Skip to main content

రోహింగ్యా సంక్షోభం

- డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్.
చారిత్రకంగా అరకనీస్ ఇండియన్స్‌గా భావిస్తున్న రోహింగ్యాలు.. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు. ప్రస్తుత రఖైన్ రాష్ట్రాన్ని గతంలో అరకాన్ అని పిలిచేవారు. 2016-17 సంక్షోభానికి ముందు మయన్మార్‌లో దాదాపు 13 లక్షల రోహింగ్యాలు ఉన్నట్లు అంచనా. వీరిలో అత్యధికులు ముస్లింలు కాగా, హిందువులు మైనార్టీలు. రోహింగ్యాలను.. ప్రపంచంలో అత్యంత పీడిత మెనార్టీలుగా 2013లో ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మయన్మార్ జాతీయ చట్టం-1982.. రోహింగ్యాలకు పౌరసత్వాన్ని తిరస్కరించింది. 1978, 1991-92, 2012, 2015, 2016-17లో రోహింగ్యాలు సైనిక దాడులను ఎదుర్కొన్నారు. రోహింగ్యాలు పొరుగుదేశం బంగ్లాదేశం నుంచి వచ్చిన చట్టబద్ధం కాని వలస ప్రజలని మయన్మార్ ప్రభుత్వం భావిస్తోంది. వారిని ‘రోహింగ్యా’లుగా గుర్తించేందుకు బదులు బెంగాలీలుగా గుర్తించేందుకు ప్రాధాన్యమిస్తోంది. మయన్మార్ ప్రభుత్వంలోని అధిక భాగాన్ని మిలిటరీ నియంత్రిస్తోంది. హోం, రక్షణ, సరిహద్దు వ్యవహారాల మంత్రిత్వశాఖలతో పాటు పార్లమెంటులోని 25 శాతం సీట్లు, ఒక ఉపాధ్యక్ష పదవి.. మిలటరీ ఆధీనంలోనే ఉన్నాయి.

రోహింగ్యా జనాభా
  • బంగ్లాదేశ్‌కు సరిహద్దు ప్రాంతమైన అరకాన్ ప్రాంతంలోని టౌన్‌షిప్‌లలో రోహింగ్యాలు నివసిస్తున్నారు. ఈ ప్రాంత మొత్తం జనాభా లో వీరి వాటా 80-98 శాతం. మయన్మార్‌లో 11-13 లక్షల రోహింగ్యాలు నివసిస్తుండగా, మరో పది లక్షల మంది ఇతర దేశాల్లో నివసిస్తున్నట్లు అంచనా.
  • ఇతర దేశాల్లో నివసిస్తున్న రోహింగ్యా ప్రజలను కలుపుకున్నట్లైతే మొత్తం రఖైన్ రాష్ట్ర జనాభాలో వీరి వాటా 60 శాతం. మయన్మార్‌ను వీడినవారిలో ఎక్కువ (తొమ్మిది లక్షల) మంది ఆగ్నేయ బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా వెళ్లారు. భారత్, థాయిులాండ్, మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, పాకిస్థాన్‌లకు కూడా వలస వెళ్లారు. అంతర్జాతీయ నిర్వాసితుల (డిస్‌ప్లేస్డ్ పర్సన్స్) కోసం నిర్వహిస్తున్న క్యాంప్‌లలో మయన్మార్‌లోనే లక్ష మందికి పైగా రోహింగ్యాలు నివసిస్తున్నారు. రోహింగ్యా యువకులను మయన్మార్ ఆర్మీ హతమార్చడం, వేధించడంతో రోహింగ్యాల్లోని ఒక గ్రూపు ప్రజలు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ప్రవేశించారు. ప్రస్తుతం మన దేశంలో 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నట్లు అంచనా. వీరిలో దాదాపు ఏడు వేల మంది తమిళనాడులో నివసిస్తున్నారు.

రోహింగ్యాల వివాదం-వలసలు
  • రోహింగ్యా ప్రజలను తమ దేశ పౌరులుగా గుర్తించేందుకు మయన్మార్ ప్రభుత్వం 1982కు ముందే నిరాకరించినప్పటికీ వారు ఆ దేశాన్ని విడిచి వెళ్లడం 2012లోనే ప్రారంభమైంది. మయన్మార్ మిలటరీ 2012లో రోహింగ్యాలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టింది. భూములను లాక్కొని గ్రామాలపై దాడులకు పాల్పడింది. దీంతో రోహింగ్యా ముస్లింలను ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోనే అత్యంత పీడిత ఎథ్నిక్ గ్రూప్‌గా గుర్తించింది. రఖైన్, రోహింగ్యాలు, బౌద్ధుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇవి అరాకన్ ప్రాంతం మొత్తం వ్యాపించాయి. మయన్మార్ ప్రభుత్వం అనేక వేల మంది రోహింగ్యాలను క్యాంప్‌లలో బంధించింది. క్యాంప్‌లను విడిచి వెళ్లడానికి రోహింగ్యాలను పోలీసులు అనుమంతించలేదు. మయన్మార్ అధికారులు క్యాంప్‌లలో ఉన్న రోహింగ్యాలకు సరిపోయినంత ఆహారాన్ని అందించనందున ఆకలి చావులు సంభవించాయి. వైద్య సదుపాయాలు కూడా లేకపోవడంతో క్యాంప్‌లలో వ్యాధులు ప్రబలి ప్రజలు మృత్యువాత పడ్డారు. క్యాంప్‌లకు బయట ఉన్న రోహింగ్యాలు మయన్మార్‌ను విడిచి వెళ్లడం ప్రారంభించారు. ఏ దేశానికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో అనేక వేల మంది రోహింగ్యాలు సముద్రంపై పడవల్లో ప్రయాణమయ్యారు. వీరిని అంతర్జాతీయ మీడియా ‘పడవ ప్రజలు’గా వర్ణించింది.

భారత్‌లోకి రోహింగ్యాల ప్రవేశం
  • రోహింగ్యాలు బెంగాలీ మాట్లాడటంతోపాటు వారి పూర్వీకుల మూలాలు బంగ్లాదేశ్‌లో ఉండటం వల్ల మయన్మార్‌ను వీడిన రోహింగ్యాల్లో ఎక్కువ మంది ఆ దేశానికి వెళ్లారు. ప్రారంభంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం వీరి వలసల పట్ల కొంత సానుకూలత ప్రదర్శించినా వీరి సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో 2012 ఆగస్టులో మానవతావాద సహాయాన్ని నిలిపివేసింది. ఈ క్రమంలో రోహింగ్యాలు థాయిలాండ్‌లోకి ప్రవేశించారు. మయన్మార్‌లోని పరిస్థితులను గమనించిన థాయిలాండ్.. ‘పడవ ప్రజలు’ తమ దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు నేవీని అప్రమత్తం చేసింది. దీంతో వారు రోహింగ్యాలకు ఆహారం, మందులను అందించినప్పటికీ తమ భూభాగంలోకి అనుమతించలేదు. ఫలితంగా వారు మలేషియా వైపు పయనమయ్యారు. ముస్లిం ప్రజలు మెజారిటీగా ఉన్న మలేషియా తమను ఆదుకొని గూడు కల్పిస్తుందని రోహింగ్యా ముస్లింలు భావించారు. కానీ, ఆ దేశం కూడా థాయిలాండ్ విధానాన్నే అవలంబించింది. రోహింగ్యాలు మలేషియాలోకి రాకుండా ఆ దేశ నావికాదళం అడ్డుకుంది. కొన్ని వారాల తర్వాత.. ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉండే మరో దేశమైన ఇండోనేషియాలోకి ప్రవేశించగలిగారు. ఇండోనేషియా జాలర్లు సముద్ర జలాల్లోని పడవల్లో ఉన్న రోహింగ్యాలను తమ దేశంలోకి ప్రవేశించేందుకు సహకరించారు. అదే సమయంలో ఇండోనేషియా ప్రభుత్వం రోహింగ్యాలను తమ దేశంలోకి అనుమతించబోమని ప్రకటించింది. అప్పటికే వేల మంది రోహింగ్యాలు ఇండోనేషియాలో ఆశ్రయం పొందారు. రోహింగ్యాలు ఇండోనేషియాలోకి ప్రవేశించేందుకు సహాయపడుతున్న జాలర్లను ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది. దాంతో రోహింగ్యాల దృష్టి భారత్ వైపు మళ్లింది. 2013 నాటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం రోహింగ్యాలు తమ దేశంలోకి ప్రవేశించకుండా అన్ని మార్గాలను మూసివేసింది. దాంతో రోహింగ్యాలు అనేక మార్గాల ద్వారా ఈశాన్య భారత్‌లోకి ప్రవేశించారు. వీరంతా మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకోకుండా అనేక రాష్ట్రాలకు తరలివెళ్లారు. ప్రధానంగా అసోం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు.
భారత్‌లో 40,000 మంది రోహింగ్యాలు చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఆగస్టులో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం గత రెండేళ్లలో రోహింగ్యాల జనాభా నాలుగు రెట్లు పెరిగింది. 2015లో వీరి జనాభా 10,500 కాగా, ప్రస్తుతం 40,000కు చేరింది. భారత్‌లోకి ప్రవేశించిన రోహింగ్యాల్లో అధిక శాతం జమ్మూకశ్మీర్‌లో నివసిస్తున్నారు. జమ్మూ పరిసర ప్రాంతాల్లో 5,700 మంది రోహింగ్యాలు నివసిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కానీ, కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం ఆ సంఖ్య పది నుంచి పదకొండు వేల వరకు ఉంది. భారత్‌లో ఉన్న అధిక శాతం రోహింగ్యాలు ‘ఆఫీస్ ఆఫ్ ది యునెటైడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్)’లో నమోదు చేసుకున్నారు. యూఎన్‌హెచ్‌సీఆర్‌ను ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీగా వ్యవహరిస్తారు. దీని అంచనా ప్రకారం గత నెలలో మయన్మార్ నుంచి ఇతర దేశాలకు తరలివెళ్లిన రోహింగ్యాల సంఖ్య 1,23,000.

రోహింగ్యాలు- భారత్ వైఖరి
  • ఇటీవల కాలంలో మయన్మార్‌తో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల అనుసంధానం ద్వారా ఆర్థిక, వ్యూహాత్మక రంగాల్లో రెండు దేశాల మధ్య పటిష్ట సంబంధాలు పెంపొందాలని భారత్ కోరుకుంటోంది. ఇంగ్లిష్ భాషా శిక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు మయన్మార్‌కు భారత్ సహకారం అందిస్తోంది. ఇండియన్ టెక్నికల్, ఎకనమిక్ కో-ఆపరేషన్ కింద మానవ వనరుల సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు భారత ప్రభుత్వం.. మయన్మార్ జాతీయులకు 500 స్లాట్స్‌ను రిజర్వ్ చేసింది. మయన్మార్ ప్రజాస్వామ్యయుత దేశంగా రూపుదిద్దుకోవడంలో భారత్ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది.
  • అంతర్జాతీయ సంస్థలు రోహింగ్యాలను భారత్ నుంచి పంపించవద్దని విజ్ఞప్తి చేశాయి. భద్రత దృష్ట్యా రోహింగ్యాలు దేశంలో చట్ట వ్యతిరేకంగా నివసించడాన్ని అనుమతించరాదని ప్రభుత్వం భావిస్తోంది. యూఎన్ రెఫ్యూజీస్ కన్వెన్షన్-1951, స్టేటస్ ఆఫ్ రెఫ్యూజీస్-1967కు సంబంధించిన ప్రోటోకాల్‌పై భారత్ సంతకం చేయలేదు. దీంతోపాటు మనదేశంలో శరణార్థులకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక చట్టం లేదు. కేంద్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ 1946లో రూపొందించిన ఫారెనర్స్ యాక్ట్ పరిధిలోకి రోహింగ్యాల అంశం వస్తుంది.
  • ఐక్యరాజ్యసమితి శరణార్థుల తీర్మానంపై భారత్ సంతకం చేయనందున రోహింగ్యాలను వెనక్కిపంపడంలో ఏవిధమైన ఇబ్బందులు ఉండవని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ బాలల హక్కుల కమిషన్ రోహింగ్యాలను దేశం నుంచి పంపించకుండా నిలువరించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోహింగ్యాలు దేశ భద్రతకు ప్రమాదమని, వనరులకు భారమని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. రోహింగ్యాలు ప్రాణభీతితో భారత్‌లోకి ప్రవేశిస్తే వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించడం సరికాదన్నది మరికొందరి అభిప్రాయం.

సారాంశం
  • రోహింగ్యాలు మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి చెందినవారు. వీరిలో మెజార్టీ ప్రజలు ముస్లింలు. అయితే మయన్మార్ ప్రభుత్వం రోహింగ్యాలను తమ పౌరులుగా గుర్తించలేదు.
  • 40 వేల మందిని మాత్రమే తమ దేశ పౌరులుగా గుర్తించింది. బంగ్లాదేశ్‌కు చెందిన రోహింగ్యా ముస్లింలను మయన్మార్‌లో ‘బెంగాలీస్’గా వ్యవహరిస్తారు.
  • మయన్మార్ పౌరుల చట్టం-1982.. రోహింగ్యాలను మయన్మార్ Ethinic Groupగా గుర్తించలేదు. దీంతో ఏ దేశానికీ సంబంధించని ప్రజలుగా రోహింగ్యాలు మిగిలిపోయారు. 2014లో మయన్మార్ ప్రభుత్వం.. జనాభా లెక్కల్లో రోహింగ్యా కమ్యూనిటీ తమ Ethnicityనిరోహింగ్యా నుంచి బెంగాలీగా మార్చుకోవాలని సూచించింది. కానీ, కొన్ని శతాబ్దాలుగా రఖైన్ ప్రాంతంలో తాము నివసిస్తున్నట్లు రోహింగ్యాలు వాదించారు. మయన్మార్ పౌరుల చట్టం-1982లో పేర్కొన్న అంశాల మేరకు కటాఫ్ సంవత్సరానికి ముందు తమ పూర్వీకులు మయన్మార్‌లో నివసించినట్లు రుజువుచేయగలిగే పత్రాలు రోహింగ్యాల వద్ద లేవు.
  • భారత్‌లో చట్ట విరుద్ధంగా 40 వేల మంది రోహింగ్యాలు నివసిస్తున్నట్లు అంచనా. జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సదస్సులో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. రోహింగ్యాలు భారతదేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారేతప్ప శరణార్థులు కారని స్పష్టం చేశారు.
  • దేశ భద్రత దృష్ట్యా రోహింగ్యాలను భారత్ నుంచి పంపించివేయాలని కొందరు వాదిస్తుండగా, మయన్మార్ నుంచి ప్రాణభీతితో వచ్చిన రోహింగ్యాలపై ఉగ్రవాద ముద్ర వేయడం సరికాదన్నది కొందరి అభిప్రాయం.
  • రోహింగ్యాల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘనను ఐక్యరాజ్య సమితి (యూఎన్‌వో).. ‘Crimes Against Humanity’గా పేర్కొంది.
  • భారత్, మయన్మార్ మధ్య పటిష్ట ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను మెరుగు పరచుకోవాలని రెండు దేశాల ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో రోహింగ్యాల అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
Published date : 25 Sep 2017 05:10PM

Photo Stories