Skip to main content

సివిల్ సర్వీసెస్ పరీక్షపై నిగ్వేకర్ కమిటీ నివేదిక - సమీక్ష

సమాచార హక్కు చట్టం ఫలితంగా సివిల్ సర్వీసెస్ పరీక్ష పై వేసిన నిగ్వేకర్ కమిటీ నివేదిక ఎట్టకేలకు బహిర్గతమయ్యింది. ఈ కమిటీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష సంస్కరణలపై విప్లవాత్మక సిఫార్సులు చేసింది. ఈ నేపథ్యంలో కమిటీ సిఫార్సుల సాధ్యాసాధ్యాలపై పూర్తి విశ్లేషణ..

నిగ్వేకర్ కమిటీ సిఫార్సుల్లో ప్రధానాంశాలు:
 1. గ్రూప్ – బి పోస్టులకు ఎంపికవుతున్న అనేక మంది ఐఐటీ / ఐఐఎం పట్టభద్రులు మధ్యలోనే సర్వీసుల్ని విడిచిపెడుతున్నారు. తద్వారా సంబంధిత సర్వీసు వృథా అవుతోంది. ఇది ఇతర అభ్యర్థుల అవకాశానికి గండికొడుతోంది. కాబట్టి సివిల్ సర్వీస్ పరీక్ష నుంచి గ్రూప్ బి ఉద్యోగాలను తొలగించాలి. (అంటే గ్రూప్ బి సర్వీసులకు ప్రత్యేకంగా వేరే ఎంపిక సంస్థ ద్వారా పరీక్ష నిర్వహించాలని పరోక్షంగా సూచించింది.)
 2. గ్రూప్ ఏ సర్వీసుల్లో రెండు ప్రత్యేక సివిల్ సర్వీసు పరీక్షలను నిర్వహించాలి (ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లకు ఒక పరీక్ష ఇతర గ్రూప్ ఏ సర్వీసులకు మరో పరీక్ష).
 3. గత టాపర్లకు ఒక సారికి మించి పరీక్ష రాసేందుకు అవకాశమివ్వరాదు.
 4. గ్యాడ్యుయేషన్ లో 50 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన వారిని పరీక్ష రాసేందుకు అనుమతించకూడదు.
 5. ప్రిలిమ్స్ అర్హత రెండేళ్ల పాటు చెల్లుబాటవ్వాలి. (అంటే ఒకసారి ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థి రెండో దఫా ప్రిలిమ్స్ రాయకుండానే నేరుగా మెయిన్స్ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాలి.)
 6. సిలబస్ తో పాటే పుస్తకాల జాబితాను తెలియజేయాలి. (శిక్షణ సంస్థల సంప్రదాయానికి అడ్డుకట్ట వేయటానికి)
 7. మూడు రోజులపాటు ఇంటర్వ్యూ నిర్వహించాలి. ఎస్ఎస్బీ మాదిరిగా సమూహ చర్చలు, వ్యక్తిత్వ పూర్వాపరాలు తదితరాలు ఇంటర్వ్యూలో భాగంగా ఉండాలి.
 8. ఇంటర్వ్యూలో నిష్పక్షపాత వైఖరి సాధించడం కోసం ప్రతి ఒక్క అభ్యర్థిని అన్ని ఇంటర్వ్యూ బోర్డులు ఇంటర్వ్యూ చేసి సగటు స్కోరును పరిగణనలోకి తీసుకోవాలి.
 9. ప్రముఖ మేనేజ్ మెంట్ కళాశాలల్లో ప్రవేశ పరీక్షల ఇంటర్వ్యూల్లో మాదిరిగా యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ముందు స్వీయ వర్ణన వ్యాసాన్ని అభ్యర్థులు సమర్పించాలి.
 10. ఇంటర్వ్యూలో వైఫల్యం ఎదుర్కొన్న అభ్యర్థులకు నాన్ గెజిటెడ్ పోస్టులు లేదా ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
యూపీఎస్సీ స్వీయ పరిశోధన విభాగం నిగ్వేకర్ కమిటీకి అందించిన సమాచారం:
అందరినీ ఆశ్చర్యపరుస్తూ యూపీఎస్సీ ప్రస్తుతం కొనసాగుతున్న పరీక్ష విధానం లోపభూయిష్ఠంగా ఉందని అంగీకరించింది. ఏయే సంస్కరణలు, అంశాలపై సిఫార్సులు అందించాలో వివరిస్తూ ఈ దిగువ పేర్కొన్న పరిశీలనలను యూపీఎస్సీ స్వీయ పరిశోధన నిగ్వేకర్ కమిటీకి అందించింది.
 1. సీశాట్ పేపర్ - II పట్టణప్రాంత ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులకు అనుకూలంగా ఉంది. ఇది గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నష్టం కలిగిస్తోంది.
 2. యాప్టిట్యూడ్ పేపర్ లో మంచి పట్టుండటంతో జనరల్ స్టడీస్ లో పేలవ ప్రదర్శన చూపిస్తున్న అభ్యర్థులు సైతం ప్రిలిమ్స్ లో అర్హత సాధిస్తున్నారు. (జనరల్ స్టడీస్ పేపర్ కఠినంగా ఉంటుంది. జనరల్ స్టడీస్ లో మంచి పట్టున్న అభ్యర్థి సైతం ఒక పరిమితికి మించి స్కోర్ చేయలేరు). కాబట్టి సైన్స్, ఇంజినీరింగ్ లాంటి కోర్సులు చదవని అభ్యర్థులు సీశాట్ పేపర్ 2 వల్ల నష్టపోతున్నారు.
నిగ్వేకర్ కమిటీ సారాంశం, ప్రతిపాదనలు:
డిసెంబర్ 2011: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష సంస్కరణలపై ప్రొఫెసర్ నిగ్వేకర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.

2012 ఆగస్టు: నివేదిక సమర్పణ

ప్రస్తుత విధానం

నిగ్వేకర్ కమిటీ ప్రతిపాదన

గ్యాడ్యుయేట్లందరూ అర్హులే

గ్రాడ్యుయేషన్ లో 50 శాతం ఆపైన మార్కులు సాధించినవారు మాత్రమే.

వయో పరిమితి: జనరల్ కేటగిరీకి 21 -32, రిజర్వేషన్ కేటగిరీలకు సడలింపు [2014 Department of Personnel and Training) ఉత్తర్వుల ప్రకారం)

 

జనరల్ 25 ఏళ్లు
ఓబీసీ: 28 ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ: 30 ఏళ్లు

ప్రయత్నాలు: జనరల్ కేటగిరీకి ఆరుసార్లు అవకాశం, రిజర్వేషన్ కేటగిరీలకు సడలింపు(2014 నాటి DOPT ఉత్తర్వుల ప్రకారం)

ఏ కేటగిరీకి చెందిన అభ్యర్థైనా ఐదుసార్లు రాసేందుకు అవకాశం

యూపీఎస్సీ మెయిన్స్ (Detailed Application Form) దరఖాస్తులో ప్రతి సర్వీసు పేరు, కేడర్ ప్రాధాన్యతలను మాత్రమే కలిగి ఉంది.

 • ప్రతీ సర్వీసుకు సంబంధించి వివరణాత్మక సమాచారం ఉండాలి.
 • సర్వీసు/కేడర్ కేటాయింపు నిబంధనలను సవివరంగా తెలియజేయాలి.

ప్రతిపాదిత మెయిన్స్(ప్రధాన పరీక్ష) విధానం:

పేపర్

విషయం

మార్కులు

వివరణ

I

భారతీయ భాష (భారత రాజ్యాంగం గుర్తించిన, యూపీఎస్సీ ఆమోదించిన ఏదైనా భారతీయ భాష).

250

భారతీయ భాష పేపర్ లో మిళితమైన అంశాలు

1. వ్యాసం.

2. కంప్రహెన్షన్.

3. ప్రెస్సీ.

II

ఇంగ్లీష్ భాష.

250

భాష పేపర్ లో మిళితమైన అంశాలు

1. ఎస్సే.

2. కాంప్రహెన్షన్.

3.ప్రెస్సీ.

III

భారతదేశ చరిత్ర, భారతదేశ భూగోళశాస్త్రం, భారతీయ సమాజం

250

IV

భారత రాజ్యాంగం, అంతర్జాతీయ సంబంధాలు

250

V

భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, టెక్నాలజీ

250

VI

భారత సామాజిక న్యాయం, పాలనలో రుజువర్తన

250

VII

ఐచ్ఛికాంశం ( పేపర్ 1)

250

VIII

ఐచ్ఛికాంశం (పేపర్ 2)

250

వ్యక్తిత్వ పరీక్ష

300

మొత్తం

2300


తుది జాబితాలో భాష ప్రశ్నాపత్రాల మార్కులను లెక్కించడం:
మొత్తం మార్కులతో భాష సంబంధిత ప్రశ్నాపత్రాల్లో అభ్యర్థి సాధించిన మార్కులను కలిపి తుది ప్రతిభను నిర్ణయించాలి. ఎంపికలో అర్హత సాధించడానికి ప్రతీ ఒక్క భాష సంబంధిత పేపర్ లోనూ యూపీఎస్సీ నిర్దేశించిన కటాఫ్ మార్కులను అభ్యర్థి తప్పనిసరిగా సాధించి ఉండాలి.

ఈశాన్య ప్రాంత అభ్యర్థులకు రెట్టింపు భాష సంబంధిత మార్కులు:
ప్రస్తుత ఈశాన్య ప్రాంత అభ్యర్థులకు భారతీయ భాష పేపర్ నుంచి మినహాయించారు. ఈశాన్య ప్రాంత అభ్యర్థి ఆంగ్ల భాష పేపర్ లో సాధించిన మార్కులను రెట్టింపు చేసి మొత్తం మార్కులకు కలిపి గణించాలి.
యూపీఎస్సీ 2013 నోటిఫికేషన్స్ సవరణలో భాష సంబంధిత ప్రశ్నాపత్రాల మార్కులను పరిగణనలోకి తీసుకోమని వివరణ ఇచ్చింది (పార్లమెంట్ లో దుమారం చెలరేగిన నేపథ్యంలో). దీంతో యూపీఎస్సీ నిగ్వేకర్ సిఫార్సును తిరస్కరించిందని స్పష్టమైంది.

గ్రాడ్యుయేషన్ సంబంధిత ఐచ్ఛికాంశం మాత్రమే:
అభ్యర్థి గ్యాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ లో చదివిన ప్రధాన సబ్జెక్టుని (దిగువ పేర్కొన్న వివిధ గ్రూపుల్లో ఏదైనా గ్రూపులోని సబ్జెక్టుకి సంబంధించిన సన్నిహిత సబ్జెక్టుని) ఐచ్ఛికాంశంగా ఎంపిక చేసుకోవచ్చు. సబ్జెక్టు ఎంపిక విషయంలో ఎటువంటి సంక్లిష్టత తలెత్తినా స్పష్టత నివ్వటంలో తుది నిర్ణయం యూపీఎస్సీదే.

ఐచ్ఛికాంశాలకు సంబంధించిన ఆరు గ్రూపులు:

గ్రూప్ 1.

అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్

గ్రూప్ 2

బోటనీ, జూవాలజీ, మెడికల్ సైన్స్

గ్రూప్ 3

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియాలజీ

గ్రూప్ 4

ఆంత్రోపాలజీ, సోసియాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ, సైకాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, జాగ్రఫీ

గ్రూప్ 5

అరబిక్, అస్సామీ, బోడో, బెంగాలీ, చైనీస్, డొంగ్రీ, ఇంగ్రీష్, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలీ, మళయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పాళీ, పర్షియన్, రష్యన్, పంజాబీ, సంస్కృతం, సంతాలీ, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ మొదలైన భారతీయ భాషలు.

గ్రూప్ 6

కామర్స్ , అకౌంటెన్సీ, మేనేజ్ మెంట్, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా

అయితే 2013లో యూపీఎస్సీ సవరించిన ప్రకటన ప్రకారం పై నిబంధనలేవీ పరిగణనలోకి తీసుకోలేదు. ఐచ్ఛికాంశాల ఎంపికలో అభ్యర్థికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది యూపీఎస్సీ. కాబట్టి నిగ్వేకర్ కమిటీ సిఫార్సును యూపీఎస్సీ పరిగణనలోకి తీసుకోలేదని గ్రహించాలి.

ఇంటర్వ్యూకు ముందు స్వీయ వర్ణన:
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు స్వీయ వివరణను ముందస్తుగా సమర్పించేలా చూడాలి. ఈ స్వీయ వివరణ స్వీయచరిత్ర మాదిరిగా ఉండాలి. ఈ వివరణలో అభ్యర్థి వ్యక్తిగత నేపథ్యం, సివిల్ సర్వీసుల్లో చేరేందుకు ఎందుకు అభిలషిస్తున్నారో వివరించాల్సి ఉంటుంది.
అభ్యర్థి విద్యాసంబంధిత, విద్యేతర విషయాలు, విజయవంతమైన సివిల్ సర్వెంట్ కావటానికి తోడ్పడే గత అనుభవాలు తదితరాలను సవివరంగా స్వీయ వర్ణనలో వివరించాల్సి ఉంటుంది. అసాధారణ, ప్రత్యేక సందర్భాల్లో అభ్యర్థి సాధించిన విజయాలను, వైఫల్యాలను ఈ వివరణలో తెలియజేయవచ్చు.
స్వీయ వర్ణనను ఇంటర్వ్యూ బోర్డు పరిగణనలోకి తీసుకోవాలి. అభ్యర్థి స్వీయ వర్ణన నుంచి ప్రశ్నలను సంధించవచ్చు. అభ్యర్థి వ్యక్తిత్వంలోని విభిన్న పార్శ్వాలను స్పృశించి మార్కులను నిర్ణయించేలా ఇంటర్వ్యూ ప్రక్రియను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.

శిక్షణా సమయంలో సర్వీసు ప్రాధాన్యతల మార్పునకు అవకాశం:
అభ్యర్థికి ఫౌండేషన్ కోర్సులో చేరిన తొలి నెలలోపే సర్వీసు ఆప్షన్లపై సమీక్షించుకోవటానికి అవకాశం కల్పించాలి. ఫౌండేషన్ కోర్సు ముగిసేలోపే ప్రభుత్వం సర్వీసు, కేడర్ కేటాయింపులు జరపాలి. వివిధ సర్వీసులకు సంబంధించి కౌన్సిలింగ్ ను ఫౌండేషన్ కోర్సు తొలి రెండు వారాల్లోనే చేపట్టాలి.

టాపర్ కు మళ్లీ పరీక్ష రాయటానికి ఒకసారి మాత్రమే అవకాశం:
సర్వీసుకు ఎంపికై సర్వీసుల్లో చేరిన అభ్యర్థికి పరీక్ష రాసేందుకు ఇంకా అర్హత ఉన్నప్పటికీ కేవలం ఒకసారి మాత్రమే మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలి.

శిక్షణానంతర అంచనా:
 • శిక్షణ సంస్థలు శిక్షణ (ఫౌండేషన్ కోర్సుతో కలిపి) పూర్తయిన అనంతరం అభ్యర్థిని అంచనా వేస్తాయి. శిక్షణ సమయంలోనూ, శిక్షణ పూర్తయిన తర్వాత శిక్షణ సంస్థలు నిర్వహించే రాత పరీక్ష ద్వారా అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేయాలి. మొత్తం శిక్షణలో అభ్యర్థి సాధించిన మార్కులను సివిల్ సర్వీసెస్ పరీక్షలో సాధించిన మార్కులతో కలిపి అభ్యర్థి అంతర్ సర్వీసు సీనియారిటీ నిర్ధారణకు ఉపయోగించుకోవచ్చు.
 • ప్రతి ఏడాది రికార్డు, విశ్లేషణల కోసం ప్రతీ అభ్యర్థి వార్షిక సామర్థ్య వివరాలకు సంబంధించిన ఒక కాపీని యూపీఎస్సీకి పంపించాలి.
ప్రతీ ఐదేళ్లకు పరీక్ష విధానంలో మార్పు:
దేశీయంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎంపిక విధానంపై ప్రతీ ఐదేళ్లకోసారి కాలానుగుణగా సమీక్ష నిర్వహించాలని కమిటీ అభిప్రాయపడింది.

ప్రత్యేక పరిశోధన, అభివృద్ధి కేంద్రం సృష్టి:
ప్రశ్నల నిధి, ఆన్ లైన్ పరీక్ష, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ పరిశీలన కోసం తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా పరిశోధన కేంద్రం ఏర్పాటుపై యూపీఎస్సీ తప్పనిసరిగా దృష్టి సారించాలని కమిటీ సూచించింది.

ఆందోళన అనవసరం:
నిగ్వేకర్ కమిటీ నివేదికపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్లు, వయో పరిమితి, ఇంజినీరింగ్, ఇంజినీరింగేతరం వంటి చర్చలకు, విమర్శలకు, వక్ర భాష్యాలకు సిద్ధపడాల్సిన అగత్యం లేదు.

కారణాలు:
 1. కొన్ని సంస్కరణలు 2013 నుంచే అమల్లోకి వచ్చాయి (ఉదాహరణకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుతో ఉమ్మడి పరీక్ష, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, ఎథిక్స్ పేపర్ మొదలైనవి)
 2. కొన్ని ప్రతిపాదనలను వ్యతిరేకించారు. ( ఉదాహరణకు సాహిత్య ఐచ్ఛికాంశాల ఎంపికపై పరిమితులను తొలగించటం).
 3. వయోపరిమితిని సడలిస్తూ వ్యక్తిగత, శిక్షణ శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
యూపీఎస్సీ నిగ్వేకర్ నివేదికను సంపూర్ణంగా ఆమలు చేయలేదు. గతంలో నిగ్వేకర్ కంటే ముందు అనేక కమిటీలు ఇచ్చిన సిఫార్సులూ అమలుకు నోచుకోలేదు. అదే విధంగా నిగ్వేకర్ కమిటీ విప్లవాత్మక సిఫార్సులు సైతం మూలనపడటం ఖాయమని గత అనుభవాలు చెబుతున్న పాఠం.

నిగ్వేకర్ నివేదిక ప్రయోజనాలు:
 1. సివిల్ సర్వీస్ సంస్కరణలపై వ్యాసం, ఇంటర్వ్యూ, ఎథిక్స్ ప్రశ్నాపత్రాల్లో ప్రశ్నలకు నిగ్వేకర్ నివేదిక ఉపయోగపడుతుంది.
 2. ప్రభుత్వ పాలనా శాస్త్రంలోని సిబ్బంది పాలన, భారతదేశ పాలన సంబంధిత సిలబస్ లోని అంశాలకు నిగ్వేకర్ నివేదిక దోహదపడుతుంది.
నిగ్వేకర్ నివేదిక సమీక్ష:
నిగ్వేకర్ నివేదిక సిఫార్సుల్లో అనేకం విప్లవాత్మకంగా ఉన్నాయి. అయితే కొన్ని సిఫార్సుల అమలు ఆచరణ సాధ్యంగా కనిపించట్లేదు. ఉదాహరణకు వయోపరిమితి సిఫార్సునే పరిగణనలోకి తీసుకుందాం. జనరల్ కేటగిరీ అభ్యర్థి 25 ఏళ్ల లోపే 5 సార్లు పరీక్ష రాయాలని నిగ్వేకర్ కమిటీ సిఫార్సు చేసింది. మెడిసిన్, లా, ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్ వంటి వృత్తి విద్యాకోర్సులు అభ్యసించినవారు కనీసం 23 ఏళ్లకు కానీ తమ కోర్సులు పూర్తి చేయలేరు. అంటే ఈ వయో పరిమితి నిబంధన ప్రకారం వారికి 2 అవకాశాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇది వృత్తి విద్యా సంబంధిత అభ్యర్థులను పరీక్షకు దూరం చేస్తుంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు సాధారణ డిగ్రీలు పూర్తి చేయటానికి 22 ఏళ్ల నుంచి 24 ఏళ్లు సమయం పడుతుంది. అంటే గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నిగ్వేకర్ సిఫార్సుల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుంది.
అదేవిధంగా ఇంటర్వ్యూను మూడు రోజుల పాటు నిర్వహించాలని, ప్రతి అభ్యర్థిని అన్ని బోర్డులు ఇంటర్వ్యూ చేయాలని సిఫార్సు ఆహ్వానించదగినదే. దీనివల్ల ఇంటర్వ్యూ లోపభూయిష్ఠంగా జరుగుతుందనే ఆరోపణలకు తిలోదకాలిచ్చే అవకాశం ఉంది. అయితే గత రెండు మూడేళ్లుగా ఖాళీలు దాదాపు వెయ్యి వరకు ఉండటంతో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు భారీగా ఎంపికవుతున్నారు. అంతమందిని ఇంటర్వ్యూ చేసే సమయం లేక యూపీఎస్సీ హడావిడిగా కేవలం పది నిమిషాల్లోనే ఇంటర్వ్యూను ముగించేసిన ఉదంతాలు లెక్కకు మించి ఉన్నాయి. అంటే యూపీఎస్సీకి తగిన ఇంటర్వ్యూ చేసే యంత్రాంగం లేనట్లు విదితమవుతుంది. అదే విధంగా యూపీఎస్సీకి సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహణతో పాటు అనేక ఇతర పరీక్షల నిర్వహణ బాధ్యతలు కూడా ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో మూడు రోజుల పాటు ఒక్కో అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయటం ఆచరణ సాధ్యం కాదు.
అదే విధంగా ఇంటర్వ్యూ ముందు స్వీయ వర్ణన వ్యాసం అందించమనే సిఫార్సు కూడా యూపీఎస్సీ అమలు చేయటం కష్టమే. స్వీయ వర్ణన వ్యాసాన్ని ప్రాంతీయ భాషల్లో రాసే అభ్యర్థుల (ఇప్పటికే ప్రాంతీయ భాషల అభ్యర్థులు ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు అనేక అవరోధాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో)ను పరీక్షించే నైపుణ్యం, ఏర్పాట్లు యూపీఎస్సీ దగ్గర లేవు. ప్రాంతీయ భాషల వ్యాసాలను ఆంగ్లంలోకి అనువదించి బోర్డు సభ్యులకు అందించాలి. అదే విధంగా ప్రతీ ప్రాంతీయ భాష అభ్యర్థి కోసం ప్రతీ బోర్డులోనూ దుబాసీని నియమించాలి. ఇది మొత్తం ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తుంది. యూపీఎస్సీ ఇటువంటి సంక్లిష్ట ప్రక్రియను అమలు చేయదని గుర్తించాలి. (యూపీఎస్సీ ఏ సిఫార్సునైనా అమలు చేసే ముందు దేశానికి ఏది ప్రయోజనమో అని ఆలోచించదు. యూపీఎస్సీకి అందుబాటులో ఉన్న సమయం, వనరులు, వెసులుబాటు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటుంది.) . గ్రూప్ ఏ సర్వీసులకు రెండు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలనడం ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్న యూపీఎస్సీకి శరాఘాతమే.
నిగర్వేకర్ కమిటీ అభ్యర్థులకు ప్రయోజనం కలిగించే అనేక సిఫార్సులు చేసింది. ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలమైన అభ్యర్థులకు నాన్ గెజిటెడ్ లేదా ఇతర ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలన్న సిఫార్సు వల్ల సివిల్సే లక్ష్యంగా ఏళ్ల తరబడి సన్నద్ధమయ్యే వారికి లాభం చేకూరుతుంది. అదే విధంగా ఒకసారి ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థికి రెండు సార్లు ప్రిలిమ్స్ నుంచి మినహాయింపు లభించాలన్న సిఫార్సు ఆహ్వానించదగినదే.

సివిల్స్ వయోపరిమితి, ప్రయత్నాల సంఖ్య పెంపు:
సివిల్ సర్వీసెస్ రాయటానికి వయోపరిమితిలో మినహాయింపుపై స్పష్టతనిస్తూ కేంద్ర ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వెబ్ సైట్ లో ఈ నోట్ ను పొందుపరిచారు. ఈ నోట్ ప్రకారం ప్రస్తుతం జనరల్ కేటగిరీ అభ్యర్థులు 32 ఏళ్ల వయస్సు వరకు ఆరు సార్లు సివిల్స్ రాయటానికి వీలుంది.

జనరల్ కేటగిరీ:

ముందు

మార్చిన తర్వాత

ప్రయత్నాల పరిమితి

4

4 + 2 = 6 సంవత్సరాలు

వయోపరిమితి

30 ఏళ్లు

30 + 2 = 32 ఏళ్లు


ఓబీసీ కేటగిరీ:

ముందు

మార్చిన తర్వాత

ప్రయత్నాల పరిమితి

7

7 + 2 = 9

వయోపరిమితి

33

33 + 2 = 35 ఏళ్లు


ఎస్సీ/ఎస్టీ కేటగిరీ

ముందు

మార్చిన తర్వాత

ప్రయత్నాల పరిమితి

అపరిమితం

అపరిమితం

వయోపరిమితి

35

35 + 2 = 37 ఏళ్లు


పీహెచ్ కేటగిరీ

పీహెచ్ అభ్యర్థి

 

ముందు

మార్పు అనంతరం

జనరల్/ఓబీసీ కేటగిరీల నుంచి పీహెచ్

ప్రయత్నాల పరిమితి

7

7 + 2 = 9

వయోపరిమితి

40

జనరల్ పీహెచ్: 30 + 12 = 42 ఏళ్లు
ఓబీసీ పీహెచ్: 33 + 12 = 45 ఏళ్లు

ఎస్సీ/ఎస్టీల నుంచి పీహెచ్

ప్రయత్నాల పరిమితి

అపరిమితం

అపరిమితం

వయోపరిమితి

40

ఎస్సీ/ఎస్టీ పీహెచ్: 35 + 12 = 47 ఏళ్లు

అయితే వయస్సు, ప్రయత్నాల సంఖ్యలో మినహాయింపు కేవలం రెండేళ్ల వరకే వర్తిస్తుందా లేదా శాశ్వతంగా అమలవుతుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మేలో విడుదల కానున్న నోటిఫికేషన్ లో దీనిపై స్పష్టత వస్తుంది.
Published date : 07 Apr 2014 03:59PM

Photo Stories