Ramamurthy: చేనేత బంధు రామమూర్తి కన్నుమూత
1979–1980లో ఏపీ ఎన్‌జీవో ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ సంఘాల ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారు. ఎన్నో కో–ఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటునకు మార్గనిర్దేశం చేసిన రామమూర్తి.. హైదరాబాద్‌లో స్వయంగా భావనా బ్యాంక్‌ను స్థాపించారు. రాష్ట్ర స్థాయి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా సేవలందించారు. బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ సంస్థ ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఇచ్చి సత్కరించింది. జర్నలిస్టుగా, ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
1990 ప్రాంతంలో చేనేత రంగంలో వచ్చిన సంక్షోభానికి స్పందించి రాజ్యాధికార సాధన ద్వారానే చేనేత వృత్తి రక్షణ, జీవనోపాధి అనే నినాదంతో సంఘటిత పరిచారు. డాక్టర్ శీరం శ్రీరామచంద్రమూర్తి, కాలేపు సత్యనారాయణ మూర్తి వంటి అనేక మంది చేనేత రంగ ప్రముఖులతో కలిసి 1992లో ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్ తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రామమూర్తి అధ్యక్షతన విజయవాడలో జరిగింది. ఆయన చొరవతోనే చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక జీవోలిచ్చాయి. 2018లో రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్.. రామమూర్తికి చేనేత బంధు పురస్కారంతో సత్కరించింది.