Skip to main content

Education: కల్లోల కాలంలో... కీలకమైన చదువు ఎలా..?

గడచిన రెండేళ్లుగా కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి విద్యారంగంపై తీవ్రంగా ప్రభావితం చూపుతోంది. మొత్తం విద్యా వ్యవస్థను కునారిల్లే విధంగా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా విద్యాసంస్థలు, విద్యార్థులకు విద్యా ప్రక్రియను కొనసాగించడానికి ఆన్‌లైన్‌ విధానాల దిశగా అడుగులు వేస్తూ పెనుమార్పులను ఆకళింపు చేసుకుంటూ సాగాల్సిన అవసరంలో పడ్డాయి. డిజిటల్‌ లెర్నింగ్‌ ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులకు, పాఠశాలలకు, కళాశాలలకు అవసరమైన వనరుగా మారింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ అభ్యసనానికి ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ఆదరణ పెరిగింది, 
         2020లో యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌(యూడీఐఎస్‌ఈ+) రిపోర్టు ప్రకారం 30 శాతం పాఠశాలలకు మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు తేలింది. అందులో కేరళ, దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో నిలిచాయి. ఆన్‌లైన్‌ విద్యను సాధారణ విద్యతో అనుసంధానం చేయడానికి చాలా వనరులు అవసరం అవుతాయి. అందులో ప్రధానంగా హార్డ్‌వేర్‌ డివైజ్‌లు (ఫోన్, ల్యాప్‌టాప్‌), సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌, వీటికన్నా ముఖ్యమైనది నిరంతరాయ ఇంటర్నెట్, విద్యుత్‌ సరఫరా వ్యవస్థలతో పాటు, సుశిక్షితులైన అధ్యాపకులు, విద్యానిపుణులతో పాటు తల్లిదండ్రుల తోడ్పాటు, సహకారం కీలకంగా నిలుస్తాయి. దేశంలో 30 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవితాలు గడుపుతున్నారు.
        ప్రస్తుత విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో ఆర్థిక వనరులను ఈ రంగానికి పుష్కలంగా కేటాయించి, అట్టడుగు వర్గాల విద్యావసరాలను తీర్చడానికి అనువుగా పథకాలు రూపొందించి, అమలు పరచాలి. దేశంలో కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్‌ విద్యకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో టీవీ మాధ్యమం ద్వారా బోధన తరగతుల నిర్వహణ జరుపుతుండటం హర్షణీయం. 
       ఆన్‌లైన్‌ విద్య అమలులో ప్రముఖ భూమిక పోషించేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే. ముఖ్యంగా తల్లిదండ్రుల సంసిద్ధత, సహకారం, పర్యవేక్షణ చాలా అవసరం. ఉపాధ్యాయులు చిత్తశుద్దితో తమ సేవలను అందిస్తూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, విద్యాబోధన సాగిస్తే నిర్దేశిత సామాజిక విద్యా లక్ష్యాలను చేరుకోవడం సాధ్యపడుతుంది. 

విద్యారంగంలో ఏపీ ముందంజ : 
విద్యారంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ ముందుకు సాగడంలో ఆంధ్రప్రదేశ్‌ది ప్రథమస్థానం అనడంలో సందేహం లేదు. యువ సీఎం వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తొలి నుంచి విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.  యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి వీలుగా నాలుగేళ్ల  సాధారణ డిగ్రీ, సాంకేతిక విద్యను మాతృభాషలో అభ్యసించే అవకాశం కల్పించడం ఎంతో ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలుగా నిలుస్తున్నాయి.  ‘నాడు–నేడు’ పథకంలో పాఠశాలల స్వరూపాన్ని మార్పు చేయడం చూసు్తన్నాము. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫైబర్‌ నెట్,  విద్యాకార్యక్రమాల టీవీ ప్రసారాలను ప్రతీ విద్యార్థి ఇంటికి చౌకధరకు చేరువ చేయడం తక్షణ అవసరం. ఇంటర్‌ విద్యార్థులకు అమ్మ ఒడిలో భాగంగా ల్యాప్‌ టాప్‌ను ప్రతిపాదించిన ప్రభుత్వం మరో అడుగు ముందడుగు వేస్తూ పాఠశాల విద్యార్థులకు సైతం స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌(స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫ్‌ థింగ్‌్స–ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, బిగ్‌ డేటా అనలటిక్స్, ఐఓటీ) వంటివి అనుసంధానం చేస్తూ విద్యా వ్యవస్థకు సహకారం అందించాలి. తద్వారా ఆన్‌లైన్‌∙పరీక్షలు నిర్వహించడానికి అనువైన పరిస్థితులు సైతం ఏర్పడతాయి. విద్యార్థులకు, వయోజనులకు ఉపయుక్తంగా డిజిటల్‌ లైబ్రరీలు ఏపీ వ్యాప్తంగా ప్రారంభించారు. తద్వారా నిర్దేశిత విద్యా లక్ష్యాలు సాకారం కావడం సాధ్యపడుతుంది. కోవిడ్‌ వంటి మహమ్మారులు ఎన్ని వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ విద్యారంగం పరుగులు తీయడానికి ఏపీ ప్రభుత్వ విధానాలు నిలుస్తాయడం నిస్సందేహం.
          మహమ్మారి ఉపశమించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలురాష్ట్రాలు పాఠశాలలను తెరిచాయి, తెరుస్తున్నాయి. ఇటీవల తెలంగాణ హైకోర్టు సైతం స్కూల్, ఆన్‌లైన్‌ రెండు రకాల విద్యాబోధనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. స్కూల్‌ విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది, కానీ కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ మళ్లీ విరుచుకుపడితే ఆన్‌లైన్‌ విద్య తప్పకపోవచ్చు. అటు ప్రభుత్వాలు, సమాజాలు, కుటుంబాలు ఈ రెండు రకాల విద్యల అవసరాలను గుర్తించి చర్యలు తీసుకోవడం ప్రస్తుత సందర్భంలో ఎంతైనా అవసరం.
                                                           – వ్యాసకర్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్, సిక్కిం సెంట్రల్‌ యూనివర్సిటీ, గ్యాంగ్టక్
 

Published date : 04 Sep 2021 06:51PM

Photo Stories