Skip to main content

సమాచార హక్కు చట్టం- 2005...సమగ్ర అవగాహన

అజ్ఞానం అంధకారమని, అంధకారణమని గురువులు చెప్పేమాట. తెలియంది తెలుసుకోవాలి. కనీసం తెలుసుకునే ప్రయత్నమైనా చెయ్యాలి..ఇది ఆర్టిఐ చెప్పేమాట. సమాచార హక్కు చట్టం ఆ తెలియని విషయాన్ని తెసుకోవడానికి ఒక మంచి మార్గం. స్థూలంగా ఏఏ సంస్థల్లో ఎవరిని సమాచారం అడగాలి? ఏవిధంగా దరఖాస్తు చేయాలి? ఏ రూపంలో, ఎన్ని రోజుల్లో సమాచారం పొందాలి? వంటి ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం.
సమాచార హక్కు చట్టం (Right to information) ఎందుకు?
భారత రాజ్యాంగం గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయాలన్నా, అవినీతిని అరికట్టాలన్నా, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నా ప్రజాస్వామ్యంలోని పౌరులకు విషయ పరిజ్ఞానం ఉండటం అవసరం. అటువంటి సామాన్యుడి పాలిట పాశుపతాశ్రమే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ). ప్రతి అధికారయంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం కోసం, అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకూ, పౌరులకున్న సమాచార హక్కును చట్టబద్ధం చేయడం కోసం, కేంద్ర సమాచార కమిషన్‌ను, రాష్ట్ర సమాచార కమిషన్లను నెలకొల్పడం కోసం, సంబంధిత ఇతర అంశాల కోసం ఉద్దేశించినదే ఈ చట్టం. ఆర్టీఐలో మొత్తం 31 సెక్షన్లున్నాయి. ప్రస్తుతం తొమ్మిదో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ (సీఐసీ)గా సుధీర్‌బార్గవ వ్యవహరిస్తున్నారు.

ఆర్టీఐ ఎప్పుడు ఏర్పాటైంది?
ఆర్టీఐ బిల్లు 2005, జూన్ 15న భారత పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో ప్రతి పౌరుడికి సమాచారం తెలుసుకునే హక్కు చట్టపరంగా సంక్రమించింది. 2002లో అమలులోకి వచ్చిన ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్థానంలో ఈ చట్టం అమలులోకొచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కు ఉంటుంది. సమాచారాన్ని కోరినప్పుడు ఏకపక్షంగా నిరాకరించడం ఈ చట్టం ప్రకారం నేరం. సమాచారం పొందడానికి వ్యక్తిగత వివరాలు, కారణాలు చెప్పనవసరం లేదు.

సమాచార హక్కు అంటే ఏమిటి?
ఏ అధికార యంత్రాంగం నియంత్రణ కింద ఉన్న సమాచారాన్నైనా ఈ చట్టం కింద పొందే హక్కు. పనులను, పత్రాలను, రికార్డులను తనిఖీ చేసే హక్కు. వాటి కాఫీలు (ఎలక్ట్రానిక్ లేదా హార్డ్ కాఫీ ఏ రూపంలోనైనా) తీసుకునే హక్కును సమాచార హక్కు అంటారు.

ఏఏ సంస్థలు ఆర్టీఐ చట్ట పరిధిలోకొస్తాయి?
కేంద్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిధులను పొందుతున్న స్వచ్ఛంద సంస్థలు, శాఖలు, ఆఫీసులు, యంత్రాంగం, పాలన, నిర్ణయాలు, జీవోలు, ప్రజా ధనం ఖర్చు, విదేశీ పర్యటనల ఖర్చు (కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీ వంటి రాజకీయపార్టీలతో సహా) వంటివన్నీ, అంటే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలన్నింటికి సంబంధించిన అంశాలన్నీ ఆర్టీఐ చట్టపరిధిలోకొస్తాయి.

ఆర్టీఐ అధికార యంత్రాంగాల విధులు?
  • సెక్షన్ 4 (1) (ఎ) ప్రకారం ప్రతి అధికార యంత్రాంగం రికార్డుల్లోని సమాచారం అందుబాటులో ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలులోకి వచ్చిన 120 రోజులలోగా కంప్యూటర్ నెట్‌వర్క్‌లోకి ఎక్కించాలి.
  • సెక్షన్ 5 (2) ప్రకారం పతి అధికార యంత్రాంగంఈ చట్టం అమలులోకి వచ్చిన 100 రోజులలోగా ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో లేదా జిల్లా విభాగాల స్థాయిలో ఒక అధికారిని దరఖాస్తులను స్వీకరించడానికి కేంద్ర పౌర సమాచార సహాయ అధికారిగా, రాష్ట్ర పౌర సమాచార సహాయ అధికారిగా నియమించాలి. ఆ అధికారులు స్వీకరించిన దరఖాస్తులను వెంటనే కేంద్ర పౌర సమాచార అధికారికి లేదా రాష్ట్ర పౌర సమాచార కమిషన్‌కు లేదా సెక్షన్ 19 (1) కింద నిర్ధిష్టపరచిన సీనియర్ అధికారికి లేదా కేంద్ర సమాచార కమిషన్‌కు లేదా రాష్ట్ర సమాచార కమిషన్‌కు పంపవలసి ఉంటుంది. దరఖాస్తును కే ంద్ర సమాచార సహాయ అధికారికి లేదా రాష్ట్ర పౌర సమాచార సహాయ అధికారికి అందించిన పక్షంలో దానికి జవాబు ఇచ్చేందుకు సెక్షన్ 7 (1) ప్రకారం నిర్ణయించిన కాల పరిమితికి 5 రోజులు కలపవల్సి ఉంటుంది.
  • సెక్షన్ 5(4) ప్రకారం కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి అవసరమైతే మరే ఇతర అధికారి సహకారాన్నైనా కోరవచ్చు. ఇటువంటి సందర్భంలో సెక్షన్ 5 (5)ప్రకారం ఈ చట్టంలోని నిబంధనల ఉల్లంఘన కిందకు రాకుండా ఉండేందుకు ఆ సహకారం అందించే అధికారులను కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారిగా పరిగణిస్తారు.
  • సెక్షన్6 (3) ప్రకారం సంబంధిత సమాచారం మరో అధికార యంత్రాంగంలో ఉన్నట్లయితే దానిని పొందడానికి దరఖాస్తును అందుకున్న 5 రోజుల లోపు అక్కడికి పంపాలి. ఈ విషయం దరఖాస్తు దారునికి తెల్పాలి.

ఆర్టీఐ దరఖాస్తు ఏవిధంగా, ఎవరికి ఇవ్వాలి?
సెక్షన్ 6 (1) ప్రకారం సమాచారం కోరదలచేవారు ఇంగ్లీష్ లేదా హిందీ లేదా స్థానిక భాషలో రాత ద్వారా లేదా ఎలక్ట్రానిక్ రూపంలో నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత సంబంధిత అధికార యంత్రాంగానికి చెందిన కేంద్ర పౌర సమాచార అధికారికి (ప్రతి కార్యాలయంలో ఉంటారు) లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారికి అందించాలి. అలాగే సెక్షన్6 (2) ప్రకారం సమాచారం కోరుతున్న వారు అందుకు గల కారణం చెప్పవల్సిన అవసరం లేదు. తనకు కబురు చేసేందుకు అవసరమైన వివరాలు మినహా ఎలాంటి వ్యక్తిగత వివరాలు తెల్పవల్సిన అవసరం లేదు.


ఎన్ని రోజులలోపు సమాచారం అందుతుంది?
  • సెక్షన్ 7 (1) ప్రకారందరఖాస్తు అందుకున్న నాటి నుంచి 30 రోజులలోపు ఆ సమాచారం అందించాలి లేదా సెక్షన్8, 9 కార ణాల వల్ల అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్టు తెల్పాలి. ఓ వ్యక్తి ప్రాణానికి లేదా స్వేచ్ఛకు సంబంధించిందైతే అభ్యర్ధన అందిన 48 గంటలలోపు ఆ సమాచారం అందించాలి.
  • సెక్షన్ 7 (2) ప్రకారం కాలపరిమితిలోపు కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి నిర్ణయం ప్రకటించకపోతే ఆ అభ్యర్థనను కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి తిరస్కరించినట్టు భావించాలి.
  • సెక్షన్ 7 (8) ప్రకారం కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి ఒక అభ్యర్ధనను తిరస్కరిస్తే కారణాలు దరఖాస్తుదారుకి తెల్పాలి. తిరస్కరణపై అప్పీలు చేసుకునేందుకు ఉన్న కాలపరిమితి, అప్పీలు విచారించే అధికారి వివరాలు కూడా తెల్పాలి.

రుసుము వివరాలు?
  • సెక్షన్ 7 (3) ప్రకారం సమాచారాన్ని అందించడానికి మరికొంత రుసుము అవసరమైతే ఆ రుసుము చెల్లించాల్సిందిగా దరఖాస్తు దారునికి తెల్పాలి. రుసుము డిపాజిట్ అయ్యే రోజు వరకుపట్టిన కాల వ్యవధిని 30 రోజుల నుంచి మినహాయించాలి.
  • సెక్షన్ 7 (5) ప్రకారం సమాచారం అచ్చురూపంలో లేదా ఎలక్ట్రానిక్ రూపంలో అందించవల్సినపుడు దరఖాస్తుదారు అందకుకు అవసరమైన రుసుము చెల్లించాలి. అయితే దారిద్య్రరేఖ దిగువున ఉన్నవారి నుంచి ప్రభుత్వం ఎలాంటి రుసుము వసులు చేయరాదు.
  • సెక్షన్ 7 (6) ప్రకారం 30 రోజుల కాలపరిమితి పాటించడంలో అధికార యంత్రాంగం విఫలమైతే దరఖాస్తుదారుకి ఆ సమాచారం ఉచితంగా అందించాలి.

కేంద్ర సమాచార కమీషన్ అంటే ఏమిటి?
సెక్షన్ 12 లోని సబ్‌సెక్షన్ల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అధికార గజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా కేంద్ర సమాచార కమీషన్‌ను స్థాపించింది. దీనిలో ప్రధాన సమాచార కమీషనర్, పదిమందికి మించకుండా అవసరమైన సంఖ్యలో కేంద్ర సమాచార కమీషనర్లు ఉంటారు. వీరిని ప్రత్యేక కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. సాధారణ పర్యవేక్షణ, దిశానిర్దేశం, నిర్వహణ అధికారాలు ప్రధాన సమాచార కమీషనర్‌కు సంక్రమిస్తాయి. ఈ అధికారాల వినియోగంలో ప్రధాన సమాచార కమీషనర్‌కు కేంద్ర సమాచార కమీషనర్లు సహాయపడతారు. ఈ చట్టప్రకారం కేంద్ర సమాచార కమీషన్ స్వతంత్ర ప్రతిపత్తితో మరే అధికారానికీ, ఆదేశాలకూ లోబడకుండా వినియోగించే అన్ని అధికారాలనూ, నిర్వహించే అన్ని పనులనూ కేంద్ర సమాచార కమీషనర్ వినియోగించవచ్చు, నిర్వహింవచ్చు. కేంద్ర సమాచార కమీషన్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ముందుగా ఆమోదం పొందిన తర్వాత కేంద్ర సమాచార కమీషన్ ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో కార్యాలయాలు నెలకొల్పవచ్చు.
అర్హతలు:
ప్రధాన సమాచార కమీషనర్, సమాచార కమీషనర్లు ప్రజాజీవనంలో సుప్రసిద్ధులై ఉండాలి. వారికి చట్టం, శాస్త్ర సాంకేతికరంగాలు, సామాజిక సేవ, మేనేజ్‌మెంట్, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనవంటి ఏదేని రంగంలో అనుభవం, విశాలమైన విషయ పరిజ్ఞానం ఉండాలి. రాష్ట్రపతి ఎదుట పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రధాన సమాచార కమీషనర్ లేదా సమాచార కమీషనర్ ఎప్పుడైనా స్వదస్తూరీతో రాష్ట్రపతికి రాజీనామా సమర్పించవచ్చు. సెక్షన్ 14లో సూచించిన రీతిలో రాష్ట్రపతి వారిని పదవి నుంచితొలగించవచ్చు.
పదవీకాలం:
ప్రధాన సమాచార కమీషనర్ పదవీకాలం 5 సంవత్సరాలు. 65 ఏళ్లు మించినవారు ఈ పదవికి అనర్హులు. ఆర్థిక లాభం చేకూరే ఏ ఇతర పదవిలోనూ ఉండకూడదు. ప్రధాన సమాచార కమీషనర్ పునర్నియామకానికి అవకాశం లేదు. సెక్షన్ 13 (2) ప్రకారం ఏ సమాచార కమీషనర్ అయినా సెక్షన్ 12 (3)లో నిర్దేశించిన విధంగా ప్రధాన సమాచార కమీషనర్‌గా నియామకం పొందే అర్హత ఉంటుంది. ఈ విధంగా సమాచార కమీషనర్‌గా నియామకం పొందిన సమాచార కమీషనర్ ఈ రెండు పదవుల్లోనూ కలిపి 5 ఏళ్లకు మించి పదవిలో ఉండకూడదు.
వేతనం: సెక్షన్ 13 (5) ప్రకారం ప్రధాన సమాచార కమీషనర్‌కు ప్రధాన ఎన్నికల కమీషనర్‌తో సమానంగా వేతనాలు, అలవెన్సులు, ఇతర సర్వీసు నియమ నిబంధనలు ఉంటాయి.
నోట్: సెక్షన్ 14 (1) ప్రకారం ప్రధాన సమాచార కమీషనర్ లేదా సమాచార కమీషనర్‌లను అనుచిత ప్రవర్తన లేదా అశక్తత కారణాలతో ఒక్క రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే పదవి నుంచి తొలగించవచ్చు. రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి అనుచిత ప్రవర్తన లేదా అశక్తత కారణంతో ప్రధాన సమాచార కమీషనర్‌ను లేదా సమాచార కమీషనర్‌ను పదవి నుంచి తొలగించవచ్చని నివేదించిన తర్వాత రాష్ట్రపతి వారిని సస్పెండ్ చేయవచ్చు.

రాష్ట్ర సమాచార కమీషన్ అంటే ఏమిటి?
సెక్షన్ 15 (1) ప్రకారం రాష్ట్ర సమచార కమీషన్ అనే సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అధికార గజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా స్థాపిస్తుంది. దీనిలో రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్, పది మందికి మించకుండా అవసరమైన సంఖ్యలో రాష్ట్ర సమాచార కమీషనర్లు ఉంటారు. రాష్ట్ర ప్రధాన కమీషనర్‌ను, రాష్ట్ర సమాచార కమీషనర్లను ప్రత్యేక కమిటీ సిఫార్సు మేరకు గవర్నర్ నియమిస్తాడు. రాష్ట్ర సమాచార కమీషన్ కార్యకలాపాల సాధారణ పర్యవేక్షణ, దిశానిర్దేశం, నిర్వహణ అధికారాలు రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌కు సంక్రమిస్తాయి. ఈ అధికారాల వినియోగంలో రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌కు రాష్ట్ర సమాచార కమీషనర్లు సహాయ పడతారు. రాష్ట్ర సమాచార కమీషన్ ఈ చట్టం కింద స్వతంత్ర ప్రతిపత్తితో మరే అధికారానికి, ఆదేశాలకు లోబడకుండా వినియోగించే అన్ని అధికారాలనూ, నిర్వహించే అన్ని పనులనూ రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్ వినియోగించవచ్చు, నిర్వహించవచ్చు. రాష్ట్ర సమాచార కమీషన్ కేంద్ర కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం అధికార గెజిట్‌లో ప్రకటించిన చోట ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర సమాచార కమీషన్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కార్యాలయాలు నెలకొల్పవచ్చు. ఈ చట్టం కింద అవసరమైన అధికారులనూ, ఉద్యోగులనూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌కూ, రాష్ట్ర సమాచార కమీషనర్లకూ అందిస్తొంది.
అర్హతలు: రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్, రాష్ట్ర సమాచార కమీషనర్లు ప్రజాజీవనంలో సుప్రసిద్ధులై ఉండాలి. వారికి చట్టం, శాస్త్ర సాంకేతికరంగాలు, సామాజిక సేవ, మేనేజ్‌మెంట్, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనవంటి ఏదేని రంగంలో అనుభవం, విశాలమైన విషయ పరిజ్ఞానం ఉండాలి. గవర్నర్ ఎదుట పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రధాన సమాచార కమీషనర్ లేదా సమాచార కమీషనర్ ఎప్పుడైనా స్వదస్తూరీతో గవర్నర్‌కు రాజీనామా సమర్పించవచ్చు. సెక్షన్ 17లో సూచించిన రీతిలో గవర్నర్ వారిని పదవి నుంచి తొలగించవచ్చు.
పదవీ కాలం: రాష్ట్ర సమాచార కమీషనర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్ పునర్నియామకానికి అవకాశం లేదు. అంతేకాకుండా 65 ఏళ్లు నిండిన తర్వాత పదవిలో ఉండటానికి అనర్హులు. సెక్షన్ 16 (2) ప్రకారం పదవీ విరమణ చేసే ఏ రాష్ట్ర సమాచార కమీషనర్‌కు అయినా సెక్షన్ 15 (3)లో నిర్దేశించిన విధంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌గా నియామకం పొందే అర్హత ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌గా నియామకం పొందిన రాష్ట్ర సమాచార కమీషనర్ ఈ రెండు పదవులలోనూ కలిపి 5 ఏళ్లకు మించి పదవిలో ఉండకూడదు.
వేతనం: సెక్షన్ 16 (5) సబ్ సెక్షన్ల ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌కు ప్రధాన ఎన్నికల కమీషనర్‌తో సమానంగా వేతనాలు, అలవెన్స్‌లు, ఇతర సర్వీసు నియమ నిబంధనలు ఉంటాయి.

నోట్: సెక్షన్ 17 (1) ప్రకారం ప్రధాన సమాచార కమీషనర్ లేదా సమాచార కమీషనర్‌లను అనుచిత ప్రవర్తన లేదా అశక్తత కారణాలతో ఒక్క గవర్నర్ ఉత్తర్వు ద్వారా మాత్రమే పదవి నుంచి తొలగించవచ్చు. గవర్నర్ సూచన మేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి అనుచిత ప్రవర్తన లేదా అశక్తత కారణంతో ప్రధాన సమాచార కమీషనర్‌ను లేదా సమాచార కమీషనర్‌ను పదవి నుంచి తొలగించవచ్చని నివేదించిన తర్వాత గవర్నర్ వారిని సస్పెండ్ చేయవచ్చు.

సమాచార కమీషన్ల విధి, విధానాలు ఏవిధంగా ఉంటాయి?
  • సెక్షన్ 18 (1) ప్రకారం అభ్యర్ధించిన సమాచారాన్ని అందించేందుకు నిరాకరించినా, నిర్దేశించిన కాలపరిమితిలోగా సమాచారం అందించకపోయినా, సమాచారం కోసం చెల్లించవల్సిన రుసుము సహేతుకంగాలేదని దరఖాస్తుదారు భావించినా, తనకు అసంపూర్తిగా, తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు సమాచారం అందించారని దరఖాస్తుదారు భావించినా...ఇతర కారణాల రిత్యా ఏ వ్యక్తి ఫిర్యాదునైనా స్వీకరించి విచారణ జరపడం కేంద్ర సమాచార కమీషన్ లేదా రాష్ట్ర సమాచార కమీషన్ విధి.
  • సెక్షన్ 18 (4) ప్రకారం ఒక ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న సందర్భంలో, అధికార యంత్రాంగం నియంత్రణలో ఉండి ఈ చట్టం వర్తించే ఏ రికార్డునైనా సమాచార కమీషన్లు పరిశీలించవచ్చు.
  • సెక్షన్ 19 (5) ప్రకారం ఏ అప్పీలు విచారణలోనైనా అభ్యర్దనను తిరస్కరించడం న్యాయ బద్ధమేనని నిరూపించాల్సిన బాధ్యత ఆ తిరస్కరించిన పౌర సమాచార అధికారిపైనే ఉంటుంది.
  • సెక్షన్ 19 (7) ప్రకారం ఫిర్యాదుదారుకు కలిగిన నష్టాన్ని కానీ ఇతర కష్టాన్ని కానీ పరిహారం ద్వారా పూడ్చాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం, ఈ చట్టంలో నిర్ధేశించిన విధంగా జరిమానాలు విధించడం, దరఖాస్తును తిరస్కరించడం...వంటి ఇతర అంశాలపై కేంద్ర, రాష్ట్ర సమాచార కమీషన్లు వెలువరించిన నిర్ణయాలకు తప్పని సరిగా అందరూ కట్టుబడాలి.
  • సెక్షన్ 20 (1) ప్రకారం ఫిర్యాదుపై లేదా అప్పీలుపై కేంద్ర సమాచార కమీషన్ లేదా రాష్ట్ర సమాచార కమీషన్ నిర్ణయం తీసుకునే సమయంలో, కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి సరైన కారణం లేకుండా దరఖాస్తును స్వీకరించలేదని భావించినా, తగిన కారణం లేకుండా సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్ధేశించిన కాలపరిమితిలోపు సమాచారం అందించలేదని భావించినా, సమాచారం కోసం అభ్యర్ధనను దురుద్దేశంతో తిరస్కరించారని భావించినా, తెలిసి కూడా తప్పుడు, అసంపూర్తి, తప్పుదోవ పట్టించే సమాచారం అందించారని భావించినా, అభ్యర్ధనలో కోరిన సమాచారాన్ని ధ్వంసం చేశారని భావించినా, మరే విధంగానైనా సమాచారం అందకుండా అడ్డుపడ్డారని భావించినా, దరఖాస్తును స్వీకరించేంత వరకూ లేదా సమాచారం అందించేంత వరకూ రోజుకు రూ. 205 చొప్పున జరిమానా విధించవచ్చు. మొత్తం మీద ఆ జరిమానా రూ. 25,000 మించకూడదు. జరిమానా విధించే ముందు కేంద్ర పౌర సమాచార అధికారికి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారికి తమ వాదన వినిపించేందుకు తగిన అవకాశం ఇవ్వాలి. తాను సహేతుకంగా, జాగ్రత్తగానే వ్యవహరించానని నిరూపించుకునే బాధ్యత కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారిపైనే ఉంటుంది. అంతేకాకుడా సెక్షన్ 20 (2) ప్రకారం కేంద్ర, రాష్ట్ర పౌర సమాచార అధికారులపై వారికి వర్తించే సర్వీసు నిబంధనల కింద క్రమశిక్షణా చర్యలు తీసుకోవల్సిందిగా కేంద్ర లేదా రాష్ట్ర సమాచార కమీషన్ సిఫారసు చేస్తుంది.

ఆర్టీఐ- మినహాయింపులు?
  • సెక్షన్ 1 (2) ప్రకారం 2019, ఆగస్టు 5 ముందు రోజు వరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మినహా దేశమంతటా ఈ చట్టం వర్తిస్తుంది. కానీ 2019, ఆగస్ట్ 5న కాశ్మీర్ స్వతంత్రప్రతిపత్తి రద్దు కావడంతో ఇప్పుడు ఈ చట్టం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు అవుతుంది.
  • సెక్షన్ 8 (1) ప్రకారం ఆర్టీఐ చట్టంతో పనిలేకుండా కొన్ని రకాల సమాచారాలను పౌరులకు అందించాల్సిన బాధ్యత లేదు. దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు, ఏదైనా నేరాన్ని ప్రేరేపించే సమాచారాన్ని, ప్రకటించకూడదని ఏదైనా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని ధిక్కరించే విధంగా ఉండే సమాచారాన్ని, వాణిజ్య, వ్యాపారం వంటి రంగాల గోప్యతకు సంబంధించిన సమాచారాన్ని, సమాచార వెల్లడి వల్ల వ్యక్తులకు ప్రాణనష్టం కలిగించే సమాచారం, నేరస్థులను పట్టుకునేంచుకూ, ప్రాసిక్యూట్ చేసేందుకూ అవరోధాలు కల్పించే సమాచారం, క్యాబినెట్ పత్రాలు, మంత్రుల నిర్ణయాలు, అందుకుగల కారణాలు వంటివి నిర్దేశించిన మినహాయింపుల కిందకు వచ్చే సమాచారాన్ని మాత్రం వెల్లడి చేయరాదు. వ్యక్తుల వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే అవాంఛనీయ అవకాశం కల్పించే సమాచారం... విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ తరహా సమాచారాలను వెల్లడి చేయవల్సిన అవసరం లేదు.
  • సెక్షన్ 8 (2) ప్రకారం అధికార రహస్యాల చట్టం- 1953 లేదా సెక్షన్ 1 ప్రకారం ఇవ్వదగిన మినహాయింపులతో ఎలాంటి నిమిత్తం లేకుండా, రక్షిత ప్రయోజనాలకు కలిగే హాని కన్నా ప్రజాప్రయోజనాలకు కలిగే మేలు ఎక్కువని అధికార యంత్రాంగం భావించిన పక్షంలో అలాంటి సమాచారాన్ని వెల్లడి చేయవచ్చు.
  • సెక్షన్ 8 (3) ప్రకారం అభ్యర్థన అందిన రోజుకు 20 సంవత్సరాల ముందు సంభవించిన ఎలాంటి సంఘటన లేదా విషయానికి సంబంధించిన సమాచారాన్ని అయినా కోరిన వారికి అందించవచ్చు. గడువు ఏ రోజునుంచి లెక్కించాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పాలి.
  • సెక్షన్ 9 ప్రకారం సమాచార వెల్లడి వల్ల దేశానికి చెందినది కాకుండా ఒక వ్యక్తికి చెందిన కాపీరైట్ ఉల్లంఘన జరిగే పక్షంలో అలాంటి సమాచారం కోసం వచ్చిన అభ్యర్థనను కేంద్ర, రాష్ట్ర పౌర సమాచార అధికారులు సెక్షన్ 8లోని నిబంధనలకు భంగం కలగకుండా తిరస్కరింవచ్చు.
  • సెక్షన్ 10 ప్రకారం మినహాయింపుపొందిన సమాచారంకాక రికార్డుల్లో ఉన్న ఇతర సమాచారాన్ని అందించవచ్చు.
  • సెక్షన్ 11 (1) ప్రకారం తృతీయ పక్షానికి చెందిన సమాచారం లేదా అందించిన సమాచారం గోప్యమైనదని ఆ తృతీయ పక్షం భావించినప్పుడు ఆ సమాచారం కోసం అభ్యర్థన అందిన 5 రోజులలోగా కేంద్ర పౌరసమాచార అధికారి లేదా రాష్ట్ర సమాచార అధికారి లిఖితపూర్వకమైన నోటీసు తృతీయ పక్షానికి ఇవ్వాలి. చట్టం పరిరక్షిస్తున్న వాణిజ్య వ్యాపార రహస్యాలను మినహాయించి ఏదైనా సమాచారం వెల్లడి తృతీయ పక్షానికి కలిగించే హానికన్నా ప్రజా ప్రయోజనాలకు చేకూరే మేలు అధికంగా ఉంటే ఆ సమాచారాన్ని వెల్లడి చేయవచ్చు (సమాచారాన్ని వెల్లడి చెయ్యాలన్న నిర్ణయం తీసుకునే ముందు తృతీయ పక్షం వాదనను పరిగణనలోకి తీసుకోవాలి).
  • సెక్షన్ 24 (1) ప్రకారం రెండవ షెడ్యూలులో తెల్పిన ఇంటలిజెన్స్, భద్రతా సంస్థలకు, ఆ సంస్థలు ప్రభుత్వానికి సమర్పించే ఎలాంటి సమాచారానికీ ఈ చట్టం వర్తించదు. అవినీతి ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం అయిన పక్షంలో ఈ సబ్ సెక్షన్ నుంచి మినహాయింపు ఉంటుంది. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం కోరినప్పుడు కేంద్ర సమాచార కమీషన్ ఆమోదం తర్వాత మాత్రమే అలాంటి సమాచారం అందించాల్సి ఉంటుంది. కేంద్ర సమాచార కమీషన్ ఆమోదం తర్వాత అభ్యర్ధన అందిన దగ్గర నుంచి 45 రోజులలోగా, సెక్షన్ 7లోని నిబంధనలతో నిమిత్తం లేకుండా, సమాచారం అందించాల్సి ఉంటుంది.
  • సెక్షన్ 24 (2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం తాను నెలకొల్పిన మరో ఇంటలిజెన్స్ లేదా భద్రతా సంస్థను, అధికార గెజిట్‌లో ప్రచురించడం ద్వారా, రెండవ షెడ్యూలులో చేర్చవచ్చు. అలాగే ఇప్పటికే అందులో ఉన్న ఏదైనా సంస్థను తొలగించవచ్చు. అలాంటి నోటిఫికేషన్ ప్రచురించగానే ఒక సంస్థ షెడ్యూలులో చేరినట్టుగానో లేదా తొలగిపోయినట్టు గానోలెక్క. సెక్షన్ 24 (3) ప్రకారం సబ్ సెక్షన్ (2) కింద జారీ చేసిన ప్రతి నోటిఫికేషన్‌ను పార్లమెంటు ఉభయ సభల ముందుంచాలి.
  • సెక్షన్ 24 (4) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన ఇంటలిజెన్స్, భద్రతా సంస్థలకు ఈ చట్టం వర్తించదు. ఆ ఇంటలిజెన్స్, భద్రతా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అధికార గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా తెల్పవచ్చు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమాచారం అయినప్పుడు ఈ సబ్ సెక్షన్ నుంచి మినహాయింపు ఉంటుంది. మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం అయితే, రాష్ట్ర సమాచార కమీషన్ ఆమోదం పొందిన తర్వాత, సెక్షన్ 7లోని నిబంధనలతో నిమిత్తం లేకుండా, అభ్యర్ధన అందిన నాటి నుంచి 45 రోజులలోగా ఆ సమాచారం అందించాల్సి ఉంటుంది. సెక్షన్ 24 (5) ప్రకారం సబ్ సెక్షన్ (4) కింద జారీ చేసిన ప్రతి నోటిఫికేషన్‌ను రాష్ట్ర శాసనసభ ముందుంచాలి.

ఇతర అంశాలు:
  • సెక్షన్ 21 ప్రకారం ఈ చట్టం కింద మంచి చేస్తున్నానన్న నమ్మకంతో ఎవరేం చేసినా, చేసేందుకు ఉద్దేశించినా అందుకు వారిపై ఎలాంటి దావాలు వేయడం, ప్రాసిక్యూట్ చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం కుదరదు.
  • సెక్షన్ 22 ప్రకారం అధికార రహస్యాల చట్టం- 1923, అమలులో ఉన్న మరే ఇతర చట్టంలో ఈ చట్టంతో పొసగని అంశాలు ఎలాంటివి ఉన్నప్పటికీ ఈ చట్టంలోని నిబంధనలు అమలులో ఉంటాయి.
  • సెక్షన్ 23 ప్రకారం ఈ చట్టం కింద ఎలాంటి ఆదేశం జారీ అయినా దానిపై దావాను గానీ, దరఖాస్తును గానీ, ఇతర విచారణలను గానీ ఏ న్యాయస్థానం చేపట్టరాదు. ఈ చట్టం కింద అప్పీలు చేయడం మినహాయించి ఆ ఆదేశాలను ప్రశ్నించడం కుదరదు.
ఆర్టీఐ పరిధి చాలా విస్తృతమైనది. ప్రతి సామాన్యుడు తనకు అవసరమైన, తెలుసుకోదలచిన ప్రతి అంశాన్ని ఈ చట్టం ద్వారా పొందవచ్చు.ప్రభుత్వం లేదా ప్రజా ప్రతినిధుల నుంచి ఇతర ప్రైవైటు సంస్థల వరకు వారి విధులు, వారు పెట్టే ఖర్చులు..వంటి ఆయా సంస్థల నుంచి పొందతలచుకున్న ఏ సమాచారాన్నైనా అత్యంత సాధారణమైన ఒక సామాన్యుడు పొందగలిగే ఏకైక చట్టం ఈ సమాచార హక్కు చట్టం. కాబట్టి ముందు చెప్పినట్టు ఇది నిజంగా సామాన్యుడి పాలిట తిరుగులేని పాశుపతాశ్రమని చెప్పవచ్చు.
Published date : 23 Sep 2019 03:23PM

Photo Stories