Skip to main content

ప్రపంచ సంతోష సూచిక-2019లో మొదటి స్థానంలో ఉన్న దేశం?

స్థూల ఆర్థిక చలాంకాలు- ఇటీవలి ప్రగతి :
ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ధోరణిని తెలుసుకోవడానికి స్థూల ఆర్థిక చలాంకాలు సూచికలుగా ఉపకరిస్తాయి. ఆర్థిక వేత్తలు ఆర్థికవ్యవస్థ ప్రగతిని అధ్యయనం చేయడానికి స్థూల దేశీయోత్పత్తి, నిరుద్యోగిత రేటు, ద్రవ్యోల్బణంలాంటి స్థూల ఆర్థిక చలాంకాలను పరిగణనలోకి తీసుకొంటారు. తద్వారా ఆర్థికవ్యవస్థలో ఉత్పత్తి, వినియోగ వృద్ధిని అంచనా వేస్తారు. ద్రవ్య సరఫరాలో వచ్చే మార్పు ప్రభావం జాతీయోత్పత్తి, ఉద్యోగిత, వడ్డీరేటు, ద్రవ్యోల్బణం, స్టాక్ ధరలు, వినిమయ రేటు లాంటి స్థూల ఆర్థిక చలాంకాలపై ఉంటుంది. వరుసగా రెండు త్రైమాసికాలలో వృద్ధి క్షీణత కొనసాగడాన్ని తిరోగమనంగా ‘ది నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్’ నిర్వచించింది.
ఫిలిప్స్ రేఖ సిద్ధాంతం ప్రకారం ద్రవ్యోల్బణం లేకుండా ఆర్థిక వ్యవస్థ పూర్ణోద్యోగిత స్థితిని కొనసాగించ లేదు. విధాన నిర్ణేతలు ద్రవ్యోల్బణం తగ్గింపునకు ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత ఆవశ్యకతను గుర్తించారు. 1982-83లో ‘రీగన్’ ప్రేరిత తిరోగమనం, నిరుద్యోగితను రెండంకెలకు పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తగ్గించగల్గింది.

స్థూల ఆర్థిక చలాంకాల ప్రగతి :
2018 ఏప్రిల్-ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ వ్యయం రూ.10.71 లక్షల కోట్లు కాగా ఈ మొత్తం 2019 ఏప్రిల్ - ఆగస్టులో రూ.11.75 లక్షల కోట్లకు పెరిగింది. ప్రభుత్వ వ్యయంలో భాగంగా మూలధన వ్యయంలో తగ్గుదల కారణంగా వృద్ధి రేటు క్షీణించింది. అల్ప వృద్ధి కారణంగా ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించడంలో అవరోధాలు ఏర్పడతాయి. 2019-20 కేంద్ర బడ్జెట్ ద్రవ్యలోటును రూ.7.03లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఈ మొత్తం జి.డి.పి.లో 3.3 శాతం. 2019 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ది రేటు 5 శాతానికి పరిమితమైనందువల్ల ప్రభుత్వం వృద్ధిని వేగవంతం చేయడానికి ఆర్థిక కార్యకలాపాల పెంపుపై దృష్టి సారిస్తుంది. ఆర్థిక కార్యకలాపాల పెంపునకు తీసుకున్న చర్యల కారణంగా ద్రవ్యలోటు ప్రభుత్వ లక్ష్యం కంటే అధికంగా ఉండే సూచనలు కన్పిస్తున్నాయి.
  • భారత ఆర్థిక వ్యవస్థపై 2008లో అమెరికా సంక్షోభ ప్రభావంతో పోల్చినపుడు ప్రస్తుతం భారత్ స్థూల ఆర్థిక స్థిరత్వం అధికమని ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. 2018 మార్చి చివరి నాటికి భారతీయ షెడ్యూల్డ్ బ్యాంకుల రికవరీ కాని రుణాలు మొత్తం స్థూల రుణంలో 11.2 శాతం కాగా, 2019 మార్చి నాటికి 9.1 శాతానికి తగ్గాయి. తిరిగి 2019 జూన్ నాటికి 9.6 శాతానికి పెరిగాయి. రికవరీ కాని రుణాల పెరుగుదలకు ఆర్థిక వృద్ధి క్షీణత ప్రభావం వ్యాపారంపై అధికంగా ఉండటం కారణమైంది. ఈ క్రమంలో బ్యాంకులు తమ బ్యాలెన్‌‌స షీట్లను సక్రమంగా నిర్వహించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
  • 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశంలో నగదు సంక్షోభం ఏర్పడింది. తద్వారా అసంఘటిత రంగం, చిన్న వ్యాపారాల ప్రగతిపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. 2017 జూలైలో వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత వ్యాపార వృద్ధి పెరుగుదలకు అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో పెట్టుబడులు క్షీణించాయి. పెట్టుబడుల క్షీణత కారణంగా వినియోగం, ఎగుమతుల వృద్ధి మందగించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్‌‌స కంపెనీల సంక్షోభం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో వృద్ధి క్షీణతకు ఒక కారణంగా నిలిచింది.
  • contingent liabilities పెరుగుతున్న కారణంగా ద్రవ్యలోటు పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడి సంస్థలు భారత్ ఉమ్మడి (కేంద్ర, రాష్ర్ట) ద్రవ్యలోటును జి.డి.పి.లో 9-10 శాతంగా అంచనా వేశాయి. భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయంలో భారత్ సమష్ట్టి ద్రవ్యలోటు జి.డి.పి.లో 7 శాతం కంటే ఎక్కువ. పెరుగుతున్న ద్రవ్యలోటు కారణంగా ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ ప్రయోజనాన్ని భారత్ పొందలేదని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు.
  • ఇటీవల కాలంలో ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, వృత్తి సంబంధిత సేవలు, ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయంలో వృద్ధి క్షీణత ఆందోళన కలిగించే పరిణామంగా నిలిచింది. భారత వృద్ధిని 2019-20కి సంబంధించి తన అంచనాలను 6.1 శాతానికి రిజర్‌‌వబ్యాంకు పరిమితం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
  • 2018 ఆగస్టులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు బ్యాంకు పరపతి వృద్ధి 6.6 శాతం ఉంటే, 2019 ఆగస్టులో 6.8 శాతానికి పెరిగింది. ఆహారేతర పరపతి వృద్ధి 2018 ఆగస్టులో 12.4 శాతం కాగా 2019 ఆగస్టులో 9.8 శాతానికి తగ్గింది. 2019 సెప్టెంబర్‌లో బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్ల వృద్ధిలో తగ్గుదల సంభవించింది. వ్యక్తిగత రుణాలు, సేవారంగం నుంచి పరపతికి సంబంధించి డిమాండ్ తగ్గుదల కారణంగా బ్యాంకింగ్ పరపతి డిమాండ్ తగ్గింది.
  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపునకు ప్రభుత్వం అనేక రంగాల్లో సంస్కరణలను చేపట్టినప్పటికీ ఎఫ్.డి.ఐ.ల వృద్ధిలో పెరుగుదల సంభవించలేదు. ఇటీవల రిజర్వు బ్యాంకు తన ద్రవ్య విధానం ద్వారా విధాన రేట్లను కొంత మేర తగ్గించినప్పటికీ ఆ ప్రభావం వెంటనే ఆర్థిక వ్యవస్థలో కన్పించదు. సమష్టి డిమాండ్ పెరుగుదలకు కనీసం మూడు త్రైమాసికాల సమయం పడుతుంది.
తిరోగమనం నివారణకు చర్యలు:
  • వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 2019-20లో 6-6.2 శాతానికి పరిమితమవు తుందనే అంచనాల నేపథ్యంలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం.
  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అధికంగా ఆకర్షించడానికి తగిన చర్యలతో పాటు వినియోగ వృద్ధి పెంపుపై దృష్టి సారించాలి. వినియోగ వృద్ధిలో పెరుగుదల లేనిదే 2019-20 ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించలేం.
  • ఆరోగ్య సంరక్షణ పథకమైన ఆయుష్మాన్ భారత్‌కు నిధుల పెంపు అవసరం. మానవాభివృద్ధిలో ఆరోగ్యం ప్రధానమైంది. తద్వారా వనరుల అభిలషణీయ వినియోగం సాధ్యమవుతుంది.
  • స్థానిక మార్కెట్‌లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న కారణంగా ఆయా ఉత్పత్తుల ఎగుమతులను నిషేధించాలి.
  • కార్పొరేషన్ పన్ను రేటు తగ్గింపు సంస్థలకు ప్రయోజనం కల్గించే అంశమైనప్పటికీ పన్ను విధానంలో మార్పులకు సంబంధించి అనిశ్చితిని నివారించాలి.
  • రిజర్వుబ్యాంకు విధాన రేట్లను తగ్గించడం, బ్యాంకుల తక్కువ వడ్డీపై రుణం కారణంగా పరపతి వృద్ధి పెరిగి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయి.

మాదిరి ప్రశ్నలు :

1. 2019 జూన్ నాటికి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల రికవరీ కాని రుణాలు మొత్తం స్థూల రుణంలో ఎంత శాతంగా నమోదైంది?
  1) 9.6 శాతం 
  2) 9.9 శాతం
  3) 10.7 శాతం 
  4) 11.3 శాతం
Published date : 25 Oct 2019 03:01PM

Photo Stories