Next CJI of the Supreme Court: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్!
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 50వ సీజేగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ ప్రతిపాదించారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో జరిగిన ఫుల్‌కోర్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం-ఈ ప్రతిపాదనను ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు పంపుతారు. ఆ లేఖను కేంద్ర న్యాయశాఖ ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ నవంబరు 8వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం-సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఆ లెక్కన జస్టిస్ యు.యు.లలిత్ తర్వాత జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అత్యంత సీనియర్‌గా ఉన్నారు. జిస్టిస్ చంద్రచూడ్ నవంబరు 9న ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. 2024నవంబరు 10న పదవీ విరమణ చేస్తారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP