NITI Aayog ‘National Multidimensional Poverty Index': ఏపీలో తగ్గిన పేదరికం..
కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘జాతీయ బహుముఖ పేదరిక సూచీ’ నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది. 2016 కంటే 2021 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలు దాదాపుగా సగం వరకు తగ్గారని నివేదిక తెలిపింది. మరోవైపు ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని పేర్కొంది.
☛☛ Niti Aayog Rankings in Aspirational Districts: నీతి ఆయోగ్ టాప్ లిస్ట్‌లో వైఎస్సార్ జిల్లా
పౌష్టికాహారం, శిశు మరణాల రేటు, తల్లుల ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు శాతం, వంటనూనెల వినియోగం, పరిశుభ్రత, తాగునీరు, గృహ వసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు కలిగి ఉండటం లాంటి 12 అంశాలు ప్రామాణికంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే నివేదికను నీతి ఆయోగ్ తాజాగా వెల్లడించింది. జిల్లాల వారీగా పేదరికం తగ్గుదల గణాంకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
గ్రామాల్లో గణనీయంగా తగ్గుదల:
2016 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 11.77 శాతం మంది ప్రజలు నిరుపేదలుండగా 2021 డిసెంబర్ నాటికి 6.06 శాతానికి తగ్గారు. నిరుపేదలు 5.71 శాతం తగ్గారని నీతి ఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా తగ్గంది. 2016 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 14.72 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 4.63 శాతం మంది నిరుపేదలున్నారు. 2021 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు 7.71 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 2.20 శాతానికి తగ్గారు. గ్రామీణ ప్రాంతాల్లో 7.01 శాతం, పట్టణ ప్రాంతాల్లో 2.43 శాతం పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్ వెల్లడించింది.
2016 డిసెంబర్‌లో నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం మొత్తం జనాభాలో 10 శాతం కంటే తక్కువ పేదలున్న రాష్ట్రాల జాబితాలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, కేరళ, గోవా, మిజోరాం రాష్ట్రాలే ఉన్నాయి.