Skip to main content

చీకటి చట్టానికీ న్యాయమైన చెల్లుచీటీ

మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్
రాజ్యాంగ మూలసూత్రమైన వాక్ స్వాతంత్య్రానికి సుప్రీం కోర్టు భరోసా ఉంది. ప్రజా స్వామ్య విలువలకు ఊతం దొరికింది. జనం కోసం జైళ్ల్ల తలుపులు తెరిచి ఉంచే ఐటీ చట్టం సెక్షన్ 66ఎ.. సర్వోన్నత న్యాయస్థానం వేటుకు గురైంది. ఎవరికైనా ఇబ్బంది కలిగించే రాతలు పత్రికలలో రాస్తే నేరం కాదు. ఉత్తరాలు రాస్తే నేరం కాదు. కాని ట్వీటర్ లేదా ఈమెయిల్‌లో రాస్తే మాత్రం నేరం. ఇదెక్కడి న్యాయం? ప్రపంచంలో ఎక్కడా అసౌకర్యమైన రాతలు, గాయపరిచే మాటలు రాయడాన్ని నేరంగా పరిగణించి శిక్షించే చట్టాలుండవు. కానీ ఐటీ చట్టం 2000, 66ఎ సెక్షన్ ద్వారా జనాన్ని జైళ్లకు పంపే కొత్త విధానం 2008 నుంచి ఈ దేశంలో ప్రవేశించింది. దాని దెబ్బపడే దాకా మాట్లాడే స్వేచ్ఛకు అదెంత ప్రమాదకరమో చాలా మందికి అర్థం కాలేదు. దీనిని పాలకులూ, పోలీసులూ ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్న సందర్భాలలో అనేక మంది అనేక సార్లు ఇబ్బందులను ప్రస్తావిస్తూ అనేక వ్యాసాలు రాశారు. ఇలా మీడియాలో కొందరు ప్రచార సంగ్రామం చేసినా ప్రభుత్వం కదలలేదు. సుప్రీం కోర్టు లోనే నేరుగా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అయినా ఈ సెక్షన్ ఎంతో గొప్పదనీ, దాని అవసరం ఎంతో ఉంద నీ ప్రభుత్వం వాదించింది.

ఈ సెక్షన్ మన రాజ్యాంగ నియమాలకూ, స్వేచ్ఛా హక్కు సూత్రాలకూ, ఆర్టికల్ 19(1)లో హామీ ఇచ్చిన వాక్ స్వాతంత్య్రానికీ పూర్తిగా భంగకరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జె. చలమేశ్వర్, ఆర్.ఎఫ్. నారిమన్ చరిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో ఒక చీకటి చ ట్టం అంతమైంది. రాజకీయ విమర్శకీ, అసమ్మతికీ, ఉన్నత పదవులలో ఉన్నవారి అభిప్రాయాలను నిలదీసే, వాటిని వ్యతిరేకించే ఆస్కారం లేకపోతే ప్రజాస్వామ్యం అర్థం పర్థం లేని వ్యవహారంగా మిగిలిపోతుంది. ఇలాంటి స్వేచ్ఛ విశృంఖలమైందేమీ కాదు. ఆర్టికల్ 19(2)లోని ఎనిమిది అంశాల ఆధారంగా చట్టపరమైన పరిమితులు విధించవచ్చు. ఐటీ చట్టం ఆ ఎనిమిది అంశాలను దాటి, తప్పు రాతలేమిటో స్పష్టంగా నిర్వచించకుండానే కొత్త శిక్షలను విధించిందని సుప్రీంకోర్టు ‘66 ఎ’ను తప్పు పట్టింది.

మిలియన్ల మందికి ఒకేసారి చేరే సందేశాలు నేరపూరితమైతే శిక్షిస్తామని ఈ చట్టం పేర్కొంది. కాని ఒకే వ్యక్తికి పంపిన సందేశం వల్ల కూడా ఇదే శిక్షకు గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెంటికి మధ్య తేడాను సెక్షన్ 66ఎ వివరించలేదు. కాబట్టే నిలబడలేకపోయింది. ఒక వర్గాన్ని రెచ్చగొట్టే రాతలూ, పబ్లిక్ ఆర్డర్ (శాంతి)కి విఘాతం కలిగించే విధంగా ఉన్న రాతలు మాత్రమే శిక్షార్హమని పేర్కొంటే బాగుండేది. అదీ లేదు. రాతలకూ, వాటి ఫలితానికి మధ్య సంబంధం లేకపోయినా శిక్షార్హమైన నేరాలంటారా? ఒక వ్యక్తిని అల్లరిపెట్టే ఒక్కమాట కూడా నేరమే. దాని వల్ల సమాజానికి, ప్రశాంతతకు నష్టం ఏమీ లేకపోయినా అతడిని శిక్షించే అవకాశం ఉంది. మా ప్రభుత్వం అలా ఎప్పుడూ శిక్షించదు. కేవలం శాంతి భద్రతలను దెబ్బతీసే రచన లను మాత్రమే శిక్షార్హం చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని నమ్మినా, రాబోయే ప్రభుత్వాలు కూడా కట్టుబడి ఉంటాయా? అమాయకంగా రాసిన రాతకూ, ఉద్దేశ పూర్వక ప్రమాదకర రచనకూ తేడా లేకుండా శిక్షించే సౌకర్యం అధికారులకు ఇస్తే దుర్వినియోగం కావడం ఖాయం.

చర్చ, వాదన, అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది. ఇబ్బంది పెట్టేది, ప్రమాదకరమైనది, బాధ కలిగించేది అంటూ రాతను శిక్షించే అవకాశం ఇండియన్ పీనల్ కోడ్‌లో లేదు. రెచ్చగొట్టే రచన కాకపోయినా ఇబ్బంది పెడితే అది నేరంగా పరిగణించేందుకు ఈ సెక్షన్ అవకాశం ఇస్తున్నది. అశ్లీలమైన రచనలను శిక్షార్హం చేయవచ్చు. శిక్షించవచ్చు. చిక్కేమిటంటే- 66ఎ కింద అశ్లీలం కాకపోయినా శిక్షించవచ్చు. నేర పూరితం అంటే ఏమిటో తేల్చని అస్పష్టత 66ఎ నిండా ఉంది. ప్రమాణాలు, మార్గదర్శకాలు, పరిధులు లేకుండా నేర నిర్ణయం అమాయకులను శిక్షించడానికి ఉపయోగపడుతుందని అమెరికా ఇంగ్లాండ్ న్యాయశాస్త్రాలు వివరిస్తున్నాయి. మిగతా సెక్షన్లలో దురుద్దేశంతో, కావాలని, స్వచ్ఛందంగా, మోసపూరితంగా అనే మాటలు ఉన్నాయి. దురుద్దేశపూరితం కాని చర్యలను నేరాలుగా భావించడానికి వీలు లేదు. 66ఎ సెక్షన్‌లో అస్పష్టత ఆ సెక్షన్ మనుగడకు దెబ్బగా పరిణమించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ట్వీటర్, ఫేస్‌బుక్ తదితర మీడియాల్లో విమర్శలకు దిగే గొంతులను నొక్కివేయడానికి ఇప్పుడు వీలులేదు. అసమ్మతి, విమర్శ, భిన్నాభిప్రాయం ప్రజా నిర్ణయాలకు మూలాధారాలు. వాటితోపాటు అవేమీ కాని మామూలు మాటలను కూడా శిక్షార్హంగా పరిగణించడం ఇక చెల్లదు. ‘ఈ బంద్‌లు ఏమిటి?’, ‘ఆయన పోతే నగరం స్థంభించాలా?’, ‘ఆ మంత్రిగారి కొడుక్కున్న ఆస్తులు లెక్కిస్తే అసలు సంగతి తెలుస్తుంది...!’ వంటి మాటలు రాసినందుకు తెల్లవారుఝామునే పోలీసులు రావడం, లాకప్‌కు తరలించడం ఇకపై సాగదు.
Published date : 27 Mar 2015 03:44PM

Photo Stories