Skip to main content

మే 2017 రాష్ట్రీయం

స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల కార్యక్రమం ప్రారంభం
ప్రభుత్వ బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో రోజువారి దుప్పట్లు మార్చే ‘స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 24న విజయవాడలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇకపై రోజుకో రంగు బెడ్ షీట్ మారుస్తారు. ఆయా వార్డుల్లో ఏ రోజు ఏ రంగు దుప్పటి ఉపయోగించేది బెడ్‌షీట్ల మీద రాస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : మే 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు
ఎక్కడ : విజయవాడ
ఎందుకు : ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజువారీ దుప్పట్ల మార్పు కోసం

తెలంగాణ ‘సోనా’ విక్రయానికి అనుమతి
Current Affairs తెలంగాణ సోనా బియ్యం (ఆర్‌ఎన్‌ఆర్-15048) విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటివరకు సన్న బియ్యం పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్న వ్యాపారులు, మిల్లర్లు ఇకనుంచి తెలంగాణ సోనా బ్రాండ్‌తో బియ్యం అమ్ముకోవచ్చని ప్రభుత్వం స్పష్టీకరించినట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ప్రవీణ్‌రావు తెలిపారు. విశ్వవిద్యాలయం ఆర్‌ఎన్‌ఆర్-15048 వరి రకాన్ని 2015లో తయారు చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కూడా ఇచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌ఎన్‌ఆర్-15408 రకం సోనా బియ్యం అమ్మకానికి అనుమతి
ఎప్పుడు : మే 24
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

ఆదాయ వృద్ధిలో దేశంలో తెలంగాణ టాప్
ఆదాయ వృద్ధి రేటులో తెలంగాణ మరోసారి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ మేరకు కాగ్ 2017 ఫిబ్రవరి వరకు వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ 17.81 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. 17.16 శాతం వృద్ధితో పశ్చిమబెంగాల్ రెండో స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో నిలిచింది.
తెలంగాణలో ప్రధానంగా వ్యాట్, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం 17.82% పెరిగింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయమూ కలిపితే 17.81% వృద్ధి నమోదైంది.
ఆదాయ వివరాలివీ..
  • 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2016 ఫిబ్రవరి వరకు రూ.33,257 కోట్ల ఆదాయం రాగా, 2016-17 సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.39,183 కోట్ల ఆదాయం సమకూరింది.
  • ప్రధాన పన్నులతో కలిపి రవాణా రంగం, నాలా, అటవీ, వృత్తి పన్ను తదితరాలనూ కలుపుకుంటే 2015-16లో రూ.36,130 కోట్ల ఆదాయం రాగా 2016-17లో రూ.42,564 కోట్ల ఆదాయం వచ్చింది. రెండు విభాగాల్లోనూ దేశంలోని తెలంగాణ తొలి స్థానంలో ఉంది.
  • పన్ను ఆదాయంలో జార్ఖండ్ రెండో స్థానం (16.86%), ఛత్తీస్‌గఢ్ మూడో స్థానం (11.41%)లో ఉన్నాయి.
  • రాష్ట్ర సొంత పన్ను ఆదాయాన్నీ కలిపితే పశ్చిమబెంగాల్ రెండో స్థానం (17.16%), జార్ఖండ్ మూడో స్థానం (16.42%)లో ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ ఏపీ ఏడో స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆదాయ వృద్ధిలో దేశంలో తొలిస్థానంలో తెలంగాణ
ఎప్పుడు : మే 25
ఎవరు : కాగ్
ఎందుకు : 2016-17లో 17.81 శాతం వృద్ధి

తెలుగు రాష్ట్రాల పోలీసులకు ఫిక్కీ అవార్డులు
న్యూఢిల్లీలో మే 25న జరిగిన ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్-2017 అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల పోలీసులకు పలు అవార్డులు దక్కాయి. తెలంగాణ పోలీసు శాఖకు 5, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు రెండు విభాగాల్లో అవార్డులు దక్కాయి.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాల్లో అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులను అధ్యయనం చేసి ఫిక్కీ ఈ అవార్డులకు ఎంపిక చేసింది.
తెలంగాణ పోలీసుల అవార్డులు
  • పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు గాను స్మార్ట్ వెరిఫికేషన్ అవార్డు
  • సైబర్ నేరాల నియంత్రణకు కీలక కృషి చేస్తున్న హైదరాబాద్ కమిషనరేట్‌లోని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అవార్డు.
  • స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ - హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి
  • రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తానికి స్మార్ట్ ఇన్నొవేటివ్ పోలీసింగ్ కింద స్పెషల్ జ్యూరీ అవార్డు
  • ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ అండ్ నెట్‌వర్క్ సిస్టమ్ ప్రాజెక్ట్‌కు సూర్యాపేట ఎస్పీ పరిమళ హనా నూతన్‌కు అవార్డు.
ఆంధ్రప్రదేశ్ పోలీసుల అవార్డులు
  • కోర్టు మానిటరింగ్ సిస్టంలో అవార్డు
  • ఈ-ట్రాఫిక్ చలాన్‌లకు అవార్డు
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్మార్ట్ పోలీసింగ్ అవార్డులు - 2017
ఎప్పుడు : మే 25
ఎవరు : ఫిక్కీ
ఎక్కడ : న్యూఢిల్లీలో

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రం (2016 - 17)
తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా వెనుకబడిపోయింది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలు ఏపీకన్నా ముందుస్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ తలసరి ఆదాయం ఏపీకన్నా సుమారు రూ.20 వేలు ఎక్కువగా ఉంది. రెండురోజుల జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా మే 25న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన 2016-17 రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం ఈ వివరాలు వెల్లడించింది.
నివేదిక ప్రకారం మహారాష్ట్ర, హర్యాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో వెనుకబడింది. పంజాబ్ తలసరి ఆదాయం రూ.1,26,063 కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,40,683, ఏపీ తలసరి ఆదాయం రూ.1,22,376గా ఉంది.
జిల్లాల ఆర్థిక ముఖచిత్రం విడుదల
ఆదాయంలో (జిల్లాల స్థూల ఉత్పత్తి) కృష్ణా, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా విజయనగరం, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తితో పాటు ఏ ఏ రంగాల్లో ఏ ఏ జిల్లాలు ఏ స్థానంలో ఉన్నాయనే వివరాలు (2016-17) కూడా చంద్రబాబు విడుదల చేశారు. వ్యవసాయ రంగం ఆదాయంలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అలాగే పారిశ్రామిక రంగం ఆదాయంలో విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. సర్వీసు రంగంలో విశాఖపట్నం తొలి స్థానంలో ఉండగా కృష్ణా, గుంటూరు జిల్లాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఇక తలసరి ఆదాయంలో కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నంలు జిల్లాలు మొదటి మూడు స్థానాలు ఆక్రమించాయి.
2016-17లో పలు రాష్ట్రాల తలసరి ఆదాయం వివరాలు..

రాష్ట్రం పేరు

తలసరి ఆదాయం (రూ.లలో)

మహారాష్ట్ర

1,68,677

హర్యాణ

1,62,034

కర్ణాటక

1,59,977

కేరళ

1,55,516

తమిళనాడు

1,43,547

తెలంగాణ

1,40,683

గుజరాత్

1,38,023

పంజాబ్

1,26,063

ఆంధ్రప్రదేశ్

1,22,376


మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఏపీ స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, తలసరి అప్పు, తలసరి వ్యయం, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం వివరాలు..(రూ.లలో)

అంశం

2014-15

2015-16

2016-17

రాష్ట్ర స్థూల ఉత్పత్తి

5,26,470 కోట్లు

6,09,934 కోట్లు

6,99,307 కోట్లు

జనాభా

5,01,51,000

5,04,46,000

5,07,43,000

తలసరి ఆదాయం

93,699

1,08,163

1,22,376

పన్ను రెవెన్యూ

42,618 కోట్లు

44,423 కోట్లు

52,318 కోట్లు

మొత్తం అప్పులు

1,56,472 కోట్లు

1,70,115 కోట్లు

1,90,513 కోట్లు

తలసరి అప్పు

31,200

33,722

37,545

మొత్తం వ్యయం

1,12,067 కోట్లు

1,12,216 కోట్లు

1,35,689 కోట్లు

తలసరి వ్యయం

22,346

22,245

26,740

జీఎస్‌డీపీలో పన్ను శాతం

8.10

7.28

7.48


2016-17లో రంగాల వారీగా జిల్లాల ఆదాయ వివరాలు...

జిల్లా పేరు

స్థూల ఉత్పత్తి (రూ.కోట్లలో)

ర్యాంకు

తలసరిఆదాయం(రూ.లలో)

ర్యాంకు

కృష్ణా

85,433

1

1,61,097

1

విశాఖపట్నం

77,697

2

1,42,821

3

తూర్పుగోదావరి

74,448

3

1,18,249

8

గుంటూరు

69,872

4

1,21,145

6

పశ్చిమగోదావరి

67,588

5

1,52,153

2

చిత్తూరు

51,679

6

1,09,141

9

ప్రకాశం

46,528

7

1,22,939

5

నెల్లూరు

46,310

8

1,37,159

4

కర్నూలు

46,222

9

99,116

10

అనంతపురం

45,086

10

97,912

11

వైఎస్సార్

34,485

11

1,19,244

7

శ్రీకాకుళం

28,223

12

94,118

13

విజయనగరం

25,734

13

94,772

12


ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.3 శాతం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత 67.3 శాతంగా (రాష్ట్ర జనాభా 5,07,43,000) తేలింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో (74 శాతం మంది) అక్షరాస్యులున్నట్లు వెల్లడైంది.
అలాగే రాష్ట్రంలో 1,34,93,671 మంది చదువురానివారు ఉండగా అత్యధికంగా కర్నూలు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నిరక్షరాస్యులున్నట్లు సర్వేలో వెల్లడైంది.
జిల్లాల వారీగా అక్షరాస్యత, నిరక్షరాస్యుల సంఖ్య

జిల్లా పేరు

అక్షరాస్యత శాతం

నిరక్షరాస్యులు

విజయనగరం

60.9

7,69,521

నెల్లూరు

66.8

7,91,554

వైఎస్‌ఆర్

63.1

8,16,351

శ్రీకాకుళం

62.9

8,38,668

పశ్చిమగోదావరి

73.5

8,91,084

కృష్ణా

74.0

9,57,074

చిత్తూరు

70.9

9,97,190

ప్రకాశం

63.8

10,31,053

విశాఖపట్నం

69.6

11,51,317

అనంతపురం

63.6

12,52,675

తూర్పుగోదావరి

70.6

13,14,798

గుంటూరు

66.6

13,37,946

కర్నూలు

60.2

13,44,440

రాష్ట్రంమొత్తం

67.3

1,34,93,671


ఆంధ్రప్రదేశ్ సంతోష సూచీ 2016-17
సంతోష సూచిక (హ్యాపీనెస్ సర్వే)లో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ హ్యాపీనెస్ సర్వే 2016-17 తేల్చింది. ప్రజల ఆనందం విషయంలో అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో మన దేశం 122వ స్థానంలో ఉండగా 5.368 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ 72వ స్థానంలో ఉందని పేర్కొంది. విజన్ 2029లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక శాఖ ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ హ్యాపీనెస్ సర్వే 2016-17ను సీఎం చంద్రబాబునాయుడు మే 25న కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి సొల్యూషన్ నెట్‌వర్క్ ప్రపంచ ఆనంద సూచికల ఆధారంగా ఈ సర్వే నివేదిక రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
జిల్లాల సంతోష సూచీ

జిల్లా

స్కోరు

శ్రీకాకుళం

6.414

పశ్చిమగోదావరి

6.067

కృష్ణా

5.746

నెల్లూరు

5.720

తూర్పుగోదావరి

5.672

గుంటూరు

5.515

విజయనగరం

5.370

విశాఖపట్నం

5.053

అనంతపురం

4.966

వైఎస్సార్

4.867

కర్నూలు

4.775

చిత్తూరు

4.751

ప్రకాశం

4.679

(పది పాయింట్లకు నమోదైన ‘సంతోషం’ స్కోరు)

ఏపీ పట్టణ మురికి వాడల జనాభా 50 లక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాల్లో అర కోటి మందికిపైగా మురికివాడల్లోనే నివాసం ఉంటున్నారు. పట్టణాల్లో కనీస సౌకర్యాల అందుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం రాష్ట్రంలో 51,59,131 మంది మురికివాడల్లో నివాసం ఉంటున్నట్లు తేలింది. అలాగే పట్టణాల్లో కోటి మంది పైగా జనాభాకు అవసరమైన కనీస నీటిని సరఫరా చేయడం లేదని సర్వేలో తేలింది. పట్టణాల్లో ఒక్కో వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. కేవలం 89 లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు.
జిల్లాల వారీగా పట్టణాల్లో మురికివాడల్లో నివసిస్తున్న వారి సంఖ్య, అలాగే 135 లీటర్ల నీటిని సరఫరా చేయని జనాభా వివరాలివీ..

జిల్లా

135 ఎల్‌పీసీడీ సరఫరా కాని జనాభా వారు

మురికివాడల్లో నివశిస్తున్న

శ్రీకాకుళం

3,50,535

1,09,195

పశ్చిమగోదావరి

4,33,948

3,29,218

విజయనగరం

4,58,270

1,90,753

కృష్ణా

5,86,146

6,10,839

ప్రకాశం

6,57,455

2,12,572

కర్నూలు

7,38,628

5,06,457

తూర్పుగోదావరి

8,13,556

3,78,036

అనంతపురం

8,87,136

4,52,073

నెల్లూరు

9,40,806

3,09,779

గుంటూరు

9,41,331

6,48,371

వైఎస్‌ఆర్

9,80,235

3,28,930

చిత్తూరు

11,18,088

2,64,433

విశాఖపట్నం

21,53,585

8,18,474

మొత్తం

1,10,59,719

51,59,131

క్విక్ రివ్యూ:
ఏమిటి : పట్టణ మురికివాడల జనాభా 50 లక్షలు
ఎప్పుడు : మే 26
ఎవరు : ఏపీ ప్రభుత్వ సర్వే
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో

థైరాయిడ్ బాధితుల్లో 5వ స్థానంలో హైదరాబాద్
జాతీయ స్థాయిలో 18 ఏళ్లు పైబడిన వారిలో 10.95 శాతం మంది థైరాయిడ్‌తో బాధపడుతున్నారని ఇండియన్ థైరాయిడ్ ఎపిడమియాలజీ స్టడీ వెల్లడించింది. వీరిలో 15.86 శాతం మంది మహిళలు, 5.02 శాతం మంది పురుషులు ఉన్నారు.
2012-2013లో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూర్, అహ్మదాబాద్, గోవా, చైన్నై, హైదరాబాద్‌ల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. వివిధ ప్రాంతాల్లో థైరాయిడ్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. దేశంలోనే అత్యధికంగా కోల్‌కతాలో 21.6, ఢిల్లీలో 11.07, అహ్మదాబాద్‌లో 10.6, ముంబైలో 9.6 శాతం ఉండగా... దక్షిణాది నగరాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 8.88 శాతం బాధితులు ఉన్నట్లు తేలింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో థైరాయిడ్ బాధితులపై సర్వే
ఎప్పుడు : 2012 - 2013లో
ఎవరు : ఇండియన్ థైరాయిడ్ ఎపిడమియాలజీ స్టడీ

దర్శకరత్న దాసరి నారాయణరావు కన్నుమూత
దర్శకుడు, నటుడు, రచయిత, పత్రికాధిపతి దాసరి నారాయణ రావు (72) మే 30న హైదరాబాద్‌లో కన్నుమూశారు. చికిత్స సమయంలో అకస్మాత్తుగా గుండె పని చేయకపోవడం (కార్డియాక్ అరెస్ట్)తో ఆయన మృతిచెందినట్లు కిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
1945 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సాయిరాజు, మహాలక్ష్మీ దంపతులకు దాసరి జన్మించారు. హైస్కూల్ స్థాయిలోనే నాటక రంగంపై మక్కువ పెంచుకున్న ఆయన.. నటుడిగా, రచయితగా, ప్రయోక్తగా, దర్శకుడిగా ఎదిగారు. అవార్డులు, రివార్డులకు మారు పేరయ్యారు. 151 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కారు. శివరంజని, ప్రేమాభిషేకం, మేఘసందేశం, గోరింటాకు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, ఒసేయ్ రాములమ్మ తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తీసిన తాతా-మనవడు చిత్రం ఏకంగా 350 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. దర్శకుడిగా ఆయన ఆఖరు చిత్రం ఎర్రబస్సు(151వ చిత్రం). 2010లో ఆయన దర్శకత్వం వహించిన 149 సినిమా యంగ్ ఇండియాను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అంకితమిచ్చారు. బాలకృష్ణ హీరోగా 150వ చిత్రం పరమ వీర చక్ర తీశారు. రాజకీయ నాయకుడిగానూ తనదైన ముద్ర వేశారు.
అవార్డులు రివార్డులు..
సినీ పరిశ్రమ :
దర్శకుడిగా 151 చిత్రాలు, నిర్మాతగా 53 , రైటర్‌గా 250
పురస్కారాలు : పద్మశ్రీ, కళాప్రపూర్ణ, దర్శకరత్న, అత్యధిక చిత్రాల దర్మకుడిగా గిన్నిస్ రికార్డు, రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 9 నంది అవార్డులు, 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
జర్నలిజం : ఉదయం దినపత్రిక, శివరంజని, మేఘసందేశం సినీపత్రికలు, బొబ్బిలి పులి రాజకీయ వారపత్రిక
రాజకీయాల్లోకి
1999లో కాంగ్రెస్‌లోకి రాజకీయ రంగ ప్రవేశం
2000లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక
2004లో కేంద్రమంత్రిగా ప్రమాణం
క్విక్ రివ్యూ:
ఏమిటి :
దాసరి నారాయణరావు కున్నుమూత
ఎప్పుడు : మే 30
ఎక్కడ : హైదరాబాద్‌లో
ఎవరు : దర్శకుడు, రచయిత, రాజకీయ నాయకుడు

తెలంగాణలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ రద్దు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్ (రాష్ట్రంలో ఎక్కడైనా భూముల రిజిస్ట్రేషన్)’ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు మే 30న ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆస్తులు ఏ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తాయో అక్కడే వాటి రిజిస్ట్రేషన్ జరగాలని స్పష్టం చేసింది. జిల్లా రిజిస్ట్రార్లకు ఉన్న సెక్షన్ 47(ఎ) విచక్షణాధికారాలను తొలగించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిఘా పెట్టాలని, ఎక్కడ అవినీతి కనిపించినా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏసీబీని ఆదేశించింది.
హైదరాబాద్‌లో ఇటీవల భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగు చూడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల విధానం రద్దు
ఎప్పుడు : మే 30
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణలో

తెలంగాణలో అంత్యోదయ కార్డుకి సబ్సిడీపై చక్కెర
అంత్యోదయ ఆహార భద్రత కార్డు (ఏఎఫ్‌ఎస్‌సీ) కలిగిన వారికి రేషన్ షాపుల ద్వారా జూన్ నుంచి సబ్సిడీ ధరపై కిలో చక్కెర పంపిణీ జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ మే 24న ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే చక్కెరకు సబ్సిడీ ఎత్తివేసి కేవలం అంత్యోదయ అన్నయోజన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంత్యోదయ కార్డుకు సబ్సిడీపై కిలో చక్కెర
ఎప్పుడు : 2017 జూన్ నుంచి
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో అమల్లోకొచ్చిన కొత్త భూసేకరణ చట్టం
తెలంగాణలో కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మే 17న రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ పునరావాసం, పునఃపరిష్కారంలో న్యాయమైన పరిహారం, పారదర్శకమైన హక్కు (తెలంగాణ సవరణ)-2016 బిల్లు రాష్ట్రపతి ఆమోదం తర్వాత మే 17న ప్రభుత్వానికి అందింది. దీంతో వెంటనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ చట్టంతో 36 సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన 96 వేల ఎకరాల భూసేకరణకు మార్గం సుగమం కానుంది
చట్టంలోని ముఖ్యాంశాలివీ..
  • కేంద్ర భూసేకరణ చట్టం-2013తో పాటు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 123 జీవోలోని అంశాలే ఎక్కువగా ఈ కొత్త చట్టంలో ఉన్నాయి.
  • ఈ చట్టం ప్రకారం 2014 జనవరి 1 నుంచి భూసేకరణ అమల్లోకి వస్తుంది.
  • 2013 చట్టంలోని సామాజిక ప్రభావం, ప్రజా ప్రయోజన నిర్ధారణకు చేపట్టే ప్రాథమిక విచారణ అధ్యాయాన్ని తొలగించారు. దీంతో సామాజిక ప్రభావ మదింపు, పరిశోధన లేకుండానే భూసేకరణ చేపట్టే అధికారం రాష్ట్రం సొంతమవుతుంది
  • ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టే భూసేకరణకు ఆ ప్రాంతంలోని జిల్లా కలెక్టర్.. భూ యజమానితో సంప్రదింపులు జరిపి అమ్మకం ధర ఖరారు చేసుకుంటారు. దాని ప్రకారం గెజిట్ జారీ చేస్తారు. దాంతో నిర్వాసిత భూ యజమానుల హక్కులు ప్రభుత్వానికి ధారాదత్తమవుతాయి
  • సేకరించిన భూములు ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ అవుతాయి.
  • ఖరారు చేసుకున్న ధర ప్రకారం సహాయ పునరావాస, పరిహార మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించాలి.
  • నిర్వాసితులకు అక్రమంగా డబ్బు చెల్లించినట్లు గుర్తిస్తే భూమి శిస్తు తరహాలో తిరిగి వసూలు చేసుకుంటారు.
  • ప్రభావిత కుటుంబాల జాబితాలో ఉన్న వ్యవసాయాధారిత కూలీలకు తగిన పరిహారం చెల్లిస్తారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి
: అమల్లోకి భూసేకరణ చట్టం
ఎప్పుడు : మే 17
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

స్వచ్ఛ రైల్వే స్టేషన్‌గా "విశాఖ"
దేశంలోనే స్వచ్ఛ రైల్వేస్టేషన్‌గా విశాఖపట్నం స్టేషన్ గుర్తింపు పొందిం ది. తర్వాతి స్థానంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిలిచింది. విజయవాడ రైల్వే స్టేషన్‌కు నాలుగో స్థానం లభించింది. ఈ మేరకు దేశంలో రద్దీ తీవ్రంగా ఉండే దాదాపు 75 రైల్వే స్టేషన్లలో స్వచ్ఛతపై క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఆడిట్ నివేదికను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు మే 17న ఢిల్లీలో విడుదల చేశారు. దీంతో పాటు స్వచ్ఛ రైల్ పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. పార్కింగ్ ప్రాంతం, ప్రధాన ప్రవేశ ప్రాంతం, ప్రధాన ప్లాట్‌ఫాం, వేచి ఉండే గది, ప్రయాణికుల స్పందన, తదితర పరిమితుల ఆధారంగా ఈ ఆడిట్‌ను నిర్వహించారు.
విభాగాల వారీ ర్యాంకింగ్స్
స్వచ్ఛత స్టేషన్లు - ఏ1 కేటగిరీ (తొలి పది)
విశాఖ, సికింద్రాబాద్, జమ్ముతావి, విజయవాడ, ఆనంద్ విహార్ టర్మినల్, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, పుణే, బెంగళూరు సిటీ స్టేషన్లు నిలిచాయి.

ఏ-కేటగిరీ స్టేషన్లు (తొలి పది)
బియాస్, ఖమ్మం, అహ్మద్‌నగర్, దుర్గాపూర్, మంచిర్యాల, బద్నెర, రంగ్ ఇయా జంక్షన్, వరంగల్, దమో, భుజ్

రైల్వే జోన్ల ర్యాంకింగ్స్ (తొలి పది)
ఆగ్నేయ మధ్య రైల్వే, తూర్పుకోస్తా రైల్వే, సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, పశ్చిమ రైల్వే, నైరుతి రైల్వే, ఈశాన్య రైల్వే, వాయవ్య రైల్వే, దక్షిణ రైల్వే, ఉత్తర ఫ్రాంటియర్ రైల్వే
క్విక్ రివ్యూ:
ఏమిటి :
రైల్వేల్లో స్వచ్ఛతపై నివేదిక
ఎప్పుడు : మే 17
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : రైల్వేల్లో స్వచ్ఛత చర్యల్లో భాగంగా

పర్వతారోహణలో విశాఖ చిన్నారి కామ్య రికార్డు
విశాఖకు చెందిన కామ్య కార్తికేయన్ (09) రోజుకు 9 గంటల పాటు నడిచి.. 9 రోజుల్లోనే ఎవరెస్టు బేస్ క్యాంప్‌నకు(18,000 అడుగులు) చేరుకుంది. తద్వారా ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో బాలికగా రికార్డు సృష్టించింది.
మూడేళ్ల వయసులోనే సహ్యాద్రి కొండలు ఎక్కిన కామ్య 2015లో ఒకసారి, 2016లో 3 సార్లు హిమాలయాల్లో భాగమైన చంద్రశిల (13 వేల అడుగులు), హర్కిధమ్ (13,500 అడుగులు), రూప్ ఖండ్ లేక్ (16,499 అడుగులు)ను అధిరోహించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
అతి చిన్న వయసులో ఎవరెస్టు బేస్ క్యాంప్ ఎక్కిన చిన్నారి
ఎప్పుడు : మే 20
ఎవరు : కామ్య కార్తికేయన్
ఎక్కడ : విశాఖపట్నం

మా భూమి - మా పంట యాప్ ప్రారంభం
రైతులకు భూమి వివరాలను అందుబాటులో ఉంచడంతో పాటు పంటల వివరాలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మా భూమి - మా పంట పేరుతో మొబైల్ యాప్‌ను మే 22న ప్రారంభించింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్‌‌స దీన్ని రూపొందించింది. ఇది రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ సమాచార డాటా బేస్‌గాను ఉపయోగపడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
మా భూమి - మా పంట యాప్ ప్రారంభం
ఎప్పుడు : మే 22
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : భూమి, పంటల వివరాలు అందించేందుకు

స్వచ్ఛాంధ్ర మిషన్ అంబాసిడర్‌గా తుర్లపాటి
స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయవాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు, కాలమిస్ట్ తుర్లపాటి కుటుంబరావు నియమితులయ్యారు. ఈ మేరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీ బి.మురళీధరరెడ్డి నుంచి మే 23న లేఖ అందిందని తెలిపారు.
తుర్లపాటి 70 ఏళ్లుగా పలు పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. అనేక పత్రికలకు వ్యాసాలు రాశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకు కార్యదర్శిగా కూడా పనిచేశారు. గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా తెలుగు భాషాభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
స్వచ్ఛాంద్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్
ఎప్పుడు : మే 23
ఎవరు : తుర్లపాటి కుటుంబరావు

మంగళగిరి రాజన్న క్యాంటీన్‌లో రూ. 4కే భోజనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో రాజన్న క్యాంటీన్‌ను మే 14న ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ ద్వారా ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నారు. అన్నం, కూర, పెరుగు, వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, మిగిలిన మూడు రోజులు అరటి పండ్లు, వడియాలు, తాగునీటి ప్యాకెట్ల్లు ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
రాజన్న క్యాంటీన్ ప్రారంభం
ఎప్పుడు : మే 14
ఎవరు : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఎక్కడ : గంటూరు జిల్లా మంగళగిరి
ఎందుకు : అతి తక్కువ ధరకు భోజనం అందించేందుకు

హైదరాబాద్‌లో ఐసీటీ 4డీ అంతర్జాతీయ సదస్సు
తొమ్మిదో ‘ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ డెవలప్‌మెంట్ (ఐసీటీ 4డీ)’ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌లో (మే 15 - 18 ) జరిగింది. ఐటీ సహాయంతో సుస్థిరాభివృద్ధి అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో 74 దేశాలకు చెందిన 800 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ విసృ్తత వినియోగంపై చర్చించారు. అనుదీప్, ఇక్రిశాట్, డైల్, ఇస్రితో పాటు పలు సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఐసీటీ 4డీ అంతర్జాతీయ సదస్సు
ఎప్పుడు : మే 15 - 18
ఎక్కడ : హైదరాబాద్‌లో
ఎందుకు : ఐటీతో సుస్థిరాభివృద్ధిపై చర్చించేందుకు

అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్‌తో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మే 15న అమరావతిలో జరిగిన స్టార్టప్ ఏరియా శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
రాజధాని స్టార్టప్ ప్రాజెక్టు మాస్టర్ డెవలపర్‌గా స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీల కన్సార్టియం (అసెండస్ - సింగ్‌బ్రిడ్జ్, సెంబ్‌కార్)ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఒప్పందం
ఎప్పుడు : మే 15
ఎవరు : ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభుత్వాల మధ్య

2వ దశ రూర్బన్‌లో తెలంగాణకు మూడు క్లస్టర్లు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ రెండోదశలో తెలంగాణ రాష్ట్రానికి 3 క్లస్టర్లు మంజూరయ్యాయి. ఈ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం మంజూరు చేసిన రూర్బన్ క్లస్టర్లలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, భూపాలపల్లి జిల్లా నాగారం, నాగర్ కర్నూల్ జిల్లా వెన్నెలచర్ల ఉన్నాయి. వివిధ పథకాలకు మంజూరు చేసిన నిధులతోపాటు సెంట్రల్ గ్యాప్ ఫండ్ కింద ఆయా క్లస్టర్ల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు వెచ్చించనున్నాయి. మొత్తంగా రెండోదశ రూర్బన్ ప్రాజెక్ట్‌కు రూ.500 కోట్ల మేర వ్యయం కానుంది.
2016 ఫిబ్రవరి 21న ప్రారంభించిన ఈ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లోనూ పట్టణ స్థాయి వసతులు, ఉపాధి అవకాశాలను కల్పించి, గ్రామాల నుంచి వలసలను నిరోధించడం.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: 2వ దశ రూర్బన్ కార్యక్రమం
ఎప్పుడు : 2017లో
ఎక్కడ : తెలంగాణకు 3 క్లస్టర్లు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

జీఎస్టీ బిలుకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం
వస్తువులు, సేవల పన్ను (Goods and Service Tax) బిల్లుకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ఆమోదం లభించింది. ఈ మేరకు మే 16న ప్రత్యేకంగా సమావేశమైన రెండు సభలు బిల్లుకి ఆమోదాన్ని తెలిపాయి.
దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నుల విధానం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ చట్టం 2017 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
జీఎస్టీ బిల్లుకి ఆమోదం
ఎప్పుడు : మే 16
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ

గ్రూప్ - 1 అధికారిగా పీవీ సింధు
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును గ్రూప్ - 1 అధికారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకోసం నియామకంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ (ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాల నియంత్రణ, సిబ్బంది నమూనా హేతుబద్ధీకరణ, వేతన విధానం) సర్వీసు నియామకాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు రూపొందించిన సర్వీసు నియామకాల సవరణ బిల్లుకి మే 16న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది.
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించినందుకు గాను పీవీ సింధుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గుర్తింపునిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
గ్రూప్ - 1 అధికారిగా పీవీ సింధు
ఎప్పుడు : మే 16
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

2017 సంతోష సూచీలో ఏపీకి 72వ స్థానం
2017 ప్రపంచ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్టులో ఆంధ్రప్రదేశ్ 72వ ర్యాంకులో నిలిచింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కార్యాలయం మే 16న ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రం సాధించిన హ్యాపీనెస్ స్కోరు 5,368 కాగా భారతదేశ (122వ ర్యాంకు) వ్యాప్తంగా చూసినప్పుడు ఆ స్కోరు 4,315 ఉందని, ఆ లెక్కన రాష్ట్ర ర్యాంకు 72తో సమానమని తెలిపింది.
రాష్ట్ర స్థాయి సంతోష సూచీల్లో శ్రీకాకుళం జిల్లా మొదటి స్థానంలో, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయని వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
2017 హ్యాపినెస్ ఇండెక్స్‌లో ఏపీకి 72వ స్థానం
ఎప్పుడు : మే 16
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం

ఎవరె స్ట్‌ను అధిరోహించిన ఏపీ విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. వీరిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన పూయక కృష్ణారావు (శ్రీకాకుళం), కుంజా దుర్గారావు (తూర్పుగోదావరి), జి.సురేష్‌బాబు (కర్నూలు), యువజన సంక్షేమ విభాగం తరఫున సత్యారావు కారె (విశాఖపట్నం), సుందరాన్ నాగరాజు (విశాఖపట్నం), తమ్మినేని భరత్ (కర్నూలు) ఉన్నారు. వీరంతా మే 13 ఉదయానికి 8,848 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్‌పైకి చేరుకున్నారు.

బంగినపల్లి మామిడికి జీఐ ట్యాగ్
Current Affairs
బంగినపల్లి మామిడి పండుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ లభించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దరఖాస్తును పరిశీలించిన చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ మే 3న జియో ట్యాగ్ మంజూరు చేసింది. దీంతో ఈ పండు ఓ నిర్దిష్ట ప్రాంతానికి చెందినదనే గుర్తింపు పొందింది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగినపల్లి మామిడిపండ్లు వందేళ్ల నుంచి పండుతున్నాయి. వీటిని బెనెషాన్, బనెషాన్, సఫేద అని కూడా పిలుస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంగినపల్లి మామిడికి జీఐ ట్యాగ్
ఎప్పుడు : మే 3
ఎవరు : జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ

విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం (విజయవాడ) విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మే 3న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని వల్ల ఏపీ రాజధాని అమరావతికి అనుసంధానాన్ని మరింత పెంచినట్లు అవుతుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా
ఎప్పుడు : మే 3
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : విజయవాడ

తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్ ప్రారంభం
తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్ మే 3న ప్రారంభమైంది. స్టేట్ ఇన్నొవేషన్ పాలసీ కింద ఐఐటీ-హైదరాబాద్ కళాశాలలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి కళాశాల ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ తాత్కాలికంగా నేతృత్వం వహిస్తారు. స్టార్టప్ పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడం, కొత్త స్టార్టప్‌లను ప్రోత్సహించడమే ఈ విభాగం ముఖ్య ఉద్దేశం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టేట్ ఇన్నొవేషన్ సెల్ ప్రారంభం
ఎప్పుడు : మే 3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్‌లో
ఎందుకు : స్టార్టప్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు

వెయ్యి కోట్లు వసూలు చేసిన బాహుబలి - 2
105 ఏళ్ల భారతీయ సినిమా చరిత్రలో రూ. వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా బాహుబలి -2 రికార్డు సృష్టించింది. ఈ మేరకు ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమా మే 7న ( పది రోజుల్లోనే ) ఈ ఘనతను నమోదు చేసింది. ఈ రికార్డును గుర్తిస్తూ బీబీసీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. భారతీయ సినిమా రికార్డులన్నీ ఈ చిత్రం బద్దలుగొట్టిందని, అమెరికాలో ఈ వారం విడుదలైన అన్ని చిత్రాల్లో(హాలీవుడ్ సహా) బాహుబలి వసూళ్ల పరంగా మూడో స్థానంలో నిలిచిందని ఈ కథనంలో పేర్కొంది. ఇందుకోసం రాజమౌళి, అనుష్కను ఇంటర్వ్యూ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. వెయ్యి కోట్లు వసూలు చేసిన భారతీయ సినిమా
ఎప్పుడు : మే 7
ఎవరు : బాహుబలి - 2
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా

తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటుకు ఒప్పందం
తెలంగాణలో డ్రైపోర్ట్ (మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్) ఏర్పాటు కోసం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మే 5న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. టీఎస్‌ఐఐసీ తరఫున ఎండీ నర్సింహారెడ్డి, నేషనల్ హైవేస్ అథారిటీ డిప్యూటీ సీజీఎం మనోజ్‌కుమార్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ రాహుల్ మిట్టల్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటుకు ఒప్పందం
ఎప్పుడు : మే 5
ఎవరు : టీఎస్‌ఐఐసీ
ఎక్కడ : న్యూఢిల్లీలో

టీ టీడీ, టాటా సంస్థల ఆధ్వర్యంలో తిరుపతిలో కేన్సర్ హాస్పిటల్
టాటా సంస్థ తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కేన్సర్ ఆస్పత్రిని నిర్మించనుంది. ఈ మేరకు మే 5న టాటా ట్రస్టు మేనేజింగ్ డెరైక్టర్ వెంకటరమణన్, టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. టీటీడీ సహకారంతో ఈ హాస్పిటల్ నిర్మాణం జరగనుంది. టాటా ట్రస్టు ఇప్పటికే ముంబై, కోల్‌కత్తాల్లో కేన్సర్ ఆస్పత్రులను నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టాటా ట్రస్టు ఆధ్వర్యంలో కేన్సర్ ఆసుపత్రి
ఎప్పుడు : మే 5
ఎవరు : టాటా, టీటీడీ మధ్య అవగాహన ఒప్పందం
ఎక్కడ : తిరుపతిలో

తెలంగాణలో టీకా బండి కార్యక్రమం ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా ‘టీకా బండి’అనే సరికొత్త కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం మే 6న ప్రారంభించింది. మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం కింద పూర్తిగా టీకాలు అందని చిన్నారులకు అన్ని వ్యాధి నిరోధక టీకాలను వారి ఇళ్లకే వెళ్లి అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన పది ద్విచక్ర వాహనాలను ఏఎన్‌ఎంలకు అందించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 68 శాతంగా ఉన్న టీకాల శాతాన్ని 80 శాతానికి పెంచాలనే లక్ష్యంతో టీకా బండి కార్యక్రమానికి రూపకల్పన చేశామని ప్రభుత్వం ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీకా బండి కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : మే 6
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : ఇంటింటికి వెళ్లి పిల్లలకు టీకాలు వేసేందుకు

ఆంధ్రప్రదేశ్‌లో ఐయోవా మెగా సీడ్ పార్కు
అమెరికాలోని ఐయోవా స్టేట్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌లో మెగా సీడ్ పార్కును ఏర్పాటు చేయనుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం అమెరికాలో పర్యటనలో భాగంగా మే 8న ఐయోవా యూనివర్సిటీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో విత్తనాభివృద్ధి, పరిశోధనా రంగంలో ఐయోవా యూనివర్సిటీ సహకారం అందిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో ఐయోవా మెగా సీడ్ పార్కు ఏర్పాటుకు ఒప్పందం
ఎప్పుడు : మే 8
ఎవరు : ఏపీ ప్రభుత్వం, ఐయోవా యూనివర్సిటీ
ఎందుకు : విత్తనాభివృద్ధి, పరిశోధన రంగాల్లో సహకారం కోసం

తెలంగాణ సామాజికాభివృద్ధి నివేదిక - 2017
తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు అప్పుల్లోనే ఉన్నారు. అలాగే రాష్ట్రంలో సాగవుతోన్న మొత్తం విస్తీర్ణంలో 65.5 శాతం భూమి కౌలు రైతుల చేతుల్లోనే ఉంది. ఈ మేరకు కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ (సీఎస్‌డీ) తెలంగాణ సామాజికాభివృద్ధి నివేదిక - 2017లో ఈ వివరాలు వెల్లడించింది. (సీఎస్‌డీ) డెరైక్టర్ కల్పనా కన్నబీరన్ సారథ్యంలో పద్మినీ స్వామినాథన్, జయరంజన్‌లు ఈ నివేదికను రూపొందించారు.
జాతీయ నమూనా సర్వేతోపాటు 2011 జనాభా లెక్కలను విశ్లేషించి.. సామాజిక సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించేందుకు ఈ నివేదికను తయారు చేశారు. ప్రధానంగా భూమి, వ్యవసాయం, రుణాల పంపిణీ, అప్పులు, విద్య, ఉపాధి, వైద్యం, గృహ నిర్మాణం, తాగునీటి వసతి, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి తమ అధ్యయనంలో తేలిన అంశాలను ఇందులో పొందుపరిచారు.
నివేదికలోని ముఖ్యాంశాలు
  • రాష్ట్రంలో 43.3 శాతం గ్రామీణ కుటుంబాలకు ఎలాంటి భూమీ లేదు.
  • ఎస్సీల్లో 75 శాతం మందికి హెక్టారు కంటే తక్కువగానే భూమి ఉంది.
  • వ్యవసాయ అవసరాల కోసం తవ్వే బావులు, బోర్లతో తెలంగాణలో దాదాపు 70 శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారు.
  • ఎస్సీలకు చెందిన 25.4 శాతం భూములకు, ఎస్టీలకు చెందిన 29.9 శాతం, ఇతర వర్గాలకు 36.9 శాతం భూములకు సాగునీటి వసతి ఉంది.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 50.6 శాతం మంది కుటుంబ అవసరాలకు తీసుకునే అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వాణిజ్య బ్యాంకులు 16 శాతం, సహకార బ్యాంకులు 9.3 శాతం రుణాలు అందిస్తున్నాయి.
  • గ్రామీణ ప్రాంతాల్లో సగటున ఒక్కో కుటుంబం వైద్యానికి ఏడాదికి రూ.21,683 చొప్పున ఖర్చు చేస్తోంది. జాతీయ స్థాయి (రూ.16,596) సగటుతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ.
  • రాష్ట్రంలో 18 శాతం కుటుంబాలు ఇప్పటికీ తాగునీటికి మినరల్ వాటర్ క్యాన్‌లపైనే ఆధారపడుతున్నాయి.
  • రాష్ట్రంలో 36.7 శాతం ఇళ్లల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో సగానికిపైగా ఇళ్లలో మరుగుదొడ్లు లేవు.
  • బాల్య వివాహాలు దేశవ్యాప్తంగా 3.7 శాతం ఉండగా తెలంగాణలో 2.6 శాతం నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా బాల్య వివాహాలు నమోదయ్యాయి.
  • 60 ఏళ్ల పైబడిన వారిలో 87 శాతం మంది పురుషులు వివాహితులు కాగా.. వితంతువులైన మహిళలు 57 శాతం. పురుషుల్లో జీవిత భాగస్వామి లేనివారు 11 శాతం ఉన్నారు.
  • రాష్ట్రంలోని ఎస్టీల్లో 32 శాతం, ఎస్సీల్లో 28 శాతం, ఇతర వెనుకబడిన వర్గాల్లో 26 శాతం మంది నిత్యావసరాల కోసం ఎక్కువగా ప్రజా పంపిణీ వ్యవస్థపైనే ఆధారపడుతున్నారు.
  • రాష్ట్రంలో మొత్తంగా 1.5 శాతం కుటుంబాలు బియ్యం కోసం పూర్తిగా చౌక దుకాణాలపైనే ఆధారపడి ఉన్నాయి. వినియోగం అవుతున్న బియ్యంలో 25 శాతం ( గ్రామాల్లో 32 శాతం ) చౌకదుకాణాల ద్వారా సమకూరుతున్నదే.
  • నెలరోజుల తలసరి బియ్యం వినియోగంలో రాష్ట్ర సగటు 10.48 కిలోలు. అత్యంత అల్పాదాయ వర్గాల్లో ఇది 9.42 కిలోలుగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ సామాజికాభివృద్ధి నివేదిక - 2017
ఎప్పుడు : మే 8
ఎవరు : కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ మండలి
ఎందుకు : సంక్షేమ రంగంలో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు

చంద్రబాబుకు ట్రాన్స్ ఫర్మేటివ్ సీఎం అవార్డు
యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌ఐబీసీ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ట్రాన్స్ ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డును ప్రదానం చేసింది. అమెరికా పర్యటనలో భాగంగా యూఎస్‌ఐబీసీ రెండవ వార్షిక పశ్చిమ తీర సదస్సులో సిస్కో సంస్థ వరల్డ్ వైడ్ హెడ్ జాన్ చాంబర్స్ నుంచి చంద్రబాబు ఈ అవార్డు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు ‘సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ ఫర్మేషనల్ జర్నీ టువార్డ్స్ ఎ హ్యాపీ స్టేట్’ అనే అంశంపై మాట్లాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చంద్రబాబుకు ట్రాన్స్ ఫర్మేటివ్ సీఎం అవార్డు
ఎప్పుడు : మే 9
ఎవరు : యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ కౌన్సిల్
ఎక్కడ : అమెరికాలో

విత్తన విధానంపై జర్మనీతో తెలంగాణ ఒప్పందం
తెలంగాణ ప్రభుత్వం విత్తన విధాన రూపకల్పనకు జర్మనీ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు మే 7న జర్మనీ, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి.

అవయవదానంలో నరసరావు పేట గిన్నిస్ రికార్డు
అవయవదానంలో గుంటూరు జిల్లా, నరసరావుపేట గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. ఈ మేరకు మే 2న స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఒక గంటలోనే 11,987 మంది అవయవాలు దానం చేస్తామంటూ అంగీకార పత్రాలు అందజేశారు. దీంతో గతంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో 6,697 మందితో సాధించిన రికార్డును నరసరావుపేట అధిగమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
అవయవదానంలో గిన్నిస్ రికార్డు
ఎప్పుడు : మే 2
ఎవరు : 11,987 మంది స్థానికులు
ఎక్కడ : నరసరావు పేట, గుంటూరు జిల్లా

గవర్నర్ పదవీకాలం పొడిగింపు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పదవీకాలంను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఆయన పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.నరసింహన్ ప్రస్తుత పదవీకాలం మే 2తో ముగియడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: తెలుగు రాష్ట్రాల గవర్నర్ పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు : మే 2
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

స్పైస్‌జెట్‌తో తెలంగాణ పర్యాటక శాఖ ఒప్పందం
తెలంగాణ పర్యాటకానికి ప్రపంచస్థాయి కల్పించడానికి ఆ రాష్ట్ర పర్యాటక శాఖ స్పైస్‌జెట్‌తో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు బోయింగ్ 737 0800 విమానంపై అతికించిన రాష్ట్ర టూరిజం ప్రాంతాల చిత్రాలు, శాఖ లోగోను పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆవిష్కరించారు. విమానం బయట ఒకవైపు చౌమొహల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లు మరోవైపు సెవెన్ టూంబ్స్, గోల్కొండ చిత్రాలు ఏర్పాటు చేశారు. విమానంలోని 189 సీట్ల వెనుక రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల చిత్రాలు అంటించారు. ఈ ప్రచారం 2 నెలలు కొనసాగుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: స్పైస్‌జెట్‌తో తెలంగాణ పర్యాటక శాఖ ఒప్పందం
ఎప్పుడు : మే 2
ఎందుకు : తెలంగాణ పర్యాటకానికి ప్రపంచస్థాయి కల్పించడానికి

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా సిధారెడ్డి
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి మే 2న నియమితులయ్యారు. రచయితగా, తెలంగాణ ఉద్యమకారుడిగా సుపరిచుతులైన సిధారెడ్డి 1955లో జన్మించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ చదివారు. ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు అనే అంశంపై 1981లో ఎంఫిల్ చేశారు. ఆధునిక కవిత్వం, వాస్తవికత, అధివాస్తవికతపై పరిశోధన చేసి 1986లో పీహెచ్‌డీ అందుకున్నారు. 2012లో తెలుగు అధ్యాపకులుగా పదవీ విరమణ పొందారు. ప్రాణహిత, భూమిస్వప్నం, దివిటీ, నాగేటి సాల్లల్ల, ఇక్కడి చెట్లగాలి, ఒక బాధ కాదు వంటి ఎన్నో పుస్తకాలు రాశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నియామకం
ఎప్పుడు : మే 2
ఎవరు : నందిని సిధారెడ్డి
Published date : 13 May 2017 02:30PM

Photo Stories