TSBIE: ఇంటర్‌లోనే ఆంగ్లంపై విద్యార్థులు పట్టు సాధించేలా..
నిర్మల్ ఖిల్లా: పాఠశాల విద్య అనంతరం అత్యంత కీలకమైన దశ ఇంటర్మీడియెట్. ఈదశలో భాషాపరిజ్ఞానం పెంపొందితే అన్నిరకాల పోటీ పరీక్షలను విద్యార్థులు విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడంలో భాగంగా ఆంగ్లభాష పరిజ్ఞానం అత్యంత కీలకం. ప్రస్తుతం ఏ ఉద్యోగం పొందాలన్నా.. ఏ పోటీ పరీక్ష రాయాలన్నా ఆంగ్లభాష కీలకమవుతోంది. ఈ తరుణంలో ఇంటర్‌లోనే ఆంగ్లంపై విద్యార్థులు పట్టు సాధించేలా ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని సంకల్పించింది. ప్రస్తుతం ఇంటర్‌లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ మాత్రమే ఉండగా, ఇక ఇంగ్లిష్ భాషకు సైతం ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఇంటర్ అధికారులకు ఆదేశాలు అందాయి.
ప్రాక్టికల్ మార్కులు ఇలా..
ఇంటర్మీడియెట్ స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్టుకు ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయించారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి నాలుగు మార్కులు కేటాయించారు. అదేవిధంగా రికార్డుకు మరో నాలుగు మార్కులు కేటాయించారు. వీటిలో నాలుగు అంశాలు ఉంటాయి. కమ్యూనికేటివ్ ఫంక్షన్‌కు నాలుగు మార్కులు, జస్ట్ ఏ మినిట్(జామ్)కు నాలుగు మార్కులు, రోల్‌ప్లే(పాత్ర పోషణ)కు నాలుగు మార్కులు, లిజనింగ్ కాంప్రిహెన్షన్‌కు నాలుగు మార్కులు, రికార్డు పుస్తకానికి నాలుగు మార్కులు కేటాయించారు. ఈ 20 మార్కుల్లో విద్యార్థి కనీసం ఏడు మార్కులు సాధించాల్సి ఉంటుంది. థియరీ పరీక్షకు 80 మార్కులు, ప్రాక్టికల్ మార్కులు 20 కలుపుకుని ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు మొత్తం 100 మార్కులు ఉండనున్నాయి.
ఆంగ్లానికి ప్రాధాన్యంతోనే...
ప్రస్తుతం ఉన్న ఆంగ్లభాషకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకునే ఈ సబ్జెక్టుకు ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇంగ్లిష్ భాషపై సరైన పట్టు లేకపోవడం ఉన్నతస్థాయిలో అన్ని ఆంగ్ల మాధ్యమంలోనే ఉండడంతో ఆంగ్లంపై విద్యార్థులు భయం ఏర్పరచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల భాషకు ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టనుండడంతో రోజూవారీ సబ్జెక్టు పీరియడ్‌లకు అదనంగా, వారానికి గంటపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించే విధంగా చదవడం, రాయడం, మాట్లాడడం సాఫ్ట్‌స్కిల్స్ వంటి నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించనున్నారు. ఈ మేరకు బోధన అంశాలపై ఇంగ్లిష్ బోధించే అధ్యాపకులకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు.
భయం పోతుంది
చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్‌ను థియరీ రూపంలోనే చదివాం. ఇప్పుడు ప్రాక్టికల్ ఉంటుందని మా లెక్చరర్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటినుంచే ప్రతీరోజు పీరియడ్‌లో మాట్లాడడం ప్రాక్టీస్ చేయిస్తున్నారు. దీనివల్ల ఇంగ్లిష్ అంటే మాకు కొద్దికొద్దిగా భయం పోతుంది. – శ్రీకాంత్, ఇంటర్ విద్యార్థి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల, దిలావర్‌పూర్ మంచి నిర్ణయం..
ఇంటర్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్ నిర్వహించడం ద్వా రా పిల్లల్లో సాఫ్ట్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రస్తుతం అన్నిరకాల పోటీ పరీక్షలు ఇంగ్లిష్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్ నిర్వహించడం ద్వారా ఇంగ్లిష్ భాషపై అంతర్గతంగా ఉన్న భయం తగ్గిపోతుంది. సబ్జెక్టుపై పట్టు సాధిస్తారు. – బొమ్మెర గోపాల్,
విద్యార్థి తండ్రి, దిలావర్‌పూర్ ఒక్కోరోజు ఒక్కోఅంశంపై..
ఇంగ్లిష్ అంటేనే ఆచరణలో పెట్టడం.. దినచర్యలో భాగంగా తోటి మిత్రులతో మాట్లాడటం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని మా సార్లు చెబుతున్నారు. ఒక్కోఅంశంపై ఒక్కోరోజు కేటాయించిన పీరియడ్‌లో వ్యక్తిగతంగా మాట్లాడిస్తున్నారు.
– శ్రీదేవి, ఇంటర్ విద్యార్థిని, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, లెఫ్ట్‌పోచంపాడ్
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు..
ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా 20 మార్కులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకే..
నైపుణ్యం పెరుగుతుందంటున్న అధ్యాపకులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపు కోసమే..
ఇంగ్లిష్ భాషకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇంగ్లిష్ భాష కీలకం. ఈ భాషలో విద్యార్థులు పట్టు సాధించే విధంగా ఇంటర్ స్థాయినుండే ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
– కె.నవీన్, జూనియర్ అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, లోకేశ్వరం
ఆంగ్లంపై పట్టు పెరుగుతుంది..
ఇంటర్ విద్యార్థులకు ఆంగ్లభాష నైపుణ్యాలు పెంపొందించే వి ధంగా ఇంటర్ బోర్డు ప్రాక్టికల్స్ ప్రవేశపె ట్టింది. ఈ ఏడాది మొ దటి సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. విద్యార్థులకు ఆంగ్లపై పట్టు పెరుగుతుంది.
– జాదవ్ పరుశురాం, డీఐఈవో