Skip to main content

రాజకీయ ప్రక్షాళనకు ‘నోటా’ మీట సరిపోతుందా?

డా॥బి.జె.బి. కృపాదానం, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్.
దేశంలో రోజురోజుకూ నేరమయమవుతున్న రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చొరవ ప్రధానంగా పట్టణ ప్రాంతానికి చెందిన పౌర సమాజ కార్యకర్తల నుంచి ప్రారంభమైంది. ఈ ప్రక్షాళనకు సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27, 2013న వెలువరించిన చరిత్రాత్మక తీర్పు ఊపునిచ్చిందని చెప్పవచ్చు. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పై ‘‘పైన ఉన్న వారెవరికీ కాదు’’ (None of the Above - NOTA) అనే మీటను ఏర్పాటు చేయాలి.

నేర చరిత్ర ఉన్న వ్యక్తులను ఎన్నికల బరిలో నిలబెట్టకుండా అన్ని రాజకీయపక్షాల మధ్య అవగాహన ఏర్పడాలి. రోజురోజుకూ పెరిగిపోతున్న కుల, మత, సంకుచిత ధోరణుల్ని ఎన్నికల్లో అరికట్టాలంటే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థికి కనీసం 50 శాతం ఓట్లు రావాలనే నిబంధన కూడా విధించాలి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులను పునరాయనం గావించే (రీకాల్) హక్కు ఓటర్లకు ఇవ్వాలి. మీడియా, మేధావి వర్గం, పౌర సమాజం.. సగటు ఓటరును చైతన్యపరచడంలో చొరవ తీసుకోవాలి. వీటన్నికంటే ముఖ్యమైంది ఏంటంటే కృత్రిమమైన సామాజిక, ఆర్థిక, లింగపరమైన అసమానతల్ని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ‘నోటా’ లాంటి చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వగలవు.

వాస్తవానికి ఎన్నికల సంఘం ‘నోటా’ వంటి మార్పు తీసుకురావాలని 2001లోనే ప్రతిపాదించింది. న్యాయ కమిషన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఈ కొత్త మార్పు ద్వారా తాము నిలబెడుతున్న అభ్యర్థుల పట్ల ఓటర్లకు సదభిప్రాయం లేదన్న విషయం రాజకీయ నాయకత్వానికి అర్థమవుతుంది. ఇది రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, ఎన్నికల ప్రక్రియలో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చేందుకు దోహదం చేస్తుంది. సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం ‘నోటా’ను ప్రవేశపెట్టడం వల్ల ఓటరు గుర్తింపు, గోప్యత (Identity & Secracy) పరిరక్షణతో పాటు ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం మరింత పెరుగుతుంది. ఎందుకంటే నకారాత్మక ఓటింగ్ ద్వారా అభ్యర్థులపై ఓటర్లు తమ అసంతృప్తిని రాజకీయ వ్యవస్థకు తెలియజెప్పేందుకు వీలవుతుంది. దొంగ ఓట్లు వేయడాన్ని నిరోధించేందుకూ దోహదపడుతుంది.

వాక్ స్వాతంత్య్రంలో భాగమే!
సుప్రీంకోర్టు అభిప్రాయంలో అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కు.. వాక్ స్వాతంత్య్రంలో అంతర్భాగమే (ప్రకరణ- 19(1)). అంతేకాకుండా చీఫ్ జస్టిస్ సదాశివం అభిప్రాయంలో ఇది స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కులో అంతర్భాగం. ప్రపంచంలో ఇప్పటికే ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, ఫిన్లాండ్, స్వీడన్, కొలంబియా, స్పెయిన్‌లతో పాటు అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఓటర్లకు అభ్యర్థులను తిరస్కరించే హక్కు/ నిరసన తెలిపే హక్కు/ ఖాళీ బ్యాలెట్ పేపర్‌ను ఇచ్చే హక్కు వంటివి కల్పించారు. ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం ఆధారంగా ప్రజాస్వామ్య శక్తిని అంచనా వేయొచ్చు. తక్కువ భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్యం యెడల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందనే సంకేతాన్ని పంపుతుంది. న్యాయస్థానం అభిప్రాయంలో ఇది ప్రజాస్వామ్యం మనుగడకే భంగం కలిగిస్తుంది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన 41(2), (3) ఉప నిబంధనలు, 49-O నిబంధనలు.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 128వ సెక్షన్, రాజ్యాంగ ప్రకరణ 19(1)(ఎ) నిబంధనలకు విరుద్ధం. 49-O నిబంధన ప్రకారం ఇంతకుముందే ఓటరుకు తిరస్కరించే హక్కు ఇచ్చారు. అయితే అలా తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారుల సమక్షంలో లిఖితపూర్వకంగా తెలియజేయాలి. దీనివల్ల రహస్యంగా తిరస్కరించడమనే హక్కు కోల్పోవడం జరుగుతుంది. ఇది స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కుకు భంగం కలిగిస్తుంది (ప్రకరణ 21 ప్రకారం).

నకారాత్మక ఓటింగ్‌పై ఇప్పటి వరకు జరిగిన పరిశోధన ఫలితాలు అంత స్పష్టంగా లేవు. ప్రభుత్వ విధానాలపై ప్రజలు ఏవిధంగా తమ అసంతృప్తిని వెల్లడించారనే అంశంపై విసృ్తత సమాచారం అందుబాటులో ఉందిగానీ, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పట్ల ఓటర్ల అసంతృప్తి వెల్లడికి సంబంధించిన సమాచారం మాత్రం తగినంత లేదు. అమెరికాలో నకారాత్మక ఓటింగ్‌పై విసృ్తత పరిశోధన జరిగింది. అభ్యర్థులపై ఓటర్లకు అసంతృప్తి ఉన్నట్లయితే ఎన్నికలనే బహిష్కరించినట్లు విశదమవుతుందేగానీ, అభ్యర్థుల్ని తిరస్కరించేందుకు చొరవ తీసుకున్నట్లు చెప్పడానికి ఆధారాలు లేవు.

ఓటింగ్ శాతం పెరుగుతుందా?
సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు దేశంలో నకారాత్మక ఓటింగ్ విధానం వల్ల ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని చెప్పలేం. అంతమాత్రాన జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రజాస్వామ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదనీ చెప్పలేం. స్వీడన్‌లో అభ్యర్థులపై తమ అసంతృప్తిని తెలియజేసేందుకు ఓటర్లకు ఖాళీ బ్యాలెట్ పేపర్‌ను సమర్పించే అవకాశమిచ్చారు. చరిత్రాత్మకంగా ఈ దేశంలో ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లు 85 శాతం అయితే వీరిలో ఖాళీ పేపర్‌ను సమర్పించిన వారు కేవలం ఒక శాతమే. దీన్నిబట్టి నకారాత్మక ఓటింగ్‌కు, ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడానికి ప్రత్యక్ష సంబంధం లేనట్లు అర్థమవుతోంది. సుప్రీంకోర్టు ప్రస్తావించిన గ్రీస్, బ్రెజిల్‌లో నిర్బంధ ఓటింగ్ విధానం అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఓటర్లు తప్పకుండా ఓటు వేసేందుకుగానీ, లేదంటే నకారాత్మక ఓటింగ్‌కుగానీ అవకాశముంటుంది. నిర్బంధ ఓటింగ్ లేని దేశాల్లో ఓటర్లు.. తమ అసంతృప్తిని ఓటింగ్‌లో పాల్గొనకుండా తెలియజేయవచ్చు. 1975లో అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో నకారాత్మక ఓటింగ్‌ను ప్రవేశపెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఓటింగ్ శాతం క్రమేణా తగ్గుతూ వచ్చింది. కొందరు ఓటర్లు నకారాత్మక ఓటింగ్ విధానాన్ని తొలగించాలని కూడా కోరారు. ఎందుకంటే ‘నిరసన’ అభ్యర్థులకు లభించే మద్దతు క్రమేణా తగ్గుతూ వచ్చింది.
  • పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో 2008లో నకారాత్మక ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే గత ఎన్నికల్లో ఇలా ఓటేసిన వారు ఒక శాతం మాత్రమే. సుప్రీంకోర్టు ప్రస్తావించిన ఉక్రెయిన్‌లో కూడా క్రమేణా ఓటింగ్ శాతం తగ్గుతూ వచ్చింది. నకారాత్మక ఓటింగ్/ నిరసన ఓటింగ్‌లపై విడివిడిగా సమాచారాన్ని సేకరించడం అంత సులభం కాదు. కాబట్టి వీటి ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టం. కొన్ని దేశాల్లో ఖాళీ ఓట్లను చెల్లని ఓట్లుగా పరిగణిస్తున్నారు. మరికొన్ని దేశాల్లో వీటిని నిరసన ఓట్లుగా పరిగణిస్తున్నారు. దీనికి కారణం.. దాదాపు ఈ దేశాలన్నింటిలోనూ నకారాత్మక ఓట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల ఫలితాలను నిర్ధారించేందుకు చట్టబద్ధమైన అధికారం లేదు. భారత దేశంలో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి కంటే నకారాత్మక ఓట్ల సంఖ్య ఎక్కువైనప్పటికీ, ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ అభ్యర్థినే గెలిచినట్లు ప్రకటించాలి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై.ఖురేషీ వ్యాఖ్యానించినట్లు పోలైన వంద ఓట్లలో 99 నకారాత్మక ఓట్లు అయినప్పటికీ ఒకే ఒక ఓటు పొందిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించాల్సిందే. ఆ 99 ఓట్లను చెల్లనివిగా పరిగణించాల్సి వస్తుంది. మరో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కూడా ఇదేరకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
రాజకీయ ప్రక్షాళనకు దోహదం:
నకారాత్మక ఓటింగ్ విధానం దేశంలో నిష్కళంక రాజకీయాలకు దోహదం చేస్తుందా? రాజకీయ పక్షాలపై నైతిక ఒత్తిడి తీసుకురాగలుగుతుందా? వీటిపై న్యాయశాస్త్ర కోవిదులు, ఎన్నికల నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తంచేశారు. న్యాయకోవిదుడు కె.కె.వేణుగోపాల్ అభిప్రాయంలో ఇది శుభపరిణామం. ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థికంటే నకారాత్మక ఓట్ల సంఖ్య ఎక్కువైనప్పుడు ఆ ఎన్నికను రద్దుచేయాల్సిందే. ఇది రాజకీయ పక్షాలపై గణనీయ ప్రభావం చూపుతుంది. నేరచరితులు రాజకీయ అధికారం చేపట్టకుండా నివారించేందుకు ఇది ఒక మంచి పద్ధతి. కానీ, ఖురేషీ అభిప్రాయంలో ఈ విధానం రాజకీయ పక్షాల వైఖరిలో సకారాత్మక మార్పు తీసుకొస్తుందనుకోవడం పొరపాటే.

భిన్నాభిప్రాయాలు:
గత రెండు దశాబ్దాలుగా నేరచరితులను ఎన్నికల్లో పోటీచేయనివ్వకూడదని పౌర సమాజం ఎంతగా ఘోషిస్తున్నప్పటికీ ప్రధాన రాజకీయపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకిస్తుండటం ఇందుకు నిదర్శనం. ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది రాజీవ్ ధావన్ కూడా వెలిబుచ్చారు. ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకులైన సుభాష్ కశ్యప్ అభిప్రాయంలో ఈ తీర్పు.. "రాజకీయ పక్షాలు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను ఏ మాత్రం ప్రభావితం చేయదు".

భారతీయ జనతాపార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించగా, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సీపీఎం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు దేశంలో ఎన్నికల విధానంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదాన్ని కాలమే నిర్ణయించాలి. కొత్త మార్పుతో కలిగే ప్రయోజనాల కంటే తలెత్తే సమస్యలు ఎక్కువేమోనన్న సందేహాన్ని ఖురేషీ వ్యక్తం చేశారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులందరూ తిరస్కరణకు గురైతే, మళ్లీ జరిపే ఎన్నికల్లో ఆ అభ్యర్థులు పోటీ చేయవచ్చా? వారికి అనుమతిస్తే నకారాత్మక ఓటింగ్ లక్ష్యమే దెబ్బతింటుంది. ఎంతకాలం వారిని నిషేధించాలి? తరచూ ఎన్నికల్ని నిర్వహిస్తే ఓటర్లలో ఎన్నికల అలసట (Election Fatigue) ఏర్పడదా? పదేపదే ఎన్నికలు నిర్వహిస్తే పాలనా యంత్రాంగం అస్తవ్యస్తంగా మారుతుంది. ఖర్చు కూడా తడిసిమోపెడవుతుంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నంతకాలం ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలను తీసుకునేందుకు వీలుండదు. దీనివల్ల నష్టపోయేది ప్రజలే.

సంస్కరణలు వేగవంతం కావాలి:
ఎన్నికల సంస్కరణల్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ, దానికంటే ముఖ్యమైనది నేరచరిత రాజకీయాలకు దోహదం చేస్తున్న సామాజిక, ఆర్థిక అసమానతలు; బలహీన వర్గాలు.. సంపన్న వర్గాల అణచివేతకు గురికావడం మొదలైన వాటిని నిర్మూలించాలి. రాజకీయ, వ్యవస్థాపరమైన మార్పుల వల్ల నేరమయ రాజకీయాలకు అడ్డుకట్ట వేయొచ్చు. పౌరులను ఎన్నికల ప్రక్రియలో మరింత ప్రభావవంతమైన భాగస్వాములుగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.

ఎన్నికల్లో ప్రతిబంధకాలు:
ఎన్నికల్లో ప్రజా భాగస్వామ్యానికి సంబంధించి కొన్ని ప్రతిబంధకాలున్నాయి.

అవి:
  • ప్రస్తుతం కొనసాగుతున్న కఠినతరమైన ఓటరు నమోదు ప్రక్రియ, ఓటర్లలో నిరాసక్తి, ఆదాయంలో వ్యత్యాసాలు.
  • ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం వల్ల దినసరి వేతనం పొందే కార్మికులకు నష్టం వాటిల్లడం.
  • ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగే కొట్లాటలు, ధనిక వర్గం.. తమ ప్రతినిధికి ఓటు వేయాలనో లేదంటే ఓటింగ్‌లో పాల్గొనవద్దనో బెదిరించడం.
  • ఎన్నికల సమయంలో కుల, మత, ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టడం.
  • డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టడం.
ఈ ప్రతిబంధకాలను తొలగిస్తేనే పౌరుడు స్వేచ్ఛగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలవుతుంది. అంతేగానీ కేవలం 'నోటా' విధానంతో ఓటర్లను ఉత్తేజపరచగలమనుకోవడం పొరపాటు.

భారతీయ జనతా పార్టీ వంటి రాజకీయ పక్షాలు ఎన్నికల్లో ఓటింగ్‌ను నిర్బంధం చేయాలని అభిప్రాయపడుతున్నాయి. అయితే ఓటు హక్కును వినియోగించుకునే స్వేచ్ఛలో ఓటు వేయకుండా ఉండే హక్కు కూడా అంతర్భాగమే. బలవంతంగా ఓటు వేయించడం అప్రజాస్వామ్యం.

తీసుకోవాల్సిన చర్యలివీ:
Bavitha ఎన్నికల సంస్కరణల్లో భాగంగా రాజకీయ పక్షాల పనితీరు ప్రజాస్వామ్యబద్దం గా ఉండేలా చూడాలి. అంటే రాజకీయ పక్షాలు వ్యవస్థాపరమైన ఎన్నికల్ని క్రమంతప్పకుండా నిర్వహించాలి. వాటికి బహుళ జాతి సంస్థల నుంచి భారీ ఎత్తున అందే విరాళాల్లో పారదర్శకత ఉండాలి. నేర చరిత్ర ఉన్న వ్యక్తులను ఎన్నికల బరిలో నిలబెట్టకుండా అన్ని రాజకీయ పక్షాల మధ్య అవగాహన ఏర్పడాలి. రోజురోజుకూ పెరిగిపోతున్న కుల, మత, సంకుచిత ధోరణుల్ని ఎన్నికల్లో అరికట్టాలంటే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థికి కనీసం 50 శాతం ఓట్లు రావాలనే నిబంధన కూడా విధించాలి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులను పునరాయనం గావించే (రీకాల్) హక్కు ఓటర్లకు ఇవ్వాలి. మీడియా, మేధావి వర్గం, పౌర సమాజం.. సగటు ఓటరును చైతన్యపరచడంలో చొరవ తీసుకోవాలి. వీటన్నికంటే ముఖ్యమైంది ఏంటంటే కృత్రిమమైన సామాజిక, ఆర్థిక, లింగపరమైన అసమానతల్ని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే 'నోటా' లాంటి చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వగలవు.

Published date : 25 Oct 2013 02:39PM

Photo Stories