Skip to main content

ఆధునిక భారతదేశ చరిత్ర

పోర్చుగీసు నావికుడైన వాస్కోడిగామా అట్లాంటిక్ సముద్రం ద్వారా ప్రయాణించి ఆఫ్రికా దక్షిణాన ఉన్న గుడ్‌హోప్ అగ్రాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత హిందూ మహాసముద్రం ద్వారా 1498లో భారతదేశ పశ్చిమ తీరాన ఉన్న కాలికట్‌ను చేరుకున్నాడు. ఈ సంఘటన భారతదేశ చరిత్రలో కీలక మలుపునకు నాంది పలికింది. వాస్కోడిగామా చూపిన మార్గంలో అనేక మంది యురోపియన్లు భారత్ బాటపట్టారు. మొదట వీరంతా వర్తకం కోసం భారత్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత మనదేశంపై పూర్తి గుత్తాధిపత్యం సాధించారు.
వాస్కోడిగామా చూపిన మార్గంలో అనేక మంది పోర్చుగీసు వర్తకులు భారతదేశానికి వచ్చారు. 1503లో ఫ్రాన్సిస్-డి-అల్మీడా భారతదేశంలోని పోర్చుగీస్ స్థావరాలకు మొదటి గవర్నర్‌గా నియామకమయ్యాడు. ఇతడు నీలి నీటి విధానం (Blue Water Policy)ను విస్తరింపజేశాడు. ఆల్‌ఫెన్సో-డి-ఆల్బ్‌క్లర్‌‌క 1509 నుంచి 1515 వరకు భారత్‌లో రెండో పోర్చుగీసు గవర్నరుగా పనిచేశాడు. ఇతడు పోర్చుగీస్ సామ్రాజ్యానికి పునాదులు వేశాడు. గోవాను, పర్షియా సింధుశాఖలోని హార్మోజ్‌ను 1510లో ఆక్రమించాడు.

ఆంగ్లేయుల రాక..
భారతదేశంలో మొదటిసారి అడుగుపెట్టిన ఆంగ్లేయుడు ఫాదర్ థామస్ స్టీవెన్స్. ఇతడు 1579లో గోవా చేరాడు. 1600లో ఎలిజబెత్ రాణి (లండన్) అనుమతితో భారతదేశంలో వాణిజ్యం చేయడానికి ‘ఈస్టిండియా కంపెనీ’ని స్థాపించాడు. 1611లో కెప్టెన్ జేమ్స్ హాకిన్స్ భారతదేశం వచ్చి మొదటి జేమ్స్ ఉత్తరంతో మొగలు పాదుషా జహంగీర్‌ను కలుసుకున్నాడు. జహంగీర్ అనుమతితో ఇతడు 1612లో సూరత్‌లో మొదటి కర్మాగారం స్థాపించాడు. తర్వాత అహ్మదాబాద్, ఆగ్రా, హుబ్లీ, కాశింబజార్, ఢాకాలో కర్మాగారాలు ఏర్పాటు చేశాడు. ఆంగ్లేయులు భారతదేశంలో ప్రధానంగా దుస్తులు, నల్లమందు వ్యాపారం చేసేవారు. పోర్చుగీసువారితో బ్రిటిషర్లకు ఆధిపత్య పోరు మొదలైంది. 1614లో ఈస్టిండియా కంపెనీవారు పోర్చుగీసువారిని ‘సూర్’ సమీపంలో ఓడించారు. 1618లో మొదటి జేమ్స్ రాయబారిగా సర్ థామస్ (1615-19) జహంగీర్ ఆస్థానానికి వచ్చి రెండు ‘ఫర్మానా’లు పొందాడు. వీటిలో మొదటిది భారతదేశంలో వాణిజ్యం చేసుకోవడానికి అనుమతించడం. రెండోది స్వదేశీ వాణిజ్యంపై సుంకాలు తగ్గించడం.
దక్షిణ భారతదేశంలో మొదటి కర్మాగారాన్ని మచిలీపట్నంలో స్థాపించారు. 1641లో సెయింట్-జార్జి కోట (మద్రాసు)ను నిర్మించారు. 1654లో ఇంగ్లిష్ కంపెనీ వాణిజ్య ఆధిపత్యాన్ని పోర్చుగీస్ గుర్తించింది. 1661లో పోర్చుగీస్ వారు బ్రిటిష్ రాజైన రెండో చార్లెస్‌కు బొంబాయిని కట్నంగా ఇచ్చారు. 1698లో ఈస్టిండియా కంపెనీ సత్నౌటి, కాలికట, గోవిందపూర్ ప్రెసిడెన్సీల్లో జమీందారీ హక్కులు పొందింది.

ఆ తర్వాత ఈ మూడు ప్రెసిడెన్సీలను కలిపి ‘కలకత్తా’ నగరాన్ని ఏర్పాటు చేశారు. 1690లో జాబ్ చార్నాక్ కలకత్తాకు శంకుస్థాపన చేశాడు. 1696లో ఇక్కడ జార్జి విలియం కోట నిర్మాణం మొదలైంది. 1746 నుంచి 1763 వరకు బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య ఆధిపత్యం కోసం మూడు కర్ణాటక యుద్ధాలు జరిగాయి. ఇందులో మూడో కర్ణాటక యుద్ధం (1758-63) ముఖ్యమైంది. 1760లో వాండివాష్ యుద్ధంలో ఇంగ్లిషువారు, ఫ్రెంచివారిని ఓడించి పూర్తి ఆధిపత్యం సాధించారు. 1756లో బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలా కలకత్తా పోర్టును ఆక్రమించి చీకటి గది ఉదంతానికి కారకుడయ్యాడు. 1757లో ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను ఓడించి ఇంగ్లిషువారు కలకత్తాను తిరిగి ఆక్రమించుకున్నారు. 1759లో ఇంగ్లిష్ కంపెనీవారు డచ్‌వారిని బెదరా యుద్ధంలో ఓడించారు. 1764 బక్సార్ యుద్ధం విజయంతో ఉత్తర భారతంలో బ్రిటిషర్ల ఆధిపత్యానికి తిరుగులేకుండా పోయింది. ఈ విజయం కారణంగా 1767లో బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటైంది.
1664లో ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీని 14వ లూయీ మంత్రి కోల్బర్‌‌ట స్థాపించాడు. 1667లో ఫ్రాంకోయిస్ కరన్ ‘సూరత్’ ఫ్యాక్టరీని స్థాపించాడు. ఫ్రాన్సిస్కో మార్టిన్ 1673లో ముస్లిం గవర్నర్ నుంచి అనుమతి పొంది పాండిచ్చేరికి పునాదులు వేశాడు. ఇతడు 1764లో గవర్నర్‌గా నియమితుడయ్యాడు. ఫ్రెంచ్‌వారు 1674లో షాయిస్థాఖాన్ నుంచి అనుమతి పొంది బాలాసోర్, కాశిం బజార్, చంద్రనాగూర్ వద్ద ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారు. 1674లో డూప్లే పాండిచ్చేరి గవర్నర్‌గా నియమితుడయ్యాడు. ఇతడు రెండు ఆస్ట్రియా వారసత్వ యుద్ధాలు చేశాడు.

డచ్ కంపెనీ
డచ్చివారు యూరప్‌లోని హాలెండ్ (నెదర్లాండ్స్) దేశానికి చెందినవారు. వీరు 1602లో డచ్ ఈస్టిండియా కంపెనీ స్థాపించారు. వీరు తూర్పు ఇండియా సుగంధ దీవులపై దృష్టి కేంద్రీకరించారు. 1604లో గోల్కొండ నవాబు అనుమతితో మచిలీపట్నంలో మొదటి డచ్చి వర్తక స్థావరం ఏర్పాటు చేశారు. 1610లో పులికాట్ వద్ద స్థావరాన్ని నిర్మించుకున్నారు.

గవర్నర్ జనరల్స్
వారన్ హేస్టింగ్స్ (1772-85)
వారన్ హేస్టింగ్స్ 1772లో బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యాడు. ఇతడు 1773 నుంచి 1785 వరకు గవర్నర్ జనరల్‌గా పనిచేశాడు. 1773లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేశారు. దీంతో కంపెనీకి తూర్పుదేశ వర్తకంపై గుత్తాధిపత్యం లభించింది. వారన్ హేస్టింగ్స్ రాజధానిని ముర్షిదాబాద్ నుంచి కలకత్తాకు మార్చాడు. సివిల్ న్యాయస్థానానికి కలెక్టరును, క్రిమినల్ న్యాయస్థానానికి భారతీయుడిని న్యాయాధిపతిగా నియమించాడు. న్యాయ సంస్కరణలలో భాగంగా ముఖ్యంగా జిల్లాల్లో ‘దివానీ’, ‘ఫౌజ్‌దారీ’ అదాలత్‌లను ప్రవేశపెట్టాడు. ప్రెసిడెన్సీ (కలకత్తా)లలో సాదర్, దివానీ సాదర్, నిజామత్ అదాలత్‌లను ఏర్పాటు చేసి హిందూ, ముస్లిం చట్టాలు అమలు చేశాడు. 1784లో బ్రిటిషర్లు పిట్స్ ఇండియా చట్టం చేశారు.

కారన్ వాలిస్ (1786-93)
ఇతడు సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టాడు. ప్రభుత్వ యంత్రాంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. వివిధ స్థాయిల్లో కోర్టులను ఏర్పాటు చేశాడు. న్యాయశాఖ నుంచి పరిపాలన శాఖను వేరుపరిచాడు. 1793లో శాశ్వత శిస్తు విధానం ప్రవేశపెట్టాడు. న్యాయ విచారణ పద్ధతిని రాయించాడు. న్యాయ పద్ధతిపై కారన్ వాలీస్ కోడ్‌ను పొందుపరిచాడు. మూడో మైసూర్ యుద్ధంలో టిప్పుసుల్తాన్‌ను ఓడించి రాజ్యంలో సగభాగాన్ని తీసుకున్నాడు.

సర్ జాన్‌షోర్ (1793-98)
శాశ్వత శిస్తు విధానంలో ఇతడి పాత్ర ప్రధానమైంది. జాన్‌షోర్ కాలంలో బ్రిటిష్ పార్లమెంట్ 1793లో చార్టర్ చట్టం చేసింది.

లార్డ్ వెల్లస్లీ (1798-1805)
ఇతడు ఉద్యోగుల శిక్షణ కోసం 1800లో పోర్ట్ విలియం కళాశాల స్థాపించాడు. సంస్థానాధీశులను సామంతులుగా చేసుకున్నాడు. నాలుగో మైసూర్ యుద్ధంలో టిప్పుసుల్తాన్‌ను ఓడించాడు. 1798లో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీనికి మొదటగా హైదరాబాద్ నిజాం అంగీకరించి ఒప్పందం చేసుకున్నాడు. వెల్లస్లీ రెండో మరాఠా యుద్ధం చేశాడు. ఇతడి కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ ఏర్పడింది.
  • 1805 నుంచి 1807 వరకు జార్‌‌జబార్లో గవర్నర్ జనరల్‌గా పని చేశాడు. ఇతడి కాలంలో వెల్లూరు తిరుగుబాటు జరిగింది.

మొదటి లార్డ్ మింటో (1807-1813)
ఇతడి కాలంలో 1813లో చార్టర్ చట్టం చేశారు. రంజిత్ సింగ్‌తో అమృత్‌సర్ ఒప్పందం చేసుకున్నాడు.

లార్డ్ హేస్టింగ్స్ (1813-1823)
ఇతడు నేపాల్ యుద్ధం, మూడో మరాఠా యుద్ధం చేశాడు. పీష్వా పదవి రద్దు చేశాడు. బొంబాయి ప్రెసిడెన్సీ ఏర్పాటు చేశాడు. పిండారులు అనే దారి దోపిడీదారులను అదుపులోకి తెచ్చాడు. బొంబాయి, మద్రాసులో రైత్వారీ పద్ధతి అమలుపరిచాడు. దీనికి సర్ థామస్ మన్రో, ఎల్సిస్టోన్ సహకరించారు. 1817లో కలకత్తాలో ఆంగ్ల మాధ్యమంలో బోధించే హిందూ కళాశాలను స్థాపించాడు. 1813 చట్టంతో ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీకి చైనాతో పూర్తి స్వేచ్ఛా వాణిజ్యం చేసుకునే వెసులుబాటు కలిగింది. హేస్టింగ్స్ 1799లో పత్రికలపై ఆంక్షలు రద్దు చేశాడు.

లార్డ్ అమ్రెస్ట్ (1823-1828)
ఇతడి కాలంలో మొదటి బర్మా యుద్ధం జరిగింది. భరత్‌పూర్‌ను ఆక్రమించాడు.

విలియం బెంటింక్ (1828-1835)
ఇతడు గవర్నర్ జనరళ్లలో గుర్తింపు పొందిన వాడు. విలియం బెంటింక్ ‘థగ్గులు’ అనే దారి దోపిడీ దొంగలను అణచివేశాడు. మైసూర్ రాజును పదవి నుంచి తొలగించాడు. కాచర్, జైంషియా, కూర్‌‌గను ఆక్రమించాడు. 1828లో బెంగాల్ రాష్ట్రానికే కాకుండా భారతదేశమంతటికీ గవర్నర్ జనరల్‌గా నియమితుడయ్యాడు. 1829లో సతీసహగమనాన్ని నిషేధించాడు. పురిటిలో ఆడ పిల్లలను చంపడం లాంటి దురాచారాలను అదుపు చేశాడు. భారతీయులు ఉన్నత ఉద్యోగాలకు అర్హులని ప్రకటించాడు. బెంటింక్ కలకత్తాలో వైద్య కళాశాలను స్థాపించాడు. 1835లో మెకాలే అధ్యక్షతన న్యాయ సంఘాన్ని నియమించాడు. దీనికి సంబంధించి ఇంగ్లిష్ భాషలో విద్యా బోధన ప్రవేశపెట్టాడు. 1833లో చార్టర్ చట్టంతో స్వేచ్ఛా వాణిజ్యాన్ని ఎత్తేశారు.
  • 1835 నుంచి 1836 వరకు సర్ చార్లెస్ మెట్‌కాఫ్ గవర్నర్ జనరల్‌గా పని చేశాడు.
  • 1836-42 మధ్య లార్డ్ ఆక్లాండ్ గవర్నర్ జనరల్‌గా ఉన్నాడు. ఇతడు అఫ్గానిస్తాన్‌లో బ్రిటిషర్ల పరాజయం ఫలితంగా పదవి కోల్పోయాడు.

లార్డ్ ఎలెన్‌బరో (1842-44)
ఇతడు సింధ్‌ను బ్రిటిష్ ఇండియాలో విలీనం చేశాడు. ఇతడి కాలంలో మొదటి అఫ్గాన్ యుద్ధం ముగిసింది. ఇతడు గ్వాలియర్ యుద్ధం చేశాడు.

మొదటి లార్డ్ హార్డింజ్ (1844-48)
ఇతడి కాలంలో మొదటి సిక్కు యుద్ధం జరిగింది. ఆంగ్ల మాధ్యమంలో చదివిన భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఇతడు నరమేథాన్ని అణచివేశాడు.

లార్డ్ డల్హౌసి (1848-56)
ఇతడు రెండో సిక్కు యుద్ధం తర్వాత పంజాబ్‌ను ఆక్రమించాడు. రెండో బర్మా యుద్ధం తర్వాత బర్మా దిగువ ప్రాంతాన్ని ఆక్రమించాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి సతారా, సంబల్‌పూర్, ఝాన్సీ, నాగ్‌పూర్‌ను ఆక్రమించాడు. అయోధ్యను ఆక్రమించాడు. ఇతడి హయాంలో వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇతడి కాలంలో సంతాలులు తిరుగుబాటు చేశారు. ప్రతి రాష్ట్రంలో పబ్లిక్ వర్‌‌క్స శాఖను ప్రవేశపెట్టారు. 1854లో చార్లెస్ ఉడ్స్ అధ్యక్షుడిగా విద్యకు సంబంధించిన అంశాలపై కమిటీ ఏర్పాటు చేశాడు. ఈ కమిటీ సూచనలతో విద్యాలయం నుంచి విశ్వవిద్యాలయాల వరకు కీలక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. 1853లో రైళ్లు, తంతితపాలా, రోడ్డు రవాణా సౌకర్యాలు ప్రవేశపెట్టాడు. బొంబాయి నుంచి థానే వరకు మొదటి రైల్వే లైన్ వేశారు. కలకత్తా నుంచి పెషావర్ వరకు మొదటి తంతి నిర్మించాడు. 1854లో మొదటిసారిగా తపాలా బిళ్లలను ప్రవేశపెట్టాడు. పబ్లిక్ వర్‌‌క్స డిపార్‌‌టమెంట్‌ను ఏర్పాటు చేశాడు. 1853లో చార్టర్ చట్టంతో పోటీ పరీక్షలను ప్రవేశపెట్టారు. ఈ చట్టం వ్యాపార సంస్థలకు.. వ్యాపారంలో తప్ప మిగతా విషయాలతో సంబంధం లేకుండా చేసింది. 1854లో బొంబాయిలో మొదటి నూలు మిల్లు, కలకత్తాలో జనపనార మిల్లును స్థాపించారు.

లార్డ్ కానింగ్ (1856-62)
1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ 1858లో ఒక చట్టం చేసింది. దీని ప్రకారం బ్రిటిష్ ఇండియాలో ‘వైస్రాయ్’ పదవిని ఏర్పాటు చేశారు. లార్డ్ కానింగ్ 1858 చట్టం ప్రకారం తొలి రాజప్రతినిధిగా నియమితులయ్యాడు. 1861లో ఇండియా కౌన్సిళ్ల చట్టం ప్రవేశపెట్టారు. 1859లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశారు. 1858లో భారత శిక్షాస్మృతి, 1861లో హైకోర్టు చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1865లో లారెన్స్ మూడు హైకోర్టులను స్థాపించాడు. 1857లో కానింగ్ కలకత్తా, బొంబాయి, మద్రాసులో విశ్వవిద్యాలయాలు స్థాపించాడు. ఇతడి కాలంలో 1859లో శ్వేత సైనికుల విప్లవం, 1860లో నీలి మందు రైతుల తిరుగుబాటు, 1863లో పాబ్నా రైతుల తిరుగుబాటు చెలరేగాయి.

వైస్రాయ్‌లు
లార్డ్ కానింగ్
ఇతడిని 1858 నవంబర్ 1న అలహాబాద్ కోటలో తొలి రాజప్రతినిధిగా ప్రకటించారు.

మొదటి లార్డ్ ఎల్జిన్ (1862-63)
ఇతడి కాలంలో ప్రధానంగా వహాబి ఉద్యమం జరిగింది. సుప్రీమ్, సాదర్ కోర్టులను హైకోర్టులో కలిపారు.

సర్ జాన్ లారెన్స్ (1864-69)
లారెన్స్ 1866లో ఒడిశాలో, 1868-69లో రాచపుఠానాలో సంభవించిన క్షామానికి సంబంధించిన నివారణన చర్యలు తీసుకోవడానికి సలహా సంఘం నియమించాడు. 1866లో వితంతు వివాహ సంస్థను డి.కె. కార్వే ఆధ్వర్యంలో బొంబాయిలో స్థాపించారు. సర్ జాన్ లారెన్స్ అనేక రైల్వే, తంతి తపాలా సౌకర్యాలను కల్పించాడు. ఇతడు యూరప్‌లో మొదటిసారిగా తంతి సౌకర్యం కల్పించాడు. పంజాబ్ కౌలు చట్టాన్ని జారీ చేశాడు. దీని ప్రకారం కౌలుదార్లకు అధికారాలు ఇచ్చారు. భూటాన్ యుద్ధం చేశాడు. ఇతడి కాలంలో మద్రాస్, బొంబాయి, కలకత్తాలో కోర్టులు ఏర్పాటు చేశారు.

లార్డ్ మేయో (1869-72)
ఇతడు స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా, వ్యవసాయ, వాణిజ్య శాఖలను ఏర్పాటు చేశాడు. ఇతడు ఆఫీసులోనే హత్యకు గురైన మొదటి గవర్నర్ జనరల్. అజ్మీర్‌లో విద్య కోసం ఒక కళాశాల, రాజ్‌కోట్‌లో రాజకీయ శిక్షణ ఇవ్వడానికి మరో కళాశాల స్థాపించాడు.

లార్డ్ నార్త్ బూక్ (1872-76)
ఇతడి కాలంలో 1875లో వేల్స్ రాజు (ఏడో ఎడ్వర్‌‌డ) భారతదేశాన్ని సందర్శించాడు. 1872లో బహు భార్యత్వ నిషేధ చట్టాన్ని జారీ చేశారు.

లార్డ్ లిట్టన్ (1876-80)
ఇతడి కాలంలో 1878లో ఆయుధ చట్టం, దేశభాషా పత్రికల చట్టాలను చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే జాతీయవాదులను అణచివేయడం కోసం దేశభాషా పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టారు. లిట్టన్ 1878లో ఐ.సి.ఎస్. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల గరిష్ట వయసును 21 ఏళ్ల నుంచి 19 సంవత్సరాలకు తగ్గిస్తూ కొత్త నిబంధనలు ప్రకటించాడు. ఇతడు రెండో అఫ్గాన్ యుద్ధం చేశాడు. ఇతడి కాలంలో తీసుకువచ్చిన యుద్ధ చట్టం యావత్ జాతిని నిరాయుధులను చేసింది. రాయల్ టైటిల్స్ యాక్ట్ చేశారు. 1877లో ఢిల్లీ దర్బార్ జరిగింది. ఇతడి కాలంలో మొదటిసారిగా కరవుపై కమిషన్ ఏర్పాటు చేశారు.

లార్డ్ రిప్పన్ (1880-84)
ఇతడు 1882లో దేశభాషా పత్రికల చట్టాన్ని రద్దు చేసి స్వేచ్ఛా ప్రతిపత్తిని కల్పించాడు. 1881లో మొదటి కర్మాగార చట్టం ప్రవేశపెట్టాడు. దీని ద్వారా కర్మాగారంలో పని చేసే శ్రామికుల పరిస్థితులు మెరుగయ్యాయి. 1882లో ఆర్థిక వికేంద్రీకరణ చేసి ఆదాయాన్ని 3 భాగాలుగా విభజించారు. అవి.. 1) కేంద్ర ప్రభుత్వ ఆదాయం, 2) రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, 3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆదాయం. 1882లో స్థానిక ప్రభుత్వాలకు పునాది వేసిన ఘనత రిప్పన్‌దే. ఇతడు 1882-85లో స్థానిక ప్రభుత్వ వ్యవహార చట్టం జారీ చేశాడు. ఇదే సంవత్సరంలో సర్ విలియం హంటర్ అధ్యక్షతన విద్యకు సంబంధించి ఒక కమిషన్‌ను నియమించాడు. ఈ కమిషన్ సూచనల ఆధారంగా ప్రాథమిక పాఠశాల విద్యను స్థానిక సంస్థలకు అప్పగించాడు. స్త్రీ విద్య కూడా ప్రవేశపెట్టారు. ఇతడి కాలంలో యూరోపియన్ల ఒత్తిడి మేరకు ‘ఇల్బర్ట్ బిల్లు’ను సవరించారు.
ఈ బిల్లు క్రిమినల్ కేసుల్లో యూరోపియన్లను విచారించడానికి భారతీయ జిల్లా మెజిస్ట్రేటులు, సెషన్స్ జడ్జీలకు అవకాశం కల్పించే శాసనంగా ఉండేది. 1879లో వాసుదేవ్ బలవంత్ పాడ్కే అనే ఉద్యోగి అమోషి రైతులను కూడగట్టి మహారాష్ట్రలో సాయుధ తిరుగుబాటు ప్రారంభించాడు. లార్డ్ రిప్పన్ కాలంలో భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలు గణించారు.

లార్డ్ డఫ్రిన్ (1884-88)
ఇతడి కాలంలో 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ఎ.ఒ. హ్యూమ్ తుది రూపం ఇచ్చాడు. ఇదే సంవత్సరం డిసెంబర్‌లో బొంబాయిలో ప్రథమ జాతీయ కాంగ్రెసు సమావేశానికి డబ్ల్యు.సి. బెనర్జీ అధ్యక్షత వహించాడు. మూడో బర్మా యుద్ధం డఫ్రిన్ కాలంలోనే జరిగింది.

లాండ్‌జన్ (1888-94)
ఇతడి కాలంలో ఫ్యాక్టరీ చట్టం చేశారు. సివిల్ సర్వీసులను విభజించారు. ‘డ్యూరాండ్ కమిషన్’ బ్రిటిష్ ఇండియా, అఫ్గానిస్తాన్ మధ్య సరిహద్దును నిర్ణయించింది. 1892లో ‘భారత కౌన్సిళ్ల చట్టం’ జారీ చేశారు. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో సభ్యుల సంఖ్య పెరిగింది. వీరిలో కొందరిని భారతీయులు పరోక్షంగా ఎన్నుకునే వీలు కలిగింది. కానీ ప్రభుత్వం నియమించే సభ్యుల సంఖ్యాధిక్యత యథాతథంగానే ఉంది. నూతన సభ్యులకు వార్షిక బడ్జెట్‌పై చర్చలో పాల్గొనే అవకాశం కల్పించారు. కానీ, వీరికి ఓటు హక్కు లేదు.

ఎలిజిన్ (1894-99)
ఇతడి కాలంలో 1896-97లో భయంకరమైన క్షామం సంభవించింది. దీనికి కారణాలు తెలుసుకోవడానికి ‘విలీ’ల అధ్యక్షతన ఒక సంఘాన్ని నియమించాడు. ఇది నివేదిక సమర్పించక ముందే 1899లో మళ్లీ క్షామం వచ్చింది. చాపేకర్ సోదరులు 1897లో ఇద్దరు బ్రిటిష్ అధికారులను హత్య చేశారు.

లార్డ్ కర్జన్ (1899-1905)
కర్జన్ 1904లో యూనివర్సిటీ చట్టాన్ని జారీ చేశాడు. ‘సర్‌థామస్’ ర్యారీ అధ్యక్షతన యూనివర్సిటీలకు సలహాలు ఇవ్వడానికి ఒక కమిషన్ నియమించాడు. 1904లో ప్రాచీన కట్టడాల (మాన్యుమెంట్స్) రక్షణ చట్టం, ప్రిజర్వేషన్ యాక్ట్‌ను జారీ చేశాడు. బిహార్‌లోని ‘పూసా’లో వ్యవసాయ పరిశోధన సంస్థను స్థాపించాడు. 1905లో బెంగాల్‌ను విభజించాడు. కర్జన్ కాలంలోనే 1904లో వి.డి సావర్కర్ ‘అభినవ భారత్’ పేరుతో ఒక రహస్య విప్లవ సంస్థను స్థాపించాడు.

లార్డ్ మింటో (1905-10)
ఇతడి కాలంలో అతివాదులు, విప్లవ కారులు విజృంభించారు. వీరి కార్యకలాపాలను అరికట్టడానికి 1908లో ‘ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్ యాక్ట్’ చేశాడు. పత్రికలు, ప్రజావేదికలపై ఆంక్షలు విధించాడు. దీని కారణంగా 1908లో ‘లోక్‌మాన్య’ బాలగంగాధర్ తిలక్‌ను మాండలే కారాగారంలో నిర్బంధించారు. లార్డ్ మింటో కాలంలోనే 1906లో ‘భారత ముస్లింలీగ్’ను స్థాపించారు. ఆగాఖాన్, ఢాకా నవాబు దీని ఏర్పాటుకు కృషి చేశారు. 1907లో భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది. బెంగాల్ విభజనకు నిరసనగా ప్రతిఘటనోద్యమ నాయకులు 1905 అక్టోబర్ 16ను జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. 1906 ఆగస్టు 15న జాతీయ విద్యా సమితి ఆవిర్భవించింది. కలకత్తాలో జాతీయ కళాశాలను ప్రారంభించారు. అరవింద్ ఘోష్ దీనికి మొదటి ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. 1905 తర్వాత అనేక పత్రికలు విప్లవ హింసావాదాన్ని ప్రచారం చేయడం ప్రారంభించాయి. వీటిలో బెంగాలీలో వెలువడే సంధ్య, యుగంధర్; పుణే నుంచి వెలువడే ‘కాల్ ప్రముఖ్’ పత్రికలు ముఖ్యమైనవి. 1909లో భారత శాసనసభల చట్టం ద్వారా రాజ్యాంగపరమైన రాయితీలు ప్రకటించారు. వీటినే మింటో-మార్లే సంస్కరణలు అంటారు. వీటి ద్వారా కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో ఎన్నికైన సభ్యుల సంఖ్యను పెంచారు. వీరిలో ఎక్కువ మందిని పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకునే విధానం ప్రవేశపెట్టారు. మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలను కూడా ఏర్పాటు చేశారు. హిందూ-ముస్లింలను విభజించి పాలించడమే ఇందులోని ప్రధాన ఉద్దేశం.

లార్డ్ హార్డింజ్ (1910-1916)
ఇతడి కాలంలో 1911లో బెంగాల్ విభజనను రద్దు చేశారు. భారత రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. అయిదో జార్జి ఢిల్లీ దర్బారును ఏర్పాటు చేశారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. భారత సైనికులు, పౌరులను అనుమతి లేకుండానే యుద్ధంలోకి నెట్టారు. 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చారు. ఇదే సంవత్సరంలో అనిబిసెంట్ హోమ్‌రూల్ ఉద్యమాన్ని, మదన్ మోహన్ మాలవ్య ‘హిందూ మహాసభ’ను స్థాపించారు. 1915లోనే గోఖలే, ఫిరోజ్‌షా మెహతా మరణించారు.

వైస్రాయ్‌లు లార్డ్ చెమ్స్‌ఫర్డ్ (1916-21)
ఇతడి కాలంలో 1916లో కాంగ్రెస్ లక్నో సమావేశంలో అతివాదులు, మితవాదులు, హిందూ-ముస్లింలు ఏకమయ్యారు. 1917లో చంపారన్ సత్యాగ్రహం, 1918లో అహ్మదాబాద్‌లో నూలుమిల్లుల ఉద్యమం జరిగాయి. 1919లో మాంటెగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు ప్రవేశపెట్టారు. వీటి ద్వారా ద్వంద్వ పరిపాలన (Diarchy) కింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలు కల్పించారు. ఆర్థిక వ్యవహారాలు, శాంతిభద్రతలు గవర్నర్ ప్రత్యక్ష ఆధీనంలో (Reserved Subjects); విద్య, ఆరోగ్యం, వ్యవసాయం మొదలైనవి శాసన సంబంధమైన అంశాలు (Transferred Subjects)గా ఉంటాయి. దీని ద్వారా ఎగువసభ, దిగువ సభలు ఏర్పడ్డాయి. చెమ్స్‌ఫర్డ్ కాలంలోనే 1919లో జలియన్ వాలాబాగ్ ఊచకోత జరిగింది. 1919లో ఢిల్లీలో అఖిల భారత ఖిలాపత్ సమావేశం జరిగింది.
1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించి పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలను బహిష్కరించారు. గాంధీజీ తనకు ఇచ్చిన కైజర్-ఇ-హింద్ పతకాన్ని తిరిగి ఇచ్చేశారు. 1920లో బాలగంగాధర్ తిలక్ మరణించారు. సి.ఎన్. బెనర్జీ ఇండియన్ లిబరల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఖిలాపత్ ఉద్యమం ప్రారంభమైంది. పుణేలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.

లార్డ్ రీడింగ్ (1921-26)
ఇతడి కాలంలో అలీగఢ్ జామియా మిలియా ఇస్లామియా (జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయం), బిహార్ విద్యాపీఠ్, కాశీ విద్యాపీఠ్, గుజరాత్ విద్యాపీఠ్ తదితర విద్యాసంస్థలను స్థాపించారు. 1921లో పంజాబ్‌లో సిక్కులు గురుద్వారాల నుంచి అవినీతిపరులైన మహంతులను తొలగించడానికి అకాలీ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1922లో చౌరీచౌరాలో ప్రజలు పోలీస్‌స్టేషన్‌ను తగులబెట్టారు. ఈ ఘటనలో 22 మంది పోలీసులు మృతి చెందారు. దీంతో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేశారు.
1922 డిసెంబర్‌లో చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ కలిసి స్వరాజ్య పార్టీని స్థాపించారు. 1921లో ఎం.ఎన్. రాయ్ భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. 1926లో మతకలహాలు చెలరేగాయి. వీటిలో భాగంగా ప్రముఖ నాయకుడు, జాతీయవాది అయిన స్వామి శ్రద్ధానంద్‌ను మతచాంధసవాదులు హత్య చేశారు. కె.బి. హెగ్డేవార్, ఆర్.ఎస్.ఎస్.ను స్థాపించారు. రౌలత్ చట్టాన్ని రద్దు చేశారు.

లార్డ్ ఇర్విన్ (1926-31)
ఇర్విన్ కాలంలో 1928 ఫిబ్రవరిలో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. ఇందులో భారతీయులెవరికీ సభ్యత్వం కల్పించలేదు. దీంతో ఈ కమిషన్‌కు దేశవ్యాప్తంగా నిరసన ఎదురైంది. 1928 డిసెంబర్‌లో తొలిసారిగా అఖిల భారత యువజన కాంగ్రెస్ సమావేశం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో రైతులు 1928లో పన్నుల నిరాకరణోద్యమం సాగించారు. 1928లో చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో ‘హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్’ అనే విప్లవ సంస్థ ఆవిర్భవించింది.
భగత్‌సింగ్, బి.కె. దత్తు కలిసి 1929 ఏప్రిల్ 8న కేంద్ర శాసనసభలో బాంబు విసిరారు. ప్రజారక్షణ బిల్లు ఆమోదానికి నిరసనగా వీరు ఈ ఘటనకు పాల్పడ్డారు. 1930లో చిట్టగాంగ్‌లో ప్రభుత్వ ఆయుధాగారంపై దాడి జరిగింది. సూర్యాసేన్ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో మహిళలు సైతం పాల్గొన్నారు. రాజకీయ ఖైదీలను ఉంచే జైళ్లలో దుర్భర పరిస్థితులు ఉండేవి. దీనికి నిరసనగా జతిన్‌దాస్ అనే యువకుడు 63 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి ప్రాణత్యాగం చేశాడు. 1931లో భగత్‌సింగ్, రాజ్‌గురును పోలీసు అధికారుల హత్యకేసుల్లో విచారించి ఉరితీశారు. 1929లో కాంగ్రెస్ పార్టీ లాహోర్‌లో సమావేశమైంది. ‘సంపూర్ణ స్వరాజ్యం’ కాంగ్రెస్ ఆశయమని ఈ సమావేశంలోనే ప్రకటించారు. అదే ఏడాది త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ 1930 మార్చి 12న దండి సత్యాగ్రహం ప్రారంభించారు. ఇదే ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధికెక్కింది. 1930లో జరిగిన తొలి రౌండ్ టేబుల్ సమావేశానికి భారతీయ నాయకులను ఆహ్వానించారు. కానీ, సైమన్ నివేదికపై చర్యకు నిరసనగా వీరు సమావేశాన్ని బహిష్కరించారు. తర్వాత గాంధీ-ఇర్విన్ సంధి జరిగింది. ఉద్యమాన్ని నిలిపివేశారు.

లార్డ్ వెల్లింగ్‌టన్ (1931-36)
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నాయకత్వంలో పఠాన్లు ‘ఖుదాయ్ ఖిద్మత్ గార్’ అనే సంస్థను ప్రారంభించారు. దీనికి భగవంతుడి సేవకులని అర్థం. వీరినే ‘రెడ్ షర్ట్’లు అని కూడా పిలుస్తారు. మణిపూర్ వాసులు జాతీయోద్యమంలో సాహసోపేత పాత్ర పోషించారు. గాంధీజీ పిలుపు మేరకు నాగాలాండ్ వీరనారి ‘రాణి గైడిన్‌లియూ’ పదమూడేళ్ల వయస్సులోనే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఆమె తిరుగుబాటు జరిపారు. 1932లో బ్రిటిష్ ప్రభుత్వం రాణికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. 1947లో స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం ఆమెను విడుదల చేసింది. 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీజీ లండన్ వెళ్లారు. ఈ సమావేశంలో ‘కమ్యూనల్ అవార్డు’ను ప్రకటించారు. దీని ప్రకారం మైనారిటీలకు ప్రత్యేక నియోజక వర్గాలు కల్పించారు. దీనికి నిరసనగా గాంధీజీ నిరాహారదీక్ష చేపట్టారు.
నిమ్నజాతులకు కూడా ప్రత్యేక స్థానాలను ప్రకటించారు. గాంధీ-అంబేద్కర్ మధ్య పుణే ఒప్పందం జరిగింది. 1932లో మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఓటింగ్ అర్హత, ఉమ్మడి నిధులు, రాష్ట్రాల ఆర్థిక వనరుల గురించి ఈ సమావేశంలో చర్చించారు. మహిళలకు ఓటు హక్కు కల్పించడం, రాష్ట్రాల శాసనసభ్యుల సమాఖ్య, ఎగువసభ, ప్రతినిధులను ఎన్నుకోవడం మొదలైనవి ఈ సమావేశం నిర్ణయించిన నూతన విషయాలు. గాంధీ-ఇర్విన్ ఒప్పందం తర్వాత 1933లో కాంగ్రెస్ అధికారికంగా ఉద్యమాన్ని నిలిపివేసింది. 1935 భారత ప్రభుత్వ రాజ్యాంగ చట్టం ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం దేశంలో ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థ ఏర్పాటైంది. రాష్ట్రాలకు స్వపరిపాలనాధికారం లభించింది. 1935 చట్టం రాజ్యాధికారాలను మూడు రకాలుగా విభజించింది. అవి:
1. సమాఖ్య అధికారాలు
2. రాష్ర్ట అధికారాలు
3. ఉమ్మడి అధికారాలు
తమ అధికార పరిధిలో శాసనాలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వాలకు సర్వాధికారం ఉంటుంది. ఉమ్మడి జాబితాపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు శాసనం చేయవచ్చు. ఏ శాసన్నానైనా వీటో చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఉంటుంది. బిల్లులను పునఃపరిశీలించమని సూచించే లేదా బ్రిటిష్ చక్రవర్తి నిర్ణయానికి పంపే అధికారం గవర్నర్ జనరల్‌కు ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ఎగువ సభలో 2/5వ వంతు, దిగువ సభలో 3/5వ వంతు స్థానాలు సంస్థానాధీశులకు కేటాయించారు. భారత్ నుంచి బర్మాను వేరు చేశారు. జయప్రకాశ్ నారాయణ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. 1936లో ఆలిండియా కిసాన్ సభ ఏర్పాటైంది.

లార్డ్ లిన్‌లిత్ గో (1936-44)
భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం 1937 జూలై నాటికి ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 1937లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1936లో తొలి అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భవించింది. నాటి నుంచి రైతాంగం జాతీయోద్యమంలో క్రియాశీల పాత్ర పోషించింది. 1936 లక్నో కాంగ్రెస్ సమావేశంలో సోషలిజాన్ని ఆమోదించారు.
1938లో జాతీయ కాంగ్రెస్ గుజరాత్‌లోని హరిపూర్‌లో సమావేశమైంది. దీనికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించారు. 1939లో బోస్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. గాంధీ, నెహ్రూ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినప్పటికీ సుభాష్ చంద్రబోస్ గెలుపొందారు. వర్కింగ్ కమిటీలో గాంధీజీ అనుయాయులు బోస్ పట్ల విముఖత చూపారు. దీంతో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కొందరు వామపక్ష వాదులతో కలిసి ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త పార్టీని ప్రారంభించారు. 1927 డిసెంబర్ నాటికే అఖిల భారత సంస్థాన ప్రజాసభ ప్రారంభమైంది. 1939లో నెహ్రూ ఈ సభకు అధ్యక్షుడయ్యాడు. 1939లోనే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. భారతీయులను సంప్రదించకుండానే భారత్‌లోని బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధంలోకి అడుగుపెట్టింది. ఈ విషయమై జాతీయ కాంగ్రెస్‌కు లేదా కేంద్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులకు మాటమాత్రంగా కూడా చెప్పలేదు. 1940లో ముస్లిం లీగ్ దేశ విభజన తీర్మానాన్ని ఆమోదించింది. అదే ఏడాది బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు ఆఫర్ జారీ చేసింది. దీని ప్రకారం మైనారిటీలకు అధిక స్థానాలను కేటాయిస్తారు. యుద్ధం ముగిశాక నూతన రాజ్యాంగంలో ఈ విషయాన్ని పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. 1941లో సుభాష్ చంద్రబోస్ నిర్బంధం నుంచి తప్పించుకొని బెర్లిన్ వెళ్లారు. 1942లో ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఆజాద్ హిందు ఫౌజ్)ని స్థాపించారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం విదేశాల నుంచే బోస్ పోరాడారు. ఆయన ‘జైహింద్’ అనే నినాదమిచ్చారు.
రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయుల పూర్తి సహకారం కోసం బ్రిటన్ ప్రయత్నించింది. ఇందు కోసం 1942 మార్చిలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలో ఒక రాయబార బృందాన్ని భారత్‌కు పంపింది. క్రిప్స్ బ్రిటిష్ మంత్రివర్గ సభ్యుడు, లేబర్ పార్టీలో రాడికల్ సభ్యుడు. వీలైనంత త్వరగా స్వపరిపాలన ప్రతిపాదించడమే తమ లక్ష్యమని క్రిప్స్ తెలిపారు. కాంగ్రెస్ కమిటీ 1942 ఆగస్టు 8న బొంబాయిలో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించారు. కాంగ్రెస్ పార్టీ, గాంధీజీ నాయకత్వంలో అహింసాయుత ప్రజాపోరాటాన్ని కొనసాగించింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని సమర్థవంతంగా అణచివేసింది.

లార్డ్ వేవెల్ (1944-47)
1944లో అట్లీ బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1945లో కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీలు లార్డ్ వేవెల్ సమక్షంలో సిమ్లాలో సమావేశమయ్యాయి. రాజ్యాంగ, మత అడ్డంకులను తొలగించేందుకు ఆ పార్టీలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 1946లో అఖిల భారత తంతి-తపాలా కార్మికులు సమ్మె చేశారు. కౌలు రేట్ల తగ్గింపు కోసం రైతాంగ పోరాటాలు అధికమయ్యాయి. సమ్మెలు, హర్తాళ్లు, ప్రదర్శనలు నిర్వహించడంలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం 1946 మార్చిలో కేబినెట్ మిషన్‌ను పంపింది. అధికార బదిలీ గురించి భారత జాతీయ నాయకులతో ఈ మిషన్ సంప్రదింపులు జరిపింది. నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చే దాకా తాత్కాలిక జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బ్రిటిష్ రాయబార వర్గం సూచించింది. 1946 సెప్టెంబర్‌లో నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక జాతీయ ప్రభుత్వం ఏర్పాటైంది. ముస్లింలీగ్ మంత్రి వర్గంలో చేరింది. కేబినెట్ ప్లాన్‌ను అంగీకరించని ముస్లింలీగ్ 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష చర్యాదినంగా ప్రకటించింది. నేవీ తిరుగుబాటు చేసింది. ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించింది.

లార్డ్ మౌంట్ బాటన్ (1947)
మౌంట్ బాటన్ 1947లో భారత వైస్రాయ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన కాంగ్రెస్, ముస్లిం లీగ్ నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా అవతరిస్తాయన్న ప్రకటన 1947 జూన్ 3న విడుదలైంది. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ నూతన దేశంగా ఆవిర్భవించింది. అదే రోజు అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 1948 జనవరి 30న గాడ్సే గాంధీజీని కాల్చి చంపాడు.

ముఖ్యాంశాలు
  • 1929: లాహోర్‌లో నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సమావేశం. ‘సంపూర్ణ స్వరాజ్యమే’ తమ ఆశయమని ప్రకటన.
  • 1930 మార్చి 12: దండి సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ.
  • 1942 మార్చి: సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలో భారత్‌కు రాయబార వర్గం రాక.
  • 1942 ఆగస్టు 8: బొంబాయిలో కాంగ్రెస్ కమిటీ సమావేశం, క్విట్ ఇండియా తీర్మానానికి ఆమోదం.
  • 1946 మార్చి: కేబినెట్ మిషన్ భారత్ రాక.
  • 1946 ఆగస్టు 16: కేబినెట్ ప్లాన్‌ను అంగీకరించని ముస్లిం లీగ్, ఆగస్టు 16ను ప్రత్యక్ష చర్యాదినంగా ప్రకటన.
  • 1947 జూన్ 3: భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా అవతరిస్తాయనే ప్రకటన విడుదల.
Published date : 23 Nov 2015 01:02PM

Photo Stories