Skip to main content

జాతీయోద్యమం

1885 డిసెంబర్ 28న జాతీయ కాంగ్రెస్ స్థాపనతో భారత జాతీయోద్యమం ప్రారంభమైనట్లు చెప్పవచ్చు. జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 1885 నుంచి 1947 వరకు కొనసాగిన జాతీయ ఉద్యమాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. అవి:
1. మితవాద యుగం: 1885 - 1905
2. ఆతివాద యుగం: 1905 - 1919
3. గాంధీ యుగం: 1919 - 1947

మితవాద యుగం
జాతీయోద్యమంలో ప్రారంభ దశను మితవాద యుగం (Moderate Phase)గా పేర్కొంటారు. దీన్ని జాతీయవాదానికి బీజాలు పడిన దశగా చెప్పవచ్చు. మితవాదులు బ్రిటిష్ పాలన వల్లే భారతీయులకు మేలు జరుగుతుందని భావించినా, భారతీయుల కష్టాలకు బ్రిటిష్ పాలకుల అసమానత్వ విధానాలే కారణమని పేర్కొన్నారు. పాశ్చాత్యుల రాజకీయ అనుభవం ద్వారానే భారతదేశ ప్రగతి సాధ్యమని మితవాదుల నమ్మకం. చట్టబద్ధమైన పద్ధతులు, శాంతియుత మార్గాల ద్వారా వీరు తమ లక్ష్యాల సాధనకు కృషి చేశారు.
మితవాదుల విధానం: ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన (Pray, Petition, Protest). ప్రముఖ అతివాద నాయకుడు అరబిందో ఘోష్ దీన్ని P3 విధానంగా పేర్కొన్నారు.
మితవాదుల లక్ష్యాలను రాజకీయ, పాలన, ఆర్థిక లక్ష్యాలుగా విభజించవచ్చు.
రాజకీయ లక్ష్యాలు
  • శాసన మండలిని విస్తరించాలి.
  • శాసన మండలి విధులను పెంచాలి.
  • ప్రజా ప్రతినిధుల సంస్థల సంఖ్యను పెంచాలి.
  • ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే ప్రతినిధులకు పాలనలో ప్రాముఖ్యం ఇవ్వాలి.

పాలనా లక్ష్యాలు
  • అత్యున్నత పాలనాధికారులుగా భారతీయులను నియమించాలి.
  • బ్రిటిష్ సామ్రాజ్య అధికార పరిధిలోనే భారతీయులకు స్వయం పాలన ఇవ్వాలి.
  • ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్) పరీక్షలను భారత్, ఇంగ్లండ్‌లో ఒకేసారి నిర్వహించాలి.
  • న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేయాలి.
  • పత్రికలకు భావ ప్రకటన స్వేచ్ఛలపై ఆంక్షలు తొలగించాలి.
  • భారతీయులపై జాతి వివక్షతో చేసిన చట్టాలను రద్దు చేయాలి.
  • సైన్యంలో భారతీయులకు ఉన్నత పదవులు ఇవ్వాలి.
  • విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు రక్షణ కల్పించాలి.
  • అటవీ చట్టాలను, పాలనను సంస్కరించాలి.

ఆర్థిక లక్ష్యాలు
  • భారతదేశం నుంచి సంపద తరలింపును నిలిపేయాలి.
  • హోమ్‌చార్జీలు, రక్షణ వ్యయం తగ్గించాలి.
  • భారతీయ పరిశ్రమలకు దోహదపడేవిధంగా సాంకేతిక విద్యను ప్రోత్సహించాలి.
  • అసమానత్వ ఎగుమతి సుంకాలు తగ్గించాలి.
  • నీటి పారుదల సౌకర్యాలు, బ్యాంకుల స్థాపన ద్వారా రైతులను ఆదుకోవాలి.
  • ఉద్యానవన శ్రామికులకు తగిన సౌకర్యాలు కల్పించాలి.
  • ఉప్పుపై పన్ను తొలగించాలి.
  • విదేశాల నుంచి దిగుమతయ్యే కాటన్ వస్త్రాలపై దిగుమతి సుంకాలు విధించాలి.

హోమ్ చార్జీలు
  • భారతదేశంలో పని చేసి వెళ్లిన పౌర, మిలిటరీ, రైల్వే అధికారుల పింఛన్‌లు, ఇతర అలవెన్స్ లు.
  • ఆయుధాల కొనుగోలు, భారత్‌లో కార్యాలయాల నిర్వహణ ఖర్చులు.
  • అప్పులు, రైల్వే పెట్టుబడులపై వడ్డీ.
  • ఈస్టిండియా కంపెనీ నుంచి పదవీ విరమణ పొందిన అధికారుల పింఛన్, అలవెన్స్ లు.

మితవాదుల విజయాలు
  • దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయతా భావం, చైతన్యం కలిగించారు.
  • రాజకీయ వ్యవహారాల్లో ప్రజలకు శిక్షణ ఇచ్చి, ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తి కలిగించారు.
  • బ్రిటిషర్లు భారత్ నుంచి సంపదను తరలించుకుపోయే విధానం, దాని ప్రభావం గురించి ప్రజలకు వివరించారు.
  • 1892 కౌన్సిల్ చట్టం ద్వారా.. ఎన్నికైన స్థానిక సంస్థలకు కొన్ని అధికారాలు ఇచ్చేలా విజయం సాధించారు.
  • తర్వాతి కాలంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటానికి బలమైన పునాది వేశారు.

మితవాదుల వైఫల్యాలు
  • ప్రజా ఉద్యమాల బలాన్ని గుర్తించలేక పోయారు. వీరి కార్యకలాపాలు అతికొద్ది మంది విద్యావంతులు, సంపన్నులకే పరిమితమయ్యాయి.
  • వీరు సాధించిన విజయాలు తాత్కాలికం.
  • మితవాదులు చాలా ఆలస్యంగా.. 19 శతాబ్దం చివరినాటికి బ్రిటిషర్ల నిజమైన ప్రవృత్తిని గుర్తించారు.

ప్రముఖ మితవాద నాయకులు నిర్వహించిన పత్రికలు
  1. దాదాభాయ్ నౌరోజి - వాయిస్ ఆఫ్ ఇండియా, రాఫ్త్ గోఫ్తార్
  2. ఫిరోజ్ షా మెహతా - బాంబే క్రానికల్
  3. సురేంద్రనాథ్ బెనర్జీ- బెంగాలీ
  4. గోపాలకృష్ణ గోఖలే - రాష్ట్ర సభ సమాచార్, సుధారఖ్

మితవాద నాయకుల రచనలు
  1. దాదాభాయ్ నౌరోజి - పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డెబ్ట్ టు ఇండియా.
  2. డబ్ల్యు.సి. బెనర్జీ - ఇండియన్ పాలిటిక్స్
  3. సురేంద్రనాథ్ బెనర్జీ - ఎ నేషన్ ఇన్ ద మేకింగ్.
  4. గోపాలకృష్ణ గోఖలే - ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సర్వీస్.
ప్రముఖ మితవాద నాయకులు - బిరుదులు/ విశేషాలు
దాదాభాయ్ నౌరోజి - గ్రాండ్ ఓల్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ డ్రెయిన్ థియరీ
ఫిరోజ్ షా మెహతా - సర్, అన్‌క్రౌన్‌డ్ కింగ్ ఆఫ్ బాంబే
బద్రుద్దీన్ త్యాబ్జి- జాతీయ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన తొలి ముస్లిం
డబ్ల్యు.సి. బెనర్జీ - విస్మృత దేశ భక్తుడు (Forgotten Patriot)
సురేంద్రనాథ్ బెనర్జీ - ఇండియన్ డెమస్తనీస్, సిల్వర్ టంగ్ ఒరేటర్
గోపాలకృష్ణ గోఖలే - గాంధీజీ రాజకీయ గురువు

ప్రముఖ మితవాద నాయకులు
పేరు కాలం అధ్యక్షత వహించిన జాతీయ కాంగ్రెస్ సమావేశం స్థాపించిన సంస్థలు
దాదాభాయ్ నౌరోజి 1825-1917 కలకత్తా సమావేశం (1886) లాహోర్ (1893) కలకత్తా (1906) లండన్ ఇండియా సొసైటీ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్, పార్శీ రిఫార్‌‌మ అసోసియేషన్
ఫిరోజ్‌షా మెహతా 1845-1915 కలకత్తా (1890) బాంబే ప్రెసిడెన్సీ
బద్రుద్దీన్ త్యాబ్జి 1844-1906 మద్రాస్ (1887) అంజుమన్-ఇ-ఇస్లాం, బాంబే ప్రెసిడెన్సీ (మెహతాతో కలిసి)
ఉమేష్ చంద్ర బెనర్జీ 1844-1906 బొంబాయి (1885) అలహాబాద్ (1892) ---
సురేంద్రనాథ్ బెనర్జీ 1848-1925 పుణే (1895) అహ్మదాబాద్(1902) ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఆనంద మోహన్‌తో కలిసి)
ఆనంద మోహన్ బోస్ 1847-1906 మద్రాస్ (1896) సాధారణ బ్రహ్మసభ, ఇండియన్ సొసైటీ
గోపాలకృష్ణ గోఖలే 1866-1915 బెనారస్ (1905) ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, దక్కన్ సభ
Published date : 02 Jan 2016 11:47AM

Photo Stories