Skip to main content

NTA: ఎంసెట్, లాసెట్ వంటి రాష్ట్రాల ప్రవేశ పరీక్షల అన్నీ ఎన్ టీఏ చేతుల్లోకి?

దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలతో పాటు, రాష్ట్రాల్లో నిర్వహించే విద్యా సంబంధమైన సెట్‌లన్నీ తామే నిర్వహించేందుకు అనుమతించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్ టీఏ) కోరింది.
NTA
ఎంసెట్, లాసెట్ వంటి రాష్ట్రాల ప్రవేశ పరీక్షల అన్నీ ఎన్ టీఏ చేతుల్లోకి?

ఈ దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు కొన్ని ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా పరీక్షలు ఎన్ టీఏకి అప్పగింతపై అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలను కేంద్రం కోరడం గమనార్హం. జేఈఈ, నీట్‌ వంటి పరీక్షలను ఎన్ టీఏ స్వతంత్రంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రం ఎంసెట్, ఈసెట్, లాసెట్‌ తదితర ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇలాగే ఇతర రాష్ట్రాలు కూడా సెట్‌లు నిర్వహిస్తుంటాయి. అయితే ఇలా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్రాలు నిర్వహించే సెట్‌లన్నీ భవిష్యత్తులో తామే నిర్వహించాలని ఏజెన్సీ భావిస్తోంది. గత కొన్నాళ్ళుగా తాము నిర్వహించే పరీక్షలకు విశ్వసనీయత, ప్రామాణికత ఉందని ఎన్ టీఏ తన ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టు తెలిసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవించడంతో పాటు పరీక్షల నిర్వహణ పారదర్శకంగా, ఉన్నత ప్రమాణాలతో ఉండేలా తాము చూడగలమని ఈ సంస్థ చెబుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పోటీ పరీక్షల తీరుతెన్నులపై ఆన్ లైన్ సర్వే చేపట్టి, ఆ వివరాలతో కూడిన నివేదికను కేంద్ర విద్యాశాఖ ముందుంచింది. పలు రాష్ట్రాల్లో సెట్‌ల నిర్వహణలో సమన్వయం కొరవడుతోందన్న వాదనను తెరమీదకు తెచ్చినట్టు సమాచారం. జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణలో ఇన్నేళ్లుగా ఇలాంటి సమస్యలేవీ రాలేదన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 

చదవండి: EAMCET - QUICK REVIEWBIT BANKGUIDANCEMODEL PAPERSPREVIOUS PAPERSPRACTICE QUESTIONS

రాష్ట్రాల విముఖత!

కేంద్రీకృత పరీక్ష విధానంపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు సుముఖంగా లేవు. వాస్తవానికి ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులు, వనరులు, సమయాన్ని బట్టి రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు జరుగుతుంటాయి. ఉదాహరణకు ఎంసెట్‌ పరీక్షను జేఈఈ మెయిన్, ఇతర పోటీ పరీక్షలు, అకడమిక్‌ పరీక్షల తేదీలను బట్టి నిర్వహిస్తారు. రాష్ట్రంలోని విద్యార్థుల సౌకర్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని పరీక్ష తేదీల నిర్ధారణ, పరీక్ష కేంద్రాల నిర్వహణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా మరిన్ని వెసులుబాట్లకు అవకాశం ఉంటుందని అంటున్నారు. పరీక్ష పేపర్ల రూపకల్పనలో స్థానిక ఫ్యాకల్టీ ప్రాధాన్యతే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ టీఏ లాంటి సంస్థలు జాతీయ స్థాయిలో ఫ్యాకల్టీని ఎంపిక చేసుకుని, పరీక్ష పేపర్లు రూపొందిస్తే, ఆ ప్రామాణికతను అన్ని స్థాయిల విద్యార్థులు అందుకోలేరని అంటున్నారు.

ఫీజుల భారం పెరిగే అవకాశం

పోటీ పరీక్షల నిర్వహణలో రాష్ట్రాలు అన్ని వర్గాలను, స్థానిక అంశాలను పరిగణనలోనికి తీసుకుంటాయని ఉన్నత విద్యా మండలికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఎంసెట్‌కు రాష్ట్ర విద్యార్థులు రూ.800 చెల్లిస్తే సరిపోతుందని ఉదహరించారు. కానీ నీట్, జేఈఈ పరీక్షలకు రూ.2 వేల వరకు ఫీజు చెల్లించాల్సి వస్తోందని, ఇది పేద విద్యార్థులకు భారంగా ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఎన్ టీఏ రాష్ట్రాల సెట్‌లు నిర్వహిస్తే ఆ ఫీజులు కూడా భారంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. 

తెలంగాణకు స్వీయ సామర్థ్యం ఉంది 

రాష్ట్రంలో ఎంసెట్, దోస్త్‌ నిర్వహణలో ఏటా ఉన్నత విద్యా మండలి సమర్థత రెట్టింపు అవుతోంది. ఈ విషయంలో జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నాం. కోవిడ్‌ కష్టకాలంలోనే చిన్న సమస్య కూడా లేకుండా ఎంసెట్‌ను నిర్వహించాం. స్వీయ సామర్థ్యం, అనుభవం ఉన్న మేము ఇతరుల ప్రమేయాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు.
–ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) 

Published date : 05 Mar 2022 06:22PM

Photo Stories