Skip to main content

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (Legislative Council) రద్దు- పూర్వాపరాలు

రాజకీయ ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ జనవరి 27, 2020న శాసనమండలి రద్దును సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపధ్యంలో శాసనమండలిని రద్దు చేసే అధికారం శాసనసభలకు ఉందా? ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఏపీలో రద్దు జరిగింది? దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో శాసనమండలి అమలులో ఉంది?... వంటి పూర్తి సమాచారం మీకోసం.
శాసనమండలి అంటే ఏమిటి?
మనదేశంలో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ద్విసభా విధానం అమ‌లులో ఉంది. కేంద్రంలో రాజ్యసభ లేదా ఎగువ సభ, లోక్‌సభ లేదా దిగువసభలుంటే, రాష్ట్ర స్థాయిలో శాసనసభ లేదా విధానసభ, శాసనమండలి లేదా విధానపరిషత్‌లు ఉంటాయి. శాసనసభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే, శాసనమండలి సభ్యులను ప్రజలు పరోక్షంగా ఎన్నుకుంటారు. శాసనమండలికి ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడొంతుల మంది ఎంపికకు ఎన్నికలు జరుగుతాయి. సభ్యుల పదవీకాలం 6 సంత్సరాలు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్ధానాలు 50. ఇక శాసనసభ పంపే ఏ బిల్లు నైనా నిర్మాణాత్మకంగా చర్చించి, అందులో లోటుపాట్లున్నాయని భావిస్తే సవరణలు ప్రతిపాదించడం శాసనమండలి కర్తవ్యం. రాజ్యాంగంలోని ఆరో భాగంలోని 168 ప్రకరణం రాష్ట్ర శాసనసభ నిర్మాణాన్ని పేర్కొంటే, 169(1) ప్రకరణం విధాన పరిషత్ ఏర్పాటు, రద్దు ప్రక్రియ గురించి తెలుపుతుంది.

శాసనమండలి అధికారాలు:
విధాన పరిషత్తుల చట్టం ద్వారా 1958 జూలై 1 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటైంది. అంతకు ముందు లేదు.కర్నూలు రాజధానిగా అవతరించిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంలో కూడా లేదు. శాసనమండలికి వాస్తవంలో ఏవిధమైన అధికారాలు లేవు. శాసనసభ అంగీకరించిన బిల్లుకు శాసనమండలి సవరణలు చేసినా, తిరస్కరించినా, లేక పరిషత్తుకు సమర్పించబడిన తేదీ నుండి ఆ బిల్లు ఆమోదింపబడక మూడు మాసాలు దాటిపోయినా తిరిగి శాసనసభ దానిని పరిశీలించి మార్పులు చేర్పులతో లేదా యధాతధంగా తిరిగి ఆ బిల్లును రెండవసారి పాస్ చేసి మళ్ళీ పరిషత్తుకు పంపడం జరుగుతుంది. అప్పుడు ఆ బిల్లును పరిషత్తు అంగీకరించకపోయినా, లేక ఆ బిల్లు పాస్ చేయకుండా ఒక మాసం పాటు అలాగే మిగిలిపోయినా శాసనసభ అంగీకరించని సవరణలతో పరిషత్తు దానిని పాస్ చేసినా శాసనసభ రెండవమారు బిల్లును ఏ రూపంలో పాస్ చేసిందో అదే రూపంలో శాసనమండలిలో కూడా పాస్ చేయబడినట్లు భావించబడుతుందని రాజ్యాంగంలోని 197వ అధికరణం చెబుతోంది.

మండలి రద్దు ప్రక్రియ ఇలా..
  • రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద శాసన మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.
  • మండలిని రద్దు చేయాలంటే.. రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద రద్దు ప్రతిపాదనను తొలుత రాష్ట్ర కేబినెట్ ఆమోదించాలి. అనంతరం మండలిని రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత సభలో చర్చ అనంతరం 2/3వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాలి. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలి.
  • రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలించి స్వల్ప రాజ్యాంగ సవరణకు పార్లమెంట్, రాజ్యసభ ముందుకు తీసుకువెళ్లాలి.
  • పార్లమెంట్, రాజ్యసభ ఆమోదించాక రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగానే మండలిని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వమే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ చాలా సాధారణమైన అంశమని, రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా కేంద్రం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

తొలిసారిగాఎన్టీఆర్ హయాంలో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు..
1958 జూలై 1న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఏర్పాటైంది. శాసన మండలి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొంటూ మే 31, 1985న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీ రామారావు కౌన్సిల్‌ను రద్దు చేశారు. అప్పట్లో మండలి రద్దు ప్రక్రియ కేవలం మూడు నెలల వ్యవధిలో పూర్తయింది. 1985 మార్చిలో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన ఎన్టీఆర్ అదే నెల 23న మండలిని రద్దు చేయాల్సిందిగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపగా.. అదే ఏడాది మే 31న మండలిని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జూన్ 1, 1985న మండలి మొదటిసారిగా రద్దయిపోయింది. దాదాపు 22 ఏళ్ళ తర్వాత మార్చి 30, 2007న తిరిగి మండలి పునరుద్దరణ జరిగింది.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రస్తుతం రెండోసారి..
రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రపద్రేశ్‌లో నేడు మరోసారి మండలి రద్దుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థిక భారంతోపాటు రాష్ట్ర ప్రజలకు మేలు చేయకపోగా అన్యాయం చేసేలా ప్రతిపక్ష తెలుగుదేశం ఎమ్మెల్సీలు వ్యవహరించారనీ, రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీయే రద్దు బిల్లును అప్రజాస్వామిక రీతిలో అడ్డుకుంటుందనీ శాసన మండలి రద్దుకు వైఎస్ జగన్ తాజాగా నిర్ణయం తీసుకుని ఆ మేరకు అసెంబ్లీలో జనవరి 27, 2020న తీర్మానం ఆమోదింపజేశారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయకోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మండలి పనిచేస్తోందని, కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం తప్ప ఎలాంటి మంచి జరిగే అవకాశం కనిపించట్లేదని.. ఇలాంటి మండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ఇక రాష్ట్రపతి ఆమోదిస్తే... ఏపీలో రెండోసారి శాసన మండలి రద్దు జరుగుతుంది.

ఏయే రాష్ట్రాల్లో శాసనమండలి కొనసాగుతోంది...
దేశవ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసనమండలి కొనసాగింపు జరుగుతోంది. 28 రాష్ట్రాలున్న దేశంలో ఏపీ శాసనమండలి రద్దయితే కేవలం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, యూపీ ఈ 5 రాష్ట్రాల్లో మాత్రమే ఉంటుంది. రద్దయిన శాసన మండలి పునరుద్దరించాలనీ అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఈ 5 రాష్ట్రాలు కేంద్రానికి వినతులు చేసినప్పటికీ.. వీటి పట్ల కేంద్రం విముఖత చూపుతోంది. అంతేకాకుండా 1971,72,75 లలో రాజ్యసభ రద్దుకు ప్రయత్నాలు కూడా జరిగాయి.

శాసనమండలి (ఎగువసభ) తప్పనిసరి కాదనే భావన...!
రాజ్యాంగాన్ని తయారు చేసిన కమిటీ శాసన మండలి తప్పనిసరి అనుకుని ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ రద్దు చేయడానికి వీలులేని విధంగా మండలిని ఏర్పాటు చేసి ఉండేది. రెండో సభను ఆప్షనల్‌గా రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి మండలి రద్దు అధికారాన్ని కూడా ఆర్టికల్ 169 ప్రకారం అసెంబ్లీకే అప్పగించారు. దేశంలో చదువుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో.. మేధావులు, విజ్ఞులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా మండలి ఏర్పాటు చేసుకునే వీలు రాష్ట్రాలకు కల్పించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అలాంటి దుస్థితి లేదు. ఏపీ అసెంబ్లీ (శాసనసభ- 2019)లో ముగ్గురు పీహెచ్‌డీ చేసినవారు, 38 మంది పీజీ చేసినవారు, 13 మంది డాక్టర్లు, 14 మంది ఇంజనీర్లు, 68 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అధికారులు, ఇద్దరు గ్రూప్ - 1 అధికారులు, 1 ప్రొఫెసర్, 1 జర్నలిస్టు, ఇద్దరు ఉపాధ్యాయులు, రైతులు కూడా ఉన్నారు. వీరంతా ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. ఇలాంటప్పుడు ప్రత్యేకంగా శాసనమండలి (పెద్దలసభ) అవసరం ఏముందనే భావనతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా చూస్తే...
అసలు దేశంలో 28 రాష్ట్రాలకుపైగా ఉంటే, వాటిలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే (1956-1985 మధ్య 25 ఏళ్ల పాటు) అంటే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేసేవరకు బతికి ఉండటానికి కారణం ఏమిటి? ఇతర రాష్ట్రాలలో ఆ కౌన్సిళ్లు ఎందుకు లేవు? అనే సందేహాలకు సమాధానమిదిగో...

‘కౌన్సిళ్ల’ లేదా ‘పెద్దల సభ’ పేరిట ఏర్పడినవి.. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలు ఎన్నుకునే శాసనసభలకే ప్రాధాన్యమివ్వాలన్నది 1941 డిసెంబర్ 9 నుంచి 1948 జనవరి 27 మధ్య జరిగిన రాజ్యాంగ నిర్ణయ సభా చర్చల సారాంశమూ, నిర్ణయమూ. సర్వే పల్లి రాధాకృష్ణన్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్, గోపాల స్వామి అయ్యంగార్, మౌలానా హజ్రత్, సిబిన్‌లాల్ సాక్సేనా వంటి ప్రముఖులు మాసాల తరబడి కౌన్సిళ్ల ఏర్పాటుపై చర్చించి, వ్యతిరేకించారు. కారణం-ఎగువ సభలు, దిగువ సభలన్న వివక్షకు వారు వ్యతిరేకం. స్వాతంత్య్రానంతర భారతంలో అభివృద్ధికి దోహదపడే శాసనాలకు అడ్డుపుల్లలుగా తయారైన కౌన్సిళ్లు ఎన్టీఆర్ రద్దు చేసే వరకు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనూ, తరువాత బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాయి. మిగతా దేశమంతటా ఈ కౌన్సిళ్లు రాష్ట్రాల్లో ఏర్పడక పోవడానికి కారణం-ప్రధాన రాజ్యాంగ నిర్మాతగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సహా పలువురు సభ్యులు ఎగువ సభల పేరిట ‘కౌన్సిళ్ల’ నిర్మాణం అన్నది బ్రిటిష్ వలస పాలనావశేషంగా భావించడంవల్లనే. అలాగే, శాసనమండలి (కౌన్సిల్) అన్నది ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే శాసనసభకు దాని నిర్ణయాలకూ మాత్రమే బద్ధమై ఉండాలని గోపాలస్వామి అయ్యంగార్ ప్రతిపాదించారు (రాజ్యాంగ సభ డిబేట్స్: వాల్యూం 1-6, పేజీ 860).

అసెంబ్లీలు గానీ, కౌన్సిళ్లు గానీ అసంఖ్యాకులైన పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడుతూ అభ్యున్నతిని సాధించనప్పుడు, విఫలమైనప్పుడే సామాజిక, రాజకీయ విప్లవాలు ఆవిష్కరించుకుంటాయి. అందుకు చరిత్ర పుటల్లో మరిచిపోని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఫ్రెంచి అసెంబ్లీ, ఎగువ సభలు, రష్యన్ పార్లమెంటు (డ్యూరా), బ్రిటిష్ పార్లమెంటులో సకాలంలో ప్రజాభీష్టాన్ని గౌరవించి మెలగనందువలనే, అణచివేతలకు, నిర్బంధ విధానానికి కారణమైనందుకు ప్రెంచి విప్లవం వచ్చి, బాస్టిలీ దుర్గాన్ని కూల్చివేసింది, అందుకు అనుగుణంగానే తదనంతరం అమెరికా సంయుక్త రాష్ట్రాలూ వలస పెత్తనానికి వ్యతిరేకంగా అమెరికన్ విప్లవమూ, ఆంగ్లో-అమెరికన్-చాంగైషేక్ ప్రజా వ్యతిరేక నిర్బంధ విధానాలపైన చైనా విప్లవమూ వచ్చింది. ఇది చరిత్ర నేర్పిన పాఠం.

అందువల్ల భారతదేశంలాంటి పేదదేశంలో ఖర్చుతో కూడుకున్న ఎగువసభ లాంటి విలాస సంస్థలకు అనేక రాష్ట్రాలు చోటివ్వలేదు. ఆచరణయుక్తమైన చర్చలకు తప్ప ప్రగతిని నిరోధించే, లేదా జాగరణతో బిల్లులను నిర్వీర్యం చేసే కౌన్సిళ్లను అవి ప్రోత్సహించ డంలేదు. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తాజాగా నిర్ణయం తీసుకుంది. భారతదేశ రాష్ట్రపతి ఆమోదంతో అధికారికంగా అది రద్దవుతుంది.

ఈ సందర్భంగా మేధావుల మాటలను ఓ సారి గుర్తుచేసుకుందాం!
‘ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఈ ఎగువ సభలు సమాజాభ్యున్నతికి దోహదం చేయలేదు, ఈ విషయంలో ఇప్పటి నుంచే జాగ్రత్తపడకపోతే ఇండియా అభివృద్దిలో.. రష్యా, అమెరికాలతో పోటీ పడలేదు.
- ప్రొఫెసర్ శిబిన్‌లాల్ సాక్సేనా
Published date : 31 Jan 2020 12:12PM

Photo Stories