Skip to main content

జీశాట్ - 18

సి. హరికృష్ణ, సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్.
అత్యాధునిక భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-18ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అక్టోబర్ 6న విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ ద్వీపం నుంచి ఏరియేన్-5 వీఏ-231 రాకెట్ సాయంతో నిర్దేశిత జియో ట్రాన్స్‌ఫర్ కక్ష్యలోకి ప్రవేశపె ట్టింది. వాస్తవానికి అక్టోబర్ 5నే ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా వేశారు. ప్రస్తుతం ఇన్‌శాట్/జీశాట్ వ్యవస్థల్లో సేవలందిస్తున్న 14 కార్యాచరణ టెలీ కమ్యూనికేషన్ ఉపగ్రహాల సామర్థ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీని బరువు 3,404 కిలోలు. ఇంత భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను మోసుకెళ్ల గల సామర్థ్యం ఇస్రో వద్ద ప్రస్తుతం ఉన్న పీఎస్‌ఎల్‌వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్), జీఎస్‌ఎల్‌వీ (జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్) వల్ల సాధ్యం కాదు. అందువల్ల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఏరియేన్ రాకెట్‌తో ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా ఇస్రో పంపిన భారత్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల సంఖ్య జీశాట్-18తో కలిపి 20కి చేరింది.

భూస్థిర కక్ష్యలోకి..: భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 6 తెల్లవారుజామున 2 గంటలకు ఏరియేన్ రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయింది. ఇది జరిగిన 32 నిమిషాలకు జీశాట్-18ని నిర్దేశిత భూ అనువర్తిత మార్పిడి కక్ష్య(జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫెరో ఆర్బిట్) లోకి ప్రవేశపెట్టింది. అనంతరం హసన్(కర్ణాటక)లోని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్) కేంద్రం ఉపగ్రహాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఆ తర్వాత జీశాట్-18లోని లిక్విడ్ అపోజీ మోటర్(ఎల్‌ఏఎం)ను మండించి కక్ష్య మార్పిడి ద్వారా భూస్థిర కక్ష్యలోకి చేర్చారు.

ట్రాన్స్‌పాండర్లు: ఈ ఉపగ్రహంలో 48 ట్రాన్‌‌సపాండర్లు ఉన్నాయి. వీటిలో 24 సీ బ్యాండ్, 12 ఎక్స్‌టెండెడ్ సీ బ్యాండ్, 12 క్యూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు. వీటికి అదనంగా 2 క్యూ బ్యాండ్ బీకన్లు కూడా ఉన్నాయి. నేల మీద ఉన్న యాంటెనాలను ఉపగ్రహం వైపునకు కచ్చితంగా అనుసంధానించడంలో క్యూ బ్యాండ్ బీకన్లు ఉపయోగపడతాయి. జీశాట్-18ని తొలుత జూలై 12న ప్రయోగించాల్సి ఉంది. దీంతోపాటు జపాన్‌కు చెందిన సూపర్ బర్డ్-8 ఉపగ్రహాన్నీ ప్రయోగించాలని నిర్ణయించారు. అయితే సూపర్ బర్డ్.. ఓడ ప్రమాదంలో దెబ్బతింది. అందువల్ల కొంత విరామం అనంతరం జీశాట్-18తోపాటు ఆస్ట్రేలియాకు చెందిన ‘స్కై మస్టర్-2’ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. కమ్యూనికేషన్ రంగాన్ని విస్తరించడంలో ట్రాన్‌‌సపాండర్ల పాత్ర చాలా కీలకం. మరిన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాలను వేగంగా ప్రయోగించాలంటే ఏరియేన్ లాంటి విదేశీ ఉపగ్రహ వాహక నౌకలపై ఆధారపడకుండా జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 నౌక అభివృద్ధిని వేగవంతం చేయాలి. 4000 కిలోలకు పైగా బరువు ఉన్న ఉపగ్రహాలనూ జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగించగలదు.

అప్ లింకింగ్.. డౌన్ లింకింగ్: ఉపగ్రహ కమ్యూనికేషన్‌లో సమాచార ప్రసారానికి వాడే ఒక అప్ లింక్, ఒక డౌన్ లింక్ పౌనఃపున్యాల కలయికే బ్యాండ్ విడ్త్. గ్రౌండ్ స్టేషన్ నుంచి అంతరిక్ష కక్ష్యలోని ఉపగ్రహానికి సమాచారాన్ని ప్రసారం చేసే పౌనఃపున్యం అప్ లింక్. ఉపగ్రహం నుంచి తిరిగి భూమిపైన గ్రౌండ్ స్టేషన్‌కు సమాచారాన్ని చేరవేసే పౌనఃపున్యం డౌన్ లింక్. ఈ పౌనఃపున్యాల్లో సమాచార ప్రసారాన్ని నిర్వహించే ప్రధాన ఎలక్ట్రానిక్ పరికరాలు ట్రాన్‌‌సపాండర్లు. రిసీవర్, మాడ్యులేటర్, ట్రాన్‌‌సమీటర్ కలయికే ట్రాన్‌‌సపాండర్. ఇది అప్ లింకింగ్ ద్వారా సమాచారాన్ని సేకరించి, మాడ్యులేషన్ ద్వారా కొద్దిగా మార్చి డౌన్ లింకింగ్ ద్వారా భూమికి ప్రసారం చేస్తుంది. పౌర అనువర్తనాలకు ఉద్దేశించిన బ్యాండ్ విడ్‌‌తలను ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) వివిధ దేశాలకు కేటాయిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.

జీశాట్-18 స్వరూపం
అందించే సర్వీస్:
కమ్యూనికేషన్
ఆర్బిట్: జియో స్టేషనరీ, 74 డిగ్రీల తూర్పు రేఖాంశం
మిషన్ జీవితకాలం: 15 ఏళ్లు
లిఫ్ట్ ఆఫ్ మాస్: 3,404 కిలోలు.
డ్రై మాస్: 1480 కిలోలు
ప్రొపల్షన్ సిస్టమ్: బై ప్రొపెల్లెంట్

గతంలో ప్రయోగించిన కొన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాలు

ఉపగ్రహం

ప్రయోగ తేదీ

ప్రయోగ నౌక

జీశాట్-18

2016, అక్టోబర్ 6

ఏరియేన్-5వీఏ-231

జీశాట్-15

2015, నవంబర్ 11

ఏరియేన్-5వీఏ-227

జీశాట్-6

2015, ఆగస్టు 27

జీఎస్‌ఎల్‌వీ-డీ6

జీశాట్-16

2014, డిసెంబర్ 7

ఏరియేన్-5వీఏ-221

జీశాట్-14

2014, జనవరి 5

జీఎస్‌ఎల్‌వీ-డీ5

జీశాట్-7

2013 ఆగస్టు 30

ఏరియేన్-5వీఏ-215

Published date : 18 Oct 2016 05:09PM

Photo Stories