Skip to main content

పర్యావరణ కాలుష్యం

Pollution అనే పదం లాటిన్ భాషలోని pollutonium అనే పదం నుంచి వచ్చింది. లాటిన్ భాషలో pollutonium అంటే అపరిశుభ్రత అని అర్థం.
మానవుడి కార్యకలాపాల వల్ల పర్యావరణంలో కొన్ని పదార్థాల గాఢతలు సాధారణ స్థాయిని మించిపోయి పర్యావరణంపైదుష్ర్పభావం చూపుతాయి. ఫలితంగా మానవుడితో సహా ఇతర జీవరాశులపై చెడు ప్రభావం ఉంటుంది. దీన్నే పర్యావరణ కాలుష్యం అంటారు. దీనికి కారణమయ్యే పదార్థాలను కాలుష్యకాలు అంటారు.
ఉదా: లెడ్, పాదరసం, కార్బన్‌మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మొదలైనవి.
 
ప్రకృతిలో సహజ ప్రక్రియ వల్ల జరిగే కాలుష్యాన్ని సహజ కాలుష్యం అని, మానవుడి చర్యల వల్ల జరిగే కాలుష్యాన్ని కృత్రిమ కాలుష్యం అని అంటారు.
 
కాలుష్యకాల వర్గీకరణ
కాలుష్యకాలు పర్యావరణంలోకి ప్రవేశించే, కలుషితం చేసే దశల్లోని స్థితిని బట్టి రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి..
ఎ) ప్రాథమిక కాలుష్యకాలు (Primary Pollutants: ఈ కాలుష్యకాలు పర్యావరణంలోకి ఏ స్థితిలో ప్రవేశిస్తాయో అదే స్థితిలో పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి.
ఉదా: డీడీటీ, పాదరసం, సల్ఫర్‌డయాక్సైడ్ మొదలైనవి.
బి) ద్వితీయ కాలుష్యకాలు (Secondary Pollutants: ప్రాథమిక కాలుష్యకాల మధ్య జరిగే చర్యల వల్ల ఇవి ఏర్పడతాయి. ఉదా: ప్రధాన కాలుష్యకాలైన నైట్రోజన్ ఆక్సైడ్‌లు, హైడ్రోకార్బన్‌లు కాంతి సమక్షంలో చర్య జరిపి ద్వితీయ కాలుష్యకాలైన పెరాక్సీ ఎసైల్ నైట్రేట్ (PAN) లను ఏర్పరుస్తాయి.
 
పరిమాణాత్మక కాలుష్యకాలు (Quantitative Pollutants): పర్యావరణంలో కొన్ని పదార్థాల గాఢతలు ఆరంభ అవధి విలువను దాటినప్పుడు మాత్రమే అవి కాలుష్యకాలుగా మారతాయి. వీటినే ప్రకృతిపరమైన కాలుష్యకాలు అని కూడా అంటారు.
ఉదా: CO2, CO,  నైట్రోజన్ ఆక్సైడ్‌లు, సల్ఫర్ ఆక్సైడ్‌లు మొదలైనవి.
 
గుణాత్మక కాలుష్యకాలు (Qualitative Pollutants): మానవుడి చర్యల వల్ల ఇవి పర్యావరణంలోకి ప్రవేశిస్తాయి.
ఉదా: క్రిమి, కీటక సంహారుణులు
 
సహజ క్షయ స్వభావాన్ని బట్టి కాలుష్యకాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి..
ఎ) జీవక్షయం పొందే కాలుష్యకాలు (Biodegradable Pollutants): సూక్ష్మజీవులతో క్షయం పొందే వ్యర్థ పదార్థాలు ఈ రకానికి చెందినవి. వీటివల్ల పర్యావరణ స్థాయికి మించిన కాలుష్యం సంభవిస్తుంది.
ఉదా: వ్యవసాయ, పశు, మానవ సంబంధమైన వర్థ్య పదార్థాలు.
 
బి) జీవక్షయం పొందని కాలుష్యకాలు (Non-Biodegradable Pollutants):
ఇవి సాధారణంగా క్షయం పొందవు. వ్యర్థ పదార్థాలైన ఫినోల్‌లు, ప్లాస్టిక్‌లు, లోహ పాత్రలు, క్రిమిసంహారకాలు మొదలైనవి.
మలినం (Contaminant): మానవుడి కార్యకలాపాల వల్ల ఉత్పన్నమై పర్యావరణానికి హాని కలిగించే పదార్థాన్ని మలినంగా పేర్కొంటారు. పర్యావరణంపై నిర్దిష్ట ప్రభావాన్ని చూపే మలినాన్ని కాలుష్యకారిణి అంటారు.
ఉదా: డీడీటీ, మిథైల్ ఐసోసైనైడ్.
 
గ్రాహకం (Receptor): కాలుష్య ప్రభావానికి లోనయ్యే మధ్యస్థాన్ని గ్రాహకమంటారు. కాంతి రసాయన పొగ మంచు వల్ల మనిషి కళ్లు ఎర్రబడి దురదలు, శ్వాసక్రియా సమస్యలు వస్తాయి. అందువల్ల మనిషిని గ్రాహకం అంటారు.
 
శోషక నెలవు (Sink): పర్యావరణంలో దీర్ఘకాలికంగా ఉండే కాలుష్యాలను గ్రహించి వాటితో సంయోగం చెందే యానకాన్ని శోషక నెలవు అంటారు. వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్.. సముద్రాలు పీల్చుకునే శోషక నెలవు.
 
కాలుష్య రకాలు
దైనందిన జీవితంలో వివిధ ఆవరణల్లోని కాలుష్యాలను అనేక రకాలుగా వర్గీకరించొచ్చు. అవి..
 1. వాయు కాలుష్యం
 2. నీటి కాలుష్యం
 3. నేల కాలుష్యం
 4. ద్వని కాలుష్యం
 5. సముద్ర కాలుష్యం
 6. ఉష్ణ కాలుష్యం
 7. వ్యర్థ ఘనపదార్థాల కాలుష్యం
 8. రేడియోధార్మిక కాలుష్యం.
 
సాధారణంగా మన చుట్టూ ఉన్న గాలిలో నైట్రోజన్ 78.32%, ఆక్సిజన్ 20.16%, తేమ 1.4%, కార్బన్ డయాక్సైడ్ 0.38%, జడవాయువులు (హీలియం, నియాన్, ఆర్గాన్ తదితరాలు) 0.08% ఉంటాయి. అయితే అనేక కారణాల వల్ల ఇతర పదార్థాలు గాలిలో చేరి దాన్ని కాలుష్యం చేస్తున్నాయి.
‘గాలిలో ఉండే కొన్ని పదార్థాల గాఢతలు.. మానవుడికి, పరిసరాలకు హాని చేసే స్థాయిని మించి ఉండటమే వాయు కాలుష్యం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది.
 
వాయు కాలుష్యానికి కారణాలు
రవాణా రంగంలో ఉపయోగించే వివిధ రకాల శిలాజ ఇంధనాలు (బొగ్గు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ మొదలైనవి) వినియోగం.
పరిశ్రమల నుంచి విడుదలయ్యే హానికారక భస్మం, ఇతర వ్యర్థ పదార్థాలు వాతావరణంలోకి ప్రవేశించడం. ఆటోమొబైల్ రంగంలో  వాహనాలపై పూసే హానికర పెయింట్స్ వల్ల కాలుష్యం ఏర్పడుతోంది.
థర్మల్ విద్యుత్ కేంద్రాలు: విద్యుదుత్పత్తి కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు, డీజిల్, సహజవాయువు మొదలైనవాటిని ఉపయోగిస్తారు. వీటి నుంచి వెలువడే హానికర పదార్థాలు వాతావరణంలోకి ప్రవేశించి తీవ్ర కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి.
అడవుల నరికివేత: ప్రపంచంలో జనాభా పెరిగేకొద్దీ మానవ అవసరాల కోసం అడవులను విచక్షణారహితంగా నరికివేయడం వల్ల పర్యావరణ సమతుల్యం తీవ్రంగా దెబ్బతింటోంది. మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్‌డయాక్సైడ్ శాతం పెరుగుతోంది.
అణు విద్యుత్ కేంద్రాలు: అణు రియాక్టర్‌లో ఉపయోగించే అణు పదార్థాల నుంచి అత్యంత ప్రమాదకర రేడియోధార్మిక కిరణాలు వెలువడి పర్యావరణంతోపాటు జీవావరణానికి చాలా నష్టం కలుగజేస్తున్నాయి.
ప్రకృతిపరమైన విపత్తులు: ముఖ్యంగా అడవులు అంటుకున్నప్పడు (కార్చిచ్చులు), అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు పొగ, వ్యర్థ పదార్థాలు వాతావరణంలోకి చేరి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.
 
ముఖ్యమైన వాయు కాలుష్య కారకాలు
వాయు కాలుష్యానికి కారణమవుతున్న ముఖ్య కాలుష్య కారకాలను కింది విధంగా పేర్కొనొచ్చు.
కార్బన్ మోనాక్సైడ్ (CO): మోటారు వాహనాల నుంచి వెలువడే పొగలో కార్బన్‌మోనాక్సైడ్ అధిక శాతంలో ఉంటుంది. కార్బన్ ఇంధనాలు అంటే బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తుల అసంపూర్ణ దహనం వల్ల కార్బన్‌మోనాక్సైడ్ ఉత్పన్నమవుతుంది. పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లో, ఇళ్లలో కట్టెల పొయ్యి నుంచి వెలువడే పొగ, సిగరెట్ పొగలో కూడా కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది.
కార్బన్ మోనాక్సైడ్ చాలా ప్రమాదకర విష వాయువు. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్‌తో సంయోగం చెంది కార్బాక్సిహిమోగ్లోబిన్‌గా మారుతుంది. అందువల్ల రక్తం ఆక్సిజన్ వాహకంగా తన ధర్మాన్ని కోల్పోతుంది. ఫలితంగా కణాలకు అవసరమైన ఆక్సిజన్ లభ్యం కాదు. ఇది మరణానికి దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో లోతైన బావులు, గనులు, సెప్టిక్ ట్యాంకులు, లోయల్లోకి దిగిన వ్యక్తుల మరణానికి ఈ వాయువు కారణమవుతోంది. మనదేశంలో ఎక్కువ రద్దీ గల ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మొదలైన నగరాల్లో ఈ వాయువు ఎక్కువగా విడుదలవుతోంది.
 
కార్బన్ డయాక్సైడ్ (CO2): సాధారణంగా వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ 0.03% మాత్రమే ఉండాలి. కానీ అనేక కారణాల వల్ల ముఖ్యంగా జీవుల శ్వాసక్రియ, శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం ఉపయోగం వల్ల ఈ వాయువు ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. పరిశ్రమలు, విమానాల నుంచి కూడా ఈ వాయువు వెలువడుతోంది. కార్బన్‌డయాక్సైడ్ శాతం పెరగడం వల్ల భూమి ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనివల్ల ధృవ ప్రాంతాల్లోని మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి దీవులు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. ఈ వాయువు శాతం పెరగడం వల్ల హరితగృహ ప్రభావం (గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్) ఏర్పడుతోంది.
 
సల్ఫర్ డయాక్సైడ్ (SO2): ఇది వర్ణ రహితంగా, ఘాటైన వాసన కలిగి ఉంటుంది. బొగ్గు, పెట్రోల్, ఇతర శిలాజ ఇంధనాలను వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మండించడం వల్ల వెలువడుతుంది. అగ్నిపర్వతాల పేలుడు వల్ల, ఖనిజాలు, ఎరువుల పరిశ్రమలు, నూనెశుద్ధి కర్మాగారాల నుంచి కూడా వస్తోంది. వాతావరణంలో ఈ వాయువు సగటు జీవిత కాలం 2 నుంచి 4 ఏళ్లు.

సల్ఫర్ డయాక్సైడ్ వల్ల కలిగే దుష్ఫలితాలు

దీని కారణంగా చలువ రాతితో నిర్మితమైన అద్భుత కట్టడాలు (తాజ్‌మహల్ వంటివి), విగ్రహాలు దెబ్బతింటున్నాయి.
సల్ఫర్‌డయాక్సైడ్ వల్ల ఇనుము, ఉక్కు, జింక్, రాగి వంటి లోహాల క్షయం వేగం పెరుగుతుంది.
వర్షం పడుతున్నప్పుడు వాతావరణంలోని సల్ఫర్‌డయాక్సైడ్ వాయువు వర్షం నీటిలో కరిగి సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారి ఆమ్ల వర్షానికి కారణమవుతుంది. ఆమ్ల వర్షాల వల్ల పంటలు, జలవనరులు, జీవులు తీవ్రంగా ప్రభావితమవుతాయి.
సల్ఫర్‌డయాక్సైడ్ వల్ల మానవుడి కళ్లు, శ్వాసకోశం మండటమే కాకుండా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ముక్కు రంధ్రాలు వాచి శ్వాసక్రియకు ఇబ్బంది కలుగుతుంది.
Published date : 22 Sep 2016 05:36PM

Photo Stories