Environmental Changes: వాతావరణ మార్పులతో..అల్లకల్లోలం
2022 సంవత్సరంలో 81 విపత్తులు ఆసియా దేశాలను వణికించాయి. అందులో అత్యధిక భాగం వరదలు తుపాన్లే ఉన్నాయి. కరువు కాటకాలతో కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోతే మరికొన్ని దేశాలు వరదలతో విలవిలలాడాయి.
ఈ పరిస్థితులతో ఆసియాలో ఆహార భద్రత సమస్య తలెత్తుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఒ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సామాజికంగా ఆర్థికంగా ఈ దేశాలు మరింత విఛ్చిన్నమవుతాయని డబ్ల్యూఎంఒ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోనే ఆసియా ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతోంది. 1961–1990 మధ్య సగటు వేడి కంటే 1991–2022 మధ్య కాలంలో ఆసియా ఖండంలో వేడిమి రెట్టింపు అయింది. వరదలు, తుపాన్లతో పాటుగా పశ్చిమాసియా దేశాలు ఇసుక తుపాన్లతో విలవిలలాడాయి.
Forest Conservation Act: అటవీ సంరక్షణ చట్టం ఏం చెబుతోంది!
‘‘2022లో వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలపై విపరీతమైన ప్రభావం చూపించింది. సాధారణం కంటే అధిక వేడి, పొడి వాతావరణంతో చైనా కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంది. దీని వల్ల నీటి లభ్యత తగ్గిపోవడమే కాకుండా విద్యుత్ రంగంపై కూడా ప్రభావం పడింది. కేవలం కరువు కారణంగా చైనాలో ఒక్క ఏడాది 706 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వచ్చింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్, భారత్‌లు వరదలు, తుపాన్లతో అల్లాడిపోయాయి’’ అని డబ్ల్యూఎంఒ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ పెట్రి టాలస్ వెల్లడించారు. ఈ అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల వ్యవసాయం, ఆహార భద్రతపై అత్యధిక ప్రభావం చూపిస్తుందని, ఆసియా దేశాల్లో ప్రభుత్వాలు ఆహార భద్రత సవాల్‌ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.
నివేదిక ఏం చెప్పిందంటే ..!
ఆసియా ఖండంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 2022 రెండో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. 1991–2020 సగటు కంటే ఎక్కువగా 0.72డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
► కరువుతో ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోయాయి. నీటి వనరులు తరిగిపోయాయి. ఒక్క చైనాలో కరువు కారణంగా 706 కోట్ల అమెరికా డాలర్ల నష్టం వచ్చింది
► భారీ వర్షాలు, వరదలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి. కేవలం మూడు వారాల్లో ఏడాది మొత్తంగా కురవాల్సి వానలో 60% కురిసింది. పాక్ జనాభాలో 14% మందిపై వరదలు ప్రభావం చూపించాయి
► ఆసియాలోని పర్వత ప్రాంతాల్లో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. గత 40 ఏళ్లలో హిమానీనదాలు పరిమాణం భారీగా తగ్గిపోయింది. గత కొంతకాలంగా మరింత వేగంగా క్షీణిస్తోంది. 2022లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా చాలా హిమానీనదాలు వేగంగా కరిగిపోవడం మొదలైంది. తూర్పు తియెన్ షాన్‌లో ఉరుమ్‌కీ గ్లేసియర్ ఉపరితలం నుంచి 1.25 మీటర్ల మేర క్షీణించింది.
► ఆసియా ఖండంలో సముద్ర ఉపరితలాలు వేడెక్కిపోతున్నాయి. 1982 నుంచి సముద్రాలు వేడెక్కడం మొదలైంది. వాయవ్య అరేబియన్ సముద్రం, ఫిలిప్పైన్స్ సముద్రం, తూర్పు జపాన్‌లో సముద్రం మొదలైనవి ప్రపంచంలో సముద్రాలు వేడెక్కే సగటు రేటు కంటే మూడు రెట్లు అధికంగా వేడెక్కుతున్నాయి. గత దశాబ్దంలో 0.5డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడిమి నమోదైంది.
Environment and Human Life: కొంచెం నెమ్మదిస్తేనే... నిలవగలం!
ఈ ఏడాది ఇంతే:
ఆసియాలో ఈ ఏడాది కూడా వివిధ దేశాలను విపత్తులు వణికిస్తున్నాయి. ఇండోనేసియా సమత్రాలో కొండచరియలు విరిగిపడి 15 వేల ఇళ్లు ధ్వంసమైతే లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చైనాను గత ఏడాది కరువు కాటేస్తే, ఈ ఏడాది వరదలతో అతలాకుతలమవుతోంది. వచ్చే నెలలో మరిన్ని టైఫూన్లు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హరియాణాలను కూడా వణికించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలకి 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇక పాకిస్తాన్‌లోనూ ఈ ఏడాది వరదలకి ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. ఇలా వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలకు సవాల్
విసురుతోంది.