Skip to main content

స్మార్ట్ స్టడీతో సక్సెస్ .. దినేష్ కుమార్

యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలు కష్టపడి చదివితే క్లిష్టంగా ఉంటాయని, అదే ఇష్టపడి చదివితే విషయ పరిజ్ఞానం పెంచుకోవడంతో పాటు విజయ శిఖరాలను చేరుకోవచ్చని అంటున్నారు సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా ఆరో ర్యాంకర్ కొత్తమాసు దినేష్ కుమార్.
మాది విజయవాడ. నాన్న కొత్తమాసు శ్రీనివాసరావు వస్త్ర వ్యాపారి. అమ్మ రాధా కుమారి గృహిణి. నా విద్యాభ్యాసం అయిదో తరగతి వరకు ఉండవల్లిలో, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విజయవాడలోనే చదివాను. ఇంటర్ తర్వాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వరంగల్‌లో ఇంజనీరింగ్ మెకానికల్‌లో చేరాను. కాలేజీలో జరిగే సామాజిక ఈవెంట్స్‌లో చురుగ్గా పాల్గొనేవాడిని. ఆ మధ్యలో సొసైటీకి సేవా చేయాలనే ఆలోచన వచ్చింది. అందుకు సివిల్ సర్వీసెస్ సాధించడమే ఏకైక మార్గమని నమ్మాను.
 
 ఉద్యోగం వదిలి.. ఢిల్లీ బాట :
 కాలేజీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో సైట్ ఇంజనీర్‌గా ఉద్యోగం లభించింది. ఉద్యోగంలో చేరి సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వాలనుకున్నా. కానీ ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అవడం సాధ్యపడదని తెలిసిపోయింది. అప్పటికే కాసింత ఆర్థిక భరోసా కలగడంతో 2015లో ఉద్యోగం వదిలి ఢిల్లీకి వెళ్లి కోచింగ్‌లో జాయిన్ అయ్యాను.
 
 స్మార్ట్ స్టడీ అవసరం :
 హార్డ్‌వర్క్‌ను నమ్ముకునే దానికన్నా స్మార్ట్‌వర్క్‌ను నమ్ముకోవడం మేలు. కొన్ని సబ్జెక్టులు ఎంత వరకు చదవాలో తెలుసుకొని అంతే చదవితే లాభిస్తుంది. సమయం వృథా కాకుండా ఉంటుంది. నేను అయితే మెయిన్స్ ఎగ్జామ్‌కు మరో నాలుగు నెలలు ఉండగా నిత్య ప్రణాళిక వేసుకొని, దాన్ని చేరుకునేందుకు ప్రయత్నించా.
 
 సన్నద్ధత సాగిందిలా...
 ఆప్షనల్ సబ్జెక్టును ఎంచుకోవడానికి ముందు అన్ని సబ్జెక్టులను ఒక వారం పాటు తిరగేశాను. అందులో పొలిటికల్ సైన్స్ ఆసక్తిగా అనిపించింది. పైగా మిగతా సబ్జెక్టుల ప్రిపరేషన్‌లో ఉపకరిస్తుందని, మెటీరియల్ లభ్యత కూడా పుష్కలంగా కారణంగా ఆ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. ప్రిలిమ్స్ కోసం యూపీఎస్సీ ప్రివీయస్ బిట్స్ దాదాపు 10000 ప్రాక్టీస్ చేశాను. సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు కోచింగ్‌కు వెళ్లడం తప్పనిసరి కాదు. వారికి కావాల్సింది కేవలం సరైన గెడైన్స్. ఇప్పటికే సక్సెస్ అయిన వారి గెడైన్స్ ఉంటే చాలు. ఇంటర్నెట్‌లో మెటీరియల్ అందుబాటులో ఉంది. బేసిక్స్ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివి, ఇతర స్టాండర్డ్ పుస్తకాలు సేకరించుకొని శ్రద్ధగా ప్రిపేర్ అయితే చాలు ఎలాంటి కోచింగ్ అవసరం లేదు.
 
 ఇంటర్వ్యూలో అడిగినవి
 నాకు క్రికెట్ పట్ల ఆసక్తి ఉండడంతో లోధా కమిటీ మీద ప్రశ్నలు అడిగారు. కమిటీ రికమెండేషన్లు, వాటిపై నా అభిప్రాయాలు అడిగారు. ఫ్రాన్స్, జర్మనీ ఎలక్షన్ల మీద ప్రశ్నలు, ప్రభుత్వ రిఫైనరీలు, ప్రైవేటు వాటితో పోల్చుకుంటే ఎందుకు సమర్థంగా పనిచేయలేకపోతున్నాయి?, జమ్మూ కశ్మీర్‌లో పెల్లెట్ గన్స్ వాడకంపై అభిప్రాయం, మానవ హక్కుల ఉల్లంఘన?, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
 
 ప్రొఫైల్
 10 వ తరగతి (2007-08) మార్కులు 539, ఇంటర్ (2008 -10) 938 మార్కులు, ఇంజనీరింగ్ (మెకానికల్) (2010 -14) 8.38 సీజీపీఏ
 
 సాక్షి పేపర్ రోజు ఇంటికి వస్తుంది. ఐఐటీ ప్రవేశ పరీక్షకు ప్రిపరేషన్ నుంచే సాక్షిని చదువుతున్నాను. మా కుటుంబ సభ్యులు, నేను రెగ్యులర్‌గా సాక్షి పాఠకులమే.
Published date : 02 Jun 2017 05:28PM

Photo Stories