TS ICET 2022: సిలబస్ కుదింపు, టాపిక్స్ వారీగా మార్కులు..
ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. ఐసెట్‌గా సుపరిచితం. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌గా.. ఐటీ నిపుణులుగా.. కెరీర్ ప్రారంభించడానికి దోహదం చేసే.. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. ఐసెట్! ఈ ఎంట్రన్స్‌లో ర్యాంకు ఆధారంగా.. తెలంగాణ రాష్ట్రంలోని పలు కళాశాలల్లో.. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. టీఎస్ ఐసెట్–2022కు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. టీఎస్ ఐసెట్ ప్రాధాన్యం, తాజా మార్పులు, విజయానికి ప్రిపరేషన్ టిప్స్...
- టీఎస్ ఐసెట్–2022 ప్రక్రియ ప్రారంభం
- జూలై 27, 28న ఆన్‌లైన్ టెస్ట్‌లు
- సిలబస్ కుదింపు, టాపిక్స్ వారీగా మార్కులు
మేనేజ్‌మెంట్, ఐటీ.. ఈ రెండు రంగాలు గత కొన్నేళ్లుగా ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తున్నాయి. విద్యార్థులకు కెరీర్ కోణంలో క్రేజీ రంగాలుగా మారుతున్నాయి. వీటిలో అడుగుపెట్టాలంటే..అకడమిక్‌గా నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఆ నైపుణ్యాలు అందించే కోర్సులు.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ). వీటిల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష టీఎస్ ఐసెట్. ఇందులో టాప్ ర్యాంకు సొంతం చేసుకుంటే.. బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు పొందే అవకాశం లభిస్తుంది.
Also read: ICET Study Material Analytical Ability
టీఎస్ ఐసెట్–2022 ప్రక్రియ ప్రారంభం
- తెలంగాణ రాష్ట్రంలో టీఎస్–ఐసెట్ 2022 ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్షను మూడు స్లాట్లలో రెండు రోజుల పాటు(జూలై 27, 28 తేదీల్లో) ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎంసీఏ కోర్సు అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్ గ్రూప్ సబ్జెక్ట్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నాన్ మ్యాథ్స్ అనుకూలంగా
ఈ ఏడాది టీఎస్ ఐసెట్‌లో కీలక మార్పులు చేశారు. మూడు విభాగాలుగా నిర్వహించే ఈ పరీక్షలో.. రెండో విభాగం(పార్ట్–బి)లో ఆల్‌జీబ్రకల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీలోని కొన్ని అంశాలను, అదే విధంగా స్టాటిస్టికల్ ఎబిలిటీలోని పలు అంశాలను తొలగించారు. ముఖ్యంగా స్టాటిస్టికల్ ఎబిలిటీలో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్, స్టాండర్డ్ డీవియేషన్, కొరెలేషన్ టాపిక్స్ తొలగించారు. ఇది ఏదైనా డిగ్రీ అర్హతగా నిర్వహించే ఐసెట్‌లో..నాన్–మ్యాథ్స్ విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.
అంశాల వారీగా మార్కులు
ఈ ఏడాది ఐసెట్ నోటిఫికేషన్ సమయంలోనే.. పరీక్ష విభాగాలు.. ఆయా విభాగాలకు కేటాయించిన మార్కులు.. సదరు విభాగాల నుంచి అడిగే అంశాలు–వాటికి కేటాయించిన మార్కులను కూడా ముందుగానే ప్రకటించారు.
దీని ఫలితంగా అభ్యర్థులు ఆయా అంశాలకు కేటాయించిన మార్కులను బట్టి, వాటికి పరీక్షలో లభించే వెయిటేజీని గుర్తించి.. ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించేందుకు అవకాశం లభిస్తోంది. తమకు పట్టున్న విభాగాలకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా అందులో మరిన్ని ఎక్కువ మార్కులు సొంతం చేసుకునేలా సన్నద్ధమయ్యే అవకాశం కూడా లభించనుంది.
మూడు విభాగాలు.. 200 మార్కులు
టీఎస్–ఐసెట్ 2022ను మూడు సెక్షన్లుగా 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. అదే విధంగా ప్రతి సెక్షన్‌లో ఉప విభాగాలు కూడా ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. మొదటి, రెండు విభాగాల్లో 75 మార్కులకు, మూడో విభాగంలో 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష విధానాల వివరాలు..
విభాగం–ఎ | ప్రశ్నలు | మార్కులు |
ఉప విభాగం–1: డేటా సఫిషియన్సీ |
20 | 20 |
ఉప విభాగం–2: ప్రాబ్లమ్ సాల్వింగ్ |
55 | 55 |
విభాగం–బి మ్యాథమెటికల్ ఎబిలిటీ
ఉప విభాగం: అర్థమెటికల్ ఎబిలిటీ | 35 | 35 |
ఉప విభాగం: అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ | 30 | 30 |
ఉప విభాగం: స్టాటిస్టికల్ ఎబిలిటీ | 10 | 10 |
విభాగం–సి కమ్యూనికేషన్ ఎబిలిటీ
ఉప విభాగం: మీనింగ్స్ | 5 | 5 |
ఉప విభాగం: సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ | 5 | 5 |
ఉప విభాగం: వెర్బ్ | 5 | 5 |
ఉప విభాగం: ఫ్రేజల్ వెర్బ్ అండ్ ఇడియమ్స్ | 5 | 5 |
ఉప విభాగం: ఆర్టికల్స్ అండ్ ప్రిపొజిషన్స్ | 5 | 5 |
ఉప విభాగం: కంప్యూటర్ టెర్మినాలజీ | 5 | 5 |
ఉప విభాగం: బిజినెస్ టెర్మినాలజీ | 5 | 5 |
ఉప విభాగం: కాంప్రహెన్షన్ | 3 | 15 |
విభాగాల వారీగా.. మార్కులు
- విభాగం–ఎ: డేటా సఫిషియన్సీ–20 ప్రశ్నలు–20 మార్కులు; ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలో.. సిరీస్ టాపిక్ నుంచి 25 ప్రశ్నలు; డేటాఅనాలిసిస్ నుంచి 10 ప్రశ్నలు; కోడింగ్ అండ్ డీ కోడింగ్ ప్రాబ్లమ్స్ నుంచి 10ప్రశ్నలు; డేట్, టైమ్ అండ్ అరేంజ్‌మెంట్ నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి.
- విభాగం–బి: మ్యాథమెటికల్ ఎబిలిటీగా పేర్కొనే విభాగం–బిలో.. అర్థమెటికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు; అల్జీబ్రకల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు; స్టాటిస్టికల్ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు.
- విభాగం–సి: కమ్యూనికేషన్ ఎబిలిటీగా పేర్కొనే విభాగం– సి నుంచి పైన పేర్కొన్న టేబుల్ ప్రకారమే అంశాలు, ప్రశ్నలు అడుగుతారు.
Also read: ICET Study Material Mathematical Ability
విజయానికి అడుగులు ఇలా
నలిటికల్ ఎబిలిటీ
అభ్యర్థుల్లోని విశ్లేషణాత్మక నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉండే ఈ విభాగంలో.. రాణించడానికి డేటా సఫిషియెన్సీ; ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాల్లో నైపుణ్యం సాధించాలి. ఈ విభాగం నుంచి అడిగే ప్రశ్నలు ఒక డేటాను ఇచ్చి.. దాని ఆధారంగా సమస్య సాధించేవిగా, స్టేట్‌మెంట్ ఆధారితంగా ఉంటాయి. ఇందుకోసం బేసిక్ అర్థమెటిక్ అంశాల్లో పట్టు సాధించడం మేలు. ఇది తర్వాత విభాగం–బిలోనూ రాణించే నైపుణ్యం కల్పిస్తుంది. స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. గణితంపై ప్రాథమిక అవగాహన అవసరం. ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలో రీజనింగ్ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు కోడింగ్, డీ–కోడింగ్, బ్లడ్ రిలేషన్, సిరీస్, సిలాజిజమ్, సీటింగ్ ఎరేంజ్‌మెంట్ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
మ్యాథమెటికల్ ఎబిలిటీ
- మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఉండే అర్థమెటిక్, జామెట్రికల్, స్టాటిస్టికల్ ఉప విభాగాలకు సంబంధించిన అంశాల్లో నైపుణ్యం పొందాలంటే.. ముందుగా మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక సూత్రాలపై అవగాహన పొందాలి. అల్జీబ్రకల్, జామెట్రికల్, స్టాటిస్టికల్ ఎబిలిటీ విభాగాల్లో ఈసారి సిలబస్‌ను తగ్గించారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటూ..ఆయా అంశాలకు కల్పించిన వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. ఇందుకోసం హైస్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రశ్నల శైలి కొంత క్లిష్టంగా ఉండే స్టాటిస్టికల్ ఎబిలిటీ కోసం ఇంటర్మీడియెట్ స్థాయి పుస్తకాల ప్రిపరేషన్ అవసరం.
- అర్థమెటిక్ విభాగంలోని ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించాలంటే.. శాతాలు, లాభ నష్టాలు, నిష్పత్తులు, మెన్సురేషన్, పని–కాలం, పని–సమయం వంటి అంశాలు ముఖ్యమైనవి. అల్జీబ్రకల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ కోసం ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్, సెట్స్, లీనియర్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీలపై పట్టు సాధించాలి.
కమ్యూనికేషన్ ఎబిలిటీ
ఐసెట్ అభ్యర్థులు ఈ విభాగంలో కొంత ఎక్కువ మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రాక్టీస్, అనలిటికల్ ఎబిలిటీ, కంపేరిటివ్ అప్రోచ్ ఉంటే మొత్తం 50 ప్రశ్నలకు 40 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. వొకాబ్యులరీ కోసం బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వొకాబ్యులరీ పెంచుకునేందుకు కృషి చేయాలి. ప్రతి రోజు కనీసం 20 కొత్త పదాలు నేర్చుకోవడం, వాటిని వినియోగించే తీరుపై ప్రాక్టీస్ చేయడం మరింత ఉపయుక్తంగా ఉంటుంది. బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ. ఇది అభ్యర్థులకు సామాజిక వ్యాపార–వాణిజ్య అంశాలు, అదే విధంగా తాజా పరిణామాలు, కంప్యూటర్ బేసిక్స్‌పై అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో రాణించాలంటే బిజినెస్ టెర్మినాలజీ, కొత్త వ్యాపార విధానాలు, ఆయా సంస్థలు–వాటి క్యాప్షన్లు వంటివి తెలుసుకోవాలి. ఇక కంప్యూటర్ టెర్మినాలజీకి సంబంధించి బేసిక్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్, అదే విధంగా కంప్యూటర్ హార్డ్‌వేర్‌కు సంబంధించిన ముఖ్య భాగాలు వాటి పనితీరుకు సంబంధించి ప్రాథమిక నైపుణ్యం కలిసొస్తుంది.
- రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగంలో.. ప్యాసేజ్‌ల ఆధారంగా అడిగే 15 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ముందుగా అభ్యర్థులు ఒక అంశాన్ని, అందులోని కీలక పదాలను, కీలక సారాంశాన్ని పసిగట్టే నేర్పు అవసరం. ఇందుకోసం వ్యాసాలు చదవడం, ఇంగ్లిష్ స్టోరీ బుక్స్ చదవడం ఉపయుక్తం. ఫంక్షనల్ గ్రామర్‌లో మంచి మార్కుల కోసం బేసిక్ గ్రామర్ అంశాలుగా పేర్కొనే సినానిమ్స్, యాంటానిమ్స్, కొశ్చన్ ట్యాగ్స్, డైరెక్ట్–ఇన్‌డైరెక్ట్ స్పీచ్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ఇందుకోసం ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ గ్రామర్ బుక్స్ చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.
ప్రాక్టీస్‌తో పదును
ఐసెట్‌లోని ఆయా అంశాల్లో పట్టు సాధించేందుకు ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో నిర్దేశించిన విభాగాలన్నీ ప్రాక్టికల్ ఓరియెంటేషన్, అప్లికేషన్ ఓరియెంటేషన్‌గా ఉంటున్నాయని నిపుణుల అంచనా.
Also read: Model Papers
ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ
ఐసెట్ ర్యాంకు ఆధారంగా మలి దశలో ఆన్‌లైన్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థులు కౌన్సెలింగ్ దరఖాస్తు సమయంలో తాము పేర్కొన్న కళాశాల ప్రాథమ్యాలు, కోర్సు ప్రాథమ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత దశలో సీట్ల కేటాయింపు క్రమంలో అభ్యర్థులు పొందిన మార్కులు, వారు పేర్కొన్న ప్రాథమ్యాలు, అందుబాటులో ఉన్న సీట్లను పరిగణనలోకి తీసుకుని ఆన్‌లైన్ విధానంలోనే సీట్ల కేటాయింపు చేస్తారు.
టీఎస్–ఐసెట్ 2022 సమాచారం
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్6–జూన్ 27
ఆన్‌లైన్ దరఖాస్తుల సవరణ అవకాశం: జూలై 13 – జూలై 17
హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: జూలై 18
ఐసెట్ పరీక్ష తేదీలు: జూలై 27 (మధ్యాహ్నం 2:30–5:00 వరకు); జూలై 28 (ఉదయం 10:00 నుంచి 12:30 వరకు; మధ్యాహ్నం 2:30–5:00 వరకు)
ఫలితాల వెల్లడి: ఆగస్ట్ 22, 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://icet.tsche.ac.in
Also read: Study Material