నేరచరిత రాజకీయాలకు తెరదించేనా?
Sakshi Education
డా. బి.జె. బి. కృపాదానం , సీనియర్ సివిల్స్ ఫాకల్టీ, ఆర్.సి రెడ్డి స్టడీ సర్కిల్
సుప్రీంకోర్టు తీర్పు, కేంద్ర సమాచార సంఘం ఉత్తర్వులు..
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు జూలై 10, 2013న వెలువరించిన తీర్పు ప్రకారం తీవ్ర నేరాలకు పాల్పడి, శిక్షకు గురైన పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలు చేసుకొని, ఆ నెపంతో ప్రజా ప్రతినిధులుగా కొనసాగడానికి అనర్హులు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4)లోని అంశాలు రాజ్యాంగ విరుద్ధమైనవని తీర్పు నిచ్చింది. ఈ సెక్షన్‌లోని నిబంధనలు న్యాయస్థానం విధించిన శిక్షను సవాలు చేస్తూ ప్రజాప్రతినిధిగా కొనసాగడానికి అనుమతిస్తుంది. ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (The Association of Democratic reforms).. ఎన్నికల సంఘం నుంచి సేకరించిన వివరాల ప్రకారం 545 మంది లోక్‌సభ సభ్యుల్లో 162 మంది, 4,032 విధానసభ సభ్యుల్లో 1,258 మంది తమపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సమర్పించిన అఫిడవిట్‌లలో అంగీకరించారు. వీరిలో శిక్షకు గురైనవారు అప్పీలు అనే నెపంతో తమ పదవీ కాలాన్ని కొనసాగిస్తున్నారు. 14వ లోక్‌సభతో పోలిస్తే 15వ లోక్‌సభలో నేర చరితుల శాతం 25.78 శాతం నుంచి 36.36 శాతానికి పెరిగింది.
లిల్లీ థామస్, ఎస్.ఎన్.శుక్లా అనే ఇద్దరు సామాజిక కార్యకర్తలు దాఖలు చేసిన అప్పీలుకు స్పందిస్తూ సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. రాజ్యాంగంలోని 102(1)(e), 191(1)(e) నింబంధనలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరు అనర్హులు, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ఏ పరిస్థితుల్లో తమ పదవులను కోల్పోతారు అనే అంశాలను వివరిస్తాయి. ఈ రెండింటికీ ఒకే రకమైన కొలమానాలు ఉండాలిగానీ వేర్వేరు ప్రమాణాలు ఉండకూడదు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8(1)(2)(3) నిబంధనలు కొన్ని రకాలైన నేరాలకు పాల్పడినవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటిస్తూ అదే సమయంలో 8(4)వ నిబంధన ఎంపీలు, ఎమ్మెల్యేలు నేరస్థులుగా రుజువై శిక్షకు గురైనప్పటికీ మూడు నెలలలోపు అప్పీలు చేసుకుంటే పదవిలో కొనసాగనివ్వడానికి అనుమతిస్తుంది. సుప్రీంకోర్టు అభిప్రాయంలో ‘ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ నిబంధన రాజకీయాలు నేరమయం కావడాన్ని ప్రోత్సహించేదిగా ఉంది’. అయితే ఈ తీర్పుకంటే ముందు ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలు చేసుకున్న ప్రజా ప్రతినిధులకు ఈ తీర్పు వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంది. తీర్పు తర్వాత దోషులుగా రుజువైన ప్రజాప్రతినిధులు వెంటనే పదవులు కోల్పోతారని కోర్టు స్పష్టం చేసింది. ప్రముఖ రాజకీయ నాయకులైన లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, సురేశ్ కల్మాడీ, కనిమొళి మొదలైనవారు చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని పదవుల్లో కొనసాగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
స్వాగతించిన పౌర సమాజం:
సుప్రీం కోర్టు తీర్పును ఒకవైపు ఎన్నికల సంఘం, మరోవైపు పౌరసమాజం స్వాగతించాయి. అయితే రాజకీయ పక్షాలు మాత్రం పైకి స్వాగతించినప్పటికీ గుర్రుగా ఉన్నాయి. సుప్రీం కోర్టు తన పరిధిని అతిక్రమిస్తుందనే నెపంతో దాన్ని ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వంలోని మూడు ప్రధానాంగాలైన శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల మధ్య సమతౌల్యత దెబ్బతింటుందన్నది రాజకీయనాయకుల అభియోగం. ఈ తీర్పు నేరమయ రాజకీయాలను ప్రక్షాళన చేసేదిగా ఉన్నప్పటికీ, దీనిని ఆసరాగా తీసుకొని అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు తమ ప్రత్యర్థుల మీద తప్పుడు కేసులు మోపి వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ తీర్పు ప్రకారం జైలులో గానీ, పోలీసు కస్టడీలో గానీ ఉన్నవారు పోటీ చేయడానికి అర్హులు కారు. ఈ అంశంపైన త్వరలో స్పష్టత వస్తుంది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లయిన త్రివేది, గోపాల స్వామి, నవీన్ చావ్లా లాంటివారు సుప్రీంకోర్టు తీర్పుపై సానుకూలంగా స్పందించారు.
తీర్పును వ్యతిరేకించే వారు లెవనెత్తే అభ్యంతరాలు:
ఆశించిన ఫలితం కనిపిస్తుందా?
సుప్రీం కోర్టు తీర్పు సంచలనాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో ఇది ఆశించిన ఫలితాలను చూపించ లేకపోవచ్చు. రాజకీయ నాయకులు తమకున్న ధన, రాజకీయ బలాన్ని ఉపయోగించి న్యాయవ్యవస్థను త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకుండా ఆటంక పరచవచ్చు. సాక్ష్యాలను తారుమారు చేయడం కొందరు రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఆలస్యంగా న్యాయ ప్రదానం చేయడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అనే నానుడిని ఆచరణలో పెట్టడానికి రాజకీయ నాయకులు శతవిధాల ప్రయత్నిస్తారు. ఈ తీర్పు వల్ల నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే. వారిని ప్రజా ప్రతినిధులుగా నిలువరించవచ్చుగానీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకుండా చేయలేం. తమ కుటుంబ సభ్యులు, అనుచరులను పోటీ చేయించి తెర వెనుక రాజకీయాలు చేసే అవకాశముంది. బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయ సంబంధ వివాదాల్లో చిక్కుకొని (అవినీతి కేసులో) ముఖ్యమంత్రిగా కొనసాగలేని పరిస్థితి ఏర్పడినప్పుడు తన భార్య రబ్రీదేవిని తెరపైకి తెచ్చి ఆమెను ముఖ్యమంత్రిని చేసి రాజకీయాధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. జార్ఖండ్‌లో అవినీతి కేసుల్లో ఇరుక్కున్న శిబుసోరెన్ తన కుమారుడు హేమంత్ సోరెన్‌ను ముఖ్యమంత్రి చేసిన సంఘటనను ఇటీవల జరిగిన రాజకీయ విన్యాసం ఓ మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు నేపథ్యంలో పార్లమెంటు.. నేర చరితులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కాకుండా నిరోధిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాన విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి (థామస్)ని ప్రతిపాదించినప్పుడు అది వివాదాస్పదమై సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో కోర్టు.. సంస్థాగత నిజాయితీ (Institutional Integrity) అవసరమని అభిప్రాయపడింది. అవినీతిపరుడైన వ్యక్తిని ఓ ఉన్నత పదవిలో నియమిస్తే సంస్థ నిజాయితీ ప్రశ్నార్థకమవుతుంది. అదే విధంగా అవినీతిపరులు ప్రజాప్రతినిధులుగా కొనసాగితే పార్లమెంటు కళంకితమవుతుంది. అందుకే ఈ విషయంలో తక్షణం ప్రక్షాళన జరగాలి.
మరో శుభసూచికం:
రాజకీయ పక్షాలు సమాచార చట్టం పరిధిలోకి వస్తాయని కేంద్ర సమాచార కమిషన్ ప్రకటించడం మరో శుభ సూచికం. ఇది పరోక్షంగా రాజకీయ ప్రక్షాళనకు దోహదం చేస్తుంది. రాజకీయపక్షాల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది. సామాజిక ఉద్యమకారులు అరుణారాయ్, నిఖిల్‌డే అభిప్రాయపడినట్లు రాజకీయ పక్షాలు ప్రజల దగ్గరి నుంచి విరాళాలు సేకరిస్తాయి. వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ప్రజలకు తెలియాలి. అంతేకాకుండా రాజకీయ పార్టీలు ప్రభుత్వం నుంచి పన్ను రాయితీలు, కార్యాలయాల నిర్మాణం కోసం నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాలను కారుచవుకగా పొందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సమాచార కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు రాజకీయ పార్టీలు ప్రజా/ప్రభుత్వ వ్యవస్థలు (Public Authorities). వీటి కార్యకలాపాలు పారదర్శకంగా ఉండాలి. అందుకోసం వాటిని సమాచార హక్కు చట్ట పరిధిలోకి తేవాలి. అయితే దీనిపై రాజకీయ పక్షాలు స్పందించిన తీరు విచారకరంగా ఉంది. సమాచార కమిషన్ ఉత్తర్వుల్ని వామ, మితవాద పక్షాలనే తేడా లేకుండా దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలూ వ్యతిరేకించాయి. సమాచార హక్కు పరిధిలోకి రాజకీయపక్షాలను తీసుకురావడమంటే వాటిత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని చెబుతున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఎలా జరుగుతుందో ప్రత్యర్థులకు తెలిసిపోతే తమ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు దెబ్బతింటాయని, తమ ఎన్నికల వ్యూహం ప్రత్యర్థులకు తెలుస్తుందని పేర్కొంటున్నాయి. అనేక రాజకీయ పార్టీలు తమ ఆర్థిక కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నాయని, వాటి వివరాలు ఎన్నికల కమిషన్‌కు, ఆదాయపు పన్ను విభాగాలకు తెలియజేస్తున్నాయని అందువల్ల వాటిని సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని వాదిస్తున్నాయి. కానీ, అవి చెబుతున్నట్లు ఆర్థిక కార్యకలాపాలు పారదర్శకంగా ఉంటే ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడానికి (సమాచార హక్కు ద్వారా) అభ్యంతరమెందుకు? ఈ వ్యవహారాల్లో ఒకవైపు ఎన్నికల కమిషన్, మరోవైపు ఆదాయపు పన్ను విభాగానికి రాజకీయ పక్షాల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు (Monitoring) పౌర సమాజపు సహకారం అవసరం. అది సమాచార హక్కు ద్వారానే నెరవేరుతుంది.
అన్ని రకాలైన రాజకీయ సిద్ధాంతాల్లో ప్రజాస్వామ్యం ఒక్కటే సమానత్వాన్ని సమర్థించి, దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలు దాన్ని క్రమబద్దంగా నిరాకరిస్తాయి. ఈ నేపథ్యంలో నేరపూరిత, అవినీతిపరమైన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన ఎంతో అవసరం. ఇప్పటి వరకు లోక్‌పాల్ బిల్లు, సమాచారాన్ని అందించే వారి రక్షణ బిల్లు (Whistle blower's Protection Bill), న్యాయ వ్యవస్థ జవాబుదారీతనానికి సంబంధించిన బిల్లులను ఆమోదించడంలో పార్లమెంటు అలసత్వం చూపుతోంది. ఈ జాప్యానికి కార్యనిర్వాహక వర్గం (మంత్రిమండలి) మూల స్తంభం. రోజురోజుకూ బయటపడుతున్న అవినీతి కుంభకోణాలను నివారించడంలో విఫలమవుతున్న ప్రభుత్వం.. రాజకీయపార్టీలను సమాచార హక్కు పరిధి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటు. ఆర్‌టీఐ పరిధి నుంచి పార్టీలను మినహాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 1న ఆమోదం తెలిపింది. ఆ మేరకు సమాచార హక్కు చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకించాలి. అంకిత భావం కలిగిన రాజకీయ నాయకులు ఇందుకు నడుంబిగించాలి. ఈ విషయంలో యువతతో పాటు మీడియా కూడా చొరవ తీసుకోవాలి. అప్పుడే ప్రపంచంలో అతిపెద్దదైన ప్రజాస్వామ్యం బలపడుతుంది.

- ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజా ప్రతినిధులకు ఈ అనర్హత వర్తించదు. భవిష్యత్‌లో ఎన్నికయ్యే వారికి మాత్రమే వర్తిస్తుంది. మరి ఇది వివక్ష కాదా?. కానీ, ఈ తీర్పును ఇప్పడు కొనసాగుతున్న ప్రజాప్రతినిధులకు వర్తింపజేస్తే 30 శాతం నేరమయ ప్రజాప్రతినిధులున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మనుగడకు తక్షణ ప్రమాదం ముందుకొస్తుంది. ఇది మరింత గందరగోళానికి దారి తీస్తుంది.
- అనర్హుడిగా ప్రకటించిన ప్రజాప్రతినిధి పదవి కోల్పోతారు. ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకున్నప్పుడు ఆ న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటిస్తే తాను కోల్పోయిన పదవిని తిరిగి పొందలేడు కదా? ఇది అన్యాయం కాదా?. అయితే ఇదే రకమైన ఇబ్బందిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించిన వారు ఎదుర్కొంటారు. ఆ తర్వాత వారిని నిర్దోషులుగా ప్రకటించినట్లయితే వారు ఎన్నికల్లో పోటీ చేయనివ్వక పోవడం అన్యాయమే కదా? ఏ చట్టమైనా అన్ని సందర్భాలకు సముచితంగా వర్తించదు.
- 2005 సంవత్సరంలో ఎక్కువ మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8(4) నింబంధన రాజ్యాంగబద్దమేనని తీర్పునిచ్చింది. ఈ తీర్పును కేవలం ఇద్దరు సభ్యులతో ఉన్న ధర్మాసనం ఎలా తోసిపుచ్చిందని రాజ్యాంగ నిపుణులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అప్పటి ధర్మాసనం పరిశీలించింది ఏంటంటే 8(4) నిబంధన ఎంత కాలంపాటు ప్రజాప్రతినిధులకు (శిక్ష విధించినప్పటికీ) పదవిలో కొనసాగే హక్కు ఉంటుంది. ఈ తీర్పులో సభా పదవీ కాలం ముగిసేవరకు పదవిలో కొనసాగవచ్చని తెలిపింది. అయితే ప్రస్తుత తీర్పువల్ల శిక్షకు గురైన ప్రజా ప్రతినిధులు భవిష్యత్‌లో తక్షణమే పదవులు కోల్పోతారు. కాబట్టి రాజకీయ నాయకులు సహజంగానే ఆందోళన చెందుతున్నారు.
ఆశించిన ఫలితం కనిపిస్తుందా?
సుప్రీం కోర్టు తీర్పు సంచలనాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో ఇది ఆశించిన ఫలితాలను చూపించ లేకపోవచ్చు. రాజకీయ నాయకులు తమకున్న ధన, రాజకీయ బలాన్ని ఉపయోగించి న్యాయవ్యవస్థను త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకుండా ఆటంక పరచవచ్చు. సాక్ష్యాలను తారుమారు చేయడం కొందరు రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఆలస్యంగా న్యాయ ప్రదానం చేయడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అనే నానుడిని ఆచరణలో పెట్టడానికి రాజకీయ నాయకులు శతవిధాల ప్రయత్నిస్తారు. ఈ తీర్పు వల్ల నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే. వారిని ప్రజా ప్రతినిధులుగా నిలువరించవచ్చుగానీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకుండా చేయలేం. తమ కుటుంబ సభ్యులు, అనుచరులను పోటీ చేయించి తెర వెనుక రాజకీయాలు చేసే అవకాశముంది. బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయ సంబంధ వివాదాల్లో చిక్కుకొని (అవినీతి కేసులో) ముఖ్యమంత్రిగా కొనసాగలేని పరిస్థితి ఏర్పడినప్పుడు తన భార్య రబ్రీదేవిని తెరపైకి తెచ్చి ఆమెను ముఖ్యమంత్రిని చేసి రాజకీయాధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. జార్ఖండ్‌లో అవినీతి కేసుల్లో ఇరుక్కున్న శిబుసోరెన్ తన కుమారుడు హేమంత్ సోరెన్‌ను ముఖ్యమంత్రి చేసిన సంఘటనను ఇటీవల జరిగిన రాజకీయ విన్యాసం ఓ మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు నేపథ్యంలో పార్లమెంటు.. నేర చరితులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కాకుండా నిరోధిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాన విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి (థామస్)ని ప్రతిపాదించినప్పుడు అది వివాదాస్పదమై సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో కోర్టు.. సంస్థాగత నిజాయితీ (Institutional Integrity) అవసరమని అభిప్రాయపడింది. అవినీతిపరుడైన వ్యక్తిని ఓ ఉన్నత పదవిలో నియమిస్తే సంస్థ నిజాయితీ ప్రశ్నార్థకమవుతుంది. అదే విధంగా అవినీతిపరులు ప్రజాప్రతినిధులుగా కొనసాగితే పార్లమెంటు కళంకితమవుతుంది. అందుకే ఈ విషయంలో తక్షణం ప్రక్షాళన జరగాలి.
మరో శుభసూచికం:
రాజకీయ పక్షాలు సమాచార చట్టం పరిధిలోకి వస్తాయని కేంద్ర సమాచార కమిషన్ ప్రకటించడం మరో శుభ సూచికం. ఇది పరోక్షంగా రాజకీయ ప్రక్షాళనకు దోహదం చేస్తుంది. రాజకీయపక్షాల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది. సామాజిక ఉద్యమకారులు అరుణారాయ్, నిఖిల్‌డే అభిప్రాయపడినట్లు రాజకీయ పక్షాలు ప్రజల దగ్గరి నుంచి విరాళాలు సేకరిస్తాయి. వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ప్రజలకు తెలియాలి. అంతేకాకుండా రాజకీయ పార్టీలు ప్రభుత్వం నుంచి పన్ను రాయితీలు, కార్యాలయాల నిర్మాణం కోసం నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాలను కారుచవుకగా పొందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సమాచార కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు రాజకీయ పార్టీలు ప్రజా/ప్రభుత్వ వ్యవస్థలు (Public Authorities). వీటి కార్యకలాపాలు పారదర్శకంగా ఉండాలి. అందుకోసం వాటిని సమాచార హక్కు చట్ట పరిధిలోకి తేవాలి. అయితే దీనిపై రాజకీయ పక్షాలు స్పందించిన తీరు విచారకరంగా ఉంది. సమాచార కమిషన్ ఉత్తర్వుల్ని వామ, మితవాద పక్షాలనే తేడా లేకుండా దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలూ వ్యతిరేకించాయి. సమాచార హక్కు పరిధిలోకి రాజకీయపక్షాలను తీసుకురావడమంటే వాటిత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని చెబుతున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఎలా జరుగుతుందో ప్రత్యర్థులకు తెలిసిపోతే తమ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు దెబ్బతింటాయని, తమ ఎన్నికల వ్యూహం ప్రత్యర్థులకు తెలుస్తుందని పేర్కొంటున్నాయి. అనేక రాజకీయ పార్టీలు తమ ఆర్థిక కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నాయని, వాటి వివరాలు ఎన్నికల కమిషన్‌కు, ఆదాయపు పన్ను విభాగాలకు తెలియజేస్తున్నాయని అందువల్ల వాటిని సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని వాదిస్తున్నాయి. కానీ, అవి చెబుతున్నట్లు ఆర్థిక కార్యకలాపాలు పారదర్శకంగా ఉంటే ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడానికి (సమాచార హక్కు ద్వారా) అభ్యంతరమెందుకు? ఈ వ్యవహారాల్లో ఒకవైపు ఎన్నికల కమిషన్, మరోవైపు ఆదాయపు పన్ను విభాగానికి రాజకీయ పక్షాల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు (Monitoring) పౌర సమాజపు సహకారం అవసరం. అది సమాచార హక్కు ద్వారానే నెరవేరుతుంది.
అన్ని రకాలైన రాజకీయ సిద్ధాంతాల్లో ప్రజాస్వామ్యం ఒక్కటే సమానత్వాన్ని సమర్థించి, దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలు దాన్ని క్రమబద్దంగా నిరాకరిస్తాయి. ఈ నేపథ్యంలో నేరపూరిత, అవినీతిపరమైన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన ఎంతో అవసరం. ఇప్పటి వరకు లోక్‌పాల్ బిల్లు, సమాచారాన్ని అందించే వారి రక్షణ బిల్లు (Whistle blower's Protection Bill), న్యాయ వ్యవస్థ జవాబుదారీతనానికి సంబంధించిన బిల్లులను ఆమోదించడంలో పార్లమెంటు అలసత్వం చూపుతోంది. ఈ జాప్యానికి కార్యనిర్వాహక వర్గం (మంత్రిమండలి) మూల స్తంభం. రోజురోజుకూ బయటపడుతున్న అవినీతి కుంభకోణాలను నివారించడంలో విఫలమవుతున్న ప్రభుత్వం.. రాజకీయపార్టీలను సమాచార హక్కు పరిధి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటు. ఆర్‌టీఐ పరిధి నుంచి పార్టీలను మినహాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 1న ఆమోదం తెలిపింది. ఆ మేరకు సమాచార హక్కు చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకించాలి. అంకిత భావం కలిగిన రాజకీయ నాయకులు ఇందుకు నడుంబిగించాలి. ఈ విషయంలో యువతతో పాటు మీడియా కూడా చొరవ తీసుకోవాలి. అప్పుడే ప్రపంచంలో అతిపెద్దదైన ప్రజాస్వామ్యం బలపడుతుంది.
Published date : 09 Aug 2013 02:30PM