Skip to main content

దక్షిణ భారతదేశ చరిత్ర(క్రీ.పూ. 250 - క్రీ.శ. 250)

శాతవాహనులు
శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు. నానాఘాట్, హాతిగుంఫా శాసనాల్లో శ్రీ శాతకర్ణి గురించి వర్ణించారు. శాతవాహన రాజుల్లో ప్రసిద్ధుడు గౌతమీ పుత్రశాతకర్ణి. ఇతడి గురించి నాసిక్ శాసనంలో ఉంది. హాలుడు ప్రాకృతంలో ‘గాథా సప్తశతి’ గ్రంథం రచించాడు. ఒకటో పులోమావి చివరి కణ్వ పాలకుడైన సుశర్మను సంహరించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి రుద్రదాముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన చివరి రాజుల్లో గొప్పవాడు. శాతవాహనుల్లో చివరి పాలకుడు మూడో పులోమావి.

కంచి పల్లవులు (క్రీ.శ. 300-888)
పల్లవ వంశ స్థాపకుడు ‘వీరకూర్చవర్మ’. ఇతడి కుమారుడు శివస్కందవర్మ. మహాపల్లవ వంశానికి మూల పురుషుడు సింహ విష్ణువు. ఇతడు చోళ, పాండ్య, సింహళ రాజులను ఓడించి, ‘అవనీసింహ’ అనే బిరుదు పొందాడు. ఇతడి కుమారుడైన మహేంద్రవర్మను చాళుక్యరాజు రెండో పులకేశి ‘పుల్లలూర్’ యుద్ధంలో ఓడించాడు. మహేంద్రవర్మ ‘మత్తవిలాస ప్రహసనం’ అనే వ్యంగ్య నాటకాన్ని రచించాడు. ఇతడు గొప్ప శిల్పకళాపోషకుడు. మామండనూర్, దళవదూర్ గృహాలయాలు, చిత్తన్న వానల్‌లోని కుడ్య చిత్రాలు ఇతడి కళాపోషణకు నిదర్శనాలు. మహేంద్రవర్మ కుమారుడు నరసింహవర్మ పల్లవ రాజులందరిలో అగ్రగణ్యుడు. ఇతడు రెండో పులకేశిని చంపి తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
మొదటి నరసింహవర్మ (క్రీ.శ. 630 - 668): ఇతడు శివ భక్తుడు. ఇతడు కైలాసనాథ, తీర (షోర్ టెంపుల్) దేవాలయాలను నిర్మించి కళా ప్రపంచంలో చిరస్మరణీయ స్థానం సంపాదించాడు. ఇతడు 641లో పులకేశిని ఓడించాడు. చోళ, పాండ్య పాలకులు ఇతడికి సామంతులుగా ఉన్నారు. ఇతడు సాధించిన విజయాల వల్ల ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ బిరుదులతో కీర్తి పొందాడు. సంస్కృత కిరాతార్జునీయ కావ్యాన్ని రచించిన భారవి ఇతడి ఆస్థానకవి. ఇతడి కాలంలో యువాన్‌చాంగ్ కంచిని
దర్శించాడు.
నందివర్మ: ‘పల్లవ మల్ల’ బిరుదాంకితుడు. ఇతడు వైకుంఠ పెరుమాళ్ దేవాలయాన్ని నిర్మించాడు. పల్లవుల దేవాలయ శిల్పకళలో ఆలయాలు, మండపాలు, రథాలు అనే మూడు రకాల నిర్మాణాలు ఉన్నాయి. వరాహ, త్రిమూర్తి, మహిషాసురమర్థని, పంచపాండవుల మండపం (రథాలు) నందివర్మ శిల్ప కళాపోషణకు తార్కాణాలు. పల్లవుల పాలనా వ్యవస్థ మౌర్యులు, ఆంధ్ర శాతవాహనుల పరిపాలనా వ్యవస్థను పోలి ఉంది.

పశ్చిమ చాళుక్యులు (క్రీ.శ. 500-757)
పశ్చిమ చాళుక్కుల రాజధాని ‘వాతాపి’ లేదా ‘బాదామి’. వీరిని వాతాపి లేదా బాదామి చాళుక్యులు అని కూడా అంటారు. చాళుక్య వంశ మూలపురుషుడు జయసింహ వల్లభుడు. సత్యాశ్రయ పులకేశి ‘వాతాపి’ (బీజాపూర్ జిల్లా, కర్ణాటక) నగరాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. రెండో పులకేశి దక్షిణాపథ సార్వభౌముడిగా కీర్తి పొందాడు. ఇతడు ‘ఐహోల్’ వద్ద రాయించిన శాసనం అతడి విజయాల గురించి వర్ణిస్తుంది. ఇతడు ఎలిఫెంటా, పట్టాడక్కల్ దేవాలయాన్ని నిర్మించాడు. రెండో హర్షుడిని ఓడించాడు.

తూర్పు చాళుక్యులు (క్రీ.శ. 630-970)
ఆంధ్ర సంస్కృతి, తెలుగు భాషకు తూర్పు చాళుక్యులు ఎనలేని సేవ చేశారు. ఈ వంశంలో రాజరాజ నరేంద్రుడు ఆంధ్ర భాషా సాహిత్య పరిపోషకుడిగా పేరుపొందాడు. ఈ వంశ స్థాపకుడైన కుబ్జ విష్ణువర్థనుడికి ‘విషమసిద్ధి’ అనే బిరుదు ఉంది.

కళ్యాణి చాళుక్యులు (క్రీ.శ. 973-1189)
తైలపుడు రాష్ట్రకూట రాజును ఓడించి చాళుక్య రాజ్యాన్ని పునఃస్థాపించాడు. ఇతడు ‘కళ్యాణి’ని రాజధానిగా చేసుకొని పాలించాడు. కళ్యాణి చాళుక్యుల కాలంలో కన్నడ, సంస్కృత భాషలు అభివృద్ధి చెందాయి. బసవేశ్వరుడు వీరశైవ (ఆరాధ్య) మతాన్ని స్థాపించాడు.

మాన్యఖేట రాష్ట్రకూటులు (క్రీ.శ. 757-973)
జైనమతానికి, కన్నడ భాషకు మాన్యఖేట రాష్ట్రకూటులు ఎనలేని సేవ చేశారు. ఈ వంశానికి మూల పురుషుడు దంతి దుర్గుడు (752-56). ఇతడికి ‘ఖడ్గావలోక’, ‘వైరమేఘ’ అనే బిరుదులు ఉన్నాయి.
ధ్రువుడు (780-92): ఇతడి కాలంలో రాష్ట్రకూట సామ్రాజ్యం అఖిల భారత ప్రతిష్టను పొందింది. గంగా కావేరీ నదుల మధ్య వీరికి ఎదురే లేకుండా పోయింది. ధ్రువుడికి నిరుపమ, కలివల్లభ, శ్రీ వల్లభ, ధారావర్ష అనే బిరుదులున్నాయి.
మూడో గోవిందుడు (792-814): ఇతడి కాలంలో రాష్ట్రకూట ప్రతిష్ట మహోన్నత స్థితికి చేరింది. ఇతడు జగత్తుంగ, ప్రభూత వర్ష అనే బిరుదులు ధరించాడు. ఇతడి కాలంలో ఉత్తరాపథంపై రాష్ట్రకూటుల అధికారం చెక్కు చెదరలేదు.
అమోఘవర్షుడు: ‘మాన్యఖేత’ అనే దుర్గాన్ని నిర్మించి రాజధానిగా చేశాడు. సోదరి శీల మహాదేవిని రెండో విజయాధిత్యుడి కుమారుడైన కలి విష్ణువర్థనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈవిధంగా వేంగి చాళుక్యుల మైత్రిని సాధించాడు. గంగ, అంబిరాజులను సామంతులుగా చేసుకున్నాడు. ఇతడు కన్నడ భాషలో గొప్ప పండితుడు.
రెండో కృష్ణ: ఇతడు చోళరాజు పరాంతకుడి చేతిలో ‘వల్లా యుద్ధం’లో ఓడిపోయాడు. ఇతడిని ‘అకాలవర్షుడు’గా పేర్కొంటారు.
రాష్ట్రకూటుల్లో మూడో కృష్ణ చివరి గొప్పరాజు. పరాంతకుడు ‘తక్కోల యుద్ధం’లో ఓటమిపాలయ్యాడు. అమోఘవర్షుడు ‘కవిరాజ మార్గం’ అనే అలంకార గ్రంథాన్ని రచించాడు. ఎలిఫెంటా, ఎల్లోరాల్లో రాష్ట్రకూటుల శిల్పకళను చూడొచ్చు. రాష్ట్రకూట రాజు ఒకటో కృష్ణుడు ఎల్లోరా (మహారాష్ట్ర)లో కైలాస దేవాలయాన్ని నిర్మించాడు. ఇది ఏకశిలా నిర్మితం. దీన్ని నిర్మించడానికి 150 ఏళ్లు పట్టింది. పశ్చిమ కనుమల్లో ఒక కొండరాయిని ఎన్నుకొని దాన్ని కొండల నుంచి వేరు చేసి దేవాలయంగా మలిచారు. ప్రపంచంలో ఈ తరహా దేవాలయం ఎక్కడా లేదు.
తంజావూరు చోళులు
ఈ చోళ వంశస్థాపకుడు విజయాలయుడు. ఇతడు ఉరైయూర్‌లో క్రీ.శ. 850 ప్రాంతంలో పల్లవ సామంతుడుగా ఉంటూ పాండ్య సామంతుడైన ముత్తరయార్‌ను ఓడించి తంజావూర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఇతడి కాలం నుంచి చోళుల విజృంభణ ప్రారంభమైంది.
రాజరాజు (క్రీ.శ. 985-1014): చోళ రాజ్య ప్రతిష్టను పునరుద్ధరించి నూతనాధ్యాయాన్ని ప్రారంభించాడు. చోళుల ఇష్టదైవమైన శివుడికి బృహదీశ్వరాలయం (రాజరాజేశ్వరి దేవాలయం) నిర్మించాడు. ఇదే చోళకళకు ప్రసిద్ధి. భూమిశిస్తు విధానాన్ని సక్రమంగా అమలుపరచడానికి వ్యవసాయ భూములను ‘సర్వే’ చేయించాడు. ఇతడికి రాజరాజ (ది గ్రేట్) అనే బిరుదు ఉంది.
రాజేంద్ర చోళుడు (క్రీ.శ. 1014-1044): ఇతడు రాజరాజు కుమారుడు. శ్రీవిజయ సామ్రాజ్యంపై దండెత్తి శైలేంద్ర రాజును ఓడించాడు. క్రీ.శ. 1012లో అతడి రాజధాని నగరం ‘కందరం’ను ముట్టడించాడు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలపై ఆధిపత్యం సాధించాడు. ఇతడు ‘కదరగొండన్’, ‘త్రి సముద్రాదీశ్వర’ అనే బిరుదులు పొందాడు. బెంగాల్‌పై విజయం సాధించాడు. తల్లి కోరికపై ‘గంగైకొండ చోళపురం’ అనే నగరాన్ని నిర్మించాడు. దీన్ని తన రాజధానిగా చేసుకొని పాలించాడు.
ఒకటో రాజాధిరాజు (క్రీ.శ. 1044-52): ఇతడు రాజేంద్రుడి కుమారుడు. కళ్యాణి చాళుక్య రాజైన సోమేశ్వరుడిని ‘కొప్పం’ యుద్ధంలో ఓడించాడు. కానీ అదే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. మధుర, సింహళంలో చెలరేగిన తిరుగుబాట్లను అణచివేశాడు.
రెండో రాజేంద్రుడు (క్రీ.శ. 1052-64): ఇతడు రాజాధిరాజు సోదరుడు. చాళుక్యరాజును ‘కూడల్ సంగమ యుద్ధంలో’ ఓడించి కొల్హాపూర్ వద్ద విజయ స్తంభాన్ని వేయించాడు.
వీర రాజేంద్రుడు (క్రీ.శ. 1064-70): వేంగి, కళింగ, చక్రకూట పాలకులపై దాడులు చేశాడు. చాళుక్య రాజులను, విక్రమాదిత్యుడిని ఓడించాడు. ఇతడు తన కుమార్తెలను విక్రమాదిత్యుడు, కళింగ గంగ యువరాజైన రాజరాజుకు ఇచ్చి వివాహం చేశాడు.
మొదటి కులోత్తుంగ చోళుడు (క్రీ.శ. 1070 - 1120): వీర రాజేంద్రుడి తర్వాత వారసులు లేకపోవడం వల్ల రాజరాజ నరేంద్రుడు, అమ్మంగదేవికి జన్మించిన రాజేంద్రుడు అధికారంలోకి వచ్చాడు. ఇతడు కులోత్తుంగ చోళుడు అనే పేరుతో సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడిది చాళుక్య చోళ వంశం.
చోళుల కాలం తమిళ సాహిత్యానికి స్వర్ణయుగం. కంబకవి తమిళంలో రామాయణాన్ని రచించాడు. జయకొండార్ ‘పెరియపురాణం’ గ్రంథాన్ని రాశాడు.
ద్రావిడ దేవాలయాలు
భారతీయ వాస్తుశైలిలో ద్రావిడశైలి ప్రసిద్ధమైంది. ద్రావిడ శైలి దేవాలయాల్లో ప్రముఖమైనవి బృహదీశ్వరాలయం, శ్రీ రంగనాథ స్వామి ఆలయం, మీనాక్షి దేవాలయం.
బృహదీశ్వరాలయం
దీన్ని చోళ చక్రవర్తి తంజావూరులో నిర్మించాడు. ఇది ద్రావిడ శైలికి ప్రతీక. ఈ దేవాలయం గోపురంపై ఉన్న ఏకైక కలశం బరువు 90 టన్నులు.
రంగనాథ స్వామి ఆలయం
ద్రావిడ దేవాలయాల్లో ఇది అతి పెద్దది. ఇది కావేరి ఒడ్డున ఉన్న శ్రీరంగంలో ఉంది. ఇక్కడ స్వామి విగ్రహం శయనాకార రూపంలో ఉంటుంది. ఈ రూపంలో ఉన్న మరో విగ్రహం నెల్లూరులోని శ్రీ రంగనాయకుల దేవాలయంలో మాత్రమే ఉంది.
మీనాక్షి దేవాలయం
నాయకరాజు కాలంలో మదురైలో నిర్మించారు. ఈ ఆలయంలో పలు ప్రాకారాలు, గోపురాలు ఉన్నాయి.
Published date : 12 Oct 2015 05:13PM

Photo Stories