Skip to main content

మూడు దీవుల పేర్లు మార్పు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943, డిసెంబర్ 30న అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్‌బ్లేర్‌లోని జింఖానా మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు (జింఖానా మైదానాన్ని ప్రస్తుతం నేతాజీ స్టేడియంగా పిలుస్తున్నారు).
ఆ సందర్భంగా బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తొలి భారత భూభాగంగా అండమాన్ దీవులను నేతాజీ ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అండమాన్ నికోబార్ దీవులను బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఆక్రమించుకుంది. నేతాజీ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్ మిత్ర పక్షంగా ఉండేది. నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అండమాన్ నికోబార్ దీవులను 2018, డిసెంబర్ 30న సందర్శించారు. ఆ సందర్భంగా ఇక్కడి మూడు దీవుల పేర్లను మార్చారు. రాస్ ఐలాండ్ పేరును నేతాజీ సుభాస్ చంద్రబోస్ ద్వీప్‌గా, నీల్ ఐలాండ్‌ను షహీద్ ద్వీప్‌గా, హావెలాక్ ఐలాండ్‌ను స్వరాజ్ ద్వీప్‌గా మారుస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ మూడు దీవులు ప్రముఖ పర్యాటక ప్రదేశాలు. ప్రధాని పోర్ట్‌బ్లేర్‌లోని నేతాజీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని... 75 రూపాయల స్మారక నాణేన్ని, తపాలా బిళ్లను, ఫస్ట్‌డే పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు. మోదీ మరీనా పార్క్‌లో 150 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. పోర్ట్‌బ్లేర్‌లోని సెల్యులార్ జైలును సందర్శించారు. దీనినే కాలాపానీ అంటారు. ఈ జైలులోనే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులను బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించేది. వీర్‌సావర్కర్, బట్టుకేశ్వర దత్తు, యోగేంద్ర శుక్లా తదితర నాయకులను సెల్యులార్ జైలులోనే ఉంచారు. ఈ జైలును 1896 నుంచి 1906 మధ్యకాలంలో నిర్మించారు. ప్రస్తుతం ఇది జాతీయ స్మారక చిహ్నంగా కొనసాగుతోంది.
Published date : 16 Jan 2019 06:19PM

Photo Stories