Diabetes: క్లోమాన్ని ప్రేరేపించే పీకే2ను ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు?
మధుమేహానికి నోటి ద్వారా తీసుకునే సరికొత్త మందు అభివృద్ధి దిశగా భారత పరిశోధకులు ముందడుగు వేశారు. ఇన్సులిన్ ను విడుదల చేసేలా క్లోమాన్ని ప్రేరేపించే పదార్థాన్ని వారు గుర్తించారు. దీన్ని పీకే2గా పిలుస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో ఉన్న ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయికి అనుగుణంగా క్లోమంలోని బీటా కణాలు సరిపడినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోవడం మధుమేహానికి దారితీస్తుంది. ఇన్సులిన్ విడుదలలో అనేక జీవరసాయన ప్రక్రియలకు పాత్ర ఉంటుంది. బీటా కణాల్లోని జీఎల్‌పీ1ఆర్ ప్రొటీన్ కూ ఇందులో ప్రమేయం ఉంది. భోజనం చేశాక విడుదలయ్యే జీఎల్‌పీ1 అనే హార్మోనల్ పదార్థం.. జీఎల్‌పీ1ఆర్‌కు అంటుకొని, ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఎక్సెనాటైడ్, లిరాగ్లుటైడ్ వంటి ఔషధాలు కూడా జీఎల్‌పీ1 పాత్రను పోషిస్తూ ఇన్సులిన్ విడుదలకు దోహదపడతాయి. ఈ ఔషధాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తల బృందం కంప్యూటర్ సిమ్యులేషన్ విధానాలను ఉపయోగించింది. జీఎల్‌పీ1ఆర్‌తో బంధాన్ని ఏర్పరిచే సామర్థ్యమున్న పదార్థాల కోసం శోధించారు. పీకే2 వైపు మొగ్గారు. ఇన్సులిన్ ఉత్పత్తి చేసేలా బీటా కణాలను ప్రేరేపించే సత్తా ఈ పదార్థానికి ఉందని ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడైంది. పీకే2ను జీర్ణాశయ వ్యవస్థ వేగంగా గ్రహించగలుగుతోందని, దీన్ని ఇంజెక్షన్ రూపంలో కాకుండా నోటి ద్వారా తీసుకునే మందులా వాడొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. నష్టపోయిన బీటా కణాలనూ పునరుద్ధరించే సత్తా దీనికి ఉందని గుర్తించారు.