Singer Vani Jairam : ప్రముఖ గాయని వాణీ జయరాం హఠాన్మరణం.. ఈమె ప్రస్థానం ఇదే..
తెలుగు, తమిళంతో కలిపి 14 భాషల్లో 5 దశాబ్దాలుగా వాణీ జయరాం వెండితెరకు తన గ్రాత్రాన్ని అందించారు. సినీ పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గానూ ఇటీవల భారత ప్రభుత్వం ఆమెకు పద్మ భూషన్ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డును అందుకోకముందే వాణీ మృతి చెందడం విచారకరం.
8 ఏళ్ల వయసులోనే..
1945 నవంబర్ 30న తమిళనాడులోని వేలూరులో జన్మించారు వాణీ జయరాం. ఆమె అసలు పేరు కలైవాణి. 1971లో ఆమె గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. రంగరామానుజా అయ్యంగార్ వద్ద ఆమె శాస్త్రీయ సంగీతంతో శిక్షిణ తీసుకున్నారు. కర్ణాటక సంగీతంలో సాధన చేసిన ఆమె 8 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా రెడియోలో పాట పాడి మురిపించారు. కె విశ్వనాథ్ తీసిన స్వాతికిరణం చిత్రంలో ఆమె 8 పాటలు పాడారు. ఇక ఆమె పాడిన తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అంటూ ఆమె కంఠం స్వరమాధుర్యాలను వెదజల్లింది. భక్తి సంగీత ప్రధానమైన పాట అనగానే దర్శకులకు గుర్తొచ్చేది వాణీ జయరాం. అంతగా తన గాత్రంతో 5 దశాబ్దాలుగా సంగీత ప్రియులను మైమరిపించారు వాణీ జయరాం.
Director K.Viswanath: ఐదు జాతీయ అవార్డులు అందుకున్న ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ ఇకలేరు..
తొలిసారి పాట పాడే అవకాశం ఇలా..
ఓ కచేరీ చేస్తున్న సందర్భంలోనే సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్ కంటపడ్డారు వాణీజయరాం. ఆయనకు ఆమె గొంతు బాగా నచ్చడంతో ఆమెను గుల్జార్‌కు పరిచయం చేశారు. అనంతరం 1970లో ‘గుడ్డీ’ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశమిచ్చారు. అందులో ఆమె పాడిన ‘బోలే రే’ పాట అప్పట్లో సూపర్ హిట్టయ్యింది. దానికి తాన్‌సేన్‌తో పాటు మరో నాలుగు అవార్డులు వచ్చాయి. అలా మొదలైన ఆమె సినీ పాటల ప్రయాణం.. ఆ తర్వాత ఓ ప్రవాహంలా కొనసాగింది.
తెలుగులో మాత్రం..
వాణీ గళాన్ని తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఎస్.పి.కోదండపాణి. ‘అభిమానవంతుడు’ అనే చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను వాణీజయరాంతో పాడించారాయన. ఇక ఆ తర్వాత నుంచి ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో బిజీ గాయనిగా మారిపోయారు.
మూడు జాతీయ అవార్డులు..
‘అపూర్వ రాగంగళ్’ చిత్ర పాటలు వాణీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అందులో ఆమె పాడిన పాటలకు గానూ తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులో ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే’ పాటకు రెండోసారి, ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నియ్యరా హరా’.. పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ‘తెలిమంచు కరిగింది’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘ఒక బృందావనం’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె గళం నుంచి జాలువారిన ప్రతి పాటా సినీ సంగీత ప్రియుల్ని మురిపించింది. అప్పట్లో ఏదైనా కొత్తగా పాడించాలన్నా.. కష్టమైన స్వరకల్పన ఉన్నా వాణీతోనే పాడించాలనుకునేవారట సంగీత దర్శకులు. తాను గాయనిగా ఇంత ఎత్తు ఎదగడానికి తన భర్త జయరాం అందించిన ప్రోత్సహమే కారణమంటారు వాణీ. తమకు పిల్లలు లేకున్నా.. ఆ లోటును సంగీతమే తీర్చిందని సగర్వంగా చెబుతుంటారామె. వాణీ భర్త జయరాం 2018లో కన్నుమూశారు.
Senior actress Jamuna : ప్రముఖ తెలుగు సీనియర్ నటి జమున కన్నుమూత.. ఈమె ప్రస్థానం ఇలా..