CBSE New Exam Pattern 2022-23: తాజా మార్గదర్శకాలు విడుదల.. విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. సంక్షిప్తంగా సీబీఎస్ఈ! జాతీయ స్థాయిలో.. విద్యా బోధనలో.. వినూత్న విధానాలకు కేరాఫ్! విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు.. నిరంతరం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతుంటుంది! ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు.. యాక్టివిటీ, ప్రాక్టికల్ అప్రోచ్‌లకు ప్రాధాన్యమిస్తూ కరిక్యులం రూపొందిస్తుంది! ఇలాంటి సీబీఎస్ఈ తాజాగా.. మరోసారి సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది! బోధన నుంచి మూల్యాంకన వరకు.. వినూత్న విధానాల అమలుకు రంగం సిద్ధం చేసింది! 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే విధంగా పరీక్షల విధానంలో పలు మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో.. సీబీఎస్ఈ తాజా సంస్కరణలు, ఉద్దేశాలు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై విశ్లేషణ..
- పది నుంచి 12 తరగతులకు వార్షిక పరీక్షలు
- 3, 5, 8 తరగతుల విద్యార్థులకు సామర్థ్య అంచనా పరీక్షలు
- 360 డిగ్రీస్ ప్రోగ్రెస్ కార్డ్ విధానం
- ఇంటర్నల్స్లోనూ వినూత్న విధానానికి శ్రీకారం
- ఎన్ఈపీ సిఫార్సులకు అనుగుణంగా మార్పులు
- తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన సీబీఎస్ఈ
సీబీఎస్ఈ కరిక్యులం చదివిన విద్యార్థులకు ఆల్‌రౌండ్ ప్రతిభ సొంతమవుతుంది. దీనికి కారణం.. బోర్డ్ అనుసరించే విధానాలే. అందుకే అధిక శాతం మంది తమ పిల్లలను సీబీఎస్ఈ స్కూల్స్‌లో చదివించాలని ఆశిస్తారు. ఫలితంగా విద్యార్థులకు సబ్జెక్ట్ నైపుణ్యాలతోపాటు లైఫ్ స్కిల్స్ కూడా అలవడతాయని భావిస్తారు.
చదవండి: CBSE 10th Result 2022 Toppers : సీబీఎస్ఈ టెన్త్ టాపర్లు వీరే.. ఇలా అర్థం చేసుకుని చదివా.. పూర్తి మార్కులు సాధించానిలా..
మళ్లీ వార్షిక పరీక్షల విధానం
సీబీఎస్ఈ నూతన సంస్కరణల్లో భాగంగా.. పది, పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థులకు బోర్డ్ ఆధ్వర్యంలో..వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో.. గత ఏడాది టర్మ్1,టర్మ్2 పేరిట పరీక్షలను నిర్వహించింది. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి.. గతంలో మాదిరిగా మళ్లీ వార్షిక పరీక్షలు జరపాలని నిర్ణయించింది. పది నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులకు బోర్డ్ ఆధ్వర్యంలో పరీక్షలు ఉంటాయి. అలాగే ప్రైమరీ నుంచి తొమ్మిదో తరగతి వరకు స్కూల్ స్థాయిలో వార్షిక పరీక్షలు నిర్వహించాలని మార్గదర్శకాలు రూపొందించింది. ఈ వార్షిక పరీక్షలకు 80 మార్కులు ఉంటాయి. మరో 20 మార్కులు ఇంటర్నల్స్‌కు కేటాయిస్తారు. పరీక్షల్లో అడిగే ప్రశ్నల శైలి, విద్యార్థుల నుంచి ఆశించే ప్రమాణాలను సీబీఎస్ఈ స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా టీచర్లు తరగతి గదిలో అనుసరించాల్సిన బోధన ప్రమాణాలపైనా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.
సామర్థ్య స్థాయి
వార్షిక పరీక్షల్లో సబ్జెక్ట్ నైపుణ్యాలతోపాటు విద్యార్థుల్లోని వాస్తవ సామర్థ్య స్థాయిని తెలుసుకునేలా తగిన సంఖ్యలో ప్రశ్నలు ఉండాలని సీబీఎస్ఈ సూచించింది. విద్యార్థులు తరగతి గదిలో పాఠాల ద్వారా నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించగలుగుతున్నారా లేదా అనేది పరిశీలించాలని పేర్కొంది.తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు.. 80 మార్కులకు ఉండే పరీక్షల్లో ఏఏ ప్రశ్నల శాతం ఎంత ఉండాలో కూడా స్పష్టంగా పేర్కొంది.
తొమ్మిది, పదికి ఇలా
- కనీసం 40 శాతం ప్రశ్నలు విద్యార్థుల సామర్థ్య స్థాయిని అంచనా వేసే విధంగా ఉండాలి. వీటిని బహుళైచ్ఛిక ప్రశ్నలు, కేస్ ఆధారిత ప్రశ్నలు, సోర్స్ బేస్డ్ కొశ్చన్స్ రూపంలో అడుగుతారు.
- మరో 20 శాతం సబ్జెక్ట్‌కు సంబంధించిన ఆబ్జెక్టివ్ ప్రశ్నలు.
- మిగతా 40 శాతం ప్రశ్నలు.. లఘు, వ్యాస రూప ప్రశ్నలు.
11, 12 తరగతులకు
- సామర్థ్య స్థాయి ప్రశ్నలు 30 శాతం. ఇవి కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలు, లఘు, వ్యాస రూప తరహా ప్రశ్నలుగా ఉంటాయి. మరో 20 శాతం సబ్జెక్ట్‌కు సంబంధించి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు.
- 50 శాతం ప్రశ్నలు లఘు లేదా వ్యాస రూప సమాధాన ప్రశ్నలు.
- సామర్థ్యం ఆధారంగా అడిగే ప్రశ్నలు(కాంపిటెన్సీ బేస్డ్).. పుస్తకాల్లోని పాఠ్యాంశాల నుంచి కాకుండా.. విద్యార్థులు అభ్యసనం ద్వారా పొందిన నైపుణ్యంతోపాటు పాఠ్యాంశం ఉద్దేశాన్ని గ్రహించి.. వాస్తవ పరిస్థితులతో అన్వయం చేస్తూ సమాధానాలు ఇచ్చే విధంగా ఉంటాయి.
ఛాయిస్ విధానం
సీబీఎస్ఈ వార్షిక పరీక్షల్లో ఛాయిస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రతి సబ్జెక్ట్‌లోనూ 33 శాతం ఛాయిస్ ఉంటుంది. అంటే.. ప్రతి సబ్జెక్ట్‌లోనూ మూల్యాంకనకు పరిగణనలోకి తీసుకునే ప్రశ్నల సంఖ్యకు అదనంగా 33 శాతం ప్రశ్నలు అడుగుతారు. విద్యార్థులు తమకున్న నాలెడ్జ్‌ను ఆధారంగా చేసుకుని ఛాయిస్ విధానంలో సమాధానాలు ఇవ్వొచ్చు.
చదవండి: CBSE Exams: సీబీఎస్ఈ పరీక్షల విధానంలో సంస్కరణలు ఇవే.. ఈ సారి మాత్రం..
అన్ని సబ్జెక్ట్‌లకు ఇంటర్నల్స్
సీబీఎస్ఈ.. ఇంటర్నల్ పరీక్షలను అన్ని సబ్జెక్ట్‌లకు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుత విధానంలో ఇంటర్నల్స్‌ను కేవలం ప్రాక్టికల్ పరీక్షలు ఉండే సబ్జెక్ట్‌లకే నిర్వహించేవారు. ఇకపై ఇవి అన్ని సబ్జెక్ట్‌లకు ఉంటాయి. ఇంటర్నల్స్‌కు మొత్తం 20 మార్కులు కేటాయించారు. ఇంటర్నల్ çపరీక్షల మూల్యాంకనలో సీబీఎస్ఈ వినూత్న విధానాన్ని అనుసరించనుంది. విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లలో చూపిన ప్రతిభ ఆధారంగా∙మార్కులు కేటాయించే విధానం బదులు.. టీచర్లు, తల్లిదండ్రులు, సహచర విద్యార్థుల అభిప్రాయాల ఆధారంగా ఇంటర్నల్స్‌కు మార్కులు కేటాయించాలని సూచించింది. పిరియాడిక్ అసెస్మెంట్, పిరియాడిక్ టెస్ట్స్,మల్టిపుల్ అసెస్మెంట్, పోర్ట్‌ఫోలియో, సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్.. ఇలా వివిధ కోణాల్లో విద్యార్థులు చూపిన ప్రతిభతోపాటు వారిలోని నైపుణ్యాలను సహచర విద్యార్థుల నుంచి తెలుసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టడం విశేషం.
3, 5, 8 తరగతులకు సామర్థ్య çసర్వే
సీబీఎస్ఈ తాజా సంస్కరణల్లో మరో ప్రధానమైన అంశం.. నూతన విద్యా విధానంలో ప్రిపరేటరీ, మిడిల్ స్టేజ్‌లుగా పేర్కొన్న 3, 5, 8వ తరగతుల విద్యార్థులకు కూడా సామర్థ్య సర్వే ఆధారిత మూల్యాంకన చేపట్టడం. అంటే.. పెన్‌పేపర్ పరీక్షల విధానానికి భిన్నంగా యాక్టివిటీ బేస్డ్ టెస్ట్‌లను నిర్వహిస్తారు. దాని ఆధారంగా విద్యార్థులకు ఆయా సబ్జెక్ట్‌లలో ఉన్న సామర్థ్యాన్ని, టీచింగ్‌లెర్నింగ్ మధ్య అంతరాన్ని గుర్తిస్తారు. అదే విధంగా విద్యార్థులు చూపిన ప్రతిభను వారి తల్లిదండ్రులకు తెలియజేస్తారు. ఫలితంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాల్సిన సబ్జెక్ట్‌లు, తదుపరి తరగతుల్లో రాణించడానికి వారిని ఎలా తీర్చిదిద్దాలనే విషయంలో తల్లిదండ్రులకు సైతం ఒక అవగాహన ఏర్పడుతుంది.
360 డిగ్రీ రిపోర్ట్ కార్డ్
సీబీఎస్ఈ తాజా సంస్కరణలో భాగంగా అన్ని తరగతులకు 360 డిగ్రీ రిపోర్ట్ కార్డ్‌లను జారీ చేసే విధానం అమలు చేయనుంది. సబ్జెక్ట్ నైపుణ్యం మొదలు.. సహచర విద్యార్థుల అభిప్రాయాల వరకూ..అన్నింటిని పరిగణనలోకి తీసుకుని.. వాటిని బేరీజు వేసి ఈ రిపోర్ట్ కార్డ్‌ను అందిస్తారు. ఇలా 360 డిగ్రీస్ రిపోర్ట్ కార్డ్‌ను జారీ చేసే క్రమంలో.. ప్రధానంగా సెల్ఫ్ అసెస్మెంట్, పేరెంట్స్ అసెస్మెంట్, టీచర్స్ అసెస్మెంట్, పీర్ అసెస్మెంట్ను పరిగణనలోకి తీసుకుంటారు.
సెల్ఫ్ అసెస్మెంట్లో విద్యార్థులకు సైకోమోటర్ టెస్ట్‌లను, భావోద్వేగ పరీక్షలను, ఆలోచన శక్తిని పరీక్షిస్తారు. వీటిని నిర్దేశిత కాల వ్యవధిలో నిర్వహిస్తారు. వీటిని రాత పరీక్షల మాదిరిగా కాకుండా.. క్విజ్లు, పజిల్స్, గ్రూప్ వర్క్లుగా నిర్వహిస్తారు. విద్యార్థుల ప్రవర్తన శైలిని పరిశీలిస్తారు. ఇలా అన్ని అంశాలను గణించి రిపోర్ట్ కార్డ్(ప్రోగ్రస్ కార్డ్ వంటిది) జారీ చేస్తారు. ఫలితంగా తల్లిదండ్రులకు తమ పిల్లల బలాలు, బలహీనతలు, సామర్థ్యాలు, వ్యక్తిగత ఆసక్తులు తెలుసుకునేందుకు వీలవుతుంది.
చదవండి: Telugu Subject: ఈ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి
భావోద్వేగ నైపుణ్యాలు
సీబీఎస్ఈ నూతన సంస్కరణల ప్రధాన ఉద్దేశం.. విద్యార్థుల్లో ఆలోచన, భావోద్వేగ నైపుణ్యాలు, స్వీయ అవగాహన, అన్వయ నైపుణ్యం, సమస్య పరిష్కారం, ప్రయోగాత్మక అభ్యసన సామర్థ్యాలను పెంచడం వంటివి. అదే విధంగా జీవనోపాధి నైపుణ్యాలకు అవసరమైన పరిజ్ఞానాన్ని, శారీరక, ఆరోగ్య సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటి అంశాలు కూడా నూతన మార్పుల్లో ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
సీబీఎస్ఈ నూతన మూల్యాంకన.. ముఖ్యాంశాలు
- పది,11, 12 తరగతులకు గతంలో మాదిరిగానే 80 మార్కులకు బోర్డ్ ఆధ్వర్యంలో వార్షిక పరీక్షలు. మరో 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలు.
- పదో తరగతిలోపు విద్యార్థులకు స్కూల్ స్థాయిలో వార్షిక పరీక్షలు.
- 3, 5, 8వ తరగతుల విద్యార్థులకు సామర్థ్య సర్వే ఆధారిత మూల్యాంకన విధానం.
- ఇంటర్నల్స్‌కు మార్కులు కేటాయించే విషయంలో టీచర్లు, సహచర విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాల స్వీకరణ.
- నూతనంగా 360 డిగ్రీస్ రిపోర్ట్ కార్డ్ విధానం.
విద్యార్థులకు మేలు చేసే నిర్ణయం
సీబీఎస్ఈ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు విద్యార్థులకు మేలు చేసేవిగా చెప్పొచ్చు. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి వరకు కాంపిటెన్సీ బేస్డ్ ప్రశ్నల విధానం ద్వారా విద్యార్థులు బట్టీ విధానానికి స్వస్తి పలికి.. తమలోని ఆలోచన శక్తికి, విశ్లేషణ శక్తికి పదును పెట్టుకునేందుకు ఆస్కారం లభిస్తుంది. 360 డిగ్రీస్ రిపోర్ట్ కార్డ్ ద్వారా భవిష్యత్తులో ఏ దిశగా అడుగులు వేయాలో స్పష్టమవుతుంది.
ఎస్.వసంత రామన్, డీఏవీ పబ్లిక్ స్కూల్, కూకట్పల్లి
చదవండి: Teachers Jobs: హెస్కూళ్లలో సీబీఎస్ఈ విధానం.. 1,12,853 మంది సబ్జెక్టు టీచర్లు అవసరం