Skip to main content

Statue of Equality: సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ఆవిష్కరించారు?

Statue of Equality

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, ముచ్చింతల్‌ గ్రామ పరిధిలోని శ్రీరామనగరం(హైదరాబాద్‌ సమీపం)లో నిర్వహిస్తున్న శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. శ్రీరామానుజాచార్యుల స్ఫూర్తిని ప్రపంచానికి చాటేందుకు శ్రీరామనగరంలోని భద్రవేది వద్ద నిర్మించిన 216 అడుగుల సమతామూర్తి (స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ) విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి, లోకాంకితం చేశారు. త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాల్లో దేశంలోనే పెద్దదైన రామానుజుల విరాట్‌మూర్తి వద్దకు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సందర్శకులను అనుమతించారు.

ప్రధాని ప్రసంగం..

స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ‘‘రామానుజాచార్యులు అద్వైత, ద్వైత సిద్ధాంతాలను సమ్మిళితం చేసి విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు. తన బోధనల్లో కర్మ సిద్ధాంతాన్ని ఉత్తమ రీతిలో ప్రస్తావించడంతోపాటు స్వయంగా తన పూర్తి జీవితాన్ని అందుకోసమే సమర్పించారు. అంబేడ్కర్‌ వంటివారు రామానుజాచార్యుల బోధనల నుంచి నేర్చుకోవాలని అనేవారు. హైదరాబాద్‌ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ఏకత్వాన్ని.. రామానుజాచార్యుల ‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’ సమానత్వాన్ని బోధిస్తున్నాయి.’’ అని పేర్కొన్నారు.

రూ.వెయ్యి కోట్ల అంచనాతో..

శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్దిని పురష్కరించుకుని సమతామూర్తి రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1,100 టన్నుల బరువు ఉండే 216 అడుగుల పంచలోహ విగ్రహంతోపాటు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.వెయ్యి కోట్ల అంచనాతో స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేశారు. 2014లో ఈ పనులకు చినజీయర్‌ స్వామి భూమిపూజ చేశారు. నిత్యం పూజలు అందుకునే విధంగా 120 కిలోల బంగారంతో మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు. రామానుజుల సహస్రాబ్ది వేడుకలను 2022, ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు.

చ‌ద‌వండి: రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నోవా ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటైంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సమతామూర్తి (స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ) విగ్రహావిష్కరణ
ఎప్పుడు  : ఫిబ్రవరి 5
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : ముచ్చింతల్‌ గ్రామం, శంషాబాద్‌ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
ఎందుకు : శ్రీరామానుజాచార్యుల స్ఫూర్తిని ప్రపంచానికి చాటేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Feb 2022 03:50PM

Photo Stories