RBI Regional Office: విశాఖలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలన్నీ హైదరాబాద్‌లోని రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం నుంచే కొనసాగించింది. రాష్ట్ర విభజన అనంతరం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన లావాదేవీలన్నీ అక్కడి నుంచే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహించే సమావేశాలకు హైదరాబాద్ నుంచే అధికారులు విజయవాడకు వస్తున్నారు. దీనివల్ల పరిపాలన సౌలభ్యం కష్టసాధ్యమవుతుందని.. రాష్ట్రంలోనే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఈ క్రమంలో విశాఖలో ఆర్‌బీఐ బృందం ఇటీవల పర్యటించింది. జిల్లా అధికారులతో చర్చించి పలు భవనాలను పరిశీలించింది. 500 మంది ఉద్యోగులతో ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు దాదాపు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనం అవసరమని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ బృందం జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జునతో సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో మధురవాడ, రుషికొండ, ఆరిలోవ, కొమ్మాది, భీమిలి, హనుమంతువాక, కైలాసగిరి, సాగర్‌నగర్ పరిధిలోని పలు భవనాల్ని పరిశీలించారు.