Forest Development Corporation: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు
అడవుల నిర్వహణ, అభివృద్ధిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను ఎఫ్‌డీసీకి జర్మనీ ఫారెస్ట్ స్టీవర్డ్ కౌన్సిల్ సర్టిఫికెట్ దక్కింది. సేంద్రియ పద్ధతిలో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి లాంటి అటవీ ఉత్పత్తు(ముడిసరుకు)ల నుంచి తయారయ్యే వస్తువులకు ఐదేళ్లపాటు తమ లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్‌డీసీకి కౌన్సిల్ అనుమతినిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి చెట్లను ఉన్నత ప్రమాణాలతో సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్లలో సుమారు 45 వేల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటకు ఈ గుర్తింపు దక్కిందని అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వివరించారు.
Union Budget 2023: కేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
దీనివల్ల అంతర్జాతీయంగా ఎఫ్‌డీసీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, ఐకియా వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లకు జర్మన్ కౌన్సిల్ ధ్రువీకరించిన కలపను విక్రయించే అవకాశం దక్కిందన్నారు. ఐదేళ్లలో రూ.10 కోట్ల అదనపు ప్రయోజనం కలగనుందని, కంపోజిట్ వుడ్‌పేపర్, ప్యాకింగ్ పరిశ్రమల కోసం ప్రాసెస్ చేసిన ఉత్పత్తులకు అధికధర లభిస్తుందన్నారు. అటవీ ఉత్పత్తుల నుంచి చేసిన కాగితం, టెట్రాప్యాక్, మిశ్రమ కలపకు ఎఫ్‌ఎస్సీ ఆమోదం లభించిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు.