Skip to main content

ఎన్‌జేఏసీ రాజ్యాంగ విరుద్ధం

భారత రాజ్యాంగ రక్షణ సంరక్షణ బాధ్యత న్యాయవ్యవస్థదే! భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 జనవరి 28 నుంచి సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది. సుప్రీంకోర్టు.. దేశ అత్యున్నత న్యాయస్థానం. రాజ్యాంగ ఆధిక్యతను కాపాడుతూ, రాజ్యాంగాన్ని అధికారికంగా వ్యాఖ్యానిస్తున్న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంగా వెలుగొందుతోంది. సమాఖ్య లక్షణాలున్న మన దేశంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. అదేవిధంగా హైకోర్టు నుంచి వచ్చే అన్ని రకాల అప్పీళ్లను విచారిస్తుంది. పౌరుల రక్షణకు అవసరమైన రిట్లను జారీ చేస్తుంది. గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సుప్రీంకోర్టు గురించి, అదే విధంగా న్యాయవ్యవస్థ గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు టీఎస్‌పీఎస్‌సీ సిలబస్ కమిటీ సభ్యులు, ఓయూ కాలేజ్ ఆఫ్ లా ప్రొఫెసర్ జి.బి. రెడ్డి. దేశంలో న్యాయ వ్యవస్థ మూలాల నుంచి ఎన్‌జేఏసీ ఏర్పాటు, తాజాగా ఎన్‌జేఏసీ విషయమై సుప్రీం కోర్టు తీర్పు వరకూ.. గ్రూప్స్ అభ్యర్థుల కోసం ప్రొఫెసర్ జి.బి.రెడ్డి అందిస్తున్న విశ్లేషణ సాక్షికి ప్రత్యేకం...
పదహారో శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలోకి అడుగుపెట్టి, పాలన చేపట్టాక పరిపాలన, న్యాయపరమైన పలు సంస్కరణలు చేపట్టింది. 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. మరుసటి ఏడాది కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. తర్వాత మద్రాస్, బొంబాయిలలో ఏర్పాటైన కోర్టులను రాయల్ కోర్టులుగా పిలిచేవారు. అదే సమయంలో అదాలత్ వ్యవస్థ ఏర్పాటైంది. దీనిలో సివిల్ విభాగాల్లో మఫిసిల్ దివానీ అదాలత్, సదర్ దివానీ అదాలత్, క్రిమినల్ విభాగంలో ఫౌజ్‌దారీ అదాలత్ అనే వ్యవస్థలు ఉండేవి. వీటినే కంపెనీ కోర్టులు అనేవారు. ఈ విధంగా సమాంతరంగా రెండు రకాలైన న్యాయవ్యవస్థలు పని చేయడంతో వాటి పరిధులకు సంబంధించి వివాదాలు మొదలయ్యాయి.

ఫెడరల్ కోర్టు ఆఫ్ ఇండియా
1858లో భారత ప్రభుత్వ చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్లింది. 1861లో ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ ద్వారా రాయల్ కోర్టులను, కంపెనీ కోర్టులను ఏకీకృతం చేశారు. తర్వాత హైకోర్టులను ఏర్పాటు చేశారు. తదనంతరం భారత ప్రభుత్వ చట్టం- 1919, భారత ప్రభుత్వ చట్టం-1935 వచ్చాయి. కేంద్రం-రాష్ట్రాలు, అంతర్రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి 1937లో ఫెడరల్ కోర్టు ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. 1935 చట్టం ద్వారా ఏర్పాటైన ఫెడరల్ కోర్టు.. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చే సందర్భంలో సుప్రీంకోర్టుగా రూపాంతరం చెందింది. రాజ్యాంగంలోని 135వ అధికరణ ప్రకారం గతంలో ఫెడరల్ కోర్టు నిర్వహించిన అధికారాలన్నీ ప్రస్తుత సుప్రీంకోర్టు చెలాయిస్తుంది.

రాజ్యాంగం తర్వాత....
రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఉన్నత న్యాయ వ్యవస్థ, సబార్డినేట్ న్యాయ వ్యవస్థ అనే రెండు రకాల న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఉన్నత న్యాయస్థానాల్లో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏర్పాటు, నిర్మాణం గురించి ఆర్టికల్స్ 124 నుంచి 147 వరకు తెలుపుతున్నాయి; హైకోర్టుల నిర్మాణం గురించి ఆర్టికల్స్ 214 నుంచి 231 వరకు తెలుపుతున్నాయి. ఆర్టికల్ 214 ప్రకారం- ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉండాలనే నిబంధన ఉంది.

సబార్డినేట్ కోర్టుల నిర్మాణం
సబార్డినేట్ కోర్టుల నిర్మాణం గురించి ఆర్టికల్స్ 233 నుంచి 237 వరకు తెలుపుతాయి. వీటిని జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని సివిల్, క్రిమినల్ కోర్టులుగా విభజించవచ్చు. సివిల్ కోర్టులకు సంబంధించి జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి ఉంటారు. క్రిమినల్ కోర్టులకు సంబంధించి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి, అసిస్టెంట్ సెషన్ జడ్జిలు, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్; జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండరీ క్లాస్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ ఉంటారు.

సుప్రీంకోర్టు
General Essays
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలుపుకొని 31 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. ప్రకరణ 124(3) ప్రకారం- సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యేందుకు కింద పేర్కొన్న అర్హతలు ఉండాలి.
ఎ) భారతీయ పౌరుడై ఉండాలి.
బి) ఏదైనా హైకోర్టులో అయిదేళ్లు న్యాయమూర్తిగా లేదా పదేళ్లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.
సి) రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయకోవిదుడై ఉండాలి.

నియామక ప్రక్రియలు
ఆర్టికల్ 124 ప్రకారం- రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు ప్రధాన న్యాయమూర్తిని, మిగతా న్యాయమూర్తులను సంప్రదించాలి. 1982లో ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చిన తీర్పు ప్రకారం- జడ్జిల నియామకంపై మిగతా జడ్జిలను సంప్రదించడం అనేది కేవలం సంప్రదాయమే అనీ, కార్యనిర్వహణ శాఖకే పూర్తి అధికారం ఉంటుందని పేర్కొంది. 1993లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ జె.ఎస్.వర్మ రాజ్యాంగ ధర్మాసనం.. సంప్రదించడం అంటే జడ్జిలు ఒప్పుకోవడమని తీర్పునిచ్చింది. దీని ఆధారంగానే కొలీజియం వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
1998లో ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ న్యాయమూర్తుల అభిప్రాయం ప్రకారం- జడ్జిల నియామకం జరగాలని మరో ధర్మాసనం సూచించింది. అందులో మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం నియామకాలు జరగాలని చెప్పింది. అధికరణ 124(2) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ‘కొలీజియం’ను రాష్ట్రపతి సంప్రదిస్తారు. ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించి ప్రత్యేక అర్హతలు పేర్కొనలేదు. సాధారణంగా సీనియర్ న్యాయమూర్తిని నియమిస్తారు. కానీ ఇది తప్పనిసరి కాదు. 1973లో సీనియారిటీ పరంగా నాలుగో వ్యక్తి అయిన జస్టిస్ ఎ.ఎస్.రే, 1977లో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్ ఎం.హెచ్. బేగ్ ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

ఎన్‌జేఏసీ
2014లో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా కొలీజియం వ్యవస్థను రద్దు చేసి, దాని స్థానంలో ‘జాతీయ న్యాయ నియామక కమిషన్’ ఏర్పాటు చేశారు. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 124(ఎ)ను చేర్చారు. దీని ద్వారా అప్పటివరకు ఉన్న కొలీజియం వ్యవస్థను రద్దు చేస్తూ.. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) సిఫారసుల మేరకు న్యాయమూర్తుల నియామకం జరగాలని పేర్కొన్నారు. ఈ కమిషన్‌లో చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చైర్మన్‌గా కొనసాగుతారు. సభ్యుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖులు ఉంటారు. ఈ ప్రముఖులను మూడేళ్ల కాలానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడితో కూడిన కమిటీ నియమిస్తుంది. వీరు తిరిగి ఎన్నికవ్వడానికి అవకాశం లేదు.

ఎన్‌జేఏసీ ఏర్పాటు.. రాజ్యాంగ సవరణకు మద్దతు
ఆర్టికల్ 368 ప్రకారం న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్ ఆమోదంతో పాటు, మెజారిటీ రాష్ట్ర శాసనసభల ఆమోదం కూడా కావాలి. ఎన్‌జేఏసీకి అవసరమైన మెజారిటీ రాష్ట్రాల ఆమోదం లభించడంతో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్‌జేఏసీ రూపొందింది. ఎన్‌జేఏసీ బిల్లుకు 2014 ఆగస్టు 13న లోక్‌సభ, మరుసటి రోజు రాజ్యసభ ఆమోదం తెలిపాయి. 2014 డిసెంబర్ 31న రాష్టపతి ఆమోదం తెలపడంతో 2015 ఏప్రిల్ 13 నుంచి ఎన్‌జేఏసీ అమల్లోకి వచ్చింది.

ఎన్‌జేఏసీ విధులు
ఎన్‌జేఏసీకి ప్రత్యేకంగా కొన్ని విధులు కేటాయించారు. వాటి గురించి ఆర్టికల్ 124(బి)లో పేర్కొన్నారు. అవి..
  1. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సిఫారసు చేయాలి.
  2. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించిన సిఫారసు.
  3. నిజాయితీ, సమర్థత ఉన్న వ్యక్తులను సిఫారసు చేయాలి.

ఎన్‌జేఏసీకి వ్యతిరేకంగా పిటిషన్
శాసనపరమైన మెజారిటీతో రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్‌జేఏసీ ఏర్పాటును సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ అనే సంస్థ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగంలో ఒక మౌలిక అంశం, రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మార్చడం కూడా సరికాదని ఈ సంస్థ వాదిస్తోంది.

ఎన్‌జేఏసీపై సుప్రీంకోర్టు తీర్పు
ఎన్‌జేఏసీ ఏర్పాటు, కొలీజియం వ్యవస్థ రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు 2015 అక్టోబర్ 16న సంచలన తీర్పు వెలువరిచింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఎన్‌జేఏసీ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న కొలీజియం వ్యవస్థను సమర్థించింది. అయితే కొలీజియం వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయని ఈ తీర్పును వెలువరించిన న్యాయమూర్తులు అభ్రిపాయపడ్డారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై రాజకీయ జోక్యం ఉండకూడదని, దేశంలో ఇప్పటిదాకా అలాంటి పరిస్థితి తలెత్తలేదని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ చలమేశ్వరరావు మాత్రమే ఎన్‌జేఏసీ రాజ్యాంగ బద్ధమని తీర్పునిచ్చారు.

న్యాయమూర్తుల తొలగింపు విధానం
రాజ్యాంగ ప్రకరణ 124(4) న్యాయమూర్తులను తొలగించే విధానాన్ని తెలుపుతోంది. న్యాయమూర్తులకు సంబంధించి ఏదైనా అసమర్థత, అక్రమ ప్రవర్తనను గుర్తిస్తే.. పార్లమెంట్ అభిశంసన తీర్మానం సిఫారసు మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు. ఈ తీర్మానాన్ని 100 మంది సభ్యుల మద్దతుతో లోక్‌సభలో లేదా 50 మంది మద్దతుతో రాజ్యసభలో 14 రోజుల ముందు సభాధ్యక్షునికి నోటీస్ ఇచ్చి ప్రవేశ పెట్టవచ్చు. సభాధ్యక్షుడు దీన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. తీర్మానాన్ని ఆమోదిస్తే సభాధ్యక్షుడు విచారణ కమిటీని నియమిస్తారు. విచారణలో అభియోగం రుజువైతే తీర్మానం చర్చకు వస్తుంది. అనంతరం ఉభయ సభలు విడివిడిగా 2/3 మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్రపతి సంబంధిత న్యాయమూర్తిని తొలగిస్తారు. ఇంతవరకు ఈ విధంగా ఎవరినీ తొలగించలేదు. 1993లో జస్టిస్ వి.రామస్వామిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ ఇది నెగ్గలేదు. 2011లో జస్టిస్ సౌమిత్రసేన్‌పై తీర్మానం ప్రవేశ పెట్టగా రాజ్యసభలో నెగ్గింది. ఈ తీర్మానం లోక్‌సభకు రాకముందే ఆయన రాజీనామా చేశారు.
రాజీనామా: ప్రకరణ 124 (2ఎ) ప్రకారం - సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

సుప్రీంకోర్టు పరిధి
  1. ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కులను పరిరక్షించే అధికారం.
  2. ఆర్టికల్ 131 ప్రకారం కేంద్రం- రాష్ట్రాల మధ్య వివాదాలు, అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరిస్తుంది.
  3. ఆర్టికల్ 132 ప్రకారం.. హైకోర్టు వెలువరించే తీర్పులో రాజ్యాంగాన్ని మరింత లోతుగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని ధ్రువీకరిస్తే అలాంటి కేసులను సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.
  4. ఆర్టికల్ 133 ప్రకారం.. హైకోర్టుల నుంచి వచ్చే సివిల్ అప్పీళ్లను హైకోర్టు సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు విచారించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది.
  5. ఆర్టికల్ 134 ప్రకారం.. హైకోర్టుల నుంచి వచ్చే క్రిమినల్ అపీళ్లను విచారించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. కింది న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులను హైకోర్టు అప్పీళ్లకు స్వీకరించి అవి ఇచ్చిన తీర్పునకు పూర్తి విరుద్ధమైన తీర్పు చెప్పి, ముద్దాయికి మరణశిక్ష విధించినప్పుడు సుప్రీంకోర్టు విచారిస్తుంది.
  6. హైకోర్టు/ట్రిబ్యునల్ ఏదైనా కేసు తీర్పునకు సంబంధించి ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేయనప్పుడు అంటే తమ తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులుబాటు కల్పించనప్పుడు, ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయవచ్చు.
    రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ప్రకారం- వీటిని విచారించే అధికారం సుప్రీం కోర్టుకు ఉంది. అదే విధంగా ఈ పిటిషన్లను స్వీకరించాలా? వద్దా? అనే విచక్షణాధికారం కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే సుప్రీం కోర్టు చాలా వరకు స్పెషల్ లీవ్ పిటిషన్లను తిరస్కరిస్తుంది.
  7. ప్రకరణ 137 ప్రకారం- సుప్రీంకోర్టుకు తన తీర్పులను తానే సమీక్షించుకునే అధికారం ఉంది.
  8. ఒక హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును మరో హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు బదిలీ చేసే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 139 (ఎ) ప్రకారం ఉంది. వీటిని సుప్రీంకోర్టు స్వయంగా లేదా అటార్నీ జనరల్ ఇచ్చిన అప్లికేషన్ ఆధారంగా చేయవచ్చు. ఉదాహరణకు గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో వచ్చిన బెస్ట్ బేకరీ కేసును సుప్రీంకోర్టు తనకున్న స్వీయ అధికారంతో గుజరాత్ హైకోర్టు నుంచి బాంబే హైకోర్టుకు బదిలీ చేసింది.
  9. రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం- సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు, ఆదేశాలకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి.

క్యూరేటివ్ పిటీషన్:
ఆర్టికల్ 142 ప్రకారం..
సుప్రీంకోర్టు తనంటతాను సృష్టించుకున్న పరిధి ఇది. దీన్ని రెండో సమీక్ష అధికారంగా కూడా పేర్కొనవచ్చు.
రాజ్యాంగంలోని 143 అధికరణ ప్రకారం- రాజ్యాంగ, చట్ట, పాలనపరమైన సందేహాలపై సుప్రీంకోర్టు న్యాయ సలహాలను రాష్ర్టపతి పొందొచ్చు.
ఆర్టికల్ 145 ప్రకారం- సుప్రీంకోర్టు తన అధికార పరిధికి సంబంధించి సొంతగా కొత్త విధానాలు, నిబంధనలు రూపొందించుకునే అధికారం ఉంది. ఉదాహరణకు పిల్, స్టే, బెయిల్ మొదలైన విషయాల్లో నిబంధనలు రూపొందించవచ్చు.

కొత్త హక్కుల రూపకల్పనలో సైతం
సుప్రీంకోర్టు కేవలం న్యాయపరమైన, చట్టపరమైన మార్గనిర్దేశాలు, ఉత్తర్వులు, ఆదేశాల జారీ మాత్రమే కాకుండా.. ప్రజలకు కొత్త హక్కులు కల్పించేందుకు కూడా కృషిచేస్తోంది. ఇందుకు నిదర్శనం నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం. సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పుల ఆధారంగా శాసనపరంగా ప్రాథమిక విద్యా హక్కు చట్టం ప్రతిపాదన వచ్చింది.

పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(పిల్)నూ సుప్రీం కోర్టే ప్రవేశపెట్టింది. 1994లో తీర్పుతో ఆర్టికల్ 356 (రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపు ప్రక్రియ) దుర్వినియోగం కాకుండా నివారించింది. పర్యావరణ పరిరక్షణను సమర్థంగా నిర్వహించడంలో ముందుంది. రాజ్యాంగంలోని మానవ హక్కుల పరిరక్షణలోనూ ముందుంది.

ఇలా గత ఆరున్నర దశాబ్దాలుగా సమర్థంగా, సమాజ న్యాయానికి తోడ్పడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం తన పనితీరు కనబరుస్తోంది. అందుకే సుప్రీంకోర్టు ‘ఫస్ట్ అండ్ లాస్ట్ రిసార్ట్’గా పేరు పొందింది.
Published date : 28 Oct 2015 12:43PM

Photo Stories