Skip to main content

సింధూ నాగరికత

నైలునది పరీవాహక ప్రాంతంలోని ఈజిప్టు నాగరికత, టైగ్రిస్, యూఫ్రటిస్ నదుల మధ్య వెలసిన మెసపటోమియా నాగరికత, హొయాంగ్‌హో పరీవాహక ప్రాంతంలోని చైనా నాగరికతలను మాత్రమే ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతలుగా పరిగణించేవారు. కానీ ప్రస్తుత పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉన్న హరప్పా ప్రాంతంలో 1921లో చేసిన తవ్వకాల వల్ల సింధూ నాగరికత కూడా ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతగా గుర్తింపు పొందింది. దీనికి సంబంధించిన తొలి తవ్వకాలు హరప్పా ప్రాంతంలో జరిగాయి. అందువల్ల దీన్ని హరప్పా నాగరికత అంటారు. భారత దేశ చరిత్రలో తొలిసారిగా పట్టణాలు ప్రారంభమైనవి ఈ నాగరికతలోనే. భౌతికంగా సింధూ నగరాలు కాలగర్భంలో కలిసినా నాటి సంస్కృతి మాత్రం అంతం కాలేదు. నేటికీ మన సంస్కృతుల్లో భాగంగా అది కొనసాగుతూనే ఉంది.
సింధూ నాగరికతకు సమకాలీన ప్రపంచ నాగరికతలకంటే విశాలమైన పరిధి ఉంది. ఇది భారతదేశంలో దాదాపు 1.3 మిలియన్ల చ.కి.మీ. ప్రాంతంలో విస్తరించింది. దీనికి సంబంధించి భారత్, పాకిస్థాన్‌లో 1400 స్థావరాలు బయటపడ్డాయి. ప్రధానంగా సింధూనది, దాని ఐదు ఉపనదులైన రావి, బియాస్, సట్లేజ్, జీలం, చీనాబ్ పరీవాహక ప్రాంతాల్లో విలసిల్లినందువల్ల దీన్ని సింధూ నాగరికత లేదా సింధూలోయ నాగరికతగా వ్యవహరిస్తారు. ఈ నాగరికత సరిహద్దులు తూర్పున-అలంఘీర్‌పూర్ నుంచి పశ్చిమాన - సుట్కజెండార్ వరకు, ఉత్తరాన - మాండా నుంచి దక్షిణాన - దాయిమాబాద్ వరకు విస్తరించాయి.
 
పట్టణ నాగరికత
ఈ నాగరికతా కాలాన్ని మొదటి నగరీకరణ యుగంగా పేర్కొంటారు. దీని తర్వాత మళ్లీ బుద్ధుని కాలం వరకూ నగరాలు కనిపించవు. సింధూ నాగరికతకు సంబంధించి దాదాపు 250 వరకు పట్టణాలను కనుగొన్నారు. వీటిలో ముఖ్యమైనవి..
హరప్పా: దయారాం సాహ్ని ఆధ్వర్యంలో తొలిసారిగా తవ్వకాలు చేసింది హరప్పాలోనే. ఇక్కడ బయటపడిన ప్రధాన నిర్మాణాలు.. ఒకే వరుసలో నిర్మితమైన ఆరు ధాన్యాగారాలు, హెచ్ ఆకారంలో ఉన్న శ్మశాన వాటిక, కోట మొదలైనవి.
మొహెంజొదారో: ఈ పదానికి సింధీలో ‘మృతదేహాల మట్టిదిబ్బ’ అని అర్థం. ఇక్కడ తవ్వకాలకు నేతృత్వం వహించింది ఆర్.డి. బెనర్జీ. ఇక్కడ బయటపడిన ప్రధాన నిర్మాణం మహాస్నానవాటిక. దీంతోపాటు ధాన్యాగారం, పాలనా భవనం, అసెంబ్లీ హాలు వంటి కట్టడాలు వెలుగు చూశాయి. నాట్యగత్తె కాంస్య విగ్రహం, నేసిన వస్త్రం మొదలైనవి ఇక్కడ బయటపడిన ఇతర ముఖ్య అవశేషాలు.
చన్హుదారో: ఇది మొహెంజొదారో లానే సింధూ తీరంలో వెలసిన మరో నగరం. ఇక్కడ మొదట ఎం.జి.మజుందార్ తర్వాత మాకే తవ్వకాలు నిర్వహించారు. దీనికి కళాకారుల నగరమని పేరు. అంతేకాకుండా ఇది కోట గోడలేని ఏకైక నగరం.
లోథాల్: దీనికి కూడా మృతులదిబ్బ అని పేరు. ఇక్కడ తవ్వకాలు చేసింది ఎస్.ఆర్.రావు. ఇది భాగావో అనే నదీ పరీవాహక ప్రాంతంలో విలసిల్లింది. ఇక్కడ ఒకే సమాధిలో రెండు అస్థిపంజరాలు బయటపడినందువల్ల సతీ సహగమనం దురాచారం అమల్లో ఉండేదని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. సింధూ నాగరికతకు సంబంధించిన ఏకైక కృత్రిమ ఓడరేవు ఇక్కడ వెలుగుచూసింది. ఇంకా హోమగుండాలు, చదరంగం ఆటకు సంబంధించిన ఆధారాలు, కాంస్యపు కొలబద్ధలు, వస్త్రపు గుర్తును కలిగి ఉన్న ముద్రలు (సీల్స్) ఇక్కడ లభించాయి.
కాలీబంగన్: రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఉంది. ఇది ఘగ్గర్ (ప్రాచీన సరస్వతి) నది ఒడ్డున వెలసింది. ఇక్కడ మొదట తవ్వకాలు చేసింది డాక్టర్ ఎ.కె.ఘోష్. కాలీబంగన్ అంటే ‘నల్లని గాజులు’ అని అర్థం. భూమిని నాగలితో దున్నినట్లుగా ఆధారాలు లభించిన ఏకైక నగరం కాలీబంగన్.
బనావలి: హరప్పా నగరాలన్నింటిలోకి గ్రిడ్ పద్ధతిని పాటించని ఏకైక నగరమిదే. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉంది. తవ్వకాలు చేసింది ఆర్.ఎస్. బిష్త్. సింధూ ప్రజలు నాగలిని ఉపయోగించారనడానికి ఇక్కడ లభించిన మట్టితో చేసిన నాగలి బొమ్మను ప్రధాన ఆధారంగా పేర్కొంటారు.
కోట్‌డిజి: పాకిస్థాన్‌లోని సింధూ రాష్ట్రంలో ఉంది. తవ్వకాలు నిర్వహించింది గురే.ఇక్కడ రాతితో చేసిన బాణాలు బయటపడ్డాయి.
ధోలవీర: గుజరాత్‌లో ఉంది. తవ్వకాలు చేసినవారు ఆర్.ఎస్.బిష్త్, జె.పి.జోషి. ఈ నగరం వర్షాభావ ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడ కృత్రిమ రిజర్వాయర్ నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఒక స్టేడియం కూడా బయటపడింది. మిగిలిన సింధూ నగరాలకు భిన్నంగా ఈ నగరం రెండుకు బదులు 3 విభాగాలుగా విభజితమై ఉంది.
 
సింధూ నాగరికత ముఖ్య లక్షణాలు
పట్టణ ప్రణాళిక:
సింధూ ప్రజలు ప్రధానంగా నగరవాసులు. ఈ నగరాలు అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నా వాటి నిర్మాణశైలి, నగర ప్రణాళిక మొదలైన అంశాల్లో ఏకరూపత కనిపించడం విశిష్ట లక్షణంగా చెప్పొచ్చు. ప్రతి నగరాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఎగువభాగంలో ఉన్నత వర్గాలవారు నివసించేవారు. నగర నిర్మాణానికి గ్రిడ్ పద్ధతిని అనుసరించారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించారు. నిర్మాణాల్లో కాల్చిన ఇటుకలను ఉపయోగించేవారు. ఎగువ పట్టణం చుట్టూ పటిష్టమైన కోటగోడను నిర్మించారు. వీధులన్నీ సూటిగా 90° లంబ కోణంలో ఉండి నగరాన్నంతా అనేక చతురస్ర బ్లాకులుగా విభజించేవి.
సామాజిక వ్యవస్థ: సింధూ సమాజం భిన్న జాతుల కలయికతో ఏర్పడింది. మెడిటరేనియన్ జాతికి చెందినవారు అధిక సంఖ్యాకులు కాగా, మంగోలాయిడ్, ఆస్ట్రలాయిడ్, అల్పిన్నాయిడ్ జాతులకు చెందిన ప్రజలు కూడా ఇక్కడ నివసించారు. వైదిక యుగంలో ఉన్నట్లుగా కుల, వర్ణ వ్యవస్థలు ఈ కాలంలో ఇంకా ఏర్పడలేదు. అయినప్పటికీ ఆర్థికస్థాయిని బట్టి సమాజం వివిధ వర్గాలుగా విభజితమైంది. ఈ కాలంలో స్త్రీలు మంచి గౌరవ మర్యాదలు పొందినట్లుగా తెలుస్తోంది. నాటి సమాజం మాతృస్వామిక వ్యవస్థను అనుసరించినట్లు జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు.
ఆర్థిక వ్యవస్థ: సింధూ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పశుపోషణ, పరిశ్రమలు, వ్యాపార వాణిజ్యాలకు కూడా ప్రాధాన్యం ఉండేది. ప్రధాన పంటలు గోధుమ, బార్లీ. వరి కూడా పండించినట్లు లోథాల్, రంగపూర్‌లో ఆధారాలు లభించాయి. సింధూ పరీవాహక ప్రాంతం అత్యంత సారవంతంగా ఉండేది. పశుపోషణలో భాగంగా ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువులను మచ్చిక చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. పట్టణాల్లో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. ఖేత్రి, బెలూచిస్థాన్ నుంచి రాగిని, అఫ్గానిస్తాన్ నుంచి తగరాన్ని, ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల లోహాలను దిగుమతి చేసుకుని వాటితో ఆయుధాలు, ఆభరణాలు తయారు చేసేవారు. వస్త్ర పరిశ్రమ కూడా ప్రముఖంగానే ఉంది. వీరు నూలు, ఉన్ని వస్త్రాలు తయారు చేశారు. తవ్వకాల్లో చాలాచోట్ల రాట్నాలు బయటపడ్డాయి. ఇటుకలు, సీళ్లు, కుండలు, ఆటబొమ్మలు, పూసలు, గవ్వలతో ఆభరణాల తయారీ, నౌకల నిర్మాణం వంటివి ఇతర పరిశ్రమల్లో ముఖ్యమైనవి. వీరు దేశీయ, విదేశీ వాణిజ్యాన్ని కొనసాగించారు. మొహెంజొదారో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉండేది. తవ్వకాల్లో బయటపడిన ధాన్యాగారాలు, సీళ్లు, తూనికలు, కొలతలు, ఎడ్లబండ్ల బొమ్మలు, నౌకల బొమ్మలు మొదలైనవి వాణిజ్యానికి సంబంధించిన ఆధారాలను అందిస్తున్నాయి. దేశీయ వ్యాపారానికి ఎడ్లబండ్లు, పడవలనూ, విదేశీ వ్యాపారానికి భారీ నౌకలనూ ఉపయోగించారు. వీరి విదేశీ వాణిజ్యం ప్రధానంగా మెసపటోమియాతో కొనసాగింది. అక్కడి శాసనాలు సింధూ ప్రాంతాన్ని ‘మెలూహ’అని పేర్కొన్నాయి.
రాజకీయ వ్యవస్థ: సింధూ నాగరికత భౌగోళికంగా 1.3 మిలియన్ల చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది. అయినా అనేక అంశాల్లో ఏకరూపత, సమగ్రత కనిపిస్తుంది. ఉదాహరణ: గ్రిడ్ పద్ధతిలో పట్టణాల నిర్మాణం, భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ. ఇటుకల నిర్మాణంలో ప్రమాణాలు, 16 లేదా దాని గుణకాలను తూనికలు, కొలతలకు ప్రమాణంగా ఉపయోగించడం మొదలైన అంశాల్లో ఉన్న ఏకరూపత వల్ల కేంద్రీకృత పాలనా వ్యవస్థ ఉండేదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. మరికొందరి ప్రకారం 4 లేదా 5 పాలనా కేంద్రాలతో ఈ నాగరికత వర్థిల్లింది. డి.డి. కౌశాంబి ఇది మతరాజ్యమనీ, మతాధిపతుల పాలన కొనసాగిందని అభిప్రాయపడ్డారు. ఆర్.ఎస్. శర్మ.. వ్యాపార, వాణిజ్యాలకు అమిత ప్రాధాన్యమిచ్చిన వ్యాపార వర్గాలే పాలకులుగా ఉండేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సింధూ ప్రజల రాజకీయ వ్యవస్థపై నిర్దిష్ట ఆధారాలు లభించడం లేదు. కాబట్టి చరిత్రకారుల మధ్య ఈ అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి.
మత వ్యవస్థ: సింధూ ప్రజల ప్రధాన దైవం అమ్మతల్లి. మొహెంజొదారోలో ‘పశుపతి’ మహాదేవుడి ముద్ర లభించింది. ఈ దైవాన్నే జాన్ మార్షల్ తర్వాతి కాలపు పరమశివుడుగా పేర్కొన్నారు. సింధూ ప్రజలు జంతువులు, వృక్షాలను కూడా పూజించారు. మూపురమున్న ఎద్దు, రావిచెట్టు వీరికి పరమ పవిత్రమైనవి. మానవ జననేంద్రియాలనూ ఆరాధించారు. భూత ప్రేతాలు, మంత్రతంత్రాలపై విశ్వాసం ఉంది. రక్షా రేకులు, తాయెత్తులను ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. వీరి దహన సంస్కారాలు భిన్న రకాలుగా ఉండేవి. దహనం చేయడం, పూడ్చిపెట్టడం, కళేబరాలను పశుపక్ష్యాదులు తినగా మిగిలిన అవశేషాలను పూడ్చడం మొదలైన పద్ధతులుండేవి.
సింధూ లిపి: భారతదేశంలో లిపిని ఉపయోగించిన తొలి ప్రజలు వీరే. ఇది నేటి లిపిలా అక్షర రూపంలో కాకుండా బొమ్మల రూపంలో ఉన్నందువల్ల నేటి వరకూ దీన్ని చదవడం సాధ్యపడలేదు. వీరి లిపిలో 400 దాకా చిత్రాలున్నాయి. ఇది ఎడమ నుంచి కుడికి, మళ్లీ కుడి నుంచి ఎడమకి రాసి ఉంది. ఎస్.ఆర్ రావు ఈ చిత్రలిపిని ఆర్యభాషకు మాతృకగా పేర్కొన్నారు. కంప్యూటర్ సహాయంతో ఈ లిపిని పరిశోధించిన మహదేవన్ మాత్రం ఇది ద్రావిడ భాషతోనే పోలికలు కలిగి ఉందని అభిప్రాయపడ్డారు. అధిక సంఖ్యాక చరిత్రకారుల అభిప్రాయం కూడా ఇదే.
సింధూ ప్రజల సీళ్లు (ముద్రలు): సింధూ ప్రజల కళాభిరుచికి నిదర్శనం వారి సీళ్లు. తవ్వకాల్లో దాదాపు 2000కు పైగా సీళ్లు లభించాయి. వీటిలో అత్యధికం మొహెంజొదారోలోనే లభించాయి. 1-2.5. సెం.మీ. ఎత్తుతో వివిధ ఆకారాల్లో వీటిని తయారుచేశారు. ప్రతి సీలు పై ఏదో ఒక జంతు బొమ్మతోపాటు చిత్రలిపిలో శాసనం కూడా ఉండేది. పులి, ఎద్దు, గేదె, మేక, జింక, ఖడ్గమృగం, ఏనుగు వంటి జంతువుల బొమ్మలు సీళ్లపై ముద్రించారు.
పతనానికి కారణం: ఈ నాగరికత క్రీ.పూ. 18వ శతాబ్దం నాటికి అంతమైంది. అయితే దీని పతనానికి నిర్దిష్ట ఆధారాలు లభించలేదు. ఇది చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలకు దారి తీసింది. విపరీతమైన వరదలు ఈ నాగరికత అంతానికి కారణమని కొందరి వాదన. నదుల ప్రవాహ దిశల్లో మార్పు వల్ల ఏర్పడిన నీటిఎద్దడి కారణమని మరికొందరు అభిప్రాయం. పక్కనున్న ఎడారి విస్తరించి, భూసారం తగ్గడం వల్ల పతనమైందని మరికొందరి వాదన. ఆర్యుల దాడి ఈ నాగరికత ముగియడానికి ప్రధాన కారణమని ఎం.ఎం. వీలర్ అభిప్రాయం. భూకంపాల వల్ల ఈ నాగరితక అంతమైందని రైస్ వాదన.
Published date : 05 Aug 2016 02:25PM

Photo Stories