Skip to main content

మహిళా సాధికారతకు ‘ఐ యామ్ దట్ ఉమెన్’

బాలలత మల్లవరపు, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
తాజాగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘ఐ యామ్ దట్ ఉమెన్’ పేరుతో నూతన ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల విజయాలను ట్విటర్ వేదికగా ప్రచారం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రతి మహిళా తన తోటి మహిళకు సహాయం అందించడం ద్వారా నారీ శక్తిని ప్రపంచానికి చాటొచ్చని కార్యక్రమ ప్రారంభం సందర్భంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ పేర్కొన్నారు.

మహిళలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు చర్యలు ప్రారంభమైనా అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం చిత్తశుద్ధి లోపించడమే. ఫలితంగా ఇప్పటికీ మహిళా సాధికారత అందని ద్రాక్షగానే ఉంది. ఈ నేపథ్యంలో రంగాల వారీగా మహిళల స్థితిగతులు, సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకుందాం.

రాజకీయ ముఖచిత్రం
మన దేశ జనాభాలో 48.46 శాతం మహిళలు ఉన్నారు. రాజకీయ అధికారాన్ని పరిశీలిస్తే పార్లమెంటులో కేవలం దాదాపు 12 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. పార్లమెంటు, ప్రభుత్వంలో మహిళా ప్రాతినిధ్యంపై ఐక్యరాజ్యసమితి చేపట్టిన సర్వేలో భారత్ 148వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో భారత్ చాలా ఆఫ్రికా దేశాల కంటే కిందిస్థాయిలో ఉండటం గమనార్హం. చరిత్రను పరిశీలిస్తే తొలివేదకాలంలో మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండేది. మలివేదకాలం వచ్చేసరికి మహిళా హక్కులను కాలరాయడం ప్రారంభమైంది. గుప్తులు తదనంతర కాలంలో మహిళలు వంట ఇంటికే పరిమితమనే అనాగరిక సంప్రదాయం మొదలైంది. తిరిగి స్వాతంత్య్రానంతరం మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఇందులో భాగంగా 73, 74 రాజ్యాంగ సవరణలతో మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కొన్ని రాష్ట్రాల్లో వీటిని 50 శాతం వరకు పెంచారు. కానీ, ఉన్నత చట్టసభలైన పార్లమెంటు, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో మాత్రం రాజకీయ నాయకత్వం అడుగులు ముందుకు పడలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు దశాబ్దాలుగా పార్లమెంటులో పెండింగ్‌లోనే ఉంది. అనేక చర్చల తర్వాత రాజ్యసభలో నెగ్గినా, లోక్‌సభ ఆమోదం కోసం మాత్రం ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక విషయాల్లో మహిళలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని.. వాటిని స్వేచ్ఛగా అమలు చేయగలిగినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుంది.

సామాజిక, ఆర్థిక స్థితిగతులు
అవకాశం వస్తే అంతరిక్షానికైనా దూసుకెళ్లగల సత్తా తమకుందని మహిళలు నిరూపించారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి ధీరవనితలు కేవలం మహిళలకే కాదు మొత్తం సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. అయినప్పటికీ సమాజం మహిళలను ద్వితీయ శ్రేణిగానే గుర్తిస్తోంది. ఎన్ని విజయాలు సాధించినా మహిళల స్థానం పురుషుడి తర్వాతే అనే భావన పురుషాధిక్య భావజాలాన్ని ప్రతిబింబిస్తోంది. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో సత్తా చాటేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నా తగిన ప్రోత్సాహం కరువైంది. స్త్రీ, పురుషుల మధ్య అంతరాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తున్నా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది.

శ్రమదోపిడీ
చట్టరీత్యా బానిసత్వం రద్దయినా క్షేత్రస్థాయిలో అనధికారికంగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మహిళలు నిత్యం శ్రమదోపిడీకి గురవుతున్నారు. రోజురోజుకూ దేశంలో రైతులు వ్యవసాయరంగం నుంచి నిష్ర్కమిస్తున్నారు. పురుషులు మెరుగైన ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తుంటే మహిళలు మాత్రం రైతు కూలీలుగానే మిగిలిపోతున్నారు. మహిళలు వ్యవసాయ రంగంలో అన్ని విధాల శ్రమిస్తున్నా తగిన కూలీ లభించడం లేదు. మహిళలకు సమాన ఉపాధి అవకాశాలు, సమాన వేతనాల కోసం రాజ్యాంగంలో 39 ఎ, 39 డి ఆర్టికల్స్‌ను పొందుపరిచారు. కానీ, ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం అవుతోంది. కుటీర పరిశ్రమల నుంచి కార్పొరేట్ సంస్థల వరకు పరిశీలిస్తే స్త్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాస నిష్పత్తి 20 నుంచి 50 శాతం వరకు ఉంటోంది. గృహిణులు ఇంటి బాధ్యతల నిర్వహణ, పిల్లలు, వృద్ధుల ఆలనాపాలనలో కీలకపాత్ర పోషిస్తున్నారు. జాతీయాదాయంలో అన్ని రకాల సేవలను పరిగణనలోకి తీసుకుంటున్నా గృహిణుల శ్రమకు ఎలాంటి విలువ లేదు. మహిళలు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నా పురుషులతో సమానంగా గుర్తింపు లభించడం లేదు. వివాహానంతరం కుటుంబ బాధ్యతల కోసం చాలా మంది మహిళలు ఉద్యోగాలు వదులుకుంటున్నారు. ఫలితంగా ఆర్థిక స్వేచ్ఛతో పాటు మెట్టినింట్లో గౌరవం కోల్పోతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో..
సివిల్ సర్వీస్ వంటి అత్యున్నత ఉద్యోగాల్లో 17.5 శాతం, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 7.02 శాతం మహిళలు ఉన్నారు. కార్పొరేటు సంస్థల బోర్డు సభ్యుల్లో 7.7 శాతం, బోర్డు చైర్మన్‌లలో 2.7 శాతం మహిళలు ఉన్నారు. కార్పొరేట్ సంస్థలు బోర్డు సభ్యుల్లో మహిళలకు తగిన భాగస్వామ్యం కల్పించాలనే నిబంధన విధించినా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు.

విద్య, ఆరోగ్యం
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నేటికీ బాలికలు విద్యకు దూరమవుతున్నారు. ఇంటి పనులు, ఇటుక బట్టీలు, పరిశ్రమల్లో కూలీలుగా చేరుతున్నారు. ప్రాథమిక స్థాయిలో పాఠశాలలో చేరుతున్న బాలికలు 88.7 శాతం కాగా, సెకండరీ విద్యకు చేరేసరికి 51.93 శాతం, ఉన్నత విద్యా సమయానికి 32.6 శాతం మాత్రమే మిగులుతున్నారు. ఎనిమిదో తరగతి దాటిన బాలికల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు పాఠశాల మానేస్తున్నారు. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ వంటి కార్యక్రమాలు బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నా.. లక్ష్యసాధనకు చాలా దూరంలో నిలిచిపోయాం.

ఆరోగ్యం విషయంలోనూ మహిళలు వివక్షకు గురవుతున్నారు. పౌష్టికాహార లోపం వల్ల దేశంలో మూడింట ఒకవంతు మహిళలు తక్కువ బరువుతో ఉన్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు.

ప్రపంచవ్యాప్త మాతృమరణాల్లో 17 శాతం మన దేశంలోనే నమోదవుతున్నాయి. ప్రతి లక్ష కాన్పులకు 174 మంది తల్లులు కన్నుమూస్తున్నారు. ఇలా ఏటా దేశంలో 45 వేల మంది చనిపోతున్నట్లు ప్రపంచ బ్యాంకు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫిన్లాండ్, గ్రీస్‌లలో ప్రతి లక్ష కాన్పులకు మాతృ మరణాల సంఖ్య 3 కాగా, నార్వే, స్విట్జర్లాండ్, జపాన్‌లలో 5గా ఉంది. దీన్నిబట్టి ఆయా దేశాలతో పోల్చితే మన పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్ధమవుతుంది.

ప్రజారోగ్యం కోసం ఆమెరికా తన జీడీపీలో 8.1 శాతం, బ్రిటన్ 7.6 శాతం ఖర్చు చేస్తుండగా, భారత్ కేవలం 1.3 శాతం మాత్రమే ఖర్చు చేస్తోంది. దేశంలో 70 నుంచి 80 శాతం వైద్య అవసరాలను ప్రైవేటు ఆసుపత్రులే తీరుస్తున్నాయి. ఫలితంగా పేదలు నాణ్యమైన వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితులు మహిళా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

వైద్య సేవలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం ప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాల కోసం జననీ సురక్ష యోజన, జననీ శిశు సురక్ష వంటి కార్యక్రమాలను అమలుచేస్తోంది. వీటిని మరింత సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.

మహిళలపై నేరాలు
ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు మానసిక లేదా శారీరక వేధింపులకు గురువుతున్నారని ఐక్యరాజ్యసమితి అధ్యయనం వెల్లడించింది. జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక ప్రకారం రోజురోజుకూ మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. 2011లో మహిళలపై జరిగిన నేరాలు 41.7 శాతం కాగా, 2015 నాటికి 53.9 శాతానికి పెరిగాయి. మహిళలకు సంబంధించి కేవలం సంవత్సర కాలంలోనే సుమారు మూడున్నర లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో 34 వేలకు పైగా అత్యాచార కేసులు కాగా, దాదాపు 60 వేల అపహరణ కేసులు, ఏడున్నర వేలకు పైగా వరకట్న వేధింపుల కేసులు, లక్షకు పైగా గృహహింస కేసులు ఉన్నాయి. అయితే పోలీసు స్టేషన్ వరకు రాని అఘాయిత్యాల సంఖ్య దీనికి రెండింతలు ఉండొచ్చని అంచనా. పరువు హత్యలు, పోకిరీల వేధింపులు, యాసిడ్ దాడులు, కత్తిపోట్లు నిత్యకృత్యమయ్యాయి. నిర్భయ వంటి కఠిన చట్టాలు చేసినా అత్యాచారాల సంఖ్య తగ్గడం లేదు.

అక్రమ రవాణా
మనుషుల అక్రమ రవాణా అతిపెద్ద సమస్యగా పరిణమించింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది అక్రమ రవాణాకు గురవుతున్నారు. ఇందులో ప్రధానంగా చిన్నారులు, మహిళలు (యువతులుఅధికం) ఉంటున్నారు. చిన్నారులను అపహరించడం, ఇంటి నుంచి పారిపోయి ఒంటరిగా కనిపించిన యువతులను సహాయం పేరుతో లోబరుచుకోవడం, ఉపాధి పేరుతో మాయమాటలు చెప్పి ఇతరులకు అమ్మేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు.

బాల్యవివాహాలు
దేశంలో నేటికీ ఆడపిల్లను చిన్నచూపు చూస్తున్నారనడానికి బాల్య వివాహాలే నిదర్శనం. 2011 జనాభా లెక్కల ప్రకారం తొమ్మిదేళ్ల కాలంలో కోటిన్నరకు పైగా మైనర్ యువతులకు వివాహాలు జరిగాయి. త్వరగా వివాహాలు జరగడం వల్ల చాలామంది అమ్మాయిలు ఉన్నత చదువులకు నోచుకోవట్లేదు. అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు.

సంతానం పొందే విషయంలోనూ మహిళల శారీరక, మానసిక పరిస్థితులను కొంతమంది పురుషులుపట్టించుకోవట్లేదు. చివరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ను మహిళలే చేయించుకోవాలనే ధోరణి నేటికీ కనిపిస్తోంది.

ప్రధాన భావ ప్రసార మాధ్యమాల్లో ఒకటైన సినిమాల్లో (కొన్ని సినిమాలు మాత్రమే) స్త్రీని వినోద వస్తువు, శృంగారానికి ప్రతీకగా చూపిస్తూ నైతిక విలువల పతనానికి కారణమవుతున్నారు. అధిక శాతం ధారావాహికల్లో స్త్రీలు, అసూయ, గొడవలను ఇతివృత్తంగా చూపిస్తూ సమాజంలో మహిళల పట్ల వ్యతిరేక ధోరణిని పెంపొందిస్తున్నారు.

మహిళల పట్ల అడుగడుగునా అసమానతలు, అవహేళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ ఒక్క రంగం దీనికి మినహాయింపు కాదు. అన్ని రంగాల్లో స్త్రీల పట్ల ఆంక్షలు, అవరోధాలు సర్వసాధారణంగా మారాయి. ఈ పరిస్థితుల్లో మహిళలకు చేయూతనందించి వారిని సాధికారత వైపు నడిపించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నూతన జాతీయ మహిళా విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా రూపొందించింది.

ముసాయిదాలోని ప్రధానాంశాలు
2001లో రూపొందించిన జాతీయ మహిళా విధానం స్థానంలో నూతన లక్ష్యాలతో జాతీయ మహిళా విధానం-2016 కోసం ముసాయిదా రూపొందించారు. మహిళల హక్కులను కాపాడుతూ వారిని సామాజిక అభివృద్ధిలో సమ్మిళితం చేయడమే దీని ధ్యేయం. ఇందులో పామ్ రాజ్‌పుత్ కమిటీ సూచనలకు ప్రాధాన్యం ఇచ్చారు.
జాతీయ మహిళా విధానం ప్రకారం మాతా, శిశు మరణాల నియంత్రణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తగిన రవాణా సౌకర్యాలు కల్పించాలి.
మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పురుషులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునే విధంగా ప్రోత్సహించాలి.
అన్ని వయసుల వారికి బలవర్ధక పౌష్టికాహారం అందించాలి. 60 ఏళ్లు దాటిన మహిళలకు వృద్ధాప్య సేవలు అందించాలి.
పాఠశాల దూరంగా ఉండడంతో చాలామంది బాలికలు సెకండరీ విద్యలో డ్రాపౌట్ అవుతున్నారు. మినీ బస్ వంటి రవాణా సాధనాలను అందుబాటులోకి తీసుకొచ్చి డ్రాపౌట్స్‌ను తగ్గించాలి.
స్త్రీల పట్ల గౌరవం పెంపొందించే విధంగా పురుషులకు సామాజిక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
సంతానం లేని మహిళలు అద్దెగర్భంపై ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గర్భాన్ని మోసే తల్లి, సంతానం పొందే మహిళకు సంబంధించిన హక్కుల గురించి ముసాయిదాలో పొందుపరిచారు.
వితంతువులు, విడాకులు పొందినవారు, ఒంటరి మహిళలకు సామాజిక భద్రత కల్పించాలని ప్రతిపాదించారు. ఆధారం కోల్పోయిన మహిళలకు వసతి కల్పించాలని సూచించారు.
నూతన జాతీయ విధాన ముసాయిదా ప్రధానంగా మహిళల అక్రమ రవాణాపై దృష్టి సారించింది. అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధిత విభాగాలు సమర్థంగా పనిచేయాలి. సత్వర న్యాయం కోసం నారీ అదాలత్, కుటుంబ న్యాయస్థానాలను పటిష్టం చేయాలి.
స్త్రీలపై వివక్ష ఏ రూపంలో ఉన్నా నివారించి, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
మహిళలకు భద్రత కల్పించేందుకు పోలీసు, తక్షణ ప్రతిస్పందన విభాగం, అత్యవసర పరిస్థితుల్లో ఫిర్యాదుల కోసం మొబైల్ అప్లికేషన్‌లను మరింతగా అభివృద్ధి చేయాలని నూతన విధానం సూచిస్తోంది.
ఈ విధానం అమలుకు ప్రస్తుత మహిళా సంక్షేమ కార్యక్రమాలకు తోడు మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
మహిళా సాధికారత సాకారానికి ప్రభుత్వ చర్యలతోపాటు ప్రజల ఆలోచనా ధోరణిలోనూ మార్పు రావాలి. స్త్రీ, పురుష భేదాలను పక్కనపెట్ట్టి సమాజ పురోభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
Published date : 21 Nov 2017 12:02PM

Photo Stories