Skip to main content

International Monetary Fund: ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఎండీగా నియమితులైన తొలి మహిళ?

Gita Gopinath

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌(డీఎండీ)గా ఇండియన్‌ అమెరికన్‌ గీతా గోపీనాథ్‌ (49) నియమితులయ్యారు. దీంతో ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఎండీగా నియమితులైన తొలి మహిళగా గీత గుర్తింపు పొందారు. ఇప్పటి వరకూ ఆమె ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకమిస్ట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఐఎంఎఫ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ప్రస్తుతం జాఫ్రీ ఒకామోటో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2022 ఏడాది మొదట్లో ఆయన తన బాధ్యతలను విరమించనున్నారు. అటు తర్వాత గీతా గోపీనాథ్‌ కొత్త బాధ్యతలు చేపడతారు.

తొలి మహిళా చీఫ్‌ ఎకానమిస్ట్‌గానూ..

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ అండ్‌ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ అయిన గీత.. ఐఎంఎఫ్‌ తొలి మహిళా చీఫ్‌ ఎకానమిస్ట్‌గా 2019 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. ఆమె సెలవును హార్వర్డ్‌ వర్సిటీ పొడిగించడంతో ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌గా మూడేళ్ల పాటు కొనసాగారు. 2022 ఏడాది తన బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంది. ఐఎంఎఫ్‌లో బాధ్యతల అనంతరం.. హార్వర్డ్‌ వర్సిటీకే తిరిగి వెళ్లాలని గీత నిర్ణయించుకున్నారు. అయితే అనూహ్యంగా ఐఎంఎఫ్‌ రెండవ స్థానంలో ఆమె నియామకం వార్త వెలువడింది.

ఎండీగా క్రిస్టాలినా..

ప్రస్తుతం ఐఎంఎఫ్‌ ఎండీగా క్రిస్టాలినా జార్జివా ఉన్నారు. 2024, సెప్టెంబర్‌ వరకు ఆమె పదవిలో కొనసాగనున్నారు. తాజాగా ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఎండీగా గీత నియామకం జరగడంతో... ఐఎంఎఫ్‌ తొలి రెండు అత్యున్నత స్థానాల్లో ఒకేసారి మహిళలు ఉండనున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్‌ ప్రధాన కార్యాలయం ఉంది.

గీతా గోపీనాథ్‌ నేపథ్యం..

  • 1971, డిసెంబర్‌ 8న పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జన్మించారు.
  • మలయాళీ కుటుంబ నేపథ్యం గల గీత ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశారు. 
  • ఆ తర్వాత ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లోను, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో మాస్టర్స్‌ చేశారు.
  • 2001లో ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరిన గీతా గోపీనాథ్‌.. 2005లో హార్వర్డ్‌కు మారారు. 
  • 2010లో టెన్యూర్డ్‌ ప్రొఫెసర్‌ (దాదాపు పర్మనెంట్‌ స్థాయి)గా పదోన్నతి పొందారు. హార్వర్డ్‌ చరిత్రలో ఈ గౌరవం దక్కించుకున్న మూడో మహిళగాను, నోబెల్‌ గ్రహీత అమర్త్య సేన్‌ తర్వాత తొలి భారతీయురాలిగాను ఆమె ఘనత సాధించారు.

చ‌ద‌వండి: తూర్పు నౌకాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన వైస్‌ అడ్మిరల్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌(డీఎండీ)గా నియమితులైన ఇండియన్‌ అమెరికన్‌?
ఎప్పుడు : డిసెంబర్‌ 3
ఎవరు    : గీతా గోపీనాథ్‌
ఎందుకు : ఐఎంఎఫ్‌ బోర్డ్‌ నిర్ణయం మేరకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 04 Dec 2021 03:21PM

Photo Stories