Skip to main content

డిసెంబర్ 2017 రాష్ట్రీయం

ఆర్‌కే నగర్ ఉపఎన్నికల్లో దినకరన్ విజయం
తమిళనాడులో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థి, ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ విజయం సాధించారు. ఈ మేరకు డిసెంబర్ 24న జరిగిన ఓట్ల లెక్కింపులో ఆయన 40వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. డీఎంకే, బీజేపీ సహా 58 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌కే నగర్ నుంచి తమిళనాడు మాజీ సీఎం జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని కూడా దినకరన్ అధిగమించి సత్తా చాటారు. జయలలిత మరణంతో డిసెంబర్ 21న ఆర్‌కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.

డీజీపీ నియామక ఆర్డినెన్స్‌ను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Current Affairs డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేలా ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్ట్‌ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26న ఆర్డినెన్‌‌స జారీ చేసింది. డీజీపీ పోస్టు కోసం రాష్ట్రానికి చెందిన ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను పంపించగా.. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ యూపీఎస్సీ పలుమార్లు తిప్పి పంపింది. ఈ నేపథ్యంలో డీజీపీ ఎంపిక వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్డినెన్‌‌స తెచ్చేందుకు డిసెంబర్ 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్(రిఫారమ్స్, అడ్మినిస్ట్రేటివ్) ఆర్డినెన్‌‌స నంబర్ 4-2017ను జారీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ పోలీస్ యాక్ట్‌ను సవరిస్తు ఆర్డినెన్స్ జారీ
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేలా

ఏఎన్‌యూలో ఐఈఏ శతాబ్ది ఉత్సవాలు
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్ మిషన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ)’ శతాబ్ది ఉత్సవాల సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న ప్రారంభించారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబు, బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనిస్, ఐఈఏ కాన్ఫరెన్‌‌స అధ్యక్షుడు, సి.రంగరాజన్, భారత 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ఇంటర్నేషనల్ ఎకనామిక్ అసోషియేషన్ అధ్యక్షుడు కౌశిక్ బసు, ఐఈఏ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ థోరట్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. 'ట్రాకింగ్ ది ఇండియన్ ఎకానమీ' పేరుతో డాక్టర్ సి. రంగరాజన్ రచించిన పుస్తక తొలి కాపీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాలు
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : బైబిల్ మిషన్ ప్రాంగణం, ఏఎన్‌యూ

ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న ప్రారంభించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితమిచ్చారు. దీంతోపాటు రియల్‌టైమ్‌లో పరిపాలనను పర్యవేక్షించే డ్రోన్లు, సీసీటీవీ సర్వెయలెన్‌‌స ప్రాజెక్టుతోపాటు మారుమూల ప్రాంతాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ఎఫ్‌ఎస్‌ఓసీ ప్రాజెక్టును సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు ద్వారా పౌర జీవనం నాణ్యంగా మారే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం తక్కువ ధరకు ప్రజలకు టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ వంటి వసతులని కల్పిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : తక్కువ ధరకు ప్రజలకు టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ వంటి వసతులని కల్పించేందుకు

బెటర్ ఇండియా జాబితాలో సీపీ మహేశ్ భగవత్
బెటర్ ఇండియా ఏటా ప్రకటించే టాప్-10 ఐపీఎస్ అధికారుల జాబితాలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ చోటు దక్కించుకున్నారు. విధుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు బెటర్ ఇండియా ఏటా టాప్-10 ఐపీఎస్ అధికారుల జాబితాను విడుదల చేస్తుంది. తాజా జాబితాలో తొలి, రెండు స్థానాల్లో మనీశ్‌శంకర్ శర్మ, ఆర్.శ్రీలేఖ ఉండగా.. మూడో స్థానంలో మహేశ్ భగవత్ ఉన్నారు.
అక్రమ రవాణా బారి నుంచి చాలామంది మహిళలు, పిల్లలను రక్షించినందుకు మహేశ్ భగవత్‌కు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ట్రాఫికింగ్ ఇన్ పర్సన్‌‌స రిపోర్ట్ హీరోస్ అవార్డు-2017ను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెటర్ ఇండియా టాప్-10 ఐపీఎస్ ఆఫీసర్స్
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : మూడో స్థానంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీ మాలకొండయ్య
ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ సాంబశివరావు డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మాలకొండయ్య 2018 జనవరి 1వ తేదీన డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : మాలకొండయ్య

మిషన్ అంత్యోదయలో ఏపీ ఫస్ట్
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిసెంబర్ 22న మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రామాల సమగ్ర అభివృద్ధి ఆధారంగా మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకులను ప్రకటించారు.

ఆదిభట్లలో మైమానిక ఇంజిన్ పరికరాల తయారీ
Current Affairs
హైదరాబాద్‌లోని ఆదిభట్లలో ఉన్న ఏరోస్పేస్ సెజ్‌లో వైమానిక ఇంజిన్లు తయారు కానున్నాయి. ఈ మేరకు టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ ఏరో సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్), అంతర్జాతీయ ఇంజినీరింగ్ సంస్థ జీఈ గ్రూప్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సీఎఫ్‌ఎం లీప్ వైమానిక ఇంజిన్‌కు అవసరమయ్యే వివిధ పరికరాలను తయారు చేస్తారు. దీనికి సంబంధించి డిసెంబర్ 14న జీఈ- టాటా సన్‌‌స ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఒప్పందం విలువ దాదాపు 50 కోట్ల డాలర్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైమానిక ఇంజిన్ పరికరాల తయారీ ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : టాటా అడ్వాన్‌‌సడ్ ఏరో సిస్టమ్స్ లిమిటెడ్ మరియు జీఈ గ్రూప్
ఎక్కడ : ఆదిభట్ల ఏరోసెజ్, హైదరాబాద్
ఎందుకు : వైమానిక ఇంజిన్ పరికరాల తయారీకి

ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 15న హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ సభలు డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఇర్ అధ్యక్షతన జరిగే ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరై ఉత్సవాలను ప్రారంభించారు.
డిసెంబర్ 19 వరకు జరగనున్న ఈ మహాసభల్లో తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పేట్లు సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘‘తెలుగు వెలుగును ప్రపంచానికి చాటుదాం.. తెలంగాణా ఖ్యాతిని దశదిశలా చాటుదాం’’ అనేది ఈ మహాసభల నినాదం. ఈ సభలకు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దాదాపు 6 వేల మంది తెలుగువారిని ఆహ్వానించారు. 1975లో తొలి తెలుగు ప్రపంచ మహాసభలు జరగగా 2012లో చివరి మహాసభలు జరిగాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : ఎల్బీ స్టేడియం, హైదరాబాద్

డీజీపీ నియామకంను రాష్ట్ర పరిధిలోకి తెస్తూ ఏపీ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డీజీపీ నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేలా పోలీస్ చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ఆర్డినెన్‌‌స కూడా తీసుకురావాలని తీర్మానించింది. పోలీస్ యాక్ట్ 9 ఆఫ్ 2014ను సవరిస్తూ ఆర్డినెన్‌‌స తెచ్చి, తరువాత అసెంబ్లీలో చర్చించి పూర్తిస్థాయి సవరణకు ఆమోదం పొందాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్సుతో డీజీపీ నియామకాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆలిండియా సర్వీసెస్(ఏఐఎస్) యాక్ట్ 1953కి లోబడి డీజీపీ పదవీకాలం కూడా నిర్ణయించే అధికారం ఆర్డినెన్‌‌స ద్వారా రాష్ట్రానికి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రం పరిధిలోకి డీజీపీ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : ఏపీ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్
రాజధాని పరిపాలనా నగరంలో అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నీటి కొలను మధ్యలో 250 మీటర్ల వెడల్పు, 250 మీటర్ల పొడవుతో అసెంబ్లీ డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించింది. డిసెంబర్ 16న వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధులు టవర్ డిజైన్‌తోపాటు వజ్రం డిజైన్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. టవర్ ఆకృతికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
125 ఎకరాల విస్తీర్ణంలో కొలను
250 మీటర్ల ఎత్తులో టవర్ ఆకారంలో నిర్మించే ఈ అసెంబ్లీ భవనం నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. టవర్‌పైకి 40 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి 217 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. 70 మంది సందర్శకులు ఒకేసారి వ్యూపాయింట్‌కు వెళ్లి రాజధాని నగరాన్ని చూడొచ్చు. ఈ భవనాన్ని నీటి కొలనులో నిర్మిస్తారు. ఈ కొలను 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. టవర్ ప్రతిబింబం ఈ నీటిలో పడేలా డిజైన్ చేశారు. టవర్ కింది భాగంలో శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్, పరిపాలనా కేంద్రాల భవనాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అసెంబ్లీ భవనం మొత్తం 87 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఉంటుండగా, నిర్మిత ప్రాంతం 7.8 లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఈ భవనంపై పునరుత్పాదక విద్యుదుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సూర్యకాంతి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా నెలకొల్పుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్ ఖరారు
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : అమరావతి

తెలంగాణలో జిల్లాల వెనుకబాట నివేదిక
వెనుకబాటుతనంలో రాష్ట్రంలోని కొత్త జిల్లాలే ముందు వరసలో ఉన్నాయి. 31 జిల్లాల్లో మహబూబాబాద్, గద్వాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలు అత్యంత వెనుకబాటుతనంతో టాప్‌లో ఉన్నాయి. పాత జిల్లాలు ఉన్నప్పుడు వెనుకబాటుతనం, పేదరికంలో ముందు వరుసలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా తాజాగా 14వ స్థానంలో నిలిచింది. ఇటీవల నీతి ఆయోగ్‌కు పంపించిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.
11 అంశాల ప్రాతిపదికగా జిల్లాల వెనుకబాటుతనాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. భూమి లేని నిరుపేద కూలీలు, గర్భిణుల సంరక్షణ, ఆసుపత్రుల్లో ప్రసవాలు, పిల్లల ఎదుగుదల, బరువు తక్కువగా ఉండటం, ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్లు, పిల్లలు-ఉపాధ్యాయుల నిష్పత్తి, కరెంటు, రోడ్డు, తాగునీరు లేని గ్రామాలు, మరుగుదొడ్లు లేని ఇళ్లను ప్రామాణికంగా స్వీకరించింది. వీటన్నింటా ఆందోళనకర పరిస్థితులున్న జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది. ఈ అంచనా విధానాన్ని కేంద్రం కంపోజిట్ ఇండెక్స్‌గా పరిగణనలోకి తీసుకుంది. ఈ పరిస్థితులను మొత్తం 100 పాయింట్లకు ఎక్కువ పాయింట్లు సాధించిన జిల్లాల వరుసలో వెనుకబాటుతనాన్ని అంచనా వేసింది. వెనుకబడిన జిల్లాల జాబితాలో మొదటి 10 స్థానాల్లో మహబూబాబాద్, గద్వాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్ రూరల్, నిర్మల్, సూర్యాపేట, వికారాబాద్, ఆదిలాబాద్‌లు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డితో పాటు సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలు అభివృద్ధిలో ముందంజలో నిలిచాయి.

కాళేశ్వరం ప్రాజెక్టుకు తుదిదశ పర్యావరణ అనుమతులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తుదిదశ పర్యావరణ అనుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టుకు ఇప్పటికే అటవీ, భూగర్భ జలశాఖ, కన్‌స్ట్రక్షన్ మెషినరీ డెరైక్టరేట్ అనుమతులురాగా.. కీలకమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు డిసెంబర్ 5న ఢిల్లీలో సమావేశమైన జల సంబంధమైన ప్రాజెక్టుల ‘ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టు నివేదికను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదని తేల్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వరం ప్రాజెక్టుకు తుది దశ పర్యావరణ అనుమతులు
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి
హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు వైభవంగా సాగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమం డిసెంబర్ 19న జరిగింది. ఎల్‌బీ స్టేడియంలోని పాల్కురికి సోమన ప్రాంగణం పోతన వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు భాష ప్రాధాన్యాన్ని, తెలుగు సాహితీవేత్తల వైభవాన్ని, తెలంగాణ ప్రముఖులను రాష్ట్రపతి తన ప్రసంగం ఆద్యంతం స్మరించుకున్నారు.
ప్రతి డిసెంబర్‌లో తెలుగు మహాసభలు
కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఇకపై రాష్ట్రంలో ఏటా తెలంగాణ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్‌లో రెండు రోజుల పాటు సభలు జరుగుతాయని వివరించారు. ఇకపై ఏ మీడియమైనా, ఏ సిలబస్ అయినా ఈ గడ్డపై చదువుకోవాలంటే తెలుగును ఒక సబ్జెక్టుగా కచ్చితంగా నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌దాకా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చదవాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ముఖ్య అతిథి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : ఎల్‌బీ స్టేడియం, హైదరాబాద్

తెలంగాణలో నాలుగు లక్షల మందికి బాల్య వివాహాలు
దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో 1.5 కోట్ల మందికి బాల్య వివాహాలు జరగగా.. అందులో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఉన్నట్లు ఎంవీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో గత మూడేళ్లలో 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో 19.4 శాతం మందికి, అబ్బాయిల్లో 4.7 శాతం మందికి బాల్య వివాహం జరిగినట్లు తేలింది. ఎంవీ ఫౌండేషన్ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు, పాఠశాలలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పలు ప్రభుత్వ విభాగాల నుంచి సమాచారం సేకరించింది. బాల్య వివాహాలు చేసుకున్నవారిలో 46 మందిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి.. వారి ప్రస్తుత పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది.
పాలమూరు టాప్.. కరీంనగర్ లాస్ట్
బాల్య వివాహాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల బాల్య వివాహాలు జరిగితే.. మహబూబ్‌నగర్‌లోనే 26.2 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాల్లో నల్లగొండ (21.5 శాతం), రంగారెడ్డి (21.1 శాతం), ఖమ్మం, మెదక్ (21 శాతం), వరంగల్ (18 శాతం), ఆదిలాబాద్ (17.8 శాతం), నిజామాబాద్(16.3 శాతం), కరీంనగర్ (14.2 శాతం) జిల్లాలు ఉన్నట్టు ఎంవీ ఫౌండేషన్ సర్వేలో వెల్లడైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో 4 లక్షల మందికి బాల్య వివాహాలు
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ఎంవీ ఫౌండేషన్

టీయూ 142 మ్యూజియం ప్రారంభం
Current Affairs
విశాఖపట్నంలో కురుసుర జలాంతర్గామి ఎదురుగా ఏర్పాటు చేసిన టీయూ 142 యుద్ధవిమాన మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 7న ప్రారంభించారు. అనంతరం ఐఎన్‌ఎస్ డేగాలో భారత తొలి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కాల్వరి స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. ఈ మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం వచ్చిన రాష్ట్రపతి ఆంధ్రా విశ్వవిద్యాలయం(ఏయూ)లో ఈ-క్లాస్‌రూమ్ కాంప్లెక్స్, ఇంక్యుబేషన్ సెంటర్ భవనాల శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతీయ మహిళలు ఆదర్శనీయమైన సేవలందిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డీఆర్‌డీవో సీనియర్ సైంటిస్ట్ టెస్సీ థామస్‌ను బాలికలు యువతులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీయూ 142 మ్యూజియం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

రాష్ట్రపతి శీతాకాల విడిది షెడ్యూలు ఖరారు
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 22న హైదరాబాద్ రానున్నారు. ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 26 వరకు బస చేస్తారు. భారత రాష్ట్రపతి ఏటా డిసెంబర్‌లో శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు రావడం ఆనవాయితీ. ఈ సమయంలోనే దాదాపు 15 రోజుల పాటు రాష్ట్రపతి నిలయం లోకి సందర్శకులను అనుమతిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రపతి శీతాకాల విడిది పర్యటన షెడ్యూలు
ఎప్పుడు : డిసెంబర్ 22 నుంచి 26 వరకు
ఎక్కడ : రాష్ట్రపతి నిలయం, బొల్లారం, హైదరాబాద్
ఎందుకు : ఏటా డిసెంబర్‌లో శీతాకాల విడిదిలో భాగంగా

విశాఖలో సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలు
ఇండియన్ నేవీలో సబ్‌మెరైన్ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలో డిసెంబర్ 8న సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలు నిర్వహించారు. స్వర్ణోత్సవాలకు త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన భారత నౌకాదళం దేశ రక్షణకే కాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇస్తున్న సహకారం ప్రముఖమైనదని కొనియాడారు.
భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్ కల్వరి సబ్‌మెరైన్ సేవలు 1967లో ప్రారంభించారు. ఈ 50 ఏళ్లలో 25 సబ్‌మెరైన్‌లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ నేవీ సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలు
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : ఇండియన్ నేవీ
ఎందుకు : సబ్‌మెరైన్ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా

చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ ధరకే సరుకులు అందేలా చేపట్టిన చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 12న ప్రారంభించారు. ఈ మేరకు విజయవాడ, గుంటూరులో పెలైట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ‘చంద్రన్న విలేజ్ మాల్’ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇటీవల రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులను చంద్రన్న విలేజ్ మాల్స్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వివిధ బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులు ఎంఆర్‌పీ కంటే 4 నుంచి 35 శాతం తక్కువ ధరకు లభిస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : చంద్రబాబు నాయుడు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎందుకు : రేషన్ సరుకులను తక్కువ ధరకు అందించడానికి

హోంగార్డుల వేతనం 20 వేలకు పెంపు
తెలంగాణలో హోంగార్డుల వేతనాలను రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. జనహితలో డిసెంబర్ 14న హోంగార్డులతో చర్చలు జరిపిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 18,900 మంది హోంగార్డులు లబ్ధి పొందుతారు. కానిస్టేబుళ్ల నియామకాల్లో హోంగార్డులకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 10 నుంచి 25 శాతానికి పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
హోంగార్డుల వేతనాలు 12 వేల నుంచి 20 వేలకు పెంపు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ముఖ్యమంత్రి కేసీఆర్
ఎక్కడ : తెలంగాణ

నిమ్జ్‌లో మౌలిక వసతుల పరికరాల పార్కు
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ‘మౌలిక సదుపాయాల యంత్ర పరికరాల తయారీ పార్కు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పార్క్)’ ఏర్పాటు కానుంది. జహీరాబాద్‌లోని ‘నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)’లో 500 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డిసెంబర్ 13న బెంగళూరులో శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఫైనాన్‌‌స లిమిటెడ్ అనుబంధ కంపెనీ అట్టివో ఎకనామిక్ జోన్‌‌స ప్రైవేటు లిమిటెడ్ మరియు ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ పార్కులో భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, గనుల తవ్వకాల్లో ఉపయోగించే యంత్ర పరికరాలు తయారు చేస్తారు. దీని వల్ల వచ్చే పదేళ్లలో 10 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మౌలిక వసతుల పరికరాల పార్కు ఏర్పాటు ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఫైనాన్‌‌స లిమిటెడ్ - తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : నిమ్జ్, జహీరాబాద్, తెలంగాణ
ఎందుకు : యంత్ర పరికరాలు తయారీకి

తమిళనాడు, కేరళలో ఓక్కి తుపాను
Current Affairs
తమిళనాడు, కేరళలోని దక్షిణ ప్రాంతాల్లో నవంబర్ 30న ‘ఓక్కి’ తుపాను సంభవించడంతో 8 మంది మరణించారు. తుపాను కారణంగా 65 నుంచి 75 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో తిరువనంతపురంలో చేపల వేటకు వెళ్లిన 57 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.
ఓక్కీ అంటే బెంగాలీ భాషలో కన్ను అని అర్థం. తుపాను పేరును ఖరారుచేసే అవకాశం ఈసారి బంగ్లాదేశ్‌కు రావడంతో ఈ పేరును సూచించింది. సామాన్య ప్రజలకు సులువుగా అర్థం కావడానికి ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితికి చెందిన ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సాంఘిక సంఘం (ఇస్కాప్) కలసి 2000 సంవత్సరం నుంచి తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం తీసుకొచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఓక్కి తుపాను 2017
ఎప్పుడు : నవంబర్ 30
ఎక్కడ : తమిళనాడు, కేరళలో

తెలంగాణలో మహిళల కోసం వీ హబ్
తెలంగాణ రాష్ర్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ‘విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ (WE-Hub)’ పేరుతో స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున రూ.15 కోట్లతో ‘టీ-ఫండ్’ పేరిట కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నవంబర్ 30న జీఈఎస్ సదస్సు ముగింపు సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళా పారిశ్రామికవేత్తలకు వీ హబ్
ఎప్పుడు : త్వరలో
ఎవరు : కేటీఆర్
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించడానికి

తెలంగాణ అర్థగణాంక వార్షిక నివేదిక 2017
దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. దశాబ్దకాలంలోనే పట్టణ జనాభా 36 శాతం పెరిగింది. 2001లో రాష్ట్రంలో 98.53 లక్షల పట్టణ జనాభా ఉండగా.. అది 2011లో 1.36 కోట్లకు పెరిగింది. 100 శాతం పట్టణ జనాభా ఉన్న హైదరాబాద్ జిల్లాలో రాష్ట్ర జనాభాలో 30 శాతం మంది నివసిస్తున్నారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 70.22 శాతం, రంగారెడ్డి జిల్లాలో 57.70 శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తోంది. 31 జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన అర్థగణాంక వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.
అర్థగణాంక వార్షిక నివేదిక ముఖ్యాంశాలు.
  • ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 31.51 లక్షల మంది వ్యవసాయంలో ఉన్నారు. కూలీ చేస్తూ ఉపాధి పొందుతున్నవారు 59.15 లక్షల మంది.
  • 2015-16లో 21.80 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల పంటలు సాగవగా.. 51.45 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది.
  • రాష్ట్రంలో ఒక హెక్టారు కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న కమతాలు 62 శాతం ఉండగా.. 1-2 హెక్టార్ల వరకు ఉన్నవి 23.9 శాతం ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో కమతాల సగటు విస్తీర్ణం 1.12 హెక్టార్లుగా ఉంది.
  • రాష్ట్రంలో 1.63 కోట్ల మంది ప్రధాన వృత్తులతో ఉపాధి పొందుతున్నారు.
  • ఏడాదిలో 183.. అంత కంటే ఎక్కువ రోజులు పని చేసేవారు 1.37 లక్షలు. వీరిలో 22.42 లక్షల మంది ఎస్సీలు, 14.58 లక్షల మంది ఎస్టీలు.
  • ఓ మోస్తరు పనులతో 26.22 లక్షల మంది.. కుటీర పరిశ్రమలతో 7.77 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
  • గ్రామాల్లో వ్యవసాయం, వృత్తి పనులు, మోస్తరు పనులతో కాకుండా మిగిలిన రంగాల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న వారు 64.99 లక్షలు. ఏ పనీ చేయని వారు 1.86 కోట్ల మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
  • రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు 13.58 శాతం. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 17.70 శాతం.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674. ప్రతి 1,000 మంది పురుషులకు 988 మంది మహిళలుండగా.. 11 జిల్లాల్లో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంది.
  • నిర్మల్ జిల్లాలో 1,000 మంది పురుషులకు 1,046 మంది మహిళలున్నారు. 1,044 మందితో నిజామాబాద్ రెండో స్థానంలో ఉంది. రంగారెడ్డిలో 1,000 మంది పురుషులకు 950 మంది, హైదరాబాద్ జిల్లాలో 1,000 మంది పురుషులకు 954 మంది మహిళలు ఉన్నారు.
  • రాష్ట్రంలో ఆరేళ్లలోపు పిల్లల జనాభా 38.99 లక్షలు. మొత్తం జనాభాలో వీరు 11.14 శాతం.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 54.08 లక్షలు. ఇది రాష్ట్ర జనాభాలో 15.45 శాతం. ఎస్సీ జనాభాలో ప్రతి 1,000 మంది పురుషులకు 1,008 మంది మహిళలున్నారు.
  • రాష్ట్రంలో ఎస్టీల జనాభా 31.77 లక్షలు. ఇది రాష్ట్ర జనాభాలో 9.08 శాతం. ఎస్టీల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 977 మంది స్త్రీలు ఉన్నారు.
  • ప్రజల్లో జీవన స్థితిగతులు తెలిపే మానవాభివృద్ధి సూచికలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 2015-16 మానవాభివృద్ధి సూచిక రాష్ట్ర సగటు 0.595గా ఉంది.
  • ఈ సూచికలో హైదరాబాద్ (0.82 శాతం)తో తొలిస్థానంలో నిలవగా.. రంగారెడ్డి (0.71 శాతం), ఖమ్మం (0.62 శాతం) జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ అర్థగణాంక వార్షిక నివేదిక
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అర్థగణాంక శాఖ, తెలంగాణ ప్రభుత్వం

ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్
ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జస్టిస్ మంజునాథ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీలుగా గుర్తించి బీసీ (ఎఫ్) కింద ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వొచ్చని తెలిపింది. ఈ రిజర్వేషన్లు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థిక ప్రయోజనాల్లో మాత్రమే వర్తింపచేయాలని రాజకీయ పదవులకు వద్దని తెలిపింది.
కమీషన్ నివేదికకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం త్వరలోనే దానిని శాసనసభలో ఆమోదించి కేంద్రం అనుమతి కోసం ఢిల్లీకి పంపనుంది. రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 50 శాతానికి మించితే కేంద్రం అనుమతి తప్పనిసరి. జస్టిస్ మంజునాథ ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉండగా సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణ సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : జస్టిస్ మంజునాథ కమీషన్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో

ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావం
ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ మా) గుంటూరు జిల్లా తెనాలిలో డిసెంబర్ 1న ఆవిర్భవించింది. ఈ అసోసియేషన్‌కు కేంద్ర సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా వ్యవస్థాపక చైర్మన్‌గా, సినీనటి కవిత అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరసింహరాజు నియమితులయ్యారు. విభజనానంతరం ఏపీలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి దీనిని ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : సనీనటి కవిత (అధ్యక్షురాలు)
ఎందుకు : ఏపీలో సినీ పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి

తెలంగాణలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఐటీ క్యాంపస్
ప్రపంచంలోనే మొదటిసారిగా ఐటీ రంగంలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ఐటీ క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు డిసెంబర్ 2న వింద్య ఈ-ఇన్ఫో మీడియా సంస్థతో రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్యాంపస్‌ను రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేయడంతోపాటు దివ్యాంగులకు వసతి, శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దివ్యాంగుల కోసం ప్రత్యేక ఐటీ క్యాంపస్
ఎప్పుడు : త్వరలో
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : దివ్యాంగులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు

ఎరువుల కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి
తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎరువులు కొనుగోలు చేయాలంటే ఇకనుంచి ఆధార్ కార్డు సమర్పించాల్సిందేనని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఎరువుల కొనుగోలుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎరువుల కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి
ఎప్పుడు : జనవరి 1, 2018
ఎవరు : రైతులు
ఎక్కడ : తెలంగాణలో
ఎందుకు : సబ్సిడీ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి
Published date : 16 Dec 2017 03:26PM

Photo Stories