Skip to main content

క్రీ.శ.11-15 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశం

తూర్పు తీరాంధ్రను సుమారు నాలుగున్నర శతాబ్దాల పాటు వేంగీ చాళుక్యులు (క్రీ.శ.6వ శతాబ్దం నుంచి10వ శతాబ్దం వరకు) పాలించారు. ‘ఆంధ్ర దేశం’ తూర్పు చాళుక్యు యుగంతోనే ప్రాచీన యుగం నుంచి తొలి మధ్యయుగంలోకి ప్రవేశించింది. చోళులతో వివాహ సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా వేంగీ చాళుక్యులు ఆంధ్ర, ద్రావిడ సంస్కృతుల మధ్య సంధానకర్తలుగా నిలిచారు.
రాజరాజ నరేంద్రుని పుత్రుడు కులోత్తుంగ చోళుడు క్రీ.శ.1070-1120లో ‘చోళ’ రాజ్యాన్నిపాలించాడు. ఇతన్ని చాళుక్య రాజేంద్రచోళుడని కూడా పిలుస్తారు. కులోత్తుంగడు చోళ రాకుమార్తె మధురాంతకిని వివాహం చేసుకున్నాడు. కళింగ, చోళ, చాళుక్య రాజ్యాలను పాలించాడు. కులోత్తుంగని కాలంలో తెలుగు దేశానికి ద్రావిడ బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో వలసొచ్చారు. ఆ ప్రభావంతోనే తెలుగు భాషలోకి అనేక తమిళ పదాలు చేరాయి. కులోత్తుంగడు తమిళ భాషను, తమిళ కవులను ఆదరించాడు.
 
1. చోడుల యుగం
సమాజం:

తూర్పు చాళుక్యుల అనంతరం ఆంధ్ర దేశంలో రాజకీయ అనిశ్చితి చోటు చేసుకుంది. రేనాడు, పలనాడు, వెలనాడు వంటి ప్రాంతాలను పాలించే చోడ వంశీయులు అధికారంలోకి వచ్చారు. ఆంధ్ర దేశం పాకనాడు, వెలనాడు, పొత్తపినాడు వంటి చిన్నచిన్న నాడులుగా విభజితమైంది. ప్రతి మండలానికి ఒక సామంత రాజ్యం ఏర్పడింది. ఈ పరిస్థితులు..నాటి రాజకీయ, సామాజిక, మత, సాంస్కృతిక వికాసాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.
 
సామాజిక పరిస్థితులు
సామాజిక పరిస్థితులను పరిశీలిస్తే ఈ యుగం చాళుక్యు యుగానికి అనుబంధంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాజంలో ‘అష్టాదశ వర్ణాలు’ ఏర్పడ్డాయి. చతుర్థ కులమైన ‘శూద్రుల’ ప్రాబల్యం కొనసాగింది. వీరు రెడ్డి, కమ్మ, నాయుడు, బలిజ, వెలమ వంటిఉప కులాలుగా ఏర్పడ్డారు. రాజకీయ అనైక్యత, పరస్పర యుద్ధాలు సమాజంపై బలమైన ప్రభావాన్ని చూపాయి. దాంతో ప్రధాన వర్ణాల్లో ప్రాంతీయ విబేధాలు రేకెత్తాయి. వ్యవసాయం ప్రధానవృత్తిగా కలిగిన ఆయా ఉప కులాల వారు పాలక వర్గంగా ఎదిగారు.
 
బ్రాహ్మణ కులంలో ప్రాంతీయ పరమైన వెలనాటి, రేనాటి, కమ్మనాటి, ములికినాటి, వేగినాటి వంటి శాఖలు ఏర్పడ్డాయి. తమిళ దేశానికి బ్రాహ్మణ వలసలు కొనసాగాయి. బాపట్ల శాసనం ‘కమ్మ వైశ్యులను’ పేర్కొంటుంది. పాలక వర్గంలో వర్ణ సాంకర్యం ఎక్కువగా కన్పిస్తుంది. క్షత్రియులైన వైహేయులు చతుర్థాన్వయులైన వెలనాటి చోళులతో బంధుత్వం నెరిపారు.
 
వెలనాటి ఆస్థానంలో ‘బోయలు’ ఉన్నతోద్యోగాలు నిర్వహించారు. క్రమేణా రెడ్డి, వెలమ, కమ్మ కులాల వారు భూస్వాములు, పాలకులుగా ఎదిగారు. వెలమ, రెడ్డి కులాల మధ్య అధికార ప్రాబల్యానికి సంబంధించి పోటీ ప్రారంభమైంది. ఇందులోని ప్రథమ ఘట్టమే క్రీ.శ.1182లో జరిగిన పల్నాటి యుద్ధం.
 
మత పరిస్థితులు
నలగామరాజుకు మంత్రిగా ఉన్న బ్రహ్మనాయుడు అనుసరించిన ‘వీర వైష్ణవం’ వల్ల సమాజంలో, ప్రధానంగా దిగువ కులాల్లో వైష్ణవం పాటించే దాసరులు, మాల దాసులు వంటి నూతన సామాజిక ఉప కులాలు ఏర్పడ్డాయి. బ్రహ్మనాయుడు వర్ణాంతర వివాహాలు, చాపకూడు (సహపంక్తి భోజనం)ను ప్రోత్సహించాడని, మాచర్ల చెన్నకేశవ దేవాలయంలో ‘పంచములకు’ ప్రవేశం కల్పించాడనే ఓ ప్రచారం జనసామాన్యంలో ఉంది. బ్రహ్మనాయుడి సంస్కరణలను వ్యతిరేకించిన నలగామరాజు.. అతన్ని ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించి, ఆ స్థానంలో నాగమ్మను నియమించాడు. దాంతో బ్రహ్మనాయుడు.. మలిదేవరాజుకు మద్దతు పలికాడు. బ్రహ్మనాయుడు (వైష్ణవం), నాగమ్మ (శైవం)ల కారణంగా పల్నాటి రాజ్యం రెండుగా చీలడంతోపాటు యుద్ధం సంభవించింది. క్రీ.శ.1182లో కారెంపూడి వద్ద పల్నాటి యుద్ధం జరిగింది. బ్రహ్మనాయుడు అనుసరించిన సంస్కరణావాదమే సనాతనవాదుల వ్యతిరేకతకు కారణమైంది. బ్రహ్మనాయుడి సంస్కరణావాదానికి, నాగమ్మ సనాతన వాదానికి మధ్య పోరు జరిగింది.
 
శైవ-వైష్ణవ విద్వేషాలకు ప్రత్యక్ష సాక్షి అయిన ‘తిక్కన సోమయాజి’ సమాజ శాంతి, ఐకమత్యం కోసం హరిహర ఆరాధనను ప్రారంభించాడు.‘శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే’ అని చాటాడు. స్మార్త ఉద్యమానికి తిక్కనే నాయకుడని చెప్పొచ్చు. తిక్కన అద్వైత ధర్మ ప్రచారమే ఆశయంగా మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు.
 
తిక్కన సంస్కరణవాది అయినప్పటికీ బౌద్ధ, జైన మతాల పట్ల అసహనం ప్రదర్శించాడు. తిక్కన ప్రమేయంతోనే ‘కాకతి గణపతిదేవుడు’ జైనులను హింసించినట్లు సిద్ధేశ్వర పురాణం పేర్కొంటుంది. దీన్నిబట్టి ఆ కాలంలో మతపరమైన అశాంతి కొనసాగిందని చెప్పొచ్చు.
 
సాంస్కృతిక వికాసం
ప్రధానంగా సాహిత్య రంగంలో ఈ యుగం నాటి సాంస్కృతిక వికాసం కన్పిస్తుంది. ఈ యుగానికి చెందిన గొప్ప పండితుడైన మల్లికార్జునుడు శైవారాధ్యుడు. ఇతడు సర్వేశ్వరుడిని స్తుతించాడు. సాహిత్యం ద్వారా శైవ మత ప్రచారానికి పూనుకున్నాడు. 400 వందల కంద పద్యాలతో ‘శివ తత్వసారం’ను రచించాడు. తెలుగు ‘శతక సాహిత్యం’లో దీన్ని మొదటిదిగా గుర్తిస్తున్నారు. ఈ కాలానికి చెందిన కవుల్లో ‘తిక్కన సోమయాజి’  అగ్రగణ్యుడు. ఇతడు నెల్లూరును పాలించిన ‘రెండో మనుమసిద్ధి’ కొలువుకు చెందినవాడు. తిక్కన.. వచనంలో రచించిన ‘నిర్వచనోత్తర రామాయణం’ గ్రంథాన్ని మనుమసిద్ధికి అంకితమిచ్చాడు. మహాభారతంలోని 15 పర్వాలను తెలుగులోకి అనువదించి,‘కవిబ్రహ్మ’, ‘ఉభయ కవి మిత్రుడు’ వంటి  బిరుదులు పొందాడు. ఇతని శిష్యుడైన కేతన, తెలుగులో దశకుమార చరిత్ర రచించి అభినవ దండిగా పేరొందాడు.
 
సంగీతం, నాట్యం వంటి లలిత కళలు అభివృద్ధి చెందినట్లు శ్రీనాథుడు రచించిన పల్నాటి వీర చరిత్ర తెలుపుతోంది. ఇందులో శ్రీనాథుడు సన్నాయి, చిరు గంటలు, వంకిణీ, మురళి వంటి వాయిద్యాలను ప్రస్తావించాడు. దీన్ని బట్టి సంగీతం, నాట్యం అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది.
 
2. కాకతీయుల యుగం
కాకతీయులు క్రీ.శ. 1030 నుంచి క్రీ.శ.1323 వరకు దాదాపు మూడు శతాబ్దాలపాటు ‘ఓరుగల్లు’ కేంద్రంగా అఖిలాంధ్ర దేశాన్ని పాలించారు. మధ్యయుగంలో నాటి సామాజిక, మత, సాంస్కృతిక రంగాలకు గట్టి పునాది వేశారు. వీరి కాలంలోని సామాజిక పరిస్థితులు, సాంస్కృతిక వికాసాలు.. రెడ్డి రాజులు, విజయనగర రాజ వంశాలను కూడా ప్రభావితం చేశాయి.
 
సామాజిక పరిస్థితులు
కాకతీయుల నాటి సమాజం గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు.. ‘వినుకొండ వల్లభరాయుడు’ రచించిన ‘క్రీడాభిరామం’, అమీర్ ఖుస్రో ‘మిఫ్తా-ఉల్-పుతా’, మార్కోపోలో రచనలు.
సమాజంలో కుల వ్యవస్థ పటిష్టమైంది. బ్రాహ్మణులు అధిక గౌరవం పొందినప్పటికీ చతుర్థ కులాలవారికి కూడా ప్రాధాన్యత పెరిగింది. కమ్మ, రెడ్డి, వెలమలు పాలక వర్గాలుగా స్థిరపడ్డారు. ఉపకులాలు ఉండేవి.
కుల సంఘాలను ‘సమయమలుగా’ పిలిచేవారు. బ్రాహ్మణ కుల సంఘాలను మహాజనులని, వైశ్యుల సంఘాలను ‘నకరములని’ అనేవారు. ఈ సంఘాలు కులపరమైన వివాదాలను పరిష్కరించేవి.
 
అన్ని వర్ణాల్లోనూ అనేక సామాజిక దురాచారాలు ప్రబిలాయి. బాల్య వివాహాలు, వరశుల్కం, ఓలి (కన్యాశుల్కాన్ని) ఇచ్చి స్త్రీని వివాహం చేసుకోవడం, సతీ సహగమనం వంటి దురాచారాలు కొనసాగాయి. సమాజంలో ‘పంచమ కులస్తులను’ అంటరానివారిగా పరిగణించారు. సత్రం భోజనాలు బ్రాహ్మణులకు ప్రత్యేకం. సంఘంలో స్త్రీ స్థానం దిగజారింది. వేశ్యా వృత్తి ఉండేది. సమాజంలో వేశ్యలు ఒక  కులంగా రూపొందారు. సామాన్య ప్రజల్లో విద్యాభివృద్ధి శూన్యం. జూదం, మద్యపానం, కోడి, పొట్టేళ్ల పందాలు వంటివి ఉండేవి. వేశ్యలకు సంఘంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది. వేశ్యలు నృత్య, సంగీత, సాహిత్య, చిత్రలేఖనాల్లో ప్రవీణులై ఉండేవారు.
 
కోలాటం, తోలు బొమ్మలాటలు, పేరిణి నృత్యాలు ఆనాటి ప్రజలకు ప్రధాన వినోదాలని బసవ పురాణం వివరిస్తోంది. గ్రామాల్లో సంక్రాంతి, గొబ్బిళ్లు, ఏరువాకలను జరుపుకునేవారు. అప్పటి ప్రజలు సన్నని నాజూకైన వస్త్రాలను నేసేవారని మార్కోపోలో ప్రశంసించాడు. నేరస్తులను కొరడాలతో కొట్టడం, కాలు (లేదా) చెయ్యి తీసేయడం, తల నరకడం వంటి శిక్షలుండేవని మార్కాపురం శాసనం వివరిస్తోంది.
 
గిరిజన తెగలు సమాజంలో అంతర్భాగమయ్యే ప్రక్రియ కొనసాగింది. లెంకలు అనే గిరిజన తెగలు పాలక వర్గాలకు సేవలందించేవి. ఓరుగల్లు, మంథని, కొలనుపాక, బెజవాడలు విద్యాకేంద్రాలుగా వర్థిల్లాయి. గణపతిదేవుని గురువైన విశ్వేశ్వర శివుడు గోళకీ మఠాలు స్థాపించాడు. ఇవి శైవమత ప్రచారానికి ఉపయోగపడ్డాయి. మంథనిలో వేద పాఠశాల ఏర్పాటైంది. జైనంను ఆదరించారు. వేములవాడ, సిద్ధిపేట, కొలనుపాక, హన్మకొండ జైన క్షేత్రాలుగా వెలిశాయి.
 
హన్మకొండలో పద్మాక్షిదేవి ఆలయం మొదటి జైనాలయంగా ఉండేది. గణపతిదేవుని కాలంలో జైనులుపై దాడులు జరిగినట్లు విశ్వేశ్వర శివుడు స్వయంగా పేర్కొన్నాడు. జైన, శైవ మతాల మధ్య వైషమ్యాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. శైవ మతంలో కాలాముఖ, కాపాలిక, పాశుపత శాఖలు విస్తరించాయి. తిరుపతి, మంగళగిరి, శ్రీకూర్మం కేంద్రాలుగా వైష్ణవ మతం వెలుగొందింది.
 
మల్లికార్జున పండితుని ద్వారా ‘వీర శైవం’ ఆంధ్రదేశంలో ప్రవేశించింది. పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’ ద్వారా వీరశైవ సంప్రదాయాలను ఆంధ్రలో ప్రచారం చేశాడు. పండిత త్రయమైన శ్రీపతి, మల్లికార్జున, మంచన వంటి వారు ఆరాధ్య దైవం పేరిట ఆంధ్రలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
 
రామానుజాచార్యుని ద్వారా వైష్ణవ మతం ఆంధ్రదేశంలో ప్రవేశించింది. నాచన సోమనాథుడు తన ఉత్తర హరివంశ గ్రంథాన్ని హరిహరుడికే అంకితమిచ్చాడు. ప్రజలు కాకతమ్మ, ఏకవీర, భైరవ, మైలార దేవులను పూజించేవారు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఆలంపూర్ (అలంపురం) జోగులాంబ ప్రసిద్ధి చెందింది. గురజాల గంగమ్మ గుడి ప్రసిద్ధి గాంచింది.
 
సాంస్కృతిక విధానం
మూడు శతాబ్దాలపాటు వర్థిల్లిన కాకతీయ యుగంలో ఆంధ్రుల సాంస్కృతిక వికాసం ఉన్నత స్థితికి చేరింది. ఇది తర్వాత కాలంలో విజయనగర రాజులకు మార్గదర్శకమైంది. సాంస్కృతిక వికాసం, సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, వాస్తు రంగాలు గొప్పగా వర్థిల్లాయి.
 
సాహిత్య రంగంలో కాకతీయుల రాజ భాష సంస్కృతమే అయినా, ప్రజలు తెలుగు భాషను ఆదరించారు. సంస్కృతంలో కామండకుడు రచించిన ‘నీతిసారం’ గ్రంథాన్ని కాకతీయ రుద్రుడు తెలుగులో అనువదించాడు. ప్రతాపరుద్రుని ఆస్థానం.. కవి పండితులకు కల్పతరువైంది. ఇతని ఆస్థానంలో ఉన్న అగస్త్యుడు ‘నలకీర్తికౌముది’ అనే ఖండకావ్యం, బాలభారత మహాకావ్యం, కృష్ణచరిత్ర వంటి గ్రంథాలు రచించాడు. ప్రతాపరుద్రుని ఆస్థాన కవైన విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు.
 
తెలుగు భాష పరంగా దేశ కవితా ఉద్యమం శివ కవుల్లో ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి ఆద్యుడిగా పేరుగాంచిన పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం అనే ద్విపద కావ్యాలను, అనుభవసారం, వృషాధిప శతకాలను తెలుగులో రచించాడు. తెలుగు శతక సాహిత్యంలో పాల్కురికి సోమనాథుడు రచించిన వృషాధిప శతకం అతి ప్రాచీనమైంది. యధావాక్కుల అన్నమయ్య, ‘సర్వేశ్వర శతకం’, మారన మార్కండేయ పురాణాలను తెలుగులో రచించారు.
 
కేతన తెలుగులో రచించిన దశకుమార చరిత్ర తెలుగులో మొట్టమొదటి కథా కావ్యంగా గుర్తింపు పొందింది. దీంతోపాటు తెలుగులో ఆంధ్ర భాషా భూషణం వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. తెలుగు భాషా శాస్త్రానికి పునాదులు వేసిన వాడిగా కేతనకు గుర్తింపు ఉంది.
 
బద్దెన ‘నీతిశాస్త్ర ముక్తావళి, సుమతీ శతకాన్ని, శివదేవయ్య ‘పురుషార్థసారం’ను తెలుగులో రచించారు. ఇవి కాకతీయుల కాలం నాటి రాజనీతిని వివరిస్తాయి.
 
వీధి నాటకాలు రచించే సంప్రదాయం కూడా ఈ కాలంలోనే ప్రారంభమైంది. రావిపాటి త్రిపురాంతకుడు రచించిన ప్రేమాభిరామం అనే సంస్కృత వీధి నాటకం ఆధారంగా వినుకొండ వల్లభాచార్యుడు తెలుగులో క్రీడాభిరామం రచించాడు. ఈ గ్రంథం నాటి సామాజిక, స్థితిగతులను వివరిస్తోంది. గోన బుద్ధ రాజు ద్విపదలో ‘రంగనాథ రామాయణం’ రచించాడు.
Published date : 14 Oct 2016 12:14PM

Photo Stories