CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో సంస్కరణలు ఇవే.. ఈ సారి మాత్రం..
విద్యార్థులు ఆర్జించిన నైపుణ్యాలు, సామర్థ్యాల ఆధారంగా వారి ప్రతిభను పూర్తిస్థాయిలో మదింపు(అసెస్‌మెంట్) చేసేలా కొత్త మార్పులు తీసుకొస్తున్నట్లు సీబీఎస్‌ఈ ఇప్పటికే ప్రకటించింది. జాతీయ విద్యా విధానం–2020ను ప్రాతిపదికగా తీసుకొని ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. విద్యార్థుల ప్రతిభను మదింపు చేసే సంస్కరణలను కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అందుకే అన్ని స్కూళ్లలో అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సీబీఎస్‌ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి చెప్పారు.
కొత్త మార్పులు ఏమిటంటే..?
☛ విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేయడానికి వీలుగా ప్రాక్టికల్ పరీక్షలు లేని సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. ☛ విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయాల ఆధారంగా 20 శాతం మార్కులు కేటాయిస్తారు. అంటే అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. క్వశ్చన్ పేపర్‌లో ప్రశ్నల సంఖ్యను మరో 33 శాతం పెంచుతారు. వాటిలో తగిన ప్రశ్నలను ఎంచుకొని, సమాధానాలు రాసే అవకాశాన్ని కల్పిస్తారు. సమర్థత, నైపుణ్యాలను నిశితంగా పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు.
☛ పుస్తకాల్లో లేని ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచించి, సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
☛ 3, 5, 8 తరగతుల పిల్లలకు సామర్థ్య సర్వే పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి మార్కుల ఆధారంగా ఉండవు. విద్యార్థుల అభ్యసన స్థాయి, గతంలో పోలిస్తే ప్రతిభను ఎంతవరకు మెరుగుపర్చుకున్నారో వీటిద్వారా తెలుస్తుంది.
☛ విద్యార్థుల టాలెంట్‌ను అన్ని కోణాల్లో అంచనా వేసేలా ప్రత్యేక ప్రోగ్రెస్ కార్డ్‌ను సీబీఎస్‌ఈ జారీ చేస్తుంది.