Skip to main content

Boxing World Championship: ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా భారత్.. రెండోసారి స్వర్ణ పతకం సాధించిన తెలుగ‌మ్మాయి..

సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు పసిడి పంచ్‌లతో అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో తమ అత్యుత్తమ ‘స్వర్ణ’ ప్రదర్శనను సమం చేశారు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నాలుగు బంగారు పతకాలతో తమ ప్రస్థానాన్ని ముగించింది. మార్చి 25న నీతూ (48 కేజీలు), స్వీటీ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించగా.. మార్చి 26న నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (75 కేజీలు) ‘గోల్డెన్‌’ ఫినిషింగ్‌ ఇచ్చారు.
Nikhat Zareen

భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్ (తెలంగాణ అమ్మాయి) వరుసగా రెండో ఏడాది ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో మార్చి 26న‌ ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 26 ఏళ్ల నిఖత్‌ 50 కేజీల విభాగంలో విజేతగా అవతరించింది. ఫైనల్లో నిఖత్‌ 5–0తో రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన ఎన్గుయెన్‌ థి టామ్‌ (వియత్నాం)పై గెలుపొందింది. గత ఏడాది తుర్కియేలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ 52 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచింది.
తాజా ప్రదర్శనతో నిఖత్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందింది. దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఏడు పతకాలు సాధించింది. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఐదు పతకాలు గెలిచింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

‘బెస్ట్‌ బాక్సర్‌’ అవార్డు..
టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన నిఖత్‌కు ‘బెస్ట్‌ బాక్సర్‌’ అవార్డు కూడా లభించింది. విజేతగా నిలిచిన నిఖత్‌కు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ‘బెస్ట్‌ బాక్సర్‌’ పురస్కారం కింద ‘మహీంద్రా థార్‌’ వాహనం లభించింది.  
ఓవరాల్‌ చాంపియన్‌ భారత్‌.. 
ఆతిథ్య భారత్‌ నాలుగు స్వర్ణ పతకాలతో ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. చైనా మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో ఏడు పతకాలతో రన్నరప్‌గా నిలిచింది. ర్యాంక్‌ వర్గీకరణలో నెగ్గిన స్వర్ణ పతకాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. రష్యా ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో మూడు పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. 
మొత్తం 12 వెయిట్‌ కేటగిరీలలో 48 పతకాల కోసం బౌట్‌లు జరగ్గా.. 20 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. రష్యా బాక్సర్లను అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఐబీఏ నిర్ణయాన్ని నిరసిస్తూ 17 దేశాలు ఈ పోటీలకు దూరంగా ఉన్నాయి. 

లవ్లీనా తొలిసారి.. 

Lovlina


అస్సాం బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైన్‌ మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. 2018, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్న లవ్లీనా ఈసారి మాత్రం విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో లవ్లీనా 5–2తో కైట్లిన్‌ పార్కర్‌ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన లవ్లీనాకు లక్ష డాలర్లు (రూ.82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..

నీతూ, స్వీటీలకు స్వర్ణాలు..
48 కేజీల విభాగంలో నీతూ ఘంఘాస్, 81 కేజీల కేటగిరీలో స్వీటీ బూరా విశ్వ విజేతలుగా నిలిచారు. మార్చి 25న‌ జరిగిన ఫైనల్‌ పోరులో నీతూ తన ప్రత్యర్థిపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించి అగ్రస్థానంలో నిలవగా.. హోరాహోరీ సమరంలో స్వీటీ పైచేయి సాధించింది. వీరిద్దరు తొలి సారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను పొందారు. ఫైనల్లో నీతూ 5–0తో లుట్‌సైఖన్‌ అల్టాన్‌సెట్సెగ్‌ (మంగోలియా)ను చిత్తు చేయగా, స్వీటీ 4–3తో వాంగ్‌ లినా (చైనా)ను ఓడించింది. విజేతలుగా నిలిచిన నీతూ, స్వీటీలకు చెరో లక్ష డాలర్లు (సుమారు రూ.82.7 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

Neethu

☛ భారత్‌ నుంచి గతంలో ఐదుగురు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచారు. మేరీకోమ్‌ (ఆరు సార్లు – 2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), ఆర్‌ఎల్‌ జెన్నీ (2006), కేసీ లేఖ (2006), నిఖత్‌ జరీన్‌ (2022) ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఈ జాబితాలో నీతూ, స్వీటీ చేరారు.  
☛ 22 ఏళ్ల నీతూ అతి వేగంగా బాక్సింగ్‌ తెరపైకి దూసుకొచ్చింది. తన ఎడమ చేతి వాటం శైలితో ‘మరో మేరీకోమ్‌’గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2016లో యూత్‌ నేషనల్స్‌లో తొలిసారి విజేతగా నిలిచి అందరి దృష్టిలో పడింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే ఆమె ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం. గత ఏడాది జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఇప్పటి వరకు నీతూ అత్యుత్తమ ప్రదర్శన. 
☛ 30 ఏళ్ల స్వీటీ ఆరంభంలో కబడ్డీ క్రీడాకారిణి. కబడ్డీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత తండ్రి ప్రోత్సాహంతో బాక్సింగ్‌ వైపు మారింది. మూడు ఆసియా చాంపియన్‌షిప్‌ పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2014లో వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరింది. అయితే ఆ తర్వాత వేర్వేరు కారణాలతో కొంత కాలం ఆటకు దూరమైనా ఇప్పుడు తిరిగొచ్చి సత్తా చాటింది. భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌ దీపక్‌ నివాస్‌ హుడా ఆమె భర్త.

Published date : 27 Mar 2023 06:48PM

Photo Stories