Skip to main content

భారతదేశ శీతోష్ణస్థితి 2

ఒక రోజు లేదా కొన్ని రోజుల ఉష్ణోగ్రత, ఆర్ద్రత, అవపాతం వంటి అంశాల్లోని మార్పులను ‘వాతావరణం’ అంటారు.
ఒక ప్రాంత ఉష్ణోగ్రత,  ఆర్ద్రత, అవపాతం మొదలైన అంశాల దీర్ఘ్ఘకాల  సగటును ‘శీతోష్ణస్థితి’ అంటారు.
 
 ‘మౌసమ్’ అనే అరబిక్ పదం నుంచి మాన్‌సూన్ (రుతుపవనం) అనే మాట వచ్చింది. అరబిక్ భాషలో మౌసమ్ అంటే రుతువు అని అర్థం.
 
 ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో సంవత్సర కాలాన్ని 6 రుతువులుగా విభజిస్తారు. దీన్నిబట్టి ప్రతి రెండు నెలలకు ఒకసారి వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని తెలుసుకోవచ్చు.
 
6 రుతువులు..రుతుపవన ప్రక్రియ ఆవిర్భావ సిద్ధాంతాలు
థర్మల్ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం నైరుతి రుతుపవనాలు సముద్ర పవనాల లక్షణాలను కలిగి ఉంటాయి. ఖండ, సముద్ర భాగాలు ఉష్ణోగ్రతను గ్రహించటంలో ఉన్న మార్పుల వల్ల  ఇవి ఏర్పడతాయి. నైరుతి రుతుపవనాలను భారత ఉపఖండంలోకి ఆకర్షించే అల్పపీడన మండలం వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత మూలంగా ఏర్పడిందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.
 
ప్లాన్ సిద్ధాంతం: ఆగ్నేయ రుతుపవనాలు దక్షిణాసియా ప్రాంతంలో రూపాంతరం చెంది.. నైరుతి రుతుపవనాలుగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. భూమధ్యరేఖ అల్పపీడన మండలం సూర్యుడి గమనం వల్ల కర్కటరేఖ వద్దకు స్థానభ్రంశం చెంది నైరుతి రుతుపవనాలను ఆకర్షిస్తుందని ఈ సిద్ధాంతం వివరిస్తుంది.
 
టిబెటన్ హీట్ ఇంజన్ సిద్ధాంతం: వేసవి కాలంలో టిబెట్ పీఠభూమిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల ఇక్కడి ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. ఫలితంగా టిబెట్ పీఠభూమి నుంచిసంవహన గాలులు దక్షిణంగా వీచి దక్షిణ హిందూ మహాసముద్రంలో అవనతం చెందటం వల్ల ఆ సమద్రంలో అధిక పీడనం ఏర్పడుతుంది. దక్షిణ హిందూ మహాసముద్రానికి, వాయవ్య భారతదేశానికి మధ్య పీడన ప్రవణత ఏర్పడటంతో దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి కవోష్ణ ఆర్ద్ర పవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి.
 
జెట్ స్ట్రీమ్ సిద్ధాంతం: ఉప ఆయనరేఖా పశ్చిమ జెట్ స్ట్రీమ్ జూన్ మొదటి వారంలో హిమాలయాలకు ఉత్తరంగా స్థానభ్రంశం చెందటం వల్ల నైరుతి రుతుపవనాలు భారతదేశంలోకి వేగంగా ప్రవేశిస్తాయి. ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న సోమాలియా నుంచి అరేబియా సముద్రం మీదుగా కేరళ తీరం వైపు వీచే సోమాలియా నిమ్న స్థాయి జెట్‌స్ట్రీమ్ నైరుతి రుతుపవనాలను బలోపేతం చేస్తుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది.
సూర్యకిరణాల పతనం, సూర్యుడి గమనం, రుతుపవనాలు వంటి అంశాల ఆధారంగా భారతదేశంలో సంవత్సరాన్ని వాతావరణ శాఖ 4 కాలాలుగా విభజించింది. అవి..
వేసవి కాలం: మార్చి నుంచి జూన్ మధ్య వరకు
నైరుతి రుతుపవన కాలం: జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు
ఈశాన్య రుతుపవన కాలం:  అక్టోబర్ నుంచి నవంబర్ వరకు
శీతాకాలం: డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు
 
వేసవి కాలం
సూర్యుడు మార్చి 21న భూమధ్యరేఖ మీద నిట్టనిలువుగా ప్రకాశించి, ఆ తర్వాత జూన్ 21 వరకు కర్కటరేఖ వరకు ప్రయాణిస్తాడు (కర్కటరేఖ భారతదేశం మధ్య గుండా పశ్చిమం నుంచి తూర్పునకు వెళుతుంది). ఈ కాలాన్ని భారతదేశంలో వేసవి కాలంగా పిలుస్తారు. ఈ కాలంలో దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
వేసవి కాలంలో గంగా సింధూ మైదాన ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. రాజస్థాన్‌లోని ‘జైసల్మీర్’లోని గంగానగర్ ప్రాంతంలో 50-°C ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా దేశంలో ‘సంవహన వర్షాలు’ కురుస్తాయి. వీటినే రుతుపవన ఆరంభపు జల్లులు అంటారు. వీటిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లలో పిలుస్తారు. అవి....
 
 కర్ణాటకలో: ‘చెర్రీ బ్లోసమ్స్’ అని పిలుస్తారు. ఇవి కాఫీ పంటలకు ఉపయుక్తంగా ఉంటాయి.
 
కేరళ రాష్ర్టంలో: ‘మాంగో షవర్‌‌స’ లేదా మామిడి జల్లులుగా; తెలంగాణ రాష్ర్టంలో: ‘తొలకరి జల్లులు’ అని; ఆంధ్రప్రదేశ్‌లో: ‘ఏరువాక’ అని పిలుస్తారు.
 
పశ్చిమ బెంగాల్‌లో: ‘కాలబైశాఖీ’ అని అంటారు. ఇవి జనుము, వరి పంటకు ఉపయోగకరం.
 
అసోంలో: ‘టీ షవర్స్’ అని పిలుస్తారు. ఇవి తేయాకు పంటకు ఉపయుక్తం.
 
ఉత్తరప్రదేశ్‌లో: ‘ఆంథీలు’ అంటారు. ఇవి చెరకు పంటకు ఉపయోగకరం.
 
వేసవి కాలంలో ఉత్తర భారతదేశంలో వీచే వేడి గాలులను ‘లూ’ అని అంటారు.
వీటినే పశ్చిమ బెంగాల్‌లో ‘నార్వెస్టర్లు’గా పిలుస్తారు.
 
ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. దక్షిణ భారతదేశం సన్నగా, సముద్రంతో చుట్టుకుని ఉండటమే దీనికి కారణం. సముద్ర ప్రభావ శీతోష్ణస్థితి కారణంగా వేసవిలో ఉత్తర భారతదేశంతో పోల్చితే దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. అలాగే ఉత్తర భారతదేశం ఖండాంతర్గతంగా (సముద్రానికి దూరంగా) ఉన్నందువల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. వేసవి కాలంలో రాజస్థాన్ నుంచి అసోం వరకు అధిక ఉష్ణోగ్రతలుంటాయి.
 
నైరుతి రుతుపవన కాలం
భారత ఉపఖండం, హిందూ మహాసముద్రాల మధ్య రుతువులను అనుసరించి పవనాలు వీయటాన్ని, వెనక్కు మళ్లటాన్ని రుతుపవనాలుగా పేర్కొనవచ్చు.
 
ఉష్ణోగ్రతల్లోని వైవిధ్యం, అంతర ఆయనరేఖా అభిసరణ స్థానం, ట్రోపో ఆవరణం పైభాగంలోని వాయు ప్రసరణం వంటి అనేక కారణాల వల్ల రుతుపవనాలు ఏర్పడుతున్నాయి.
 
పశ్చిమ రాజస్థాన్ నుంచిపశ్చిమబెంగాల్ వరకు వ్యాపించి ఉన్న ‘అంతర ఆయనరేఖా అభిసరణం’ ప్రభావంతో పవనాలు వీచే దిశ మారి సముద్రం నుంచి భూభాగం వైపునకు వీస్తాయి. ఈ క్రమంలో భారతదేశంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి దక్షిణార్ధ గోళంలో వీచే ‘ఆగ్నేయ వ్యాపార పవనాల’ను ఆకర్షిస్తుంది. దీంతో ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖను దాటిన తరువాత ‘కొరియాలిస్ శక్తి’ ప్రభావం వల్ల ఫెరల్ సూత్రం ప్రకారం వక్రీభవనం చెంది కుడివైపునకు వంగి ‘నైరుతి రుతుపవనాలుగా’ మార్పు చెంది భారత భూభాగంలోకి ప్రవేశిస్తాయి. ఈ పవనాలు సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళ (మలబారు) తీరాన్ని చేరి, ఆ తర్వాత జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో దేశమంతటా విస్తరిస్తాయి.
 
నీటి ఆవిరితో సముద్రం నుంచి భూభాగానికి వచ్చే నైరుతి రుతుపవనాలు భారత భూభాగంలో సాధారణ వర్షపాతం నుంచి అత్యధిక వర్షపాతాన్ని కలిగిస్తాయి. అందుకే ఈ రుతువును ‘వర్ష రుతువు’గా కూడా పిలుస్తారు.
 
భారతదేశంలో కురిసే 90% వర్షపాతానికి నైరుతి రుతుపవనాలే మూలాధారం. నైరుతి రుతుపవనాలు ఆరంభంలో సముద్ర ప్రభావిత గాలుల ప్రసరణలో చిక్కుకుపోవటం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవటాన్ని ‘రుతుపవన ఆరంభ వర్షాలు’ అంటారు.
 
భారత భూభాగాన్ని చేరిన రుతుపవనాలు దేశ విశిష్ట స్వరూపం కారణంగా రెండు శాఖలుగా విడిపోతాయి. అవి..
 1. బంగాళాఖాతం శాఖ 
 2. అరేబియా శాఖ
 
బంగాళాఖాతం శాఖ
ఈ శాఖ హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం నుంచి తేమను సేకరించి ముందుగా అండమాన్ నికోబార్ దీవులకు మే 23-25 మధ్య చేరుకొని వర్షాలనిస్తుంది.
ఆ తర్వాత ఈ శాఖ పవనాలు మయన్మార్‌లోని ‘అరకన్‌యోమ’ పర్వతాలను ఢీకొని అక్కడ వర్షాలనిచ్చి అనంతరం తిరిగి భారతదేశం వైపునకు పయనిస్తాయి. ఈ ప్రయాణంలో ఈ పవనాలు రెండు శాఖలుగా విడిపోతాయి. అందులో ఒకటి ఉత్తర భారతదేశం వైపునకు పయనించి ‘అంబాలా’ వద్ద అరేబియా శాఖను కలుస్తుంది. రెండో శాఖ మేఘాలయాలోని గారో, ఖాసీ, జయంతియా కొండల మధ్య ఇరుక్కొని మొత్తం తేమను అక్కడే వర్షం రూపంలో విడుదల చేస్తుంది. అందువల్లే దేశంలోనే అత్యధిక వర్షపాత ప్రాంతాలైన మౌసిన్‌రామ్ (1187 సెం.మీ.), చిరపుంజి (1141సెం.మీ.)లు ఖాసీ కొండల ప్రాంతంలోనే ఉన్నాయి.
 
అరేబియా శాఖ
ఈ శాఖ మొదటగా నైరుతి దిశలో జూన్ 1న కేరళను చేరుకొని కర్ణాటక, మహారాష్ర్ట, కోల్‌కతాల మీదుగా పయనించిఅనంతరం ఢిల్లీ చేరుకుని ఆ తర్వాత పంజాబ్ మీదుగా వెళుతుంది. ఈ శాఖ మూలంగా అధిక వర్షం సంభవిస్తుంది. దీనికి కారణం అరేబియా సముద్రం మీదుగా ఈ శాఖ ఎక్కువ దూరం ప్రయాణించి అధిక నీటిని గ్రహించటమే. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించే క్రమం..
తేదీ ప్రాంతం నైరుతి రుతుపవన శాఖ
మే 22-25 అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతం శాఖ
జూన్ 1 కేరళ అరేబియా శాఖ
జూన్ 5 కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు అరేబియా శాఖ
జూన్ 10 మధ్యప్రదేశ్ అరేబియా శాఖ
జూన్ 15 కలకత్తా అరేబియా శాఖ
జూలై 1 ఢిల్లీ అరేబియా శాఖ
జూలై 15 ఉత్తర భారతదేశం మొత్తం అరేబియా శాఖ

భారతదేశంలో అరేబియా శాఖ వల్ల పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం (పవనాభి దిశ)లో మాత్రమే వర్షాలు కురుస్తాయి. పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం (పవన పరాన్ముఖ దిశ లేదా వర్షచ్ఛాయ మండలం)లో పొడి పవనాలు వీస్తాయి.
 
భారత దేశంలో అధిక వర్షపాతం అరేబియా శాఖ వల్ల సంభవిస్తుంది. ఇది పర్వతీయ వర్షపాత రకానికి చెందింది. నైరుతి రుతుపవనాల వల్ల భారతదేశంలోని 3 ప్రాంతాల్లో వర్షాలు కురవవు. అవి..
 1. తమిళనాడు, దక్షిణ కోస్తా
 2. వాయవ్య రాజస్థాన్
 3. జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ 
 
ఈశాన్య రుతుపవన కాలం
సెప్టెంబర్ మధ్య నుంచిసూర్యుడు దక్షిణార్ధ గోళంలోకి ప్రవేశించటంతో భారతదేశంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఇదే కాలంలో భారతదేశ భూభాగంపై విస్తరించిన అల్పపీడనం క్షీణించి, అధిక పీడనంగా బలపడుతుంది. దాని ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. ఈ విధంగా తిరోగమించిన ఈ రుతుపవనాలు ‘శుష్కం’ (పొడి)గా ఉంటాయి. కానీ ఇవి బంగాళాఖాతంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి తేమను గ్రహించి ఆర్ద్రంగా మారతాయి.
ఇదే సమయంలో బంగాళాఖాతంలో వీస్తున్న రుతుపవనాలు తిరోగమన నైరుతి రుతుపవనాలను ఈశాన్య రుతుపవనాలుగా రూపాంతరం చెందిస్తాయి.
ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడులో దేశంలోనే అధిక వర్షపాతం నమోదవుతుంది. దీనికి కారణం ఈ పవనాలకు తమిళనాడులోని ‘షెవరాయ్’ కొండలు అడ్డురావటం.
ఈ కాలంలో ఒడిశా ఎక్కువగా తుపాన్లకు గురవుతుంది. అక్టోబర్‌లో భారతదేశంలో ఏర్పడిన వేడిని ‘అక్టోబర్ హీట్’ అంటారు.
ఈశాన్య రుతుపవనాల కాలంలో బంగాళాఖాతంలో అనేక అల్పపీడనాలు ఏర్పడతాయి. ఈ అల్పపీడనాలు తుపానులుగా మారి భారతదేశ తూర్పు తీరంలో వర్షాలు కురుస్తాయి.
 
శీతాకాలం
ఈ కాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి, అధిక చలి ఉంటుంది. ఈ కాలంలో ప్రధానంగా దక్షిణ భారతదేశం నుంచిఉత్తర భారతదేశానికి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. ఈ కాలంలో సగటు ఉష్ణోగ్రత దక్షిణాన ఉన్న త్రివేండ్రంలో అత్యధికంగా (22.2°C) ఉంటే ఈశాన్యంలో ఉన్న షిల్లాంగ్‌లో అత్యల్పంగా (3.8°C) ఉంటుంది.
 మధ్యధరా సముద్రం భారతదేశంలో శీతాకాలాన్ని అధికంగా ప్రభావితం చేస్తుంది. ఈ సముద్ర ప్రాంతంలో ఈ కాలంలో వర్షాలు కురవడం వల్ల అక్కడ వీచిన పవనాలు పశ్చిమ జెట్ స్ట్రీమ్స్ రూపంలో గంటకు 300 కి.మీ.ల వేగంతో ఇరాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారతదేశం చేరుకుంటాయి. ఈ జెట్ స్ట్రీమ్స్ దేశంలో విపరీత మంచుకు కారణమవుతున్నాయి. వీటివల్ల హిమాచల్‌ప్రదేశ్ నుంచి గంగా మైదానం మీదుగా అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ మంచు... నెలకు 3 నుంచి 5 సార్లు సంభవిస్తుంది.
పశ్చిమ పవనాల ప్రభావం వల్ల మధ్యధరా, ఎర్ర సముద్ర ప్రాంతాల నుంచి బలహీనమైన సమశీతోష్ణ మండల చక్రవాతాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. వీటి ప్రభావం వల్ల హిమాచల్‌ప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ కాలంలో జల్లులు కురుస్తాయి. వీటినే పశ్చిమ అలజడులు (లేదా) పశ్చిమ కల్లోలాలు అంటారు. వీటి మూలంగా వాయవ్య భారతదేశంలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిసి ‘రబీ’ కాలంలో సాగయ్యే ‘గోధుమ’ పంట దిగుబడిని పెంచుతాయి.
 
 భారతదేశంలో రుతుపవన వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలు
 1. ఎల్‌నినో
 2. లానినో
 3. అంతర ఆయన రేఖా అభిసరణ మండలం
 4. అక్టోబర్ వేడి మొదలైనవి.
 
ఎల్‌నినో: దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహా సముద్రంలోని పెరూ తీరప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత మూలంగా అక్కడ అధిక స్థాయిలో ‘అల్పపీడన’ స్థితి ఏర్పడుతుంది. దీన్ని‘ఎల్‌నినో’ అంటారు. ఎల్‌నినో కారణంగా భారతదేశం పైకి వీచే నైరుతి రుతుపవనాలు అక్కడికి లాగివేతకు గురవుతాయి. ఫలితంగా భారతదేశంలో కరువు పరిస్థితులు ఏర్పడతాయి.
 
లానినో: పెరూ తీరానికి పక్కగా వెళ్లే హంబోల్ట్ శీతల ప్రవాహం మూలంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గి ‘అధిక పీడన’ పరిస్థితులు ఏర్పడటాన్ని ‘లానినో’ అంటారు. దీని మూలంగా భారతదేశం మీదికి రుతుపవనాలు అధికంగా వీస్తాయి. ఫలితంగా భారతదేశంలో అధిక వర్షాలు సంభవిస్తాయి.
 
అంతర ఆయన రేఖా అభిసరణ మండలం: ఉత్తరార్ధ గోళంలోని ఈశాన్య వ్యాపార పవనాలు, దక్షిణార్ధ గోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖ వద్ద కలిసే ప్రాంతాన్ని అంతర ఆయన రేఖా అభిసరణ మండలం అంటారు. ఇది వేసవి కాలంలో ఉత్తరార్ధ గోళంలో 15°C ఉత్తర అక్షాంశం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఇది 25°C ఉత్తర అక్షాంశం మీదికి లాగివేతకు గురవుతుంది. దీన్నే రుతుపవన ఆరంభం అంటారు.
 
అక్టోబర్ హీట్: అక్టోబర్ నాటికి పవనాలన్నీ సముద్రం మీదకు వెళ్లిపోయి ఉత్తర భారతదేశంలో అత్యంత వేడిగా ఉండే వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే అక్టోబర్ వేడి లేదా హీట్ అంటారు.
Published date : 24 Sep 2016 01:59PM

Photo Stories