Savitribai Phule: మహిళా విద్యకు తొలి వెలుతురు
‘సావిత్రిబాయి ఫూలే ప్రతిరోజూ సంచిలో అదనంగా చీర పెట్టుకుని స్కూల్‌కు వెళ్లేవారు. దారిలో ఎవరో ఒకరు ఆమె మీద పేడ విసిరితే కడుక్కుని కట్టుకోవడానికి’ అని రాస్తుంది రీతా రామస్వామి గుప్తా. నిమ్న వర్గాల ఆడపిల్లల విద్యకు జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలేమీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కాని రచయిత్రి రీతా రామస్వామి మరిన్ని జీవిత చిత్రాలను సేకరించి తెచ్చిన పుస్తకం ‘సావిత్రిబాయి పూలే’ తాజాగా విడుదలైంది. రీతా రామస్వామి గురించి, పుస్తకంలో ఉన్న విశేషాల గురించి...
‘ఇవాళ బాలికల విద్య అనగానే ప్రపంచానికి మలాలా పేరు గుర్తుకొస్తుంది. కాని బాలికల విద్య కోసం జీవితాన్ని అర్పించిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే. మన దేశంలో ఆమె తొలి మహిళా ఉపాధ్యాయిని. ఆడపిల్లల చదువును ప్రచారం చేయడానికి ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు’ అంటుంది రీతా రామస్వామి గుప్తా.
గతంలో నటుడు సంజీవ్ కుమార్‌పై రాసిన బయోగ్రఫీతో పాఠకులకు తెలిసిన రీతా రామస్వామి ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి అతని జీవిత సంగ్రహం రాసింది. ‘ఇలా ఇంకొన్ని పుస్తకాలు రాయాలనుకుంటుండగా నా 18 ఏళ్ల కుమార్తె– అమ్మా... ఎందుకు నువ్వు ఎప్పుడూ మగవాళ్ల గురించే రాస్తావు.
నువ్వు రాయదగ్గ స్త్రీలు లేరా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. దానికి జవాబే నా కొత్త పుస్తకం– సావిత్రిబాయి పూలే.. హర్ లైఫ్.. హర్ రిలేషన్‌షిప్స్.. హర్ లెగసీ’ అంది రీతా రామస్వామి. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి ఈ పుస్తకం తాజాగా విడుదలైంది.
బలహీనులకు అందని విద్య
‘బ్రిటిష్ వారు 1813లో క్రైస్తవ మిషనరీల ద్వారా మన దేశంలో పాశ్చాత్య విద్యకు అంకురార్పణ చేశారు. అయితే వారి ఉద్దేశాలు వేరే. తమ వ్యవహారాల కోసం ఇంగ్లిష్ తెలిసిన కొంతమంది ఉద్యోగులు అవసరం కనుక పై వర్గాల వారికి చదువు నేర్పిస్తే వారి నుంచి కింది వర్గాల వారికి చదువు అందుతుంది అని భావించారు. కాని పై వర్గాలకు మొదలైన చదువు కింది వర్గాల వరకూ చేరలేదు. కింది వర్గాల వారికి పాఠశాలల్లో అనుమతి లేని పరిస్థితి.
అంటరానితనం విస్తృతంగా ఉండేది. ఇక చదువుకు ఆడపిల్లలు నిషిద్ధం చేయబడ్డారు. ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లిష్ వచ్చి ఉండాలన్న నియమం కూడా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. వీటన్నింటినీ దాటి సావిత్రిబాయి పూలే టీచర్ అయ్యింది. జ్యోతిబా పూలేతో కలిసి 1848లో బ్రిటిష్‌వారితో సంబంధం లేని, మిషనరీలతో సంబంధం లేని బాలికల తొలి పాఠశాలను మొదలెట్టింది. దిగువ వర్గాల బాలికల విద్య కోసం పోరాడింది’ అంటుంది రీతా రామస్వామి.
ఆ ఇద్దరు
‘సావిత్రిబాయి పూలే హర్ లైఫ్, హర్ రిలేషన్‌షిప్స్, హర్ లెగసీ’... పుస్తకంలో రీతా రామస్వామి కేవలం సావిత్రిబాయి పూలే గురించే రాయలేదు. ఆమెను ఆదర్శంగా తీసుకుని బాలికల విద్య కోసం తోడైన తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ గురించీ... సావిత్రి, ఫాతిమా కలిసి మహరాష్ట్రలో బాలికల విద్య కోసం స్కూళ్లు స్థాపించి నిర్వహించడానికి పడిన ఆరాటం గురించి కూడా రాసింది. ‘ఫాతిమ షేక్ తొలి క్వాలిఫైడ్ ముస్లిం ఉమెన్ టీచర్ మన దేశంలో. ఆమె సావిత్రిబాయి పూలేకి బాసటగా నిలిచింది. ఒక దశలో సావిత్రిబాయి సుదీర్ఘకాలం జబ్బు పడితే స్కూళ్ల నిర్వహణభారం మోసింది. ఆ వివరాలన్నీ నా పుస్తకంలో ఉన్నాయి’ అని తెలిపింది రీతా రామస్వామి.
ఎన్నెన్నో అవమానాలు
‘దిగువ వర్గాల వారిలో ఆడపిల్లలకు చదువెందుకు అనే భావన విపరీతంగా ఉండేది. వాళ్లకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసేవారు. కాని వారి ఇళ్లకు వెళ్లి బడికి పంపమని కోరేది సావిత్రి. వారు శాపనార్థాలు పెట్టేవారు. దారిన పోతూ ఉంటే రాళ్లు విసిరేవారు. దానికి తోడు పేద వర్గాల వారిని చదివిస్తున్నందుకు అగ్రవర్ణాలు కక్ష కట్టి సావిత్రిబాయి మీద పేడనీళ్లు చల్లేవారు. అందుకని ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు తన సంచిలో చీర అదనంగా పెట్టుకునేది. ఎవరైనా పేడ నీళ్లు చల్లినా వెరవకుండా స్కూలుకు వెళ్లి చీర మార్చుకుని పాఠాలు చెప్పేది. ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగడం వల్ల మన దేశంలో బాలికల విద్య గణనీయంగా పెరిగింది. చదువులో ఉద్యోగాల్లో అమ్మాయిలు గొప్పగా రాణిస్తున్నారు. వారంతా తప్పక తెలుసుకోవాల్సిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే’ అంది రీతా రామస్వామి.