Skip to main content

New Courses: కొత్త కోర్సులు సరే.. ఫ్యాకల్టీ ఎక్కడ?

రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులపై యూనివర్సిటీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.
New Courses,Technology Learning in a Private CollegeProgramming Class with Students
కొత్త కోర్సులు సరే.. ఫ్యాకల్టీ ఎక్కడ?

 కొత్తగా వచ్చిన కోర్సులకు సంబంధించిన అధ్యాపకుల వివరాలు తెలియజేయాలని కాలేజీలకు సూచిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో పెరిగిన సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ లేదని, సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉన్న వారు అస్సలు లేరని పలు సంఘాల నుంచి ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించడం గమనార్హం.

మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సైతం కంప్యూటర్‌ కోర్సుల్లో నాణ్యత పెంచాలని సూచించింది. వివిధ రంగాల నుంచి నిపుణులను బోధకులుగా తీసుకోవాలని తెలిపింది. వాస్తవానికి అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో ఇలాంటి వాటిపై యూనివర్సిటీలు దృష్టి సారించాయి. అయితే, తమకు కొంత సమయం కావాలని, సీట్లు పెరిగిన తర్వాత అర్హత గల అధ్యాపకులను నియమించుకుంటామని కాలేజీలు తెలిపాయి. కానీ ఇది ఆచరణలో కనిపించడం లేదని యూనివర్సిటీ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్‌

చదవండి: ఇంజనీరింగ్‌ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్

భారీగా పెరిగిన సీట్లు

ఈ విద్యా సంవత్సరంలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు భారీగా పెరిగాయి. వందకుపైగా కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో డిమాండ్‌ లేదని గుర్తింపు ఇచ్చే వర్సిటీలకు తెలిపాయి. వీటిని తగ్గించి, కంప్యూటర్‌ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్‌ వంటి బ్రాంచీల్లో సీట్లు పెంచుకున్నాయి. నిజానికి ఈ ఏడాది కొత్తగా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో 7,635 సీట్లు మంజూరయ్యాయి.

డిమాండ్‌ లేని కోర్సులను రద్దు చేసుకోవడం వల్ల మరో 6,390 సీట్లు అదనంగా మార్పిడి రూపంలో పెరిగాయి. ఈ విధంగా 14,565 సీట్లు కంప్యూటర్‌ సైన్స్, దాని అనుబంధ విభాగాల్లో అదనంగా వచ్చి చేరాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్  వంటి బ్రాంచీలను బోధించే వారు అవసరమైన మేర ఉన్నారు. కానీ కొత్తగా వచ్చిన కంప్యూటర్‌ కోర్సులను బోధించే అనుభవజు్ఞల కొరత రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీలను వేధిస్తోంది.

సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో సీఎస్‌ఈ బ్రాంచీలో బోధించే వారినే కొత్త కోర్సులకు వాడుతున్నారు. వారికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో కొత్త కోర్సుల్లో బోధన నాణ్యత లోపిస్తోందని కాలేజీ అధ్యాపక సంఘా  నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

అనుభవంపై ఆరా

కొత్త కోర్సుల్లో మాస్టర్‌ డిగ్రీ చేసిన వారితోనైనా బోధించేలా చూడాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి. ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌ విభాగాల్లో కంప్యూటర్‌ కోర్సులు చేసిన వాళ్లు అధ్యాపకులుగా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. వారంతా సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డారు. ఈ కారణంగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ) బోధించే అధ్యాపకులున్న కాలేజీల్లో అదనపు కొత్త సబ్జెక్టులనైనా ప్రొఫెషనల్స్‌తో బోధించేందుకు ప్రయత్నించాలని వర్సిటీలు సూచిస్తున్నాయి.

ఎంఎస్, ఇతర మాస్టర్‌ డిగ్రీలు చేసి, కనీసం అయిదేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్న వారితో బోధన సమంజసమని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. ఇలాంటి మార్పు ఎన్ని కాలేజీలకు అవసరమనేది క్షేత్రస్థాయి కాలేజీల వివరాలు పరిశీలించాక ఓ అవగాహనకు వచ్చే వీలుందని ఓ యూనివర్సిటీ వీసీ తెలిపారు. కొత్త కోర్సులను నిర్వహిస్తున్న కొన్ని కాలేజీలను దసరా తర్వాత ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.

Published date : 21 Oct 2023 11:55AM

Photo Stories