Skip to main content

Bajaj Group: స్వాతంత్య్ర సమరయోధుడు రాహుల్‌ బజాజ్‌ ఇకలేరు

Rahul Bajaj

ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, బజాజ్‌ గ్రూప్‌ మాజీ చైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌(83) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో నెల క్రితం పుణేలోని రూబీ హాల్‌ క్లినిక్‌ హాస్పిటల్‌లో చేరిన ఆయన ఫిబ్రవరి 12న తుదిశ్వాస విడిచారు. 1938, జూన్‌ 10న జన్మించిన రాహుల్‌.. ఢిల్లీ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ (ఆనర్స్‌), ముంబై వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ చేశారు.

రూ.7.2 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు..

రాహుల్‌ బజాజ్‌.. తొలుత డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా బజాజ్‌ గ్రూప్‌లో చేరారు. తర్వాత 30 ఏళ్ల వయసులో 1968లో బజాజ్‌ ఆటో సీఈవో అయ్యారు. రాహుల్‌ నేతృత్వంలో సంస్థ వృద్ధిబాటన పయనించింది. జపాన్‌ మోటార్‌సైకిల్‌ కంపెనీల పోటీని తట్టుకుని బజాజ్‌ స్కూటర్లను విదేశీ గడ్డపైనా పరుగెత్తించారు. విభిన్న ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో బజాజ్‌ బ్రాండ్‌ను మెరిపించారు. ఆటోమొబైల్‌తో పాటు సాధారణ, వాహన బీమా, ఇన్వెస్ట్‌మెంట్స్, కన్సూమర్‌ ఫైనాన్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్‌ పరికరాలు, పవన విద్యుత్, అలాయ్, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ తదితర రంగాలకు గ్రూప్‌ అంచెలంచెలుగా విస్తరించింది. రాహుల్‌ సారథ్యంలో బజాజ్‌ ఆటో టర్నోవర్‌ రూ.7.2 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు పెరిగింది.

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం చైర్మన్‌గా..

రాహుల్‌ బజాజ్‌.. 2005లో బజాజ్‌ ఆటో బాధ్యతలను కుమారుడు రాజీవ్‌కు అప్పగించారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కౌన్సిల్, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ చైర్మన్‌గానూ రాహుల్‌ పని చేశారు. 2021 ఏప్రిల్‌ 30 దాకా బజాజ్‌ ఆటో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, చైర్మన్‌గా ఉన్నారు. 2001లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు. 2006లో రాజ్యసభకు ఎంపికయ్యారు.

1926లో ప్రారంభం..

బజాజ్‌ గ్రూప్‌ 1926లో ప్రారంభమైంది. జమ్నాలాల్‌ బజాజ్‌ ఈ సంస్థను స్థాపించారు. జమ్నాలాల్‌ కుమారుడు కమల్‌నయన్‌ బజాజ్‌. కమల్‌నయన్‌ బజాజ్‌ కుమారుడే రాహుల్‌ బజాజ్‌.

చ‌ద‌వండి: టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, బజాజ్‌ గ్రూప్‌ మాజీ చైర్మన్‌ కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు    : రాహుల్‌ బజాజ్‌(83)
ఎక్కడ    : పుణే, మహారాష్ట్ర
ఎందుకు : వృద్ధాప్య సంబంధిత, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 14 Feb 2022 12:52PM

Photo Stories