Skip to main content

సివిల్స్ వ్యక్తిత్వ పరీక్షలో విజయం సాధించాలంటే..

ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఇతర సెంట్రల్ సర్వీసుల (గ్రూప్ ఏ, గ్రూప్ బీ) కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2013 మెయిన్స్ ఫలితాలను మార్చి 11న యూపీఎస్సీ విడుదల చేసింది. దాదాపు మూడు వేల మంది పర్సనాలిటీ టెస్ట్ (మౌఖిక పరీక్ష) దశకు ఎంపికయ్యారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి జరగనున్న నేపథ్యంలో ఇందులో విజయం కోసం తుది దశ ప్రిపరేషన్ వ్యూహాలు..

ప్రఖ్యాత మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హాన్స్ ఐసెంక్ ప్రకారం Personality (మూర్తిమత్వం లేదా వ్యక్తిత్వం) అనేది వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులను తెలిపేది. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థులు తనకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించగలరా? లేదా? అనేదాన్ని తెలుసుకోవడమే పర్సనాలిటీ పరీక్ష ఉద్దేశం. ఇంటర్వ్యూ బోర్డు.. భిన్న ప్రశ్నల ద్వారా అభ్యర్థి మేధస్సును మాత్రమే కాకుండా అతని మానసిక సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. సివిల్స్ పరీక్ష మొత్తం 2,025 మార్కులకు ఉంటే అందులో 275 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించారు. నచ్చిన సర్వీస్, కేడర్ చేజిక్కాలంటే ఇంటర్వ్యూలో అధిక మార్కులు సాధించాలి. ఇంటర్వ్యూలో సాధించే ప్రతి మార్కూ అభ్యర్థి భావి కెరీర్‌ను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పర్సనాలిటీ పరీక్షలో విజయం సాధించేందుకు అభ్యర్థులకు ఉపయోగపడే మార్గాలు...

అకడమిక్ అంశాలు ప్రధానం
అభ్యర్థి గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన అంశాలపై పర్సనాలిటీ పరీక్షలో ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది. మెడిసిన్, ఇంజనీరింగ్, కామర్స్ ఇలా రకరకాల అకడమిక్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు ప్రజా సేవలో ఆయా రంగాల ఆవశ్యకత ఏమిటనే కోణంలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎంబీబీఎస్ నేపథ్యం ఉన్న అభ్యర్థిని ఇలా ప్రశ్నించవచ్చు...
‘‘ఒక జిల్లా కేంద్ర ఆసుపత్రిలో లంచాలు ఇవ్వందే వైద్య సేవలు అందడం లేదని, ప్రతి విభాగంలోనూ అవినీతి మేటలు వేసిందంటూ ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. నువ్వే కనుక జిల్లా వైద్యాధికారిగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటావు’’?

సామాజిక సమస్యలపై అవగాహన
పేదరికం, నిరుద్యోగం, వరకట్నం, మత ఘర్షణలు, లింగ వివక్ష వంటి ఎన్నో సమస్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ఇలాంటి వాటిపై అభ్యర్థి ఎలా స్పందిస్తాడు? ఒక సమస్యను ఎదుర్కొనేందుకు తగిన మానసిక దారుఢ్యంతో పాటు ఆ సమస్య పరిష్కారానికి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అభ్యర్థికి ఉందా? అనేదాన్ని బోర్డు సభ్యులు పరిశీలిస్తారు. ఇదే కోణంలో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అందువల్ల ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

వర్తమాన అంశాలు
అభ్యర్థులు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ సమకాలీన అంశాలపై పట్టుసాధించాలి. రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా రాష్ట్ర విభజనకు సంబంధించి చోటుచేసుకుంటున్న సంఘటనలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
ఉదా: చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి సాధ్యమని కొందరు వాదిస్తున్నారు. అలాంటప్పుడు ఈశాన్య రాష్ట్రాలు చిన్నవిగా ఉన్నప్పటికీ ఎందుకని అభివృద్ధి చెందడం లేదు? మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు పెద్దవిగా ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి కదా? అనే ప్రశ్న ఎదురుకావొచ్చు.
  • కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ తగ్గుదల వంటి ఆర్థిక సమస్యల్ని అధ్యయనం చేయాలి. దేశాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సాధించాల్సిన సమతుల్యతను పరిశీలించాలి. పొరుగుదేశాలతో భారత్ సంబంధాలతో పాటు సిరియా, ఉక్రెయిన్, అఫ్ఘానిస్థాన్‌లో అస్థిర పరిస్థితులను అధ్యయనం చేయాలి. ఆయా దేశాల్లోని పరిణామాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి.

నైతిక విలువలు
నైతిక విలువల (Moral Values)తో కూడిన ప్రజా పాలన అద్భుత ఫలితాలు ఇస్తుంది. నైతిక విలువలు ఉన్న వ్యక్తి తన మాటల ద్వారా, పనుల ద్వారా చుట్టూ ఉండే సమాజాన్ని ప్రభావితం చేయగలడు. ప్రజా పాలనలో కీలకంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులు ఈ విలువలు కలిగి ఉండటం అత్యవసరం. ఈ నేపథ్యంలోనే సివిల్స్ జనరల్ స్టడీస్‌లో నైతిక విలువలపై ప్రత్యేకంగా పేపర్‌ను ప్రవేశపెట్టారు. పర్సనాలిటీ టెస్ట్‌లో కూడా అభ్యర్థి నైతిక ప్రవర్తనను పరీక్షించేలా బోర్డు నుంచి ప్రశ్నలు ఎదురుకావొచ్చు. అందువల్ల ప్రభుత్వ పాలనలో నైతికత కోణంలో అభ్యర్థులు మౌఖిక పరీక్షకు సిద్ధమవాలి.


సాఫ్ట్ స్కిల్స్ చుట్టూ
ఆత్మస్థైర్యం, వేగంగా కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, భావ వ్యక్తీకరణ సామర్థ్యం, విశ్లేషణా సామర్థ్యం, బృంద స్ఫూర్తి, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు ఎదురవుతాయి. ఇలాంటి వాటికి సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు అభ్యర్థి నిజాయితీగా, సమయస్ఫూర్తితో, ఒత్తిడికి తావు లేకుండా ప్రశాంత చిత్తంతో సమాధానాలు ఇవ్వాలి.
  • ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకుంటే తెలియదని నిజాయితీగా అంగీకరించాలి. అంతేగానీ ఏదోఒకటి చెప్పి, మసిపూసి మారేడుకాయ చేయకూడదు. ప్రశ్నను బాగా వినాలి. బిగ్గరగా అరిసేటట్లు కాకుండా నిదానంగా అందరికీ వినిపించేలా సమాధానం చెప్పాలి. ఆ సమాధానంలో ఆత్మ విశ్వాసం తొణికిసలాడాలి.

అభిరుచులు (Hobbies)
పర్సనాలిటీ పరీక్షలో తప్పనిసరిగా అభ్యర్థి అభిరుచులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యర్థులు పుస్తక పఠనం, క్రికెట్ ఆడటం, కవితలు రాయడం.. ఇలా రకరకాల అభిరుచులను బయోడేటాల్లో పేర్కొంటారు. వీటికి సంబంధించి వివిధ కోణాల్లో సమాచారం తెలుసుకోవాలి. ఇష్టమైన విషయానికి సంబంధించిన సమాచారం తెలియకపోతే, మిగిలిన విషయాలపై ఆసక్తి ఏముంటుంది? అని బోర్డు అభిప్రాయపడే అవకాశముంది.
  • బోర్డు సభ్యుల్లో తప్పనిసరిగా ఒక సైకాలజిస్టు ఉంటారు. ఆయన అభ్యర్థి హావభావాలను నిశితంగా గమనిస్తాడు. సమాధానం చెప్పేతీరును పరిశీలిస్తాడు. అందువల్ల కూర్చొనే తీరులోనూ, మాట్లాడే విధానంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. బోర్డు సభ్యులు... అభ్యర్థి తన భావాలను స్వేచ్ఛగా చెప్పగలిగేలా అనువైన వాతావరణాన్ని ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి ఒత్తిడికి గురి కావాల్సిన పనిలేదు.

అభ్యర్థి నుంచి ఇంటర్వ్యూ బోర్డు ఆశించే అంశాలు
  • భావ వ్యక్తీకరణలో స్పష్టత.
  • విశ్లేషణ సామర్థ్యం.
  • సామాజిక, ఆర్థిక సమస్యలపై అవగాహన.
  • వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం.
  • నైతిక విలువలు, నిజాయితీ.
  • ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం.
  • ఆత్మ స్థైర్యం.

గుర్తుంచుకోండి:
  • మెయిన్స్‌లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు కూడా వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల ఆప్షనల్‌కు సంబంధించిన సమకాలీన అంశాలను అధ్యయనం చేయాలి.
  • సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థి ఎంపిక చేసుకున్న టాప్ 3 సర్వీస్‌ల ప్రాధాన్యాన్ని, వాటి వర్తమాన అంశాలను తెలుసుకోవాలి.
  • మాక్ ఇంటర్వ్యూలకు హాజరు కావడం వల్ల ఒక ప్రశ్నకు సమాధానం ఎలా చెబుతున్నాం? బలాలు, బలహీనతలేంటి? వంటి విషయాలను గుర్తించి, సరిదిద్దు కోవచ్చు. ఒక విషయంపై స్నేహి తులతో చర్చించి, వారి ద్వారా కచ్చితమైన ఫీడ్‌బ్యాక్ తీసు కోవాలి.

రిఫరెన్స్:
  • ఒకట్రెండు తెలుగు, హిందూ దినపత్రికను చదవాలి. ముఖ్యమైన అంశాలపై సొంత, ప్రభావవంతమైన అభిప్రాయాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. సంపాదకీయాలను (Editorials) తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.
  • లోక్‌సభ టెలివిజన్, రాజ్యసభ టెలివిజన్, ఎన్డీటీవీ, సీఎన్‌ఎన్-ఐబీఎన్ వంటి చానళ్లలో సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలపై చర్చా కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. వీటిని పరిశీలించాలి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల అధికారిక వెబ్‌ైసైట్లలో ఆయా శాఖల వర్తమాన అంశాలు అందుబాటులో ఉంటాయి.

టాపర్స్ టాక్..
Bavitha తీయదనం అనే పదం సులభమైందే అయినా దాన్ని నిర్వచన రూపంలో వ్యక్తం చేయడం కష్టం. Personolity (మూర్తిమత్వం లేదా వ్యక్తిత్వం) కూడా అంతే! అలాంటి ‘పర్సనాలిటీ’ ని పరీక్షించేందుకు బోర్డు సభ్యులు రకరకాల ప్రశ్నలతో అభ్యర్థి మనస్సును మథిస్తారు. ఆ మథనం నుంచి స్వచ్ఛమైన వెన్నలాంటి వ్యక్తిత్వం బయటపడేలా అభ్యర్థి సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉండేందుకు ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ జె.మేఘనాథ్‌రెడ్డి సూచనలు..

సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్ అనేది కేవలం ప్రశ్న-సమాధానం రూపంలో ఉండే మౌఖిక పరీక్ష కాదు.. ఒకరి వ్యక్తిత్వాన్ని ఆసాంతం పరీక్షించేదన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షకు సిద్ధమవాలి. అభ్యర్థులు వెర్బల్, నాన్ వెర్బల్ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు సమ ప్రాధాన్యమివ్వాలి. సరళమైన పదాలను ఉపయోగిస్తూ సూటిగా, క్లుప్తంగా సమాధానం చెప్పడం ఎంత ప్రధానమో.. సమాధానం చెప్పేటప్పుడు కనిపించే ముఖ కవళికలు, హావభావాలు, స్వర స్థాయి, చూపులో తీక్షణత సరిగా ఉండటం కూడా ముఖ్యం. మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం, రోజూ కొంత సమయం అద్దం ముందు నిలబడి మాట్లాడటం ద్వారా ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.
  • అభ్యర్థులు బయో డేటా (Summary Sheet)లో పేర్కొన్న ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, వాటిపై ఎలాంటి ప్రశ్న ఎదురైనా చెప్పగలిగేలా ఉండాలి. స్వస్థలం, విద్యార్హతలు, పని అనుభవం, అభిరుచులు తదితరాల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగేందుకు అవకాశముందో విశ్లేషించుకోవాలి. అభిరుచులు, విద్యార్హతలకు సంబంధించి అనాసక్తి కనబరచడాన్ని బోర్డు తీవ్రంగా పరిగణిస్తుందన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.
  • సాధారణంగా పలానా బోర్డు మంచిదని, పలానా బోర్డు మంచిది కాదనే అపోహలు షికారు చేస్తుంటాయి. ఇలాంటి వాటిని పట్టించుకోకూడదు. అన్ని ఇంటర్వ్యూ బోర్డులూ మంచివే.
  • అభ్యర్థులు చెప్పే సమాధానంలో నిజాయితీ, నాణ్యత, తార్కికత ప్రతిబింబించాలి. అలాంటి సమాధానం బోర్డు సభ్యులను ఆకట్టుకుంటుంది.
Confidence (విశ్వాసం), Consistency (స్థిరత్వం), Calmness (ప్రశాంతత). అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో ఈ 3-ఇ ఫార్ములాను దృష్టిలో ఉంచుకొంటే విజయం తలుపు తడుతుంది.
Bavitha
Published date : 20 Mar 2014 03:31PM

Photo Stories