Skip to main content

పరిశ్రమలు - ప్రోత్సాహకాలు

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (ఎంఎస్‌ఎంఈడీ) చట్టం-2006 ద్వారా పెట్టుబడి పరిమితులను సడలించారు. 15 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించడం, ఉపాధి పెంపు, పరిశ్రమలకు సానుకూల వాతావరణాన్ని కల్పించడం తదితర లక్ష్యాలతో భారత ప్రభుత్వం ఓ విధానాన్ని ప్రవేశపెట్టింది. 2001-2015 మధ్య రాష్ర్టంలో 40,894 ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటయ్యాయి. ఇవి రూ. 22520.63 కోట్ల మేర పెట్టుబడి పెట్టాయి. ఎంఎస్‌ఎంఈలలో 5.65 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

భారీ, మధ్య తరహా పరిశ్రమలు
ఈ ఏడాది జనవరి నాటికి రాష్ర్టంలో 2091 భారీ పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇవి రూ. 45393.33 కోట్ల మేర పెట్టుబడి పెట్టాయి. ఈ పరిశ్రమల ద్వారా 6,67,499 మందికి ఉపాధి లభిస్తోంది. 2014-15లో ఏక గవాక్ష విధానం కింద 1496 మంది ఔత్సాహికులు పరిశ్రమల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా 1173 పరిశ్రమలకు అనుమతులు జారీ అయ్యాయి.

నూతన పారిశ్రామిక విధానం
తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి చెందడానికి, ఆర్థిక వృద్ధికిపరిశ్రమల ఏర్పాటు చాలా ముఖ్యమైన అంశం. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా వృద్ధి అవకాశాలను మెరుగుపరచనున్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలని, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం రాష్ర్ట ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధాన చట్రం-2014ను ప్రవేశపెట్టింది. ఇన్ తెలంగాణ-ఇన్నోవేట్, ఇన్‌క్యూబేట్, ఇన్‌కార్పొరేట్ అనే నినాదం పారిశ్రామిక విధాన నిర్మాణానికి చోదక శక్తి. నవ్యావిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణ రాష్ర్టంలో పరిశ్రమలను ముందుకు నడిపిస్తాయి.

మౌలిక విలువలు
  • ప్రభుత్వ నియంత్రణ చట్రం పారిశ్రామిక వృద్ధికి దోహదపడాలి.
  • పారిశ్రామికవేత్తలు సురక్షిత, ప్రగతిశీల వ్యాపార నియంత్రణ వాతావరణంలో అభివృద్ధి సాధించాలి.
  • పారిశ్రామికాభివృద్ధి వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించాలి. ఇది స్థానిక యువతకు ప్రయోజనాలను అందించాలి.
  • పారిశ్రామికీకరణ సమ్మిళితంగా ఉండాలి. సామాజిక సమానత్వానికి దోహదపడాలి.
  • పారిశ్రామికీకరణ ప్రయోజనాలు రాష్ర్టంలోని అట్టడుగు వర్గాలకు, సామాజికంగా అణగారిన వర్గాలకు చేరాలి.
  • పర్యావరణాన్ని పరిరక్షించాలి.
నూతన విధానం లక్ష్యాలు
  • ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను మరింత పోటీపడేలా తీర్చిదిద్దడం.
  • పారిశ్రామిక రంగంలోకి అంతర్జాతీయ, జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం.
  • పట్టణ, గ్రామీణ యువతరానికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇందుకోసం కీలకమైన ఉత్పాదక రంగాలపై దృష్టి కేంద్రీకరించాలి.
  • పోటీ ధరలకు అత్యున్నత స్థాయి వస్తువులను ఉత్పత్తి చేయడం.
  • అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించేలా మేడ్ ఇన్ తెలంగాణ-మేడిన్ ఇండియాను ఓ బ్రాండ్‌గా తీర్చిదిద్దాలి.
  • అవినితిని నిర్మూలన. లంచగొండితనాన్ని ఏమాత్రం ఉపేక్షించకపోవడం.
  • విధాన నిర్ణయాలు పారదర్శకంగా తీసుకోవడం.
  • పర్యవేక్షణను తగ్గించడం, సౌలభ్యాన్ని పెంచడం.

ప్రోత్సాహకాలు
రాష్ర్ట ప్రభుత్వం సాధారణ కేటగిరీ పారిశ్రామిక వేత్తల కోసం నూతన పారిశ్రామిక ప్రోత్సాహక పథకం టి-ఐడియా, 2014ను ప్రకటించింది. షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం టి-ప్రైడ్, 2014ను ప్రకటించింది. ఎంఎస్‌ఎంఈ, భారీ పరిశ్రమలకు వివిధ ప్రోత్సాహకాలను ప్రకటించింది.


సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఈలు) ప్రోత్సాహకాలు
  • పరిశ్రమల స్థాపనకు భూమి ఎంతో అవసరం. పరిశ్రమలు కొనుగోలు చేసిన భూమికి స్టాంప్ డ్యూటీ, ట్రాన్‌‌సఫర్ డ్యూటీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ రాష్ర్ట ప్రభుత్వం వీటిని 100 శాతం తిరిగి చెల్లిస్తుంది.
  • పారిశ్రామిక వాడలు/పారిశ్రామిక పార్కుల్లో భూమి విలువపై రూ.10 లక్షల పరిమితితో 25 శాతం తగ్గింపు.
  • పారిశ్రామిక వినియోగానికి భూమి మార్పిడి చార్జీలను 25 శాతం తగ్గిస్తారు.
  • వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేది నుంచి అయిదేళ్ల పాటు యూనిట్‌కు రూపాయి చొప్పున స్థిర విద్యుత్ ధర తిరిగి చెల్లిస్తారు.
  • స్థిర మూలధన పెట్టుబడి మీద గరిష్టంగా రూ. 20 లక్షల పరిమితితో 15 శాతం పెట్టుబడి సబ్సిడీ ఇస్తారు.
  • నికర వ్యాట్/సీఎస్‌టీ లేదా రాష్ర్ట వస్తు, సేవల పన్ను (ఎస్‌జీఎస్‌టీ)లను నూరు శాతం తిరిగి చెల్లిస్తారు. వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేది నుంచి అయిదేళ్ల పాటు ఈ సౌలభ్యం వర్తిస్తుంది.
  • నూతన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు స్థిర మూలధన పెట్టుబడి కోసం పావలా వడ్డీ పథకం కింద రుణాలు ఇస్తున్నారు. ఈ రుణాలపై వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేది నుంచి అయిదేళ్ల పాటు వడ్డీలో ఏడాదికి 3 శాతం - 9 శాతం వరకు రాయితీ ఇస్తారు.
  • తొలి తరం పారిశ్రామికవేత్తలు సూక్ష్మ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహం అందిస్తారు. యంత్రాల కొనుగోలు కోసం వీరికి పది శాతం సహాయం చేస్తారు. దీన్ని అర్హమైన పెట్టుబడి సబ్సిడీ నుంచి తగ్గిస్తారు.
  • నైపుణ్యాలను పెంచుకోవడానికి, స్థానిక కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి కొంత ధనం ఖర్చవుతుంది. ఇందు కోసం వ్యక్తికి రూ. 2,000 పరిమితికి లోబడి 50 శాతం తిరిగి చెల్లిస్తారు.
  • నాణ్యత ధ్రువీకరణ/ పేటెంట్ల నమోదుకు అయ్యే ఖర్చులో రూ. 2 లక్షల పరిమితికి లోబడి 50 శాతం సబ్సిడీ ఇస్తారు.
  • నిర్దిష్టమైన పరిశుభ్ర ఉత్పత్తి చర్యలపై రూ. 5 లక్షల పరిమితికి లోబడి 25 శాతం సబ్సిడీ ఇస్తారు.
  • మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఏర్పాటైన పరిశ్రమలకు గుర్తించిన సేవల కార్యకలాపాలపై పెట్టుబడి సబ్సిడీని పొడిగిస్తారు. ఇందు కోసం అమల్లో ఉన్న నిర్దిష్ట విధానాన్ని అనుసరిస్తారు.

భారీ, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
  • పరిశ్రమలు తాము కొనుగోలు చేసిన భూమి కోసం స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీలను చెల్లిస్తాయి. ప్రభుత్వం వీటిని 100 శాతం తిరిగి చెల్లిస్తుంది.
  • తనఖా, తాకట్టు సహా భూమి/షెడ్ భవనాల లీజులపై 100 శాతం స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లిస్తారు.
  • పారిశ్రామిక వాడలు/పారిశ్రామిక పార్కుల్లో భూమి విలువపై రూ. 10 లక్షల పరిమితితో 25 శాతం తగ్గిస్తారు.
  • పారిశ్రామిక వినియోగానికి భూమి మార్పిడి కోసం రూ.10 లక్షల పరిమితితో మధ్యతరహా పరిశ్రమలకు 25 శాతం తగ్గిస్తారు.
  • వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేది నుంచి అయిదేళ్ల పాటు యూనిట్‌కు రూపాయి చొప్పున స్థిర విద్యుత్ ధర తిరిగి చెల్లిస్తారు.
  • మధ్య తరహా పరిశ్రమలకు 75 శాతం నికర వ్యాట్/సీఎస్‌టీ లేదా రాష్ర్ట వస్తు, సేవల పన్ను (ఎస్‌జీఎస్‌టీ)ను తిరిగి చెల్లిస్తారు. వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేది నుంచి ఏడేళ్ల దాకా లేదా 100 శాతం స్థిర మూలధన పెట్టుబడి వసూలయ్యే వరకు ఈ విధంగా చెల్లిస్తారు. ఈ రెండింటిలో ఏది ముందు పూర్తయితే అప్పటి వరకు ఇలా చెల్లిస్తారు. భారీ పరిశ్రమలకు ఈ తగ్గింపు 50 శాతం ఉంటుంది.
  • నైపుణ్యాలను పెంచుకోవడానికి, స్థానిక కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి వ్యక్తికి రూ. 2,000 పరిమితికి లోబడి 50 శాతం తిరిగి చెల్లిస్తారు.
  • నాణ్యత ధ్రువీకరణకు/పేటెంట్ల నమోదుకయ్యే ఖర్చులో రూ. 2 లక్షల పరిమితికి లోబడి 50 శాతం సబ్సిడీ. మధ్య తరహా పరిశ్రమలకు ఈ వెసులుబాటు మాత్రమే ఉంటుంది. భారీ పరిశ్రమలకు ఈ సౌలభ్యం ఉండదు.
  • నిర్దిష్టమైన పరిశుభ్ర ఉత్పత్తి చర్యలపై రూ. 5 లక్షల పరిమితికి లోబడి 25 శాతం సబ్సిడీ ఇస్తారు.
  • పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఐఐడీఎఫ్) ద్వారా మౌలిక సదుపాయాల ఖర్చులో 50 శాతం సమకూరుస్తారు. పరిశ్రమల యూనిట్లకు రోడ్లు, విద్యుత్, నీరు లాంటి మౌలిక సదుపాయాలను సమకూరుస్తారు. దీని పరిమితి కోటి రూపాయలు. కాగా, ఈ పరిమితి కింద పేర్కొన్న అంశాలకు లోబడి ఉంటుంది. అవి..
    ఎ) పరిశ్రమ ప్రదేశం ప్రస్తుత పారిశ్రామిక వాడలు/ఐడీఏలకు 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉండాలి. కేటాయించడానికి ఖాళీ భూమి/షెడ్లు ఉండాలి.
    బి) పరిశ్రమలో పెట్టిన అర్హమైన స్థిర మూలధన పెట్టుబడిలో, మౌలిక సదుపాయాల ఖర్చు 15 శాతానికి పరిమితమై ఉండాలి.

మహిళల యాజమాన్యంలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
  • ఎంఎస్‌ఈలకు స్థిర మూలధన పెట్టుబడి మీద పది శాతం అదనపు సబ్సిడీ ఇస్తారు. దీనికి గరిష్ట పరిమితిని రూ. 10 లక్షలుగా నిర్ణయించారు.
  • సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు లభించే ఇతర ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి.

మెగా ప్రాజెక్ట్‌లకు ప్రోత్సాహకాలు
  • మెగా ప్రాజెక్టుల విషయంలో పరిశ్రమల ప్రత్యేక పెట్టుబడి అవసరాలకు సరిపడే అనువైన ప్రయోజనాలను ప్రభుత్వం నిర్ణయించి, అందిస్తుంది. ఇది పరిశ్రమను బట్టి మారుతుంది.

మౌలిక సదుపాయాల మద్దతు
  • ఐఐడీఎఫ్ పథకం కింద నాణ్యమైన మౌలిక సదుపాయాలను పోత్సహించేందుకు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిస్తారు. ఈ నిధులతో రోడ్లు, విద్యుత్, నీరు, వ్యర్థాల నిర్వహణ చేపడతారు.
  • జాతీయ రహదారుల పొడవునా జాతీయ ఉత్పాదక పెట్టుబడుల జోన్(ఎన్‌ఎంఐజెడ్)లకు ప్రోత్సాహం కల్పిస్తారు.
  • వనరులను గరిష్టంగా వినియోగించుకోవడం కోసం పారిశ్రామిక కారిడార్లను ప్రోత్సహిస్తారు.
  • తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) ద్వారా భవిష్యత్తులో అభివృద్ధి చేసే పారిశ్రామిక వాడల్లో ఎంఎస్‌ఎంఈల కోసం 30-40 శాతం భూమిని రిజర్వ్ చేస్తారు.
  • నూతన పారిశ్రామిక వాడల్లో షెడ్యూల్డ్ కులాల పారిశ్రామికవేత్తలకు 15.44 శాతం స్థలాలు కేటాయిస్తారు. షెడ్యూల్డ్ తెగల పారిశ్రామిక వేత్తలకు 9.34 శాతం స్థలాలు కేటాయిస్తారు. ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక వాడల్లోని కేటాయింపుల్లో ఎస్సీ/ఎస్టీలకు ప్రాధాన్యమిస్తారు.
  • నూతన పారిశ్రామిక వాడల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం స్థలాలు కేటాయిస్తారు.

పరిశ్రమలకు సహకారం
ప్రస్తుతం ఏకగవాక్ష అనుమతుల విధానం అనుసరిస్తున్నారు. దీన్ని తెలంగాణ రాష్ర్ట పారిశ్రామిక ప్రాజెక్ట్ అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానం (టీఎస్-ఐపాస్) ద్వారా  పటిష్టం చేయాలని భావిస్తున్నారు.
 
 సమర్థవంతమైన ఏక గవాక్ష యంత్రాంగం
 రాష్ర్టంలో వ్యాపారం చేయడాన్ని అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో సులభతరం చేయనున్నారు. దీని కోసం ఓ అంతర్గత అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది.
 తెలంగాణ రాష్ర్ట పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధాన (టీఎస్-ఐపాస్) చట్టం-2014ను ప్రభుత్వం రూపొందించింది. ఏపీ పారిశ్రామిక ఏక గవాక్ష అనుమతుల చట్టం 2002ను రద్దు చేశారు. టీఎస్-ఐపాస్ ప్రకారం..
 పారిశ్రామికవేత్తల స్వీయ ధ్రువీకరణ ఆధారంగా దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తారు. పారిశ్రామిక నిర్వహణ సంస్థల ఏర్పాటుకు  అవసరమయ్యే వివిధ లెసైన్సులు, అనుమతులు, సర్టిఫికెట్లను జారీ చేస్తారు. రాష్ర్టంలో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడేలా చూస్తారు.
 
అభివృద్ధి చెందుతోన్న కీలక రంగాలు
ప్రభుత్వం 14 రంగాలను అభివృద్ధి చెందుతోన్న కీలక రంగాలుగా గుర్తించింది, వీటిలో పెట్టుబడులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు.
 
ముఖ్య నిర్వచనాలు
టి-ఐడియా:
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ అడ్వాన్‌‌సమెంట్
టి-ప్రైడ్: తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇన్‌క్యూబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్‌‌స
ఐఐడీఎఫ్: ఇండస్ట్రియల్ ఇంఫ్రూవ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఫండ్
టీఎస్‌ఐఐసీ: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇంఫ్రూవ్‌మెంట్ కార్పొరేషన్
టీఎస్-ఐపాస్: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్
మెగా ప్రాజెక్టు: రూ. 200 కోట్లు లేదా అంతకు మించిన పెట్టుబడితో ఏర్పాటైన లేదా 1000 మందికి పైగా వ్యక్తులకు ఉపాధిని సృష్టించే సామర్థ్యమున్న పారిశ్రామిక యూనిట్‌ను మెగా ప్రాజెక్టు అంటారు.
Published date : 01 Dec 2015 02:24PM

Photo Stories