Skip to main content

19వ శతాబ్దంలో సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

భారతీయ సమాజంలో తరతరాలుగా ఎన్నో మూఢాచారాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వేద సంస్కృతీ వైభవం మరుగున పడిపోయింది. ఆంగ్ల విద్య, బ్రిటిష్ పాలనా ప్రభావంతో భారతీయ సమాజంలోని కొంత మంది మేధావులు సమాజాన్ని, మతాన్ని సంస్కరించేందుకు ప్రయత్నించారు. వారిలో ఆద్యుడు ‘రాజా రామ్‌మోహన్ రాయ్’. అందుకే ఆయన్ను భారతీయ సాంస్కృతిక పునర్జీవన పితగా పేర్కొంటారు. ఆయన తర్వాత ఎంతోమంది ప్రముఖులు తమ సంస్థలు, బోధనల ద్వారా భారతీయ సమాజాన్ని సంస్కరించేందుకు కృషి చేశారు.

బ్రహ్మసమాజం

  • రాజా రామ్‌మోహన్ రాయ్ 1815లో ఏకేశ్వరోపాసనను ప్రచారం చేసేందుకు ఆత్మీయతా సభను స్థాపించారు. ఇది 1828 నాటికి బ్రహ్మసమాజంగా రూపొందింది. స్వల్ప కాలంలోనే బ్రహ్మసమాజ శాఖలు భారతదేశమంతటా విస్తరించి, సమాజ సంస్కరణకు కృషి చేశాయి.
  • బ్రహ్మసమాజం సిద్ధాంతాల ప్రకారం దేవునికి, సామాన్యులకు మధ్య పూజారులనే మధ్యవర్తులు అవసరం లేదు.
  • ఈ సమాజంలోని వారు మానవులకు సేవ చేయడమే అత్యున్నత ఆరాధనగా భావించి.. కుల, మత, జాతి విభేదాలను నిరసించారు.
  • రాజా రామ్‌మోహన్ రాయ్.. కులీన విధానాలు, సతీసహగమనం, బహుభార్యత్వాలను నిరసించడంతో పాటు స్త్రీవిద్య, స్త్రీలకు ఆస్తిహక్కు, వితంతు వివాహాలను సమర్థించారు.
  • బ్రిటిష్ పాలన, ఆంగ్ల విద్యలపై సానుకూల దృక్పథంతో ఉన్న రాయ్ వాటి వల్లే భారతీయ సమాజంలో మార్పులు సాధ్యమని విశ్వసించారు.
  • రాజా రామ్‌మోహన్‌రాయ్ కృషి వల్ల 1829, డిసెంబర్ 4న విలియం బెంటిక్ సతీసహగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు.
  • రాజా రామ్‌మోహన్ రాయ్ అనంతరం ద్వారకానాథ్ ఠాగూర్, రామచంద్ర విద్యాబాగిష్‌లు బ్రహ్మసమాజ నిర్వహణను కొనసాగించారు.
  • దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మసమాజ నాయకత్వాన్ని స్వీకరించాక.. అనేక మార్పులు ప్రవేశపెట్టారు. బ్రహ్మసమాజంలో చేరకముందు ఆయన స్థాపించిన తత్వబోధిని సభ బ్రహ్మసమాజ కార్యక్రమాలకు ముఖ్యకేంద్రంగా వర్థిల్లింది. ఠాగూర్ స్థాపించిన తత్వబోధిని పత్రిక సాంఘిక సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేసింది.
  • ఆధునిక భావాలు కలిగిన కేశవచంద్రసేన్ చేరికతో 1866లో బ్రహ్మసమాజంలో చీలికలు వచ్చాయి. కేశవచంద్రసేన్ ఆధ్వర్యంలో భారతీయ బ్రహ్మసమాజం, దేవేంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో ఆది బ్రహ్మసమాజం ఏర్పడ్డాయి.
  • బ్రహ్మసమాజంలో 1878లో మరో చీలిక వచ్చింది. సేన్‌తో విబేధించిన శివనాథశాస్త్రి, ఆనందమోహన్ బోస్‌లు సాధారణ బ్రహ్మసమాజాన్ని స్థాపించారు.
  • బ్రహ్మసమాజంలో చీలికలు వచ్చినా సమాజంపై ఎంతో ప్రభావాన్ని చూపించింది.

బ్రహ్మసమాజ ప్రముఖులు

రాజా రామ్‌మోహన్‌రాయ్
జననం: మే 22, 1772
రచనలు: తుహ్‌పత్-ఉల్, మువాహిదిన్ ప్రెసెప్ట్స్ ఆఫ్ జీసస్- ఎ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్
పత్రికలు: సంవాద కౌముది (బెంగాల్), మిరాత్- ఉల్- ఆక్బర్ (పర్షియన్)
మరణం: సెప్టెంబర్ 27, 1833 (బ్రిస్టల్ నగరం)

దేవేంద్రనాథ్ ఠాగూర్
కాలం: 1817-1905
స్థాపన: తత్వబోధిని సభ, తత్వబోధిని పాఠశాల
పత్రిక: తత్వబోధిని
రచన: బ్రహ్మోధర్మ

కేశవచంద్రసేన్
కాలం: 1838- 1884
స్థాపన: సంగీత్ సభ, నవ విధాన సభ
పత్రికలు: ఇండియన్ మిర్రర్ సులభ్, సమాచార్ ప్రార్థనా సమాజం

  • కేశవ చంద్రసేన్ ప్రచారంతో 1867లో ఆత్మారాం పాండురంగ మహారాష్ర్టలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు.
  • ప్రార్థనా సమాజం భగవంతుడు అంతటా ఉన్నాడని.. ఆత్మ ఈశ్వరునిలో భాగమని ప్రచారం చేసింది.
  • మహాదేవ్ గోవింద్ రనడే, ఆర్.జి. భండార్కర్, విఠల్ రామ్‌జీ షిండే, పండిత రమాబాయి మొదలైనవారు ఈ సమాజానికి సంబంధించిన ప్రముఖులు.

మహాదేవ గోవింద రనడే
కాలం: 1842-1901
బిరుదు: మహారాష్ర్ట సోక్రటీస్
స్థాపన: డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ


ఆర్యసమాజం

  • 1875లో దయానంద సరస్వతి స్థాపించారు.
  • ఆయన వేద సంస్కృతి ప్రేరణగా భారత సమాజాన్ని, మతాన్ని సంస్కరించేందుకు కృషిచేశారు.
  • వేదాలకు తరలిపొండి.. అనే నినాదంతో భారతదేశమంతా పర్యటించారు.
  • ఇతర మతాల్లో చేరిన వారిని తిరిగి హిందూమతంలో చేర్చుకునేందుకు శుద్ధి ఉద్యమం, గోవుల రక్షణకు గో రక్షక ఉద్యమాన్ని ప్రారంభించారు.
  • 1892లో ఆర్యసమాజం గురుకుల వర్గం, కళాశాల వర్గంగా చీలిపోయింది. గురుదత్, శ్రద్ధానంద దేవరాజ్‌లు గురుకుల వర్గంలో ప్రముఖులు కాగా, లాలా హన్సరాజ్, లజపతిరాయ్ తదితరులు కళాశాల వర్గంలో ప్రముఖులు.
  • విద్యావ్యాప్తి, కుల వ్యవస్థ, మూఢాచారాల నిర్మూలనకు ఆర్యసమాజ్ ఎంతగానో కృషిచేసింది.

దయానంద సరస్వతి
కాలం: 1824 - 1883
రచనలు: సత్యార్థ ప్రకాశిక, వేదభాష్య భూమిక
స్థాపన: ఆర్యసమాజ్, గో రక్షణ సంఘం


దివ్యజ్ఞాన సమాజం

  • ఇది మొదట అమెరికాలో కల్నల్ ఓల్కాట్, మేడం బ్లావటస్కీ స్థాపించారు.
  • ఈ సమాజ సిద్ధాంతాలకు భారతదేశం సరైన వేదిక అని భావించి 1878లో మద్రాస్‌లోని అడయార్‌లో దీని శాఖను నెలకొల్పారు.
  • ఐర్లాండ్ వనిత అనిబిసెంట్ ఇందులో సభ్యురాలైన తర్వాతే ఈ సమాజం భారతదేశ మంతా శాఖలను ఏర్పాటు చేసింది.
  • అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజ సిద్ధాంతాల వ్యాప్తికే పరిమితం కాకుండా జాతీయోద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు.

అనిబిసెంట్
పత్రికలు: వేక్ ఆన్ ఇండియా, కామన్ వీల్, న్యూ ఇండియా
స్థాపన: బెనారస్ హిందూ కళాశాల, మదనపల్లి కళాశాల
ఘనత: జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ( 1917లో)
ఉద్యమం: హోం రూల్ ఉద్యమం


రామకృష్ణ మఠం

  • రామకృష్ణ పరమహంస శిష్యుల్లో ముఖ్యుడైన స్వామి వివేకానంద తన గురువు గారి బోధనలను ప్రచారం చేసేందుకు దీన్ని స్థాపించారు.
  • ఎంతోమందికి ఆదర్శవంతుడైన స్వామి వివేకానంద హిందూమతాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు.
  • 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రసంగించారు.
  • 1887లో రామకృష్ణమఠంతో పాటు 1897లో రామకృష్ణ మిషన్ అనే సేవా సంస్థను స్థాపించారు. 1898 నుంచి కలకత్తాలోని బేలూరు మఠం రెండిటికీ ప్రధాన కేంద్రంగా ఉంది.
  • సన్యాసులంటే ఏకాంతంలో తపస్సు చేయడం కాదని, సమాజానికి, సంస్కృతికి సేవ చేయడం వారి ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
Published date : 07 Jun 2016 03:04PM

Photo Stories