సెప్టెంబర్ 2017 వ్యక్తులు
Sakshi Education
ఓఈసీడీ టాస్క్‌ఫోర్స్ వైస్ చైర్మన్‌గా పార్థసారథి
దేశంలో విత్తన ధ్రువీకరణకు ఏర్పాటైన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) టాస్క్‌ఫోర్స్ వైస్ చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలో జరిగిన ఓఈసీడీ టాస్క్‌ఫోర్స్ రెండో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
దేశంలోనే మొదటిసారిగా 4,200 క్వింటాళ్లకు పైగా విత్తనాలను తెలంగాణ నుంచి సూడాన్, ఈజిప్ట్, ఫిలిప్పీన్‌స మొదలగు దేశాలకు ఓఈసీడీ ధ్రువీకరణ విత్తనాలు ఎగుమతి కావటాన్ని ప్రత్యేకంగా సమావేశంలో ప్రశంసించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఓఈసీడీ టాస్క్‌ఫోర్స్ వైస్ చైర్మన్‌గా పార్థసారథి
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్
ఫోర్బ్స్ ‘గ్రేటెస్ట్ బిజినెస్ మైండ్స్’లో ముగ్గురు భారతీయులు
వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం జీవించివున్న వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, మేధావుల సమ్మేళనంతో ఫోర్బ్స్ మ్యాగజీన్ తాజాగా ‘వరల్డ్ 100 గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్’ జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. అర్సిలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్.. టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా ఇందులో ఉన్నారు.
శతవార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన తాజా ప్రత్యేకమైన జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, వర్జిన్ గ్రూప్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్, బార్క్‌షైర్ హత్‌వే సీఈవో వారన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ వంటి ప్రముఖులు ఉన్నారు. కొత్త ఆవిష్కరణలతో ప్రత్యేకతను చాటుకున్న, ప్రపంచంపై తన వంతు ప్రభావాన్ని చూపిన 100 ఎంట్రప్రెన్యూర్లతో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది.
ఫోర్బ్స్ మ్యాగజైన్‌ను బీసీ ఫోర్బ్స్.. వాల్టర్ డ్రేయ్‌తో కలిసి 1917 సెప్టెంబర్ 17న ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ 100 గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : ఫోర్బ్స్
ఎక్కడ : ప్రపంచ్యవాప్తంగా
ఎందుకు : ఫోర్బ్స్ మ్యాగజైన్ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని
ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ కన్నుమూత
ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు. కార్టూనిస్టుగా విశేష సేవలందించిన ఆయన దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మోహన్.. ఉదయం, ఆంధ్రప్రభ వంటి పలు పత్రికల్లో పనిచేశారు. పొలిటికల్ కార్టూన్లకు ఆయన పెట్టింది పేరు. ఎంతోమందిని కార్టూనిస్టులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయన సొంతం.
ఐఓసీలో ‘ఐబా’ ప్రతినిధిగా మేరీకోమ్
ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన భారత మహిళా బాక్సర్ మేరీకోమ్.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ ఫోరమ్‌లో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) ప్రతినిధిగా పాల్గొననుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. 33 ఏళ్ల మణిపూర్ స్టార్ బాక్సర్ గతేడాది ‘ఐబా’ లెజెండ్‌స అవార్డు అందుకుంది. రాజ్యసభ ఎంపీ అయిన ఆమె... నవంబర్ 11 నుంచి 13 వరకు లుసానేలో జరిగే ఎనిమిదో ఐఓసీ అథ్లెట్స్ ఫోరమ్‌లో ఐబా ప్రతినిధిగా వ్యవహరిస్తుంది.
అయితే వియత్నాంలో నవంబర్ 2 నుంచి 12 వరకు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం జరిగే ట్రయల్స్‌లో మేరీకోమ్ ఎంపికై తే అథ్లెట్స్ ఫోరమ్‌లో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఓసీ అథ్లెట్స్ ఫోరమ్ ప్రతినిధిగా మేరీకోమ్
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ
72వ ఐరాస సాధారణ అసెంబ్లీలో సుష్మా ప్రసంగం
భారతదేశం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మ విద్యాసంస్థల్ని నెలకొల్పి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వైద్యులు, ఇంజనీర్లను తయారుచేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల్ని ఉత్పత్తి చేస్తోందని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. ప్రపంచ ఐటీ శక్తిగా భారత గుర్తింపు పొందితే.. ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా పాకిస్తాన్ ఎందుకు అపఖ్యాతి పాలవుతుందో ఆ దేశ పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ మేరకు 72వ ఐరాస సాధారణ అసెంబ్లీలో సెప్టెంబర్ 23న సుష్మా ప్రసంగిస్తూ.. విధ్వంసం, మారణహోమం, క్రూరత్వాన్ని ప్రపంచానికి ఎగుమతి చేయడంతో పాకిస్తాన్ ముందువరుసలో ఉందని విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం మానవజాతి అస్తిత్వానికే ప్రమాదకరమని, ఉగ్రవాదుల జాబితాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలే ఆమోదించకపోతే.. ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఎలా పోరాటం చేయగలదని ఆమె ప్రశ్నించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 72వ ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : ఐరాస
ఎక్కడ : న్యూయార్క్
నూతన కాగ్‌గా రాజీవ్ మహర్షి ప్రమాణ స్వీకారం
కేంద్ర మాజీ హోం కార్యదర్శి రాజీవ్ మహర్షి(62) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా సెప్టెంబర్ 25న బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహర్షి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 2013 మే 23 నుంచి 2017 సెప్టెంబర్ 22 వరకు శశికాంత్ శర్మ కాగ్‌గా ఉన్నారు.
1978 బ్యాచ్, రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన మహర్షి కాగ్‌గా ఆరేళ్ల పాటు లేదా 65 ఏళ్లు పూర్తయ్యేవరకు కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన కాగ్
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : రాజీవ్ మహర్షి
హురుణ్ ఇండియా సంపన్నుల జాబితా-2017
హురుణ్ ఇండియా సంపన్నుల జాబితా-2017లో ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈయన టాప్ స్థానాన్ని దక్కించుకోవడం ఇది వరుసగా ఆరోసారి. అలాగే హురుణ్ గ్లోబల్ జాబితాలో అంబానీ ఏకంగా తొలిసారి టాప్- 15లోకి చేరారు. రిలయన్‌స ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేర్లు మార్కెట్లో ర్యాలీ జరపడం వల్ల అంబానీ సంపద 58 శాతం వృద్ధితో రూ.2,57,900 కోట్లకు చేరింది(అంబానీ సంపద తను జన్మించిన యెమెన్ దేశపు జీడీపీ కన్నా 50% ఎక్కువ).
పతంజలి సీఈవో బాలకృష్ణ సంపద 173% వృద్ధితో రూ.70,000 కోట్లకు చేరింది. దీంతో ఈయన 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ముంబైలోనే ఎక్కువ : నివేదిక ప్రకారం ముంబైలో 182 మంది సంపన్నులు ఉన్నారు. తర్వాతి స్థానంలో న్యూఢిల్లీ (117), బెంగళూరు (51) ఉన్నాయి. 26 మందితో అహ్మదాబాద్ నగరం కూడా ఈ సారి టాప్-5లో స్థానం దక్కించుకుంది. చెన్నై (22), కాన్పూర్ (11) తొలిసారి టాప్-10లోకి వచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హురుణ్ ఇండియా సంపన్నుల జాబితా - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ
ఎక్కడ : భారత్‌లో
సత్య నాదెళ్ల ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకం ఆవిష్కరణ
‘హిట్ రిఫ్రెష్’ పేరుతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల రచించిన పుస్తకాన్ని సెప్టెంబర్ 26న ఆవిష్కరించారు. అమెరికాలో జరిగిన మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ - 2017 సదస్సులో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ప్లాట్‌ఫాం సాంకేతికతల్లో విండోస్, ఆండ్రాయిడ్, ఫేస్‌బుక్‌తో ఆధార్ వ్యవస్థ పోటీపడుతోందంటూ సత్య నాదెళ్ల ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ సాంకేతికత, డిజిటల్ యుగం వైపుకు అడుగులేస్తుండటం శుభపరిణామమని ‘హిట్ రిఫ్రెష్’లో రాశారు. డిజిటల్ చెల్లింపులను పెంచడానికి తెచ్చిన ‘ఇండియాస్టాక్’ను మెచ్చుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిట్ రిఫ్రెష్ పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : రచయిత సత్య నాదెళ్ల
ఓఎన్‌జీసీ చైర్మన్‌గా శశి శంకర్
దేశీ దిగ్గజ ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి సంస్థ ‘ఓఎన్‌జీసీ’ కొత్త చైర్మన్, ఎండీగా శశి శంకర్ నియమితులయ్యారు. ఈయన 2021 మార్చి వరకు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఓఎన్‌జీసీలో డెరైక్టర్‌గా (టెక్నికల్ అండ్ ఫీల్డ్ సర్వీసెస్) ఉన్న శశి శంకర్‌ను అదే సంస్థ సీఎండీగా పదోన్నతి కల్పిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన రిటైర్మెంట్ పొందే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా పదవిలో కొనసాగుతారని పేర్కొంది.
శశి శంకర్ (56 ఏళ్లు) అక్టోబర్ 1న పదవీ బాధ్యతలు చేపడతారు. ఈయన దినేశ్ కె ష్రాఫ్ స్థానాన్ని భర్తీ చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఓఎన్‌జీసీ కొత్త చైర్మన్
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : శశి శంకర్
అరవింద్ సుబ్రహ్మణ్యన్ పదవీకాలం పొడిగింపు
ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఆయన పదవీ కాలం అక్టోబర్ 16తో ముగియనున్న నేపథ్యంలో 2018 అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సెప్టెంబర్ 23న పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యన్ 2014 అక్టోబర్‌లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. మూడేళ్ల కాలానికి బాధ్యతలు చేపట్టారు.
ప్రపంచ రక్షకుడు పెట్రోవ్ కన్నుమూత
అమెరికాతో అణు యుద్ధాన్ని నివారించి ప్రపంచ రక్షకుడిగా పేరొందిన సోవియెట్ యూనియన్ సైనికాధికారి స్టానిస్లావ్ పెట్రోవ్.. మే 19న మరణించగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. 1983 సెప్టెంబర్‌లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో మాస్కోకి దక్షిణాన ఒక రహస్య కమాండ్ కేంద్రంలో పెట్రోవ్ విధులు నిర్వర్తిస్తుండగా అమెరికా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఒక హెచ్చరిక సంకేతం మోగింది. అయితే అది తప్పుడు సంకేతమని ఆయన భావించారు. ఆ హెచ్చరిక నిజమైనదేనని పెట్రోవ్ నమ్మి ఉన్నతాధికారులకు తెలియజేసి ఉంటే సోవియట్ నాయకత్వం ప్రతీకార దాడులకు ఆదేశించి ఉండేది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాకే పెట్రోవ్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.
ట్రంప్ డిప్యూటీ అసిస్టెంట్‌గా భారత సంతత వ్యక్తి
భారత సంతతి వ్యక్తి రాజ్ షా(32) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిప్యూటీ అసిస్టెంట్‌గా, ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు వైట్‌హౌస్ సెప్టెంబర్ 13న ప్రకటించింది. సమాచార డెరైక్టర్‌గా హోప్ హిక్స్‌ను నియమించినట్లు పేర్కొంది. రిపబ్లికన్ నేషనల్ కమిటీలో పరిశోధన విభాగానికి నేతృత్వం వహించిన షా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడి డిప్యూటీ అసిస్టెంట్‌గా భారత సంతతి వ్యక్తి
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : రాజ్ షా
ఎక్కడ : అమెరికా
ఏబీసీ చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ
దేశంలోని పత్రికల సర్క్యు లేషన్ వ్యవహారాలను పర్యవేక్షించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్‌స (ఏబీసీ) చైర్మన్‌గా కోకకోలా సంస్థ ఆగ్నేయాసియా రీజియన్ వ్యవహారాల ఉపాధ్యక్షుడు దేబబ్రత ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017-18 సంవత్సరానికిగాను ఆయన ఈ పదవిలో ఉంటారు.
వ్యూహాత్మక ప్రణాళికలు, విక్రయాలు, మార్కెటింగ్ ఆపరేషన్లలో 23 ఏళ్లకుపైగా అనుభవమున్న దేబబ్రత.. దేశంలో కోకకోలా సంస్థ విక్రయాలు, డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్లను విస్తరించడంలో కీలకపాత్ర పోషించారు. ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా ముంబై సమాచార్ పత్రికకు చెందిన హర్మూస్‌జీ ఎన్ కమా, ఏబీసీ సచివాలయం సెక్రటరీ జనరల్‌గా హర్మూజ్ మాసాని ఎన్నికయ్యారు.
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్‌ను 1948లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యలేషన్స్‌కు కొత్త చైర్మన్
ఎప్పుడు : 2017-18 సంవత్సరానికి
ఎవరు : దేబబ్రత ముఖర్జీ
ఐఎన్‌ఎస్ అధ్యక్షురాలిగా అకిల ఉరంకర్
ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్‌ఎస్) నూతన అధ్యక్షురాలిగా 2017-18 ఏడాదికిగానూ బిజినెస్ స్టాండర్డ్స్ పత్రికకు చెందిన అకిల ఉరంకర్ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 15న బెంగళూరులో జరిగిన ఐఎన్‌ఎస్ 78వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సొసైటీ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా జయంత్ మమ్మెన్ మాథ్యూ (మలయాళ మనోరమకు), ఉపాధ్యక్షుడిగా శైలేష్ గుప్తా (మిడ్-డే), జనరల్ సెక్రటరీగా ఎస్పీ కౌర్, గౌరవ ట్రెజరర్‌గా శరత్ సక్సేనా (హిందుస్తాన్ టైమ్స్) ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కమిటీ (ఈసీ) సభ్యుడిగా ‘సాక్షి’ మార్కెటింగ్, అడ్వర్టైజ్‌మెంట్ డెరైక్టర్ కె. రాజప్రసాద్ రెడ్డి (కేఆర్‌పీ రెడ్డి) ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా మొత్తం దేశ వ్యాప్తంగా వివిధ పత్రికలకు చెందిన 41 మందిని ఎన్నుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎన్‌ఎస్ నూతన కార్యవర్గం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : అధ్యక్షురాలిగా అకిల ఉరంకర్
ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్‌లో సురేశ్ చిట్టూరి
ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) వైస్ చైర్మన్‌గా శ్రీనివాసా ఫామ్స్ ఎండీ సురేశ్ చిట్టూరి నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. భారత్ నుంచి ఈ పదవి పొందిన రెండో వ్యక్తిగా రికార్డు స్థాపించారు. ఐఈసీ బోర్డులో తొలిసారిగా దేశం నుంచి వెంకటేశ్వర హ్యాచరీస్ వ్యవస్థాపకులు బి.వి.రావు 1992-93లో స్థానం సంపాదించారు. అంతర్జాతీయంగా కోడిగుడ్ల పరిశ్రమకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐఈసీలో 80 దేశాల నుంచి సభ్యులు ఉన్నారు. ఉత్పత్తి, పోషకాహారం, విక్రయం వంటి అంశాల్లో ఆధునిక అభివృద్ధి సమాచారాన్ని వీరు ఇచ్చిపుచ్చుకుంటారు.
భారత వాయుసేన మార్షల్ అర్జన్ సింగ్ కన్నుమూత
1965 భారత్-పాక్ యుద్ధ వీరుడు, భారత వాయుసేన (ఐఏఎఫ్) మార్షల్ అర్జన్ సింగ్(98) సెప్టెంబర్ 16న ఢిల్లీలో కన్నుమూశారు. ఆర్మీలో ఫీల్డ్ మార్షల్ స్థాయి అయిన ఫైవ్ స్టార్ ర్యాంకుకు ప్రమోటైన ఏకైక అధికారి అర్జన్ సింగ్. ఆయన రిటైర్మెంట్ తర్వాత దౌత్యవేత్తగా భారత్‌కు సేవలందించారు.
అర్జన్ సింగ్ 1964 నుంచి 1969 వరకు ఐఏఎఫ్ చీఫ్‌గా కొనసాగారు. ఐఏఎఫ్‌ను ప్రపంచ వైమానిక బలగాల్లో ఒక సమర్థవంతమైన వ్యవస్థగా, నాలుగో అతిపెద్ద వైమానిక శక్తిగా మలచిన ఘనత ఆయనదే. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నుంచి రిటైర్మెంట్ వరకు 60కి పైగా వివిధ యుద్ధ, సైనిక రవాణా విమానాలను ఆయన నడిపారు. 1965 భారత్-పాక్‌లో యుద్ధంలో.. పాకిస్తాన్ చేపట్టిన ‘ఆపరేషన్ గ్రాండ్‌శ్లామ్’ను తిప్పికొట్టంలో అర్జన్ సింగ్ పాత్ర అత్యంత కీలకం. ఇందుకుగానూ 1965లో భారత ప్రభుత్వం ఈయన్ను పద్మ విభూషణ్‌తో గౌరవించింది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మాను ఆక్రమించుకున్న జపాన్ సేనలపై సింగ్ నేతృత్వంలోని భారత వాయుసేన భీకర దాడులు చేసింది. దీంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ‘డిస్టింగ్విష్డ్ ఫ్లయింగ్ క్రాస్’ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ పైలట్ కూడా ఆయనే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఏఎఫ్ మార్షల్ అర్జన్ సింగ్ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్
ఎక్కడ : న్యూఢిల్లీలో
స్కొలాస్టిక్ కిడ్ రిపోర్టర్ లుగా భారతీయులు
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక స్కొలాస్టిక్‌కు కిడ్ రిపోర్టర్లుగా ముగ్గురు భారతీయ చిన్నారులు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 44 మందిని ఎంపికచేశారు. ఈ జాబితాలో ఢిల్లీకి చెందిన అనన్యా చోప్రా, కోల్‌కతాకు చెందిన రూప్‌కథా రాయ్, బెంగళూరుకు చెందిన సాకేత్ దేవులపల్లిలకు చోటు దక్కింది. వీరంతా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రీడలు, వినోదం సహా పలు కార్యక్రమాలను రిపోర్టు చేయనున్నారు. వీరు సేకరించిన వార్తలు, కథనాలను సంస్థ వెబ్‌సైట్ సహా స్కొలాస్టిక్ క్లాస్‌రూమ్ మేగజైన్ల్లలో ప్రచురిస్తారు.
గతేడాది రిపోర్టర్లుగా ఎంపికై న చిన్నారులు అమెరికా అధ్యక్ష ఎన్నికలు సహా పలు కార్యక్రమాలను రిపోర్ట్ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్కొలాస్టిక్ కిడ్ రిపోర్టర్లుగా 44 మంది చిన్నారులు
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : భారత్ నుంచి ముగ్గురు ఎంపిక. రూప్‌కథా రాయ్, సాకేత్ దేవులపల్లి, అనన్యా చోప్రా.
ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టుకు కేంద్ర న్యాయశాఖ ఆరుగురు న్యాయమూర్తులను నియమించింది. ఈ మేరకు న్యాయమూర్తులు దూర్వాసుల వేంకట సూర్యనారాయణ సుబ్రహ్మణ్య (డీవీవీఎస్) సోమయాజులు, కొంగర విజయలక్ష్మి, పోట్లపల్లి కేశవరావు, మంతోజ్ గంగారావు, అభినంద్‌కుమార్ షావిలి, తొడుపునూరి అమర్‌నాథ్‌గౌడ్‌ల నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెప్టెంబర్ 18న ఆమోదం తెలిపారు. వీరిలో సోమయాజులు విశాఖపట్నం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తుండగా, మిగతా ఐదుగురు ఉమ్మడి హైకోర్టు న్యాయవాదులు. ఓ జిల్లా కోర్టు న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడం మన హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ నియామకాలతో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. హైకోర్టులో ఇంకా 28 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులు నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : కేంద్ర న్యాయశాఖ
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : హైకోర్టులో 33కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య
ఎన్‌ఐఏ కొత్త చీఫ్‌గా వైసీ మోదీ
ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయానికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కొత్త డెరైక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వైసీ మోదీ నియమితులయ్యారు. ప్రస్తుత ఎన్‌ఐఏ చీఫ్ శరద్‌కుమార్ నుంచి అక్టోబర్ 30న వైసీ మోదీ బాధ్యతలు స్వీకరిస్తారు. 2021 మే 31 వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
1984 అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన మోదీ ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ప్రత్యేక డెరైక్టర్‌గా ఉన్నారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో వైసీ మోదీ కూడా సభ్యునిగా ఉన్నారు. గుజరాత్ అల్లర్లకు సంబంధించిన మొత్తం తొమ్మిది కేసుల్లో నరోదా పటియ, నరోదాగామ్, గుల్బర్గ్ సొసైటీ కేసులను వైసీ మోదీ దర్యాప్తు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ దర్యాప్తు సంస్థ కొత్త డెరైక్టర్ జనరల్
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : వైసీ మోదీ
ఎందుకు : పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఎన్‌ఐఏ చీఫ్ శరద్‌కుమార్
ఎస్‌ఎస్‌బీ చీఫ్‌గా రజనీకాంత్ మిశ్రా
ఇండో-నేపాల్ సరిహద్దుల్లో గస్తీ కాసే సశస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ) డెరైక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రజనీకాంత్ మిశ్రా నియమితులయ్యారు. 1984 ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన మిశ్రా ప్రస్తుతం సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్)లో అదనపు డెరైక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఆయన ఎస్‌ఎస్‌బీ చీఫ్‌గా 2019 ఆగస్టు 31 వరకూ కొనసాగుతారు.
ప్రస్తుతం ఎస్‌ఎస్‌బీ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న అర్చనా రామసుందరం సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేస్తారు. అనంతరం రజనీకాంత్ మిశ్రా బాధ్యతలు చేపడతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సశస్త్ర సీమా బల్ కొత్త డెరైక్టర్ జనరల్
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : రజనీకాంత్ మిశ్రా
ఎందుకు : సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డెరైక్టర్ జనరల్ అర్చనా రామసుందరం
ప్రపంచంలో అత్యంత వృద్ధ మనిషి కన్నుమూత
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మనిషిగా గుర్తింపు పొందిన వయోలెట్ మోసె బ్రౌన్ 117 ఏళ్ల వయసులో మరణించింది. తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై ఆమె సెప్టెంబర్ 15న తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.
1900, మార్చి 10న బ్రిటిష్ పాలనలోని జమైకాలో బ్రౌన్ జన్మించారు. 2015లో బ్రౌన్ 115వ పుట్టిన రోజు సందర్భంగా బ్రిటన్ రెండో ఎలిజబెత్ రాణి ఆమె గౌరవార్థం ఓ లేఖను పంపారు. ఈ ఏడాది జూలై 27న 117 ఏళ్ల 139 రోజుల బ్రౌన్ పేరును గిన్నిస్ బుక్ అత్యంత వృద్ధ మహిళగా తమ రికార్డులో నమోదు చేసింది. బ్రౌన్ మరణంతో జపాన్‌కు చెందిన నబీ తాజిమా(117 ఏళ్ల 46 రోజులు) అత్యంత వృద్ధ మనిషిగా నిలుస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలో అత్యంత వృద్ధ మనిషి వయోలెట్ మోసె బ్రౌన్ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎక్కడ : జమైకా
పీపీ రావుకన్నుమూత
రాజ్యాంగ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పావని పరమేశ్వరరావు (పీపీ రావు) సెప్టెంబర్ 13న మరణించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈయన.. న్యాయ విభాగంలో 50 ఏళ్ల పాటు సేవలందించారు. దీనికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 2010 మార్చిలో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
ఆస్ట్రేలియా ప్రచారకర్తగా పరిణీతి చోప్రా
భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా.. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను ప్రచారకర్తగా నియమించింది. టూరిజం అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ‘ఫ్రెండ్ ఆఫ్ ఆస్ట్రేలియా’ కాన్సెప్ట్‌ను పరిణీతి ప్రచారం చేస్తుంది. ఇందుకోసం క్వీన్‌సలాండ్ తదితర ప్రదేశాల్లో పర్యటించి, తన అనుభవాలను భారతీయులతో పంచుకుంటుందని, ఆస్ట్రేలియా జీవజాలానికి సంబంధించి విశేషాలను కూడా పరిణీతి ద్వారా భారతీయులకు పరిచయం చేస్తామని ఆస్ట్రేలియా కాన్సూల్ జనరల్ టోనీ హ్యూబర్ తెలిపారు.
ఆ దేశానికి పర్యాటక ప్రచారకర్తగా ఎంపికైన తొలి భారతీయురాలు కూడా పరిణీతి చోప్రానే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా పర్యాటక ప్రచారకర్త
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : పరణీతి చోప్రా
ఎక్కడ : ఆస్ట్రేలియా
ఎందుకు : ఆస్ట్రేలియాకు భారత పర్యాటకులను ఆకర్షించేందుకు
అమెరికాలో ఈ యేటి మేటి నాయకులు
అమెరికాలో ఉత్తమ రాజకీయ నాయకులుగా ఎంపికై న 50 మందిలో ఐదుగురు ఇండో అమెరికన్లకు చోటు దక్కింది. 2017 సంవత్సరానికిగాను రూపొందించిన ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ఐదుగురిలో నలుగురు భారతీయ మూలాలున్న మహిళలే ఉన్నారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా అంబాసిడర్‌గా కొనసాగుతున్న నిక్కీ హేలీతోపాటు సీమావర్మ, నీల్ కత్యాల్, అపర్ణా మాధుర్, నవోమీ రావులకు ఉత్తమ రాజకీయ నాయకులుగా చోటు దక్కింది.
నిక్కీ హేలీకి జాబితాలో 22వ ర్యాంకు దక్కింది. సీమా వర్మ 26వ ర్యాంకును సొంతం చేసుకోవగా అపర్ణా మాధుర్ 32వ స్థానంలో, నీల్ కత్యాల్ 40 స్థానంలో, నావోమీ రావు 42వ స్థానంలో నిలిచారు. శ్వేతసౌధంలో వ్యూహకర్తగా పనిచేసిన మాజీ అధికారి స్టీవ్ బ్యానన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలువగా.. ప్రతినిధుల సభ స్పీకర్‌గా కొనసాగుతున్న పాల్ రియాన్ చివరిస్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ యేటి మేటి నాయకులుగా ఐదుగురు ఇండో అమెరికన్లు
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎక్కడ : అమెరికాలో
జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య
ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్ (55) సెప్టెంబర్ 5న దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని రాజరాజేశ్వరనగర్‌లోని నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఈమెపై అతిసమీపం నుంచి కాల్పులు జరపటంతో అక్కడికక్కడే మరణించారు. హత్య కేసుని దర్యాప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసింది.
కన్నడ పత్రిక ‘గౌరీ లంకేశ్ పత్రికె’కు గౌరీ లంకేశ్ ఎడిటర్. పలు పబ్లికేషన్లనూ నిర్వహిస్తున్నారు. సాహసోపేత జర్నలిస్టుగా, సామాజిక వేత్తగా గౌరీ శంకర్ సుప్రసిద్ధురాలు.
రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి - 2017 ప్రకారం... 180 దేశాల్లో భారత్ 136వ స్థానంలో నిలిచింది.
ఎన్‌ఎండీసీ సీఎండీగా బైజేంద్ర కుమార్
ప్రభుత్వ రంగంలోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) సీఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్ బైజేంద్ర కుమార్ సెప్టెంబర్ 6న బాధ్యతలు స్వీకరించారు. చత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1985 బ్యాంక్ ఐఏఎస్ అధికారి ఎన్ బైజేంద్రకుమార్ మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో కలెక్టర్ సహా పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, న్యూఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ చీఫ్‌గా ఆయన పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఎండీసీ నూతన సీఎండీ
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : బైజేంద్ర కుమార్
పీటీఐ చైర్మన్‌గా ఎన్నికైన వివేక్ గోయంకా
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్‌గా ఎక్స్‌ప్రెస్ గ్రూప్ చైర్మన్, ఎండీ వివేక్ గోయంకా.. వైస్ చైర్మన్‌గా ది హిందూ మాజీ చీఫ్ ఎడిటర్ ఎన్. రవి ఎన్నికయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 8న జరిగిన పీటీఐ 69 వార్షిక సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుత పీటీఐ చైర్మన్ రియాద్ మాథ్యూ(మలయాళ మనోరమ) నుంచి వివేక్ గోయంకా బాధ్యతలు స్వీకరిస్తారు.
పీటీఐ భారత్‌లో అతిపెద్ద న్యూస్ ఏజెన్సీ. ఇది దేశంలోని 500కుపైగా పత్రికులకు వార్తలను అందిస్తుంది. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీటీఐకి కొత్త చైర్మన్
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : వివేక్ గోయంకా
ఎక్కడ : న్యూఢిల్లీ
సియామ్ కొత్త ప్రెసిడెంట్‌గా అభయ్ ఫిరోదియా
ఫోర్స్ మోటార్స్ చైర్మన్ అభయ్ ఫిరోదియా వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. ఈయన 1990-91, 1991-92 లలో సియామ్ హెడ్‌గా వ్యవహరించారు. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వడేరా కొత్త వైస్-ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఇక మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవ ట్రెజరర్‌గా ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సియామ్‌కు కొత్త అధ్యక్షుడు
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : ఫోర్స్ మోటార్స్ చైర్మన్ అభయ్ ఫిరోదియా
ప్రపంచ యాత్రకు భారత మహిళా నావికులు
ప్రపంచాన్ని చుట్టివచ్చేందుకు ఆరుగురు భారత మహిళా నావికులు చేపట్టిన ‘నావికా సాగర్ పరాక్రమ్’ యాత్రను సెప్టెంబర్ 10న రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గోవాలోని పణజిలో ప్రారంభించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్ తరిణిలో 165 రోజుల పాటు ఈ సాహస యాత్ర సాగుతుంది. 17 మీటర్ల పొడవు, ఐదు మీటర్ల వెడల్పుతో 23 టన్నుల బరువున్న ఈ నౌకను గోవాలోని ఆక్వారియస్ షిప్‌యార్డులో తయారుచేశారు. ఈ నౌకకు లెఫ్టినెంట్ కమాండర్ వర్టికా జోషి నేతృత్వం వహిస్తారు. ఈమెతో పాటు లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జమ్‌వాల్, లెఫ్టినెంట్ పాతర్లపల్లి స్వాతి, లెఫ్టినెంట్ బోయపాటి ఐశ్వర్య, లెఫ్టినెంట్ విజయా దేవీ, లెఫ్టినెంట్ పాయల్ గుప్తాలు ఉన్నారు. ఈ సాహసయాత్రల్లో ఇద్దరు తెలుగు యువతులు స్వాతి (వైజాగ్), ఐశ్వర్య (హైదరాబాద్) పాల్గొంటున్నారు.
ఈ ప్రపంచ యాత్రలో భాగంగా ఐఎన్‌ఎస్ తరిణి... ఫ్రీ మాన్టిల్ (ఆస్ట్రేలియా), లిట్టెల్టన్ (న్యూజి లాండ్), పోర్ట్ స్టాన్లీ (ఫాక్లాండ్‌స), కేప్ టౌన్ (దక్షిణాఫ్రికా) నౌకాశ్రయాల్లో ఆగుతుంది. ‘నావికా సాగర్ పరాక్రమ్’లో భాగంగా దాదాపు 21,600 నాటికల్ మైళ్ల (40 వేల కిలోమీటర్లు) దూరాన్ని ఐదు అంచెల్లో ఐఎన్‌ఎస్ తరిణి ప్రయాణిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నావికా సాగర్ పరాక్రమ్ యాత్ర
ఎప్పుడు : సెప్టెంబర్ 9న ప్రారంభం
ఎవరు : ఆరుగురు మహిళా నావికులు
ఎందుకు : ఐఎన్‌ఎస్ తరిణితో ప్రపంచాన్ని చుట్టివచ్చేందుకు
మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించిన ఏఎస్పీ రాధిక
చిత్తూరు ఏఎస్పీ జి.ఆర్. రాధిక ఐరోపా ఖండంలోని రష్యాలో ఉన్న మౌంట్ ఎల్బ్రస్‌ని అధిరోహించి రికార్డు సృష్టించారు. ఆమె.. 2016 మే 20న ఆసియాలోని ఎవరెస్టు పర్వతాన్ని(29,029 అడుగులు), అదే ఏడాది ఆగస్టు 14న ఆఫ్రికాలోని కిలిమంజారో(19,341 అడుగులు), ఈ ఏడాది మార్చి 18న ఆస్ట్రేలియాలోని కొజియాస్కో పర్వతాన్ని(7,310 అడుగులు) అధిరోహించారు. తాజాగా సెప్టెంబర్ 8న ఐరోపాలోని మౌంట్ ఎల్బ్రస్ (18,510 అడుగులు) ఎక్కారు. తద్వారా నాలుగు ఖండాల్లో ఉన్న ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన తొలి భారత మహిళా పోలీసు అధికారిగా రాధిక రికార్డు నెలకొల్పారు. మిగిలిన మూడు ఖండాల్లోని మూడు పర్వతాలను మరో రెండేళ్లలో అధిరోహించేందుకు ప్రయత్నిస్తానని రాధిక తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాలుగు ఖండాల్లో ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన తొలి భారత మహిళా పోలీసు అధికారి
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : ఏఎస్పీ రాధిక
ఎక్కడ : చిత్తూరు, ఆంధ్రప్రదేశ్
అమెరికా రాయబారిగా కెనెత్ జెస్టర్
మన దేశంలో అమెరికా రాయబారిగా కెనెత్ జెస్టర్ నామినేట్ అయ్యారు. ఈయన భారత్, అమెరికా మధ్య చారిత్రక అణు ఒప్పందం ఖరారులో కీలక పాత్ర పోషించారు. బుష్ హయాంలో ఇండో-యూఎస్ సంబంధాల పెరుగుదలకు తీవ్రంగా కృషి చేశారు. ఈ నియామకాన్ని సెనెట్ ఆమోదిస్తే ప్రస్తుత రాయబారి రిచర్డ్ వర్మ స్థానంలో జెస్టర్ బాధ్యతలు చేపడతారు.
మిస్ ట్రాన్స్‌క్వీన్ ఇండియాగా నితాశా బిశ్వాస్
మిస్ ట్రాన్స్‌క్వీన్ ఇండియా తొలి టైటిల్‌ను కోల్‌కత్తాకు చెందిన ట్రాన్స్ ఉమెన్ నితాశా బిశ్వాస్ దక్కించుకుంది. ఈ మేరకు న్యూఢిల్లీలో ఆగస్టు 28న జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. 2018లో థాయ్‌లాండ్‌లో జరగనున్న మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌క్వీన్ పోటీల్లో నితాశా భారత్ తరపున పాల్గొననుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ ట్రాన్స్‌క్వీన్ ఇండియా - 2017
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : నితాశా బిశ్వాస్
ఎక్కడ : న్యూఢిల్లీలో
కొత్త కాగ్ రాజీవ్ మహర్షి
నూతన భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా రాజీవ్ మహర్షి ఆగస్టు 31న నియమితులయ్యారు. ఆయన కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా ఆగస్టు 30న పదవీ విరమణ చేశారు. రాజీవ్ 1978 బ్యాచ్ రాజస్తాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుత కాగ్ శశికాంత్ శర్మ పదవీకాలం సెప్టెంబర్ 24తో ముగుస్తుంది. ఆ తర్వాత రాజీవ్ మహర్షి బాధ్యతలు చేపడతారు.
డిప్యూటీ కాగ్‌లుగా అశ్వినీ అత్రి, అనితా పట్నాయక్, రంజన్ కుమార్ ఘోష్‌లు నియమితులయ్యారు. రాజీవ్ మహర్షి స్థానంలో కేంద్ర హోంశాఖ కొత్త కార్యదర్శిగా రాజీవ్ గౌబా బాధ్యతలు స్వీకరించారు. 1982 బ్యాచ్ జార్ఖండ్ కేడర్‌కు చెందిన గౌబా రెండేళ్లపాటు హోం శాఖ కార్యదర్శిగా ఉంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కొత్త కాగ్ రాజీవ్ మహర్షి
ఎప్పుడు : ఆగస్టు 31
ఎందుకు : సెప్టెంబర్ 24తో ముగియనున్న ప్రస్తుత కాగ్ శశికాంత్ శర్మ పదవీకాలం
ఐఏఎఫ్ మాజీ చీఫ్ త్యాగిపై చార్జిషీట్
యూపీఏ-2 హయాంలో జరిగిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో ఐఏఎఫ్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగిపై సీబీఐ సెప్టెంబర్ 1న చార్జిషీట్ దాఖలు చేసింది. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి త్యాగి రూ.450 కోట్లు ముడుపులు తీసుకున్నారని చార్జిషీట్‌లో పేర్కొంది. వీవీఐపీ హెలికాప్టర్లు ప్రయాణించాల్సిన ఎత్తును 6,000 నుంచి 4,500 మీటర్లకు తగ్గించేలా నిబంధనలు మార్చేందుకు త్యాగి ఒప్పుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. చార్జిషీట్‌లో త్యాగితో పాటు ఆయన బంధువు సంజీవ్ అలియాస్ జూలీ, మాజీ ఎయిర్ మార్షల్ జేఎస్ గుజ్రాల్, అడ్వొకేట్ గౌతమ్ ఖైతాన్‌ను నిందితులుగా పేర్కొంది
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఏఎఫ్ మాజీ చీఫ్‌పై సీబీఐ చార్జిషీట్
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : ఎస్పీ త్యాగి
ఎందుకు : అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో
కోల్ ఇండియా సీఎండీగా గోపాల్ సింగ్
ప్రపంచ అతిపెద్ద కోల్ మైనింగ్ కంపెనీ ‘కోల్ ఇండియా’ తాత్కాలిక సీఎండీగా సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) చీఫ్ గోపాల్ సింగ్ నియమితులయ్యారు. సుతీర్థ భట్టాచార్య ఆగస్ట్ 31న పదవీ విరమణ చేయండతో సింగ్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. సీసీఎల్ కోల్ ఇండియా అనుబంధ సంస్థ.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోల్ ఇండియా కొత్త సీఎండీ నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : గోపాల్ సింగ్
ఎందుకు : సుతీర్థ భట్టాచార్య ఆగస్ట్ 31న పదవీ విరమణ చేసినందుకు
న్యూజిలాండ్ ఎడ్యుకేషన్ అంబాసిడర్‌గా కృతి సనన్
బాలీవుడ్ నటి కృతి సనన్ న్యూజిలాండ్‌లో ఎడ్యుకేషన్ అంబాసిడర్‌గా ఎంపికైంది. న్యూజిలాండ్‌లోని విద్యాసంస్థల్లో చేరేలా విదేశీ విద్యార్థులను ఆకర్షించడం, ప్రచారం కల్పించడం కృతి సనన్ విధులు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా సెప్టెంబర్ 1న ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : న్యూజిలాండ్ ఎడ్యుకేషన్ అంబాసిడర్ నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : కృతి సనన్
ఎందుకు : విదేశీయులు న్యూజిలాండ్‌లో చేరేలా ప్రచారం కల్పించేందుకు
భారత హాకీ కోచ్ ఓల్ట్‌మన్స్ కు ఉద్వాసన
భారత హాకీ జట్టు కోచ్ పదవి నుంచి రోలంట్ ఓల్ట్‌మన్స్ ను హాకీ ఇండియా (హెచ్‌ఐ) తప్పించింది. ఈ మేరకు సెప్టెంబర్ 2న హెచ్‌ఐ వెల్లడించింది. ప్రస్తుత హై పెర్ఫార్మెన్‌స డెరైక్టర్ డేవిడ్ జాన్‌కు తాత్కాలిక కోచ్ బాధ్యతలు అప్పగించింది. పూర్తిస్థాయి కోచ్ నియామకం జరిగే వరకు ఆయన సీనియర్ జట్టు కోచ్‌గా పనిచేస్తారని హెచ్‌ఐ తెలిపింది.
హాలెండ్‌కు చెందిన ఓల్ట్‌మన్‌స తొలుత 2013లో హై పెర్ఫార్మెన్‌స డెరైక్టర్‌గా చేరారు. అనంతరం 2015 జూలైలో కోచ్‌గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత హాకీ కోచ్ పదవి నుంచి ఓల్ట్‌మన్స్ తొలగింపు
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : హాకీ ఇండియా
నోవార్టిస్ సీఈవోగా వసంత్ నరసింహన్
స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే ఫార్మా దిగ్గజం నొవార్టిస్ సీఈవోగా ప్రవాస భారతీయుడు వసంత్ నరసింహన్ నియమితులయ్యారు. 2018 ఫిబ్రవరి 1న ఆయన బాధ్యతలు చేపడతారు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న జోసెఫ్ జిమెనెజ్ అప్పటికి సీఈవోగా వైదొలుగుతారు. నరసింహన్ (41) ప్రస్తుతం నోవార్టిస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, ఔషధాభివృద్ధి విభాగం గ్లోబల్ హెడ్‌గా పనిచేస్తున్నారు.
నొవార్టిస్ మార్కెట్ విలువ 216 బిలియన్ డాలర్లు. సంస్థలో 1,19,000 పైచిలుకు సిబ్బంది ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నోవార్టీస్ కొత్త సీఈవో
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : వసంత్ నరసింహన్
ఎందుకు : 2018 ఫిబ్రవరి 1న బాధ్యతలు చేపట్టనున్న వసంత్
ముషారఫ్.. పరారీలో ఉన్న నేరస్తుడు
పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ను ఆ దేశ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ‘పరారీలో ఉన్న నేరస్తుడి’గా ప్రకటించింది. ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆగస్టు 31న తీర్పు చెప్పింది. భుట్టో 2007 డిసెంబర్ 27న హత్యకు గురయ్యారు.
"ఐ డూ వాట్ ఐ డూ" పుస్తకావిష్కరణ
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రచించిన ‘ఐ డూ వాట్ ఐ డూ’ పుస్తక ఆవిష్కరణ సెప్టెంబర్ 5న చెన్నైలో జరిగింది. రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా తన అనుభవాలను ఈ పుస్తకంలో వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భారత్‌కి అపరిమితమైన సామర్ధ్యముందని, అయితే సాధించడానికి ముందుగానే గొప్పలు చెప్పుకుంటూ తిరగడం శ్రేయస్కరం కాదని ఆయన సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : "ఐ డూ వాట్ ఐ డూ" పుస్తకావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : రచయిత ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
ఎక్కడ : చెన్నైలో
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌కుమార్
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్‌కుమార్ సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టారు. అరవింద్ పనగరియా ఈ పదవికి రాజీనామా చేయడంతో ప్రభుత్వం రాజీవ్‌ను నియమించింది.

Published date : 16 Sep 2017 02:59PM