Skip to main content

వినీలాకాశంలో వాణిజ్య విహంగం పీఎస్‌ఎల్‌వీ-సీ23

సి. హరికృష్ణ, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో ) వినీలాకాశంలో తన అప్రతిహత జైత్రయాత్రను సాగించడంలో మరోసారి సఫలమైంది. విదేశీ వాణిజ్యం నిమిత్తం ప్రయోగించిన ఐదు ఉపగ్రహాలను మోసుకుపోవడంలో ఇస్రో మానసపుత్రిక అయిన పీఎస్‌ఎల్‌వీ తన విద్యుక్తధర్మాన్ని విజయవంతం చేసింది. శాస్త్రవేత్తల నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రసాంకేతిక రంగంలో మరో అడుగు ముందుకు వేసేందుకు ఆత్మస్థైర్యాన్ని ప్రోదిచేసింది.

26వ వరుస విజయం:
అంతరిక్ష యానంలో ఇస్రో మరో అడుగుముందుకు వేసింది. నెల్లూరులోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-C23 నుంచి ఉపగ్రహాలను పంపడంలో శతశాతం విజయం సాధించింది. ఈ ప్రయోగం ద్వారా వాణిజ్య రంగంలో తనదంటూ చెరగని ముద్రవేసుకుంది. నాలుగు దేశాలకు చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇలా పీఎస్‌ఎల్‌వీల ప్రయోగ పరంపరలో ఇది 27వది. కాగా ఇది 26వ వరుస విజయం.
49 గంటల కౌంట్‌డౌన్ తర్వాత జూన్ 30, 2014న ఇస్రో ఉదయం 9.52 గంటలకు PSLV-C23 ను ప్రయోగించింది. దీని పయనానికి రోదసి లోని ఉపగ్రహ శకలాలు అడ్డుపడే సంకేతాలను గుర్తించిన శాస్త్రవేత్తలు.. 9.49 గంటలకు ప్రయోగించాల్సిన నౌకను మూడు నిమిషాల ఆలస్యంగా 9.52 గంటలకు ప్రయోగించారు. లిఫ్ట్ ఆఫ్ జరిగిన 20 నిమిషాలకు తొలుత ఫ్రాన్‌‌సకు చెందిన స్పాట్-7 ఉపగ్రహాన్ని PSLV-C23 నాలుగో దశ 662.3 కి.మీ. ఎత్తులోని సూర్యానువర్తన (Sun Synchronus) కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత నిమిషాల్లో ఇతర నాలుగు ఉపగ్రహాలను కూడా నిర్ణీత కక్ష్యలోకి చేరాయి. స్ట్రాప్ ఆన్ మోటార్లు లేని PSLV కోర్ అలోన్ రూపంలో PSLV-C23 ప్రయోగం జరిగింది. ఇలాంటి ప్రయోగాల్లో ఇది పదవది.
పూర్తిగా వాణిజ్యపరమైన ఈ ప్రయోగం తెలుగువాడైన షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. 50 రోజుల వ్యవధిలో అనుసంధానం జరిగింది. ఇప్పటివరకు ఇస్రో 19 దేశాలకు చెందిన 38 విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలను చేపట్టగా అందులో 30 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

నాలుగు దేశాలు-ఐదు ఉపగ్రహాలు
PSLV-C23 ద్వారా నాలుగు దేశాలకు చెందిన ఐదు ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటిలో ప్రధాన ఉపగ్రహం ఫ్రాన్‌‌సకు చెందిన స్పాట్-7. ఇది ఎర్‌‌త అబ్జర్వేషన్ ఉపగ్రహం. పీఎస్‌ఎల్‌వీ-సి21 ద్వారా ఇస్రో 2012 సెప్టెంబర్‌లో ఫ్రాన్‌‌సకు చెందిన స్పాట్-6 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. స్పాట్-6 స్పాట్-7ను పోలి ఉంటుంది. స్పాట్-7ను ఐరోపాకు చెందిన ప్రముఖ స్పేస్ టెక్నాలజీ సంస్థ Airbus Defence & Space రూపొందించింది. దీని బరువు 714 కిలోలు. దీని జీవితకాలం 10 ఏళ్లు. భూమి ఉపరితల చిత్రీకరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. స్పాట్-7తోపాటు ఇతర విదేశీ ఉపగ్రహాలు -వాటి వివరాలు.

ఎ.ఐ. శాట్:
ఇది జర్మనీ దేశానికి చెందినది. దీని బరువు 14 కిలోలు. మ్యారిటాం అనువర్తనాలకు ఉద్దేశించింది. దీని సహాయంతో ప్రపంచ సముద్రయానం, నౌకల గమనాన్ని పరిశీలించవచ్చు. నౌకల నుంచి సంకేతాలను గ్రహించి సమాచారం చేరవేస్తుంది. జర్మనీ అభివృద్ధి చేసే డీఎల్‌ఆర్ ఉపగ్రహాల్లో మొదటి నానో ఉపగ్రహం ఇది.

ఎన్‌ఎల్‌ఎస్:
ఎన్‌ఎల్‌ఎస్ 7.1, ఎన్‌ఎల్‌ఎస్ 7.2 అనే ఈ రెండు ఉపగ్రహాలు కెనడావి. ఒక్కో ఉపగ్రహం బరువు 15 కిలోలు. ఇవి సిగ్నల్స్‌ను తీసుకొని ట్రాన్స్‌మిషన్ చేస్తాయి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సేవలకు ఉద్దేశించినవి.

వెలాక్స్: ఈ ఉపగ్రహం సింగపూర్ దేశానికి చెందినది. దీని బరువు 6.4 కిలోలు. సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ దీన్ని రూపకల్పన చేసింది. కొత్తరకం ఇమేజ్ సెన్సార్ టెక్నాలజీని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ (ఎమ్‌ఈఎమ్‌ఎస్) ఆధారంగా పనిచేసే నియంత్రణ వ్యవస్థ, రెండు ఉపగ్రహాల మధ్య అనుసంధానానికి సంబంధించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇది పరీక్షిస్తుంది. సంకేతాలను గ్రహించి నిల్వ చేస్తుంది.
ఇది మొట్టమొదటి నానోశాటిలైట్.

తొలి వాణిజ్య విజయం:
ఇప్పటివరకు ఇస్రో PSLV ద్వారా 40 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. 1999లో తొలిసారిగా పీఎస్‌ఎల్‌వీ-సీ2 ద్వారా ఇస్రో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ప్రారంభించింది. PSLV-C2 ద్వారా జర్మనీకి చెందిన డీఎల్‌ఆర్ -టబ్‌శాట్, కొరియాకు చెందిన కిట్‌శాట్-3ను ఇస్రో ప్రయోగించింది. ఆనాటి నుంచి విదేశీ ఉపగ్రహాల ప్రయోగ పరంపరను ఇస్రో కొనసాగిస్తూనే ఉంది. మొదట్లో విదేశీ ఉప గ్రహాలను ప్రధాన భారత ఉపగ్రహాలకు అదనంగా ప్రయోగించినప్పటికీ PSLV-C8 ద్వారా 2007లో ప్రధాన పేలోడ్‌గా ఇటలీకు చెందిన ఎజైల్ ఉపగ్రహాన్ని అంత రిక్షంలోకి పంపింది. ఇది ఒక మంచి వాణిజ్య విజయంగా పరిగణించవచ్చు. అదే విధంగా PSLV-C10 ద్వారా కేవలం విదేశీ ఉపగ్రహాన్ని మాత్రమే ఇస్రో పంపింది. 300 కిలోల బరువున్న ఇజ్రాయెల్‌కు చెందిన టెక్సర్/పోలారిస్ అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఇదే తరహాలో మరో అడుగు ముందుకేసి PSLV-C9 ద్వారా మొత్తం పది ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. వీటిలో 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. PSLV-C21 ద్వారా ఫ్రాన్‌‌సకు చెందిన స్పాట్-6, జపాన్‌కు చెందిన ప్రొయిటెరిస్ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఆ తర్వాత కొన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నప్పటికీ మళ్లీ PSLV-C23 ద్వారా దాదాపు పూర్తి స్థాయిలో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో వాణిజ్య విజయాన్ని మరోసారి నమోదు చేసింది.

రూ. కోట్లలో ఆర్జన:
విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి పంపే సేవలను అందించడం ద్వారా ఇస్రో ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అత్యంత చౌక అయిన ప్రయోగ సేవలను అందిస్తున్న అంతరిక్ష సంస్థ ఇస్రోనే. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు సహజవనరుల నిర్వహణ, గ్రామీణ పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉపగ్రహాలను నిర్మించుకోనున్నాయి. అయితే రాకెట్ విజ్ఞానం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం అవడం ద్వారా భారత్ లాంటి దేశాలకు ఇది ఎంతగానో కలిసి వచ్చే అంశం.

నమ్మకానికి ప్రతీక... పీఎస్‌ఎల్‌వీ:
27 ప్రయోగాల్లో మొదటిది తప్ప మిగతా 26 ప్రయోగాల్లో ్కఔగ విజయాలను నమోదు చేసుకోవడంతో దీనిపై అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలకు నమ్మకం ఏర్పడింది. ఇన్ని దేశాలు PSLV ద్వారా తమ ఉపగ్రహాలను ప్రయోగిస్తుండటంతో భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచం ఏ విధంగా గుర్తించిందో అర్థమవుతుందని, PSLV-C23 ప్రయోగానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు.
ప్రపంచ వ్యాప్తంగా భారత అంతరిక్ష కార్యక్రమం ఘనత చాటడంలో పీఎస్‌ఎల్‌వీ చాలా కీలకమైంది. పీఎస్‌ఎల్‌వీ కార్యక్రమం 1982లో ప్రారంభమైంది. అప్పటికే ఇస్రో శాటిలైట్ లాంచ్ వెహికల్-3 (SLV3).
ఆగ్‌మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ASLV) అనే రెండు పరిశోధన నౌకలను విజయవంతంగా ప్రయోగించింది. నమూనా PSLV పొడవు 44.4 మీ. బరువు 294 టన్నులు. ఇది నాలుగు అంచెల నౌక. మొదటి, మూడో దశల్లో ఘన ఇంధనాన్ని రెండు,నాలుగో దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీని మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. ఇస్రో ఇప్పటివరకు మూడు రకాల PSLVలను రూపొందించి ప్రయోగించింది.

మొదటి PSLV జనరిక్ రూపం:
దీని మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. రెండవది PSLVCA (కోర్ అలోన్) రూపం. దీని చుట్టూ స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉండవు. తేలిక ఉపగ్రహాలను ప్రయోగించినప్పుడు రెండోరూపాన్ని వినియోగిస్తారు. భారీ ఉపగ్రహాలను ప్రయోగించడానికి స్ట్రాప్ ఆన్ మోటార్ల పరిమాణం, సామర్థ్యం పెంచితే దాన్ని PSLV-XL అంటారు.

అపజయంతో అన్నీ విజయాలే:
ఇప్పటివరకు PSLV-C23 తో కలిపితే 27 ప్రయోగాలను పీఎస్‌ఎల్‌వీ నిర్వహించింది. వీటిలో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు. మిగతా 24 కార్యాచరణ ప్రయోగాలు. 1993, సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పీఎస్‌ఎల్‌వీ అభివృద్ధి ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ-డీ1 మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 26 ప్రయోగాలు (PSLV-C23 తో కలిపి) వరుస విజయవంతమయ్యాయి. ప్రపంచంలోని విజయవంతమైన కొన్ని రాకెట్లలో పీఎస్‌ఎల్‌వీ ఒకటి. అనేక దేశాలు తమ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా విదేశీ మారకద్రవ్యం ఆర్జించడంలో ఇస్రో సఫలమైంది. ఇలాంటి అంతరిక్ష సేవలను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడానికి 1992లో Antrix Corporation (ఆంత్రిక్స్ కార్పొరేషన్) అనే ప్రత్యేక అంతరిక్ష వాణిజ్య విభాగాన్ని ఇస్రో ఏర్పాటు చేసింది.
Bavitha
Published date : 11 Jul 2014 01:38PM

Photo Stories