Draupadi Murmu Facilities : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతంటే..? ఆమెకు లభించే ఇతర అలవెన్స్ ఇవే..
స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే గాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా కూడా నిలిచారు. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవి అధిష్టించనున్న రెండో మహిళ ముర్ము. అధికార ఎన్డీఏ తరఫున బరిలో దిగిన ముర్ము జూలై 21వ తేదీన (గురువారం) జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు మూడింట రెండొంతల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారసురాలిగా 25వ తేదీ సోమవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతికి జీతం ఎంత ఉంటుంది, ఆమెకు లభించే ఇతర అలవెన్స్, విరమణ తర్వత పెన్షన్ వంటి విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. మరి వాటిపై ఓ లుక్కెద్దాం.
జూలై 25న ప్రమాణ స్వీకారరం చేసిన తర్వాత ముర్ము రాష్ట్రపతి భవన్‌లోకి మారనున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవి కాలం 24తో ముగియడంతో ఆయన ఢిల్లీలోని 12 జనపథ్ రోడ్డులోని బంగ్లాలోకి వెళ్లనున్నారు.
➤ భారత రాష్ట్రపతి నెల జీతం రూ. 5 లక్షలు. దీనిని 2018లో రూ. 1.50 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు.
➤ దేశంలో అత్యధిక వేతనం రాష్ట్రపతికే ఉంటుంది. జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
➤ రాష్ట్రపతికి గృహ, వైద్యం. ప్రయాణ ఖర్చులు ఉచితం. అలాగే కార్యాలయ ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి రూ.1 లక్ష లభిస్తుంది.
➤ భారత రాష్ట్రపతితోపాటు వారి జీవిత భాగస్వామి ప్రపంచంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
➤ ప్రెసిడెంట్ అధికారిక నివాసాన్ని రాష్ట్రపతి భవన్‌గా పిలుస్తారు. ఇందులో 340 గదులు ఉంటాయి. ఇది 2,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది.
➤ రాష్ట్రపతికి మరో రెండు విడిది నివాసాలు ఉన్నాయి. అక్కడికి సెలవుల నిమిత్తం వెళ్లవచ్చు. ఒకటి సిమ్లాలోని మషోబ్రాలో(వేసవి విడిది) ఉంది, మరొకటి హైదరాబాద్‌లోని బోలారంలో(శీతాకాల విడిది) ఉంది.
➤ రాష్ట్రపతి ప్రీమియమ్ కార్లలోనే ప్రయాణిస్తారు. కస్టమ్-బిల్ట్ బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ S600 (W221) లో ప్రయాణిస్తారు. కార్లలో అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్ కలిగి ఉంటుంది. బుల్లెట్, బాంబులు, గ్యాస్ దాడులు, ఇతర పేలుడు పదార్థాలను తట్టుకోగలదు.
➤ భారత ఆర్మీ విభాగంలోని అత్యున్నత విభాగం ప్రెసిడెంట్ బాడీగార్డ్ రాష్ట్రపతికి రక్షణ కల్పిస్తారు. ఈ విభాగంలో త్రివిధ (ఆర్మీ, వాయు, నావీ) దళాలకు చెందిన అగ్రశేణి సైనికులు ఉంటారు.
➤ భద్రతా కారణాల దృష్ట్యా భారత రాష్ట్రపతి కార్ల వివరాలు ఎప్పుడూ వెల్లడించరు. ఈ కార్లకు లైసెన్స్ ప్లేట్ ఉండదు. దీనికి బదులు జాతీయ చిహ్నం ఉంటుంది
➤ రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత నెలల రూ. 1.5 లక్షల పెన్షన్ వస్తుంది. అంతేగాక వారి జీవిత భాగస్వాములకు నెలకు రూ. 30,000 సెక్రటేరియల్ సహాయం అందుతుంది.
➤ పెన్షన్ కాకుండా ఎలాంటి అద్దె చెల్లించకుండానే పెద్ద బంగ్లాలో నివసించేందుకు అవకాశముంటుది. అయిదుగురు వ్యక్తిగత సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. వారి ఖర్చుల కోసం సంవత్సరానికి ₹60,000 లభిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో సహా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
ద్రౌపది ముర్ము ప్రస్థానం..
సొంతూరు : ఒడిశాలోని మయూర్‌భంజ్
పుట్టిన తేదీ : 1958 జూన్ 20 (64 ఏళ్లు)
తండ్రి : బిరంచి నారాయణ్ తుడు (చనిపోయారు)
భర్త : శ్యామ్ చరణ్ ముర్ము (మరణించారు)
విద్య : భువనేశ్వర్‌లోని రమాదేవి వుమెన్స్ యూనివర్సిటీ నుంచి బీఏ
సంతానం : ఇద్దరు కుమారులు (మరణించారు)
కూతురు : ఇతిశ్రీ ముర్ము
పార్టీ : బీజేపీ
పదవులు :
- ఒడిశా ఎమ్మెల్యే(2000–09), జార్ఖండ్ గవర్నర్ (2015–21), 2000లో ఏర్పాటైన జార్ఖండ్‌కు ఐదేళ్ల పూర్తికాలం పనిచేసిన మొదటి గవర్నర్
- శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఆనరరీ అసిస్టెంట్ టీచర్.
- అనంతరం ఒడిశా నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ పనిచేశారు.
- 1997లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం.
- 1997లో రాయ్‌రంగాపూర్ కౌన్సిలర్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక
- 2000లో రాయ్‌రంగాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2002 వరకు కేబినెట్‌లో రవాణా, వాణిజ్య శాఖ మంత్రిగా
- 2002 నుంచి 2004 వరకు మత్య్స, పశుసంవర్థక శాఖ బాధ్యతలు
- 2002–09 మధ్యకాలంలో మయూర్‌భంజ్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్
- 2004–09 మధ్య రాయ్‌రంగాపూర్ ఎమ్మెల్యేగా చేశారు
- 2006–09లో ఒడిశా బీజేపీ షెడ్యూల్ తెగల మోర్చా అధ్యక్షురాలిగా
- 2010–15 కాలంలో మయూర్‌భంజ్ బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ పదవి
- 2007 సంవత్సరానికి గాను ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికైన ఆమెకు ఒడిశా అసెంబ్లీ నీలకంఠ అవార్డు బహూకరించింది.