Skip to main content

నవంబర్ 2019 వ్యక్తులు

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం
Current Affairs
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత దేవేంద్ర గంగాధర్రావు ఫడ్నవీస్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తోపాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో నవంబర్ 23న జరిగిన కార్యక్రమంలో ఫడ్నవిస్, అజిత్ పవార్‌తో మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు. అనంతరం ఫడ్నవిస్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని అన్నారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశామని గవర్నర్ తెలిపారు.
ఫడ్నవీస్ నేపథ్యం
బీజేపీ నేత, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రలోని నాగపూర్‌లో 1970 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో పనిచేశారు. దాంతో సహజంగానే దేవేంద్ర కూడా ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల పట్ల చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారు. నాగపూర్ యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. తర్వాత బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చదివారు.
1990వ దశకంలో రాజకీయాల్లో ప్రవేశించిన ఫడ్నవీస్ 1992, 1997లో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు. నాగపూర్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మేయర్‌గా రికార్డు సృష్టించారు. 1999, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ సౌత్‌వెస్టు స్థానం నుంచి నెగ్గారు. 2014లో మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : దేవేంద్ర గంగాధర్రావు ఫడ్నవీస్
ఎక్కడ : రాజ్‌భవన్, ముంబై, మహారాష్ట్ర

నౌకాదళంలో తొలి మహిళా పైలట్‌గా శివాంగి
భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్‌గా లెఫ్టినెంట్ శివాంగి రికార్డు నెలకొల్పనున్నారు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకొన్న ఆమె 2019, డిసెంబర్ 2న కేరళలోని కోచిలో విధుల్లో చేరనున్నారు. నౌకాదళంలోని డోర్నియర్ విమానాలను శివాంగి నడపనున్నారు. బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన శివాంగి స్థానిక డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసింది. ఎజిమాలోని ఇండియన్ నేవల్ అకాడమీలో 27 ఎన్‌ఓసీ కోర్సు చేసింది. నేవీలో ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్‌ను నియంత్రించే అధికారులుగా, కమ్యూనికేషన్స్, ఆయుధాలను పర్యవేక్షించే విభాగాల్లో మహిళలు పని చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్‌గా రికార్డు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : లెఫ్టినెంట్ శివాంగి
ఎక్కడ : కోచి, కేరళ

అసృ్పశ్యుని యుద్ధగాథ పుస్తక ఆవిష్కరణ
దళిత ఉద్యమ నేత డాక్టర్ కత్తి పద్మారావు రచించిన ‘ఒక అసృ్పశ్యుని యుద్ధగాథ’ పుస్తకాన్ని యూపీఎస్సీ సభ్యుడు ప్రొఫెసర్ కె.ఎస్.చలం ఆవిష్కరించారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నవంబర్ 24న జరిగిన ఈ కార్యక్రమంలో ఎ.ఎస్.చలం మాట్లాడుతూ... దేశంలో అసృ్పశ్యతకు గురై యుద్ధ వీరులుగా మారి విజయాన్ని సాధించిన ఎంతో మంది చరిత్రలే యుద్ధగాధ పుస్తకమన్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అణచివేతలను అధిగమించేందుకు అణగారిన వర్గాలు ఉద్యమించాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒక అసృ్పశ్యుని యుద్ధగాథ పస్తకావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : యూపీఎస్సీ సభ్యుడు ప్రొఫెసర్ కె.ఎస్.చలం
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్

జీఆర్‌పీ ప్రోగ్రామ్‌కు ఏపీఈఆర్‌సీ చైర్మన్
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2019, నవంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న రెండో అంతర్జాతీయ రెగ్యులేటరీ పర్‌స్పెక్టివ్ (జీఆర్‌పీ) ప్రోగ్రామ్‌కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి హాజరుకానున్నారు. విద్యుత్ రంగంలో, విద్యుత్ నియంత్రణ వ్యవహారాల్లో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అభివృద్ధి, ఇతర అంశాల గురించి ఈ సదస్సులో చర్చించనున్నారు.
ఫోరమ్ ఫర్ రెగ్యులేటర్స్ (ఎఫ్‌వోఆర్) తన కార్యకలాపాల్లో భాగంగా 2018 ఏడాది నుంచి ప్రతీ సంవత్సరం ఈఆర్‌సీ చైర్‌పర్సన్లు, సభ్యుల కోసం జీఆర్‌ీపీ నిర్వహిస్తోంది. 2018లో మెల్‌బోర్న్‌లో జీఆర్‌ీపీ నిర్వహించారు. ఈసారి సిడ్నీలో సెంటర్ ఫర్ ఎనర్జీ (సీఈఆర్), ఐఐటీ కాన్పూర్ సహకారంతో జీఆర్‌ీపీ జరగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఆర్‌పీ ప్రోగ్రామ్‌కు ఏపీఈఆర్‌సీ చైర్మన్
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి
ఎక్కడ : సిడ్నీ, ఆస్ట్రేలియా
ఎందుకు : విద్యుత్ నియంత్రణ వ్యవహారాల్లో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అంశాలపై చర్చించేందుకు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాజీనామా
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ నవంబర్ 26న తమ పదవులకు రాజీనామా చేశారు. నవంబర్ 23న ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌తో మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు. అయితే నవంబర్ 27న ఫడ్నవిస్ ప్రభుత్వం బలపరీక్షను ఎదర్కొవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫడ్నవీస్, అజిత్ పవార్ రాజీనామా చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా’ అని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : దేవేంద్ర ఫడ్నవీస్
ఎందుకు : ఫడ్నవిస్ ప్రభుత్వం బలపరీక్షను ఎదర్కొవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో

ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అభయ్ త్రిపాఠి
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా 1986వ బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అభయ్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నవంబర్ 26న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులో త్రిపాఠి పనిచేశారు. మరోవైపు ప్రస్తుతం ఏపీ భవన్‌లో ప్రత్యేకాధికారి (ఓఎస్‌డీ)గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి భావనా సక్సేనాను... అక్కడే రెసిడెంట్‌కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : ఐఏఎస్ అధికారి అభయ్ త్రిపాఠి

ఏపీ రెడ్‌క్రాస్ చైర్మన్‌గా డాక్టర్ శ్రీధర్‌రెడ్డి
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్‌గా విజయవాడకు చెందిన ప్రముఖ దంత వైద్యుడు ఆరుమళ్ల శ్రీధర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే రెడ్‌క్రాస్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ వైస్ చైర్మన్‌గా పి.జగన్మోహన్‌రావు, పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అశ్విన్‌కుమార్ పరీదా జనరల్ సెక్రటరీగా, కోశాధికారిగా జి.వై.ఎన్.బాబు ఎన్నికయ్యారు. రాజ్‌భవన్‌లో నవంబర్ 27న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ప్రముఖ దంత వైద్యుడు ఆరుమళ్ల శ్రీధర్‌రెడ్డి

భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు
Current Affairs
2020లో భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సొనారొ పాల్గొననున్నారు. ఈ మేరకు మోదీ ఆహ్వానానికి ఆయన సంతోషంగా ఆమోదం తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారొతో నవంబర్ 13న మోదీ సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయి.

ప్రముఖ గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ్ సింగ్ ఇకలేరు
ప్రముఖ గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ్ సింగ్ (74) నవంబర్ 14న మరణించారు. ఆయన అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని బిహార్ సీఎం నితీశ్ చెప్పారు. పట్నా సైన్స్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన 1969లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సైకిల్ వెక్టార్ స్పేస్ థియరీలో పీహెచ్‌డీ చేశారు. ఐఐటీ కాన్పూర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కతాలో పాఠాలు బోధించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు సేవలందించారు. చాన్నాళ్లుగా ఆయన స్కిజోఫ్రేనియా అనే వ్యాధితో బాధపడుతున్నారు.

కువైట్ ప్రధాని రాజీనామా
కువైట్ ప్రధాని షేక్ జబేర్ ముబారక్ అల్ సబా తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రధాని నవంబర్ 14న కువైట్ రాజుకు సమర్పించారు. మంత్రివర్గంలో అంతర్గత కుమ్ములాటలు, మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగానే ఆయన రాజీనామా చేశారని అధికారులు తెలిపారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి వీడ్కోలు
పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి నవంబర్ 15న సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్‌సీబీఏ) వీడ్కోలు పలికింది. ఆదివారం( నవంబర్ 17) పదవీ విరమణ చేయనున్న జస్టిస్ గొగోయ్‌కి శుక్రవారమే చివరి పనిదినం కావడంతో బార్ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు పలుకుతూ సమావేశం ఏర్పాటు చేసింది.
46వ ప్రధాన న్యాయమూర్తి ప్రస్థానం ఇలా..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ హోదాలో శుక్రవారమే (నవంబర్ 15) ఆయనకు చివరి వర్కింగ్ డే. 2018, అక్టోబర్ 3న సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి న్యాయవ్యవస్థలో ఈ స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
వివాదం..
సుప్రీంకోర్టులోని ఒక ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా వెంటనే స్పందించిన జస్టిస్ గొగోయ్.. ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీ వేశారు. జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ఆ కమిటీలో ఇద్దరు మహిళా జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిర బెనర్జీలకు స్థానం కల్పించారు. విచారణ అనంతరం ఆ కమిటీ జస్టిస్ గొగోయ్‌కి క్లీన్‌చిట్ ఇచ్చింది.
తిరుగుబాటు..
2018 జనవరిలో నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి సంచలనం సృష్టించిన నలుగురు సీనియర్ జడ్జీల్లో(గ్యాంగ్ ఆఫ్ ఫోర్) జస్టిస్ గొగోయ్ కూడా ఒకరు. కేసుల కేటాయింపులో సీనియర్ న్యాయమూర్తులపై వివక్షకు పాల్పడుతున్నారంటూ జస్టిస్ మిశ్రాకు వ్యతిరేకంగా నాడు జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ లోకూర్‌లు గళం విప్పిన విషయం తెలిసిందే.
ఇటీవలి కీలక తీర్పులు..
జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని పలు ధర్మాసనాలు కీలక తీర్పులను వెలువరించాయి. వాటిలో ముఖ్యమైనది, అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడికే చెందుతుందని స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పు. శతాబ్దాల వివాదానికి ఆ తీర్పు తెర దించింది. రఫేల్ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్, శబరిమల సహా సంబంధిత వివాదాలను విసృ్తత ధర్మాసనానికి నివేదించడం, ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు తదితరాలు వీటిలో కొన్ని. జస్టిస్ గొగోయ్ నవంబర్ 15న ఉదయం ప్రధాన న్యాయమూర్తి హోదాలో చివరిసారి సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్ 1లో కొద్దిసేపు ఆశీనులయ్యారు. కానీ కేసుల విచారణేదీ చేపట్టలేదు. అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లి.. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. నవంబర్ 15న 650 మంది హైకోర్టు జడ్జీలతో, 15 వేల మంది న్యాయాధికారులతో సీజేఐ జస్టిస్ గొగోయ్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి రికార్డు సృష్టించారు. వృత్తి జీవితంలో సవాళ్లను తాను కోరుకున్నానని ఈ సందర్భంగా జస్టిస్ గొగోయ్ వారికి చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి వీడ్కోలు
ఎవరు: జస్టిస్ రంజన్ గొగోయ్
ఎక్కడ: న్యూఢిల్లీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే ప్రమాణం స్వీకారం
సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే (63) నవంబర్ 18న ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. 2021 ఏప్రిల్ 23 వరకు 17 నెలల పాటు ఈ పదవిలో ఉంటారు. అయోధ్య అంశంలో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు.
జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నేపథ్యం ఇలా..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ప్రముఖ సీనియర్ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే కుమారుడు. తన తర్వాత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ బాబ్డే పేరును చీఫ్ జస్టిస్‌గా గొగోయ్ సిఫారసు చేయడం, రాష్ట్రపతి ఆమోదం తెలుపడం తెలిసిందే. చీఫ్ జస్టిస్‌గా రంజన్ గొగోయ్‌పై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టివేసిన ముగ్గురు సభ్యుల ధర్మాసనంలోనూ బాబ్డే ఉన్నారు. ఆధార్ లేదన్న కారణంగా ఏ ఒక్క పౌరునికీ కనీస సేవలు, ప్రభుత్వ సేవలను తిరస్కరించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ భాగం పంచుకున్నారు. నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలను అందుకున్నారు. మహారాష్ట్ర బార్‌కౌన్సిల్‌లో 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. బోంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన బాబ్డే, 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే ప్రమాణం స్వీకారం
ఎప్పుడు: నవంబర్ 18, 2019
ఎవరు: జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే
ఎక్కడ: న్యూఢిల్లీ

ఆర్‌కామ్‌లో డెరైక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా
రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలో డెరైక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. ఈయనతో పాటు ఛాయా విరానీ, రైనా కరానీ, మంజరి కక్కర్, సురేశ్ రంగాచార్‌లు డెరైక్టర్లుగా రాజీనామా చేశారని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సమాచారం ఇచ్చింది. దివాలా ప్రకటించిన ఈ కంపెనీ ఆస్తుల విక్రయానికి రెడీ అవుతోంది. ఇందులోభాగంగానే సంస్థ డెరైక్టర్‌గా అనిల్ రాజీనామా చేశారు. సీఎఫ్‌ఓ మణికంఠన్ సైతం రాజీనామాను సమర్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆర్‌కామ్‌లో డెరైక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా
ఎవరు: అనిల్ అంబానీ
ఎందుకు: కంపెనీ దివాలా కారణంగా

సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి పదవీ విరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నవంబర్ 17న పదవీ విరమణ చేశారు. గతేడాది అక్టోబర్ 3న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మొత్తం 13 నెలలు విధులు నిర్వహించారు. అయోధ్య వివాదానికి ముగింపు పలకడం, రఫేల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్, ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం తదితర చరిత్రాత్మక తీర్పులు ఆయన హయాంలోనే వెలువడ్డాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పదవీ విరమణ
ఎప్పుడు: నవంబర్ 17, 2019
ఎవరు: జస్టిస్ రంజన్ గొగొయి

సుప్రీం కొలీజియం’లో జస్టిస్ భానుమతి
న్యూఢిల్లీ: దాదాపు పదేళ్ల తర్వాత సుప్రీంకోర్టు కొలీజియంలో ఓ మహిళా జడ్జి నియమితులయ్యారు. ఇప్పటి వరకూ కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ గొగోయి పదవీ విరమణ చేయడంతో తమిళనాడుకు చెందిన జస్టిస్ ఆర్. భానుమతి ఎంపికయ్యారు. 2014 ఆగస్టు 13 నుంచి ఆమె సుప్రీంకోర్టులో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె మద్రాసు హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టులలో పనిచేశారు. ప్రస్తుతం కొలీజియంలో జస్టిస్ భానుమతితో పాటు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సుప్రీం ‘కొలీజియం’కి జస్టిస్ భానుమతి నియమాకం
ఎవరు: జస్టిస్ ఆర్. భానుమతి
ఎక్కడ: న్యూఢిల్లీ

శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా రాజపక్స ప్రమాణం
శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా గోటబాయ రాజపక్స నవంబర్ 18న ప్రమాణ స్వీకారం చేశారు. సంప్రదాయాన్ని పక్కనపెట్టి శ్రీలంక రాజధాని కొలంబోలో కాకుండా, అనురాధపురలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ప్రాచీన బౌద్ధ ఆలయమైన రువన్‌వెలి సేయలో అధ్యక్షుడిగా రాజపక్స బాధ్యతలు చేపట్టారు. దీంతో రాజపక్స ఆ పదవిలో అయిదేళ్ల పాటు కొనసాగనున్నారు. నవంబర్ 17న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో రాజపక్స 52.25 శాతం ఓట్లను (6,924,255) సాధించగా, ఆయన ప్రత్యర్థి ప్రేమదాస రణసింఘే 41.99 శాతం ఓట్లను (5,564,239) సాధించారు. రాజపక్స కుటుంబం నుంచి 2005-15 మధ్య మహింద రాజపక్స అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన తమ్ముడే ఇప్పుడీ ఎన్నికల్లో గెలుపొందిన గొటబాయ. వివాదాస్పదుడిగానూ, ఎల్‌టీటీఈ తీవ్రవాదులను అణచివేసిన మిలిటరీ వార్ హీరోగానూ గొటబాయకు పేరుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : గోటబాయ రాజపక్స
ఎక్కడ : రువన్‌వెలి సేయ, అనురాధపుర, శ్రీలంక

ఫార్చూన్ బిజినెస్ పర్సన్‌లో సత్య నాదెళ్లకు తొలి స్థానం
ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2019 జాబితాలో తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. సత్య నాదెళ్ల తర్వాత ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూప్ సీఈఓ ఎలిజబెత్ గెయినెస్ 2వ స్థానంలో, చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ సీఈఓ బ్రియాన్ నికోల్ 3వ స్థానంలో ఉన్నారు. సింక్రొనీ ఫైనాన్షియల్ సీఈఓ మార్గరెట్ కీనే 4వ స్థానంలో, ప్యూమా సీఈఓ జోర్న్ గుల్డెన్ 5వ స్థానంలో నిలిచారు.
సత్య నాదెళ్లతోపాటు మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు ఈ జాబితాలో చోటు సంపాదించారు. మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా 8వ స్థానంలో ఉండగా.. కాలిఫోర్నియా కంప్యూటర్ నెట్‌వర్కింగ్ సంస్థ అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లాల్ 18వ స్థానంలో నిలిచారు. ధైర్యంగా లక్ష్యాలను చేరుకోవడం, అసాధ్యాలను సుసాధ్యం చేయడం, సృజనాత్మక పరిష్కార మార్గాలను కనుగొనడం వంటి కీలక అంశాల ఆధారంగా మొత్తం 20 మందితో ఈ జాబితాను రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2019 జాబితాలో తొలిస్థానం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

శ్రీలంక నూతన ప్రధానిగా మహిందా రాజపక్స
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా మహిందా రాజపక్స నియమితులయ్యారు. శ్రీలంక నూతన అధ్యక్షుడు గోటబాయ రాజపక్స తన సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మహిందా రాజపక్సను దేశ నూతన ప్రధానిగా నవంబర్ 20న ఎంపిక చేశారు. శ్రీలంక ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘే నవంబర్ 21న బాధ్యతల నుంచి తప్పుకోగానే, మహిందా రాజపక్స ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. మహిందా రాజపక్స 2005 నుంచి 2015 వరకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు.
ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గోటబాయ రాజపక్స చేతిలో విక్రమసింఘే నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) తరఫున పోటీ చేసిన సాజిత్ ప్రేమదాస ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు విక్రమసింఘే నవంబర్ 20న ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా నియామకం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : మహిందా రాజపక్స

జపాన్ ప్రధాని షింజో అబే అరుదైన ఘనత
జపాన్ ప్రధాని షింజో అబే అరుదైన ఘనత సాధించారు. ఆ దేశాన్ని సుదీర్ఘకాలం నుంచి పాలించిన నేతగా సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధానిగా అబే 2019, నవంబర్ 20 నాటికి 2,887 రోజులు పూర్తిచేసుకున్నారు. గతంలో టారో కస్తురా సుదీర్ఘకాలం(1901-1913 మధ్య) పాలించిన ప్రధానిగా నిలవగా ఆ రికార్డును అబే అధిగమించారు. అబే 2006లో తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు, కుంభకోణాల కారణంగా కేవలం ఏడాదికే ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 2012లో తిరిగి అధికారంలోకి వచ్చాడు. ఆయన పదవీ కాలం 2021 సెప్టెంబరు వరకు ఉంది.
షింజో అబే తన పాలన కాలంలో మిలటరీ బలోపేతంతో పాటు, అనేక రాజ్యంగ సవరణలు చేశారు. ఉత్తర కొరియా ఆధీనంలోని జపనీయులను విడుదల చేయడం, రష్యాతో దీర్ఘకాల ప్రాదేశిక వివాదం పరిష్కారం, దేశం ఆర్థిక పురోగతికి అనేక సంస్కరణలు చేపట్టడం ఆయన ఖ్యాతిని పెంచింది.

షార్ నూతన కంట్రోలర్‌గా రంగనాథన్
Current Affairs
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన కంట్రోలర్‌గా వి.రంగనాథన్ నవంబర్ 7న బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 6న వరకు కంట్రోలర్‌గా పనిచేసిన జేవీ రాజారెడ్డి మాతృసంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు వెళ్లడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. దీంతో షార్‌లోని సాలిడ్ ప్రపొల్లెంట్ ప్లాంట్ (ఎస్‌పీపీ) డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న రంగనాథన్‌కు అదనంగా కంట్రోలర్ బాధ్యతలను అప్పగిస్తూ ఇస్రో ప్రధాన కార్యాలయం ఉత్తర్వులిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన కంట్రోలర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : వి.రంగనాథన్

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్‌కుమార్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్‌కుమార్ నవంబర్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో రాకేష్‌కుమార్‌తో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణం చేయించారు. జస్టిస్ రాకేష్‌కుమార్ రాకతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 15కు చేరింది. కోర్టులో జస్టిస్ రాకేష్‌కుమార్ రెండోస్థానంలో కొనసాగుతారు.
ఇదీ నేపథ్యం..
జస్టిస్ రాకేష్‌కుమార్ 1959 జనవరి 1న బిహార్ పాట్నాలో జన్మించారు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, 1983లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 6 ఏళ్ల పాటు ప్రాక్టీస్ సాగించిన ఆయన 12 ఏళ్ల పాటు సీబీఐకి స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా, పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా పనిచేశారు. 2009 డిసెంబర్ 25న పాట్నా హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులై 2011, అక్టోబర్ 24న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : జస్టిస్ రాకేష్‌కుమార్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాజీనామా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీకి నవంబర్ 8న రాజీనామా లేఖను సమర్పించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఫడ్నవీస్‌ను గవర్నర్ కోరారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు పక్షం రోజులు గడచినా.. ప్రభుత్వ ఏర్పాటులో మెజారిటీ సాధించిన బీజేపీ, శివసేనల మధ్య అధికార పంపిణీ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం
దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో (ఆర్‌ఎస్‌ఎస్) సన్నిహిత సంబంధాలున్న కుటుంబంలో 1970 జూలై 22న జన్మించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ ఫడ్నవీస్ స్వస్థలం. ఆయన తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేశారు. దాంతో సహజంగానే దేవేంద్ర కూడా ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల పట్ల చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారు. నాగపూర్ యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. తర్వాత బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చదివారు.
1990వ దశకంలో రాజకీయాల్లో ప్రవేశించిన ఫడ్నవీస్ 1992, 1997లో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు. నాగపూర్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మేయర్‌గా రికార్డు సృష్టించారు. 1999, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ సౌత్‌వెస్టు స్థానం నుంచి నెగ్గారు. 2014లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ఐదేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పదవిలో కొనసాగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : దేవేంద్ర ఫడ్నవీస్

కాంగ్రెస్ అధ్యక్షురాలికి ఎస్పీజీ భద్రత తొలగింపు
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) భద్రతను కేంద్రప్రభుత్వం నవంబర్ 8న ఉపసంహరించింది. ఎస్పీజీ నుంచి సీఆర్‌పీఎఫ్ బలగాల సంరక్షణలోని జడ్ ప్లస్ కేటగిరీకి మార్పు చేసినట్లు ప్రకటించింది. 1991లో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చిన తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆమె అంగరక్షకుల చేతిలో హత్యకు గురైన దృష్ట్యా 1988లో ఎస్‌పీజీని స్థాపించారు. మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు పదేళ్ల వరకూ ఈ రకమైన భద్రతను కల్పిస్తున్నారు. గత ఆగస్టులోనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రత తొలగింపు
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : కేంద్రప్రభుత్వం

రిటైర్డ్ ఐఏఎస్ పీఎస్ కృష్ణన్ కన్నుమూత
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ (86) కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నవంబర్ 10న తుదిశ్వాస విడిచారు. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన కృష్ణన్ 1956 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సంక్షేమ శాఖ కార్యదర్శిగా, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, బీసీ కమిషన్ సభ్య కార్యదర్శిగా, ప్లానింగ్ కమిషన్‌లోని వివిధ విభాగాల్లో చైర్మన్, సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం-1989, సవరణ చట్టం-2015, సవరణ చట్టం-2018 డ్రాఫ్ట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడిగా, ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : పీఎస్ కృష్ణన్ (86)
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా

ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్ పుస్తకావిష్కరణ
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై వి.అనంత నాగేశ్వరన్, గుల్జార్ నటరాజన్ సంయుక్తంగా రచించిన ‘ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్: కాజెస్, కన్‌సీక్వెన్సెస్, క్యూర్’ అనే పుస్తకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో నవంబర్ 10న జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. భారత ఆర్థిక రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. ప్రపంచం, భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ పుస్తకం పరిష్కారాలను సూచించినట్టు చెప్పారు. మందగమనంపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఈ పుస్తకం వచ్చినట్టు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్: కాజెస్, కన్‌సీక్వెన్సెస్, క్యూర్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ

పాకిస్తాన్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ
పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న పాకిస్తాన్ వైమానికదళ యుద్ధ మ్యూజియంలో భారత వైమానికదళ వింగ్‌కమాండర్ అభినందన్ వర్ధమాన్ బొమ్మను ప్రదర్శించారు. వర్ధమాన్ చుట్టూ పాక్ సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును ఉంచారు. 2019, ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ యుద్ధ విమానాలను వెంబడించాడు. ఈ ప్రక్రియలో అతను నడుపుతున్న యుద్ధవిమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. అతను సురక్షితంగా బయటపడినప్పటికీ పాక్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల అనంతరం అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది.

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ శేషన్ మృతి
దేశ ఎన్నికల ముఖచిత్రంపై తనదైన ముద్రవేసి, కీలక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) తిరునెల్లయ్ నారాయణ అయ్యర్ శేషన్ (86) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా చెన్నైలోని స్వగృహంలో నవంబర్ 10న తుదిశ్వాస విడిచారు. కేరళలోని పాలక్కాడ్‌లోని తిరునెల్లయ్‌లో 1932లో జన్మించిన టీఎన్ శేషన్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మద్రాసులోనే డెమాన్‌స్ట్రేటర్‌గా మూడేళ్లపాటు పనిచేసి, ఆ సమయంలోనే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. తమిళనాడుతోపాటు, కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. కేబినెట్ సెక్రటరీగా, ప్రణాళికా సంఘం సభ్యునిగా విధులు నిర్వర్తించారు.
తమిళనాడు కేడర్‌కు చెందిన 1955 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన టీఎన్ శేషన్ 1990-96 సంవత్సరాల్లో 10వ సీఈసీగా పనిచేశారు. ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న కాలంలో నలుగురు ప్రధానులు చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, హెచ్‌డీ దేవెగౌడ మారారు. 1997 రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణన్‌పై శేషన్ పోటీ చేశారు. ఎన్నికల విధానంలో పారదర్శకత సాధించేందుకు చేసిన కృషికిగాను ఆసియా నోబెల్‌గా భావించే ప్రతిష్టాత్మక రామన్ మెగసేసే అవార్డును ఆయన అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : తిరునెల్లయ్ నారాయణ అయ్యర్ శేషన్ (86)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : గుండెపోటు కారణంగా

ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా విజయ చందర్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నటుడు తెలిదేవర విజయ చందర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు అయిన విజయచందర్ 1949 అక్టోబరు 20న జన్మించారు. నాటకరంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆయన కరుణామయుడు సినిమాలో ఏసు క్రీస్తుగా, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం చిత్రంలో సాయిబాబాగా నటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : నటుడు తెలిదేవర విజయ చందర్

క్రాప్ హాలిడే పుస్తకావిష్కరణలో ఏపీ గవర్నర్
రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ’క్రాప్ హాలిడే’ (పంట విరామం) పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు. విజయవాడలో నవంబర్ 11న జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ... ఏపీలోని పొగాకు రైతులు 2000 సంవత్సరంలో పంట విరామం వంటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను ‘క్రాప్ హాలిడే’ ద్వారా వెలుగులోకి తీసుకురావడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ,యలమంచిలి శివాజీ, పొగాకు బోర్డు అధ్యక్షుడు యడ్లపాటి రఘునాథ్‌బాబు, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు హాజరయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రాప్ హాలిడే’ (పంట విరామం) పుస్తకావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్

కేంద్రమంత్రి సావంత్ రాజీనామాకు ఆమోదం
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్వింద్ గణపత్ సావంత్ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 12న ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహా మేరకు సావంత్ రాజీనామాను తక్షణమే ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీంతో భారీ పరిశ్రమల శాఖను కేంద్ర పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అదనపు బాధ్యతలుగా అప్పగించారు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు తాము మద్దతివ్వాలంటే ముందు ఎన్డీయే నుంచి వైదొలగాలంటూ శివసేనకు ఎన్సీపీ చేసిన డిమాండ్ నేపథ్యంలో సావంత్ నవంబర్ 11న రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్వింద్ గణపత్ సావంత్ రాజీనామాకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కేవీఎల్ హరినాథ్
ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కేవీఎల్ హరినాథ్‌ను నియమిస్తూ ప్రభుత్వం నవంబర్ 12న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. కాగా, హరినాథ్ విజయవాడ జిల్లా జడ్జిగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కేవీఎల్ హరినాథ్ నియమాకం
ఎప్పుడు: నవంబర్ 12, 2019
ఎవరు: కేవీఎల్ హరినాథ్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా ఏపీ కేడర్ అధికారి నీలం సహానిని నియమిస్తూ నవంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ సీఎస్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీసీఏల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను రిలీవ్ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఓ మహిళా ఐఏఎస్ అధికారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావడం ఇదే తొలిసారి. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సహాని 1960, జూన్ 20న జన్మించారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సహానిని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు నవంబర్ 11న ఆ విధుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లలో సీనియర్ అయిన ఆమె 2020, జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : నీలం సహాని

ఇంగ్లీషు మీడియం ప్రత్యేక అధికారిణిగా వెట్రిసెల్వీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ప్రారంభించనున్న ఇంగ్లీషు మీడియం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిణిగా వెట్రిసెల్వీ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సర్వే, అసైన్‌మెంట్, భూముల కంప్యూటరీకరణ ప్రాజెక్టు సంచాలకులుగా ఉన్న ఆమెకు ఆంగ్లమాధ్యమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిణిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంగ్లీషు మీడియం ప్రత్యేక అధికారిణిగా వెట్రిసెల్వీ
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

కార్మికోద్యమ నేత గురుదాస్ కన్నుమూత
Current Affairs
భారత కార్మికోద్యమ నేత, సీపీఐ జాతీయ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు గురుదాస్ దాస్‌గుప్తా(83) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన కోల్‌కతాలోని స్వగృహంలో అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. ‘యాంగ్రీ యంగ్ మాన్’గా పేరున్న గురుదాస్ దాస్‌గుప్తా 1936 నవంబర్ 3న అవిభాజ్య బెంగాల్‌లోని బరిషాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)లో జన్మించారు. విభజన అనంతరం ఆయన కుటుంబం పశ్చిమబెంగాల్‌కి మారింది.
50వ దశకం చివరల్లో వామపక్ష సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన గురుదాస్ విద్యార్థి ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అవిభాజ్య బెంగాల్ విద్యార్థి ఫెడరేషన్‌కి అధ్యక్షుడిగానూ, కార్యదర్శిగా పనిచేశారు. 1964 కమ్యూనిస్టు పార్టీ చీలికతో మార్క్సిస్టు పార్టీ ఆవిర్భవించాక సీపీఐలో ఉండిపోయారు. 70వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాలరీత్యా కార్మికరంగ బాధ్యతలు చేపట్టారు. 2001లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చేపట్టినప్పటినుంచి గురుదాస్ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. కార్మికవర్గ సమస్యల పరిష్కారానికై జీవితమంతా పోరాడి మాస్ లీడర్‌గా గుర్తింపు పొందారు. మూడుసార్లు రాజ్యసభకు, రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత కార్మికోద్యమ నేత కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : గురుదాస్ దాస్‌గుప్తా(83)
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమబెంగాల్
ఎందుకు : క్యాన్సర్ కారణంగా

ఇస్లామిక్ స్టేట్ కొత్త చీఫ్‌గా అబూ అల్ హష్మీ
ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తమ కొత్త నాయకుడి పేరును ప్రకటించింది. తమ కొత్త నాయకుడు అబూ ఇబ్రహీం అల్ హష్మీ అని ఐఎస్ అక్టోబర్ 31న ఒక ఆడియో ప్రకటన విడుదల చేసింది. ఇటీవల సిరియాలో అమెరికా దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. అల్ బాగ్దాదీతోపాటు అతని సన్నిహితుడు, సంస్థ అధికార ప్రతినిధి అయిన హసన్ అల్ ముజాహిర్ మరణించారని ఐఎస్ తన ఆడియో సందేశంలో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కొత్త చీఫ్‌గా ఎంపిక
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : అబూ ఇబ్రహీం అల్ హష్మీ

ఐపీఎస్ అధికారి ఆనందరాం కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య కేసును ఛేదించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీనివాస ఆనందరాం (97) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. 1950లో సివిల్ సర్వీస్‌లో చేరిన ఆనందరాం 1978 -81 వరకు విశాఖ షిప్‌యార్డు సీఎండీగా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వైస్ చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 1982-83లో ఉమ్మడి ఏపీ డీజీపీగా సేవలందించారు.
ఆనందరాం 1984లో సీఐఎస్‌ఎఫ్ డెరైక్టర్‌గా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ హత్య కేసు విచారణకు ఏర్పాటు చేసిన ‘సిట్’కు నాయకత్వం వహించారు. 1975లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అందుకున్న ఆయనను 1987లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. 994లో ‘అసాసినేషన్ ఆఫ్ ఏ ప్రైమినిస్టర్’ పుస్తకాన్ని ఆనందరాం రచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : శ్రీనివాస ఆనందరాం (97)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత
ప్రముఖ నటి గీతాంజలి (72) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. 1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచయమైంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించింది. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన గీతాంజలి వివాహం ప్రముఖ నటుడు రామకృష్ణతో జరిగింది. దేవత, సంబరాల రాంబాబు, పంతాలు పట్టింపులు, శ్రీకృష్టపాండవీయం, పొట్టి ప్లీడరు, తోడు నీడ వంటి చిత్రాల్లో గీతాంజలి నటించి మెప్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ నటి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : గీతాంజలి (72)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు

ఏపీ జాతీయ మీడియా సలహాదారుగా అమర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ నవంబర్ 3న ఢిల్లీలోని ఏపీ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ మీడియాలో గతంలో దక్షిణాదికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై కవరేజి తక్కువగా ఉండేదని చెప్పారు. ఇటీవల కాలంలో జాతీయ మీడియా కూడా దక్షిణాది వైపు దృష్టి పెట్టిందని.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, పాలనాపరమైన అంశాలను జాతీయ మీడియాకు చేరువయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్
ఎక్కడ : న్యూఢిల్లీ

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ జనరల్‌గా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రధాన భూ పరిపాలన కమిషనర్‌గా(సీసీఎల్‌ఏ) పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు నవంబర్ 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1983 బ్యాచ్‌కి చెందిన ఎల్వీ సుబ్రమణ్యం 2019, ఏప్రిల్ 6న ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 2020 ఏప్రిల్‌లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

ప్రపంచ ప్రభావిత రచయితల్లో భారతీయులు
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లిష్ నవలలు రాసిన ‘మొదటి 100 మంది జాబితా’లో ప్రముఖ భారతీయ రచయితలు ఆర్‌కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్, వీఎస్ నైపాల్‌లకు చోటు లభించింది. ఆంగ్లంలో తొలి నవలగా భావించే ‘రాబిన్సన్ క్రూసో ’ప్రచురితమై 300 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీబీసీ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. లండన్‌లో నవంబర్ 7న మొదలైన బీబీసీ సాహితీ ఉత్సవంలో భాగంగా ఈ జాబితాను ప్రకటించారు.
మొదటి 100 మంది జాబితాలో అరుంధతి రాయ్ రాసిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్‌‌స’పుస్తకం ఐడెంటిటీ కేటగిరీలోను, ఆర్‌కే నారాయణ్ ‘స్వామి అండ్ ఫ్రెండ్‌‌స’ కమింగ్ ఆఫ్ ఏజ్ సెక్షన్‌లో, సల్మాన్ రష్దీ రాసిన ‘ది మూర్స్ లాస్ట్ సై’ రూల్ బ్రేకర్స్ విభాగంలో ఎంపికయ్యాయి. విక్రమ్ సేథ్ రాసిన నవల ‘ఎ స్యూటబుల్ బోయ్’ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్‌షిప్ కేటగిరీ, వీఎస్ నైపాల్ రచించిన ‘ఎ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్’కు క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో చోటు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీబీసీ ప్రపంచ ప్రభావిత రచయితల్లో భారతీయులు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : ఆర్‌కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్, వీఎస్ నైపాల్

ఎన్‌టీపీసీ ప్రాంతీయ డెరైక్టర్‌గా కులకర్ణి
ప్రభుత్వ రంగ విద్యుత్తు కంపెనీ ఎన్‌టీపీసీ దక్షిణ భారత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా డాక్టర్ ప్రమోద్ ప్రభాకర్ కులకర్ణి నవంబర్ 6న బాధ్యతలు చేపట్టారు. దీంతో పాటు ఆయన ఎన్‌టీపీసీ రామగుండం, తెలంగాణ ప్రాజెక్టు చీఫ్‌గా అదనపు బాధ్యతల్లోనూ కొనసాగనున్నారు. ఇంతకుముందు ఎన్‌టీపీసీ, ఐపీజీసీఎల్, హెచ్‌పీజీసీఎల్‌ల జాయింట్ వెంచర్... ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఈఓగా కులకర్ణి పనిచేశారు. ‘విద్యుత్తు వర్తకం, దేశీయ విద్యుత్తు విపణిపై దాని ప్రభావం’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసిన ఆయన ఎన్‌టీపీసీలో 1982లో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌టీపీసీ దక్షిణ భారత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : డాక్టర్ ప్రమోద్ ప్రభాకర్ కులకర్ణి
Published date : 27 Nov 2019 04:42PM

Photo Stories