Tamil Nadu: చెన్నై మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి దళిత మహిళ?
తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరం చెన్నై మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్.ప్రియ మార్చి 4న మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసింది. దీంతో చెన్నై మేయర్ పీఠం పై కూచున్న తొలి దళిత మహిళగా 29 ఏళ్ల ప్రియ రికార్డు నెలకొల్పింది. చెన్నైకు ప్రియ 49వ మేయర్. అంటే ఆమెకు ముందు 48 మంది మేయర్లు ఆ నగరానికి పని చేస్తే వారిలో ఇద్దరే మహిళా మేయర్లు. 1957లో కాంగ్రెస్ నుంచి తారా చెరియన్, 1971లో డి.ఎం.కె నుంచి కామాక్షి జయరామన్‌లు మాత్రమే మేయర్లుగా పని చేశారు. మిగిలిన వారంతా పురుషులే. ఇక దళిత మహిళ ఈ స్థానంలో కూచోవడం అనేది చరిత్రలోనే లేదు. కాని ప్రియ దళిత మహిళగా ఆ రికార్డును తన సొంతం చేసుకుంది.
ఏకగ్రీవంగా ఎన్నిక..
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక 2022, ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రేటర్ చెన్నైలోని 200 వార్డులలో 153 స్థానాలు డీఎంకే పార్టీకి వచ్చాయి. ఇంకో 25 స్థానాలు డీఎంకే మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అన్నా డీఎంకే పార్టీకి కేవలం 15 వార్డులు దక్కాయి. ఈసారి ఎన్నికలలో చెన్నై మేయర్ పదవిని దళిత మహిళకు రిజర్వ్ చేయడం వల్ల నార్త్ చెన్నై 74వ వార్డు (తిరువికనగర్) నుంచి గెలిచిన ప్రియకు ఏకగ్రీవంగా ఈ పదవి దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చెన్నై మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి దళిత మహిళ?
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ఆర్.ప్రియ
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : ఇటీవలి ఎన్నికల్లో ఆర్.ప్రియ నగర మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో..